అరుదైన నటవహ్ని- బల్‌రాజ్ సహ్ని – 7 పింజరే కే పంఛీ

0
9

[dropcap]జే.[/dropcap]యెన్.యూ విద్యార్థులతో ప్రసంగిస్తూ బల్‌రాజ్ సహ్ని తనలోకి తాను తొంగి చూసుకుంటు అన్న మాటను ఓ సారి ప్రస్తావించుకుందాం. “సుమారు 20 సంవత్సరాల క్రితం, కలకత్తా ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ‘దో బిఘా జమీన్’ నిర్మాత దివంగత బిమల్ రాయ్‌ని మరియు అతని సహచరులైన మమ్మల్ని గౌరవించాలని నిర్ణయించుకుంది. ఆ వేడుకలో అందరూ చాలా మంచి ప్రసంగాలు చేశారు. శ్రోతలు మాత్రం బిమల్ రాయ్‌ని వినడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మేమంతా నేలపై కూర్చున్నాం, నేను బిమల్ దా పక్కన కూర్చున్నాను. అతని వంతు సమీపించేకొద్దీ, అతను మరింత భయాందోళనకు గురవుతున్నాడని నేను గమనించాను. తన వంతు రాగానే లేచి నమస్కరిస్తూ ‘నేనేం చెప్పాలనుకుంటున్నానో నా సినిమాల్లో చెప్పుకుంటున్నాను. అది తప్ప ఇంకేమీ చెప్పడానికి నా దగ్గర లేదు,’ అని చెప్పి కూర్చున్నారు. బిమల్ దా చేసిన ఈ అతి చిన్న ప్రసంగంలో చాలా అర్థం ఉంది. బిమల్ రాయ్ చెప్పింది అక్షరాలా నిజం. కళాకారుడి డొమైన్ అతని పని మాత్రమే. కాని ఇక్కడ నేను మాట్లాడాలి కాబట్టి, నా స్వంత అనుభవాలకి, అనుభూతులకే పరిమితం అయి మీతో సంభాషించాలనుకుంటున్నాను. నా పరిధి దాటడం మూర్ఖత్వం అవుతుంది.”

బల్‌రాజ్ సహ్ని సినిమాలను గమనిస్తే ఆయన చెప్పాపనుకున్నవన్నీ, వారి వ్యక్తిత్వం ఆ పాత్రలలో కనిపిస్తూ ఉంటుంది. అయన్ని ఆ పాత్రలనుండి వేరు చేయలేం. ఇంతగా తన వ్యక్తిత్వాన్ని ఆ పాత్రలకు ఆపాదించి ప్రదర్శించే నటులు ప్రపంచంలోనే చాలా అరుదు. అందుకే బల్‌రాజ్ సహ్నిని అర్థం చేసుకోవాలన్నా, వారి ఆలోచనలకు దగ్గర అవ్వాలన్నా ఆయన నటించిన సినిమాలను గమనిస్తే చాలు.

ఆయన చదువుకుంటున్న రోజుల్లో పాశ్చాత్య జీవనశైలి ప్రభావం అప్పటి యువతలో చాలా ఎక్కువగా ఉండేది. మరో పక్కన స్వదేశీ ఉద్యమం కూడా మంచి ఉంది. వీటి మధ్య తన భారతీయ అస్తిత్వాన్ని ఆయన నిలుపుకోవాడానికి తనతో తాను ఎంతో యుద్ధం చేశారు. ఆ విషయం వారి మాటల్లోనే..

“నా కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది నా మనసులో శాశ్వత ముద్ర వేసింది. నేను వేసవి సెలవులకు మా కుటుంబంతో కలిసి రావల్పిండి నుండి కాశ్మీర్‌కు బస్సులో వెళ్తున్నాను. అంతకుముందు రాత్రి వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రోడ్డులోని పెద్ద భాగం కొట్టుకుపోయి మేము దారిలో ఆగిపోవలసి వచ్చింది. ల్యాండ్‌సైడ్‌కి ఇరువైపులా బస్సులు, కార్లతో నిండి ఉన్న పొడవైన క్యూలో మేము ఉండిపోయాము. ఎంతో అసహనంతో రోడ్డు క్లియర్ అయ్యే వరకు ఎదురుచూస్తూ ఉండిపోయాం. పి.డబ్ల్యు.డి.కి రోడ్డు క్లియర్ చేయడం చాలా కష్టమైన పని. అలాంటి క్లిష్ట సమయంలో కూడా ప్రయాణికులు, వాహనాల డ్రైవర్లంతా తమ అసహనంతో, కోపంతో, ఆ క్లిష్ట పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశారు. సిటీ-వాలాల ప్రవర్తనతో సమీపంలోని గ్రామస్థులు కూడా విసిగిపోయారు.

చాలా సమయం తరువాత ఓ ఉదయం, రోడ్డు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. డ్రైవర్లకు పచ్చజెండా కూడా ఊపారు. కానీ మాకు అక్కడ ఒక వింత దృశ్యం కనిపించింది. ఏ డ్రైవరూ ముందుగా క్రాస్ చేయడానికి ఇష్టపడలేదు. అందరూ ఇరువైపుల నుండి ఒకరినొకరు చూసుకుంటున్నారు. అది ప్రమాదకరమైన రహదారి. ఒకవైపు పర్వతం, లోతైన లోయ, దాని దిగువన నది. పర్యవేక్షకుడు అంతా జాగ్రత్తగా తనిఖీ చేసి, పూర్తి బాధ్యతతో రహదారిని తెరిచాడు. కానీ అతని తీర్పును విశ్వసించడానికి అక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. వారంతా, అతనిని, అతని శాఖను అప్పటిదాకా సోమరులని, అసమర్థులని ఆరోపించినవరే. కాని ఇప్పుడు ముందుకు రావడానికి ఎవరూ సిద్ధపడలేదు. అరగంట నిశ్శబ్దంగా గడిచిపోయింది. ఎటుపక్క ఎవరూ కాదలలేదు.

అప్పుడే మా మధ్యకు ఒక చిన్న ఆకుపచ్చ స్పోర్ట్స్ కార్ వచ్చింది. ఒక ఆంగ్లేయుడు దానిని నడుపుతున్నాడు. పార్క్ చేసిన వాహనాలను, అక్కడున్న జనాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. స్మార్ట్ జాకెట్ మరియు ప్యాంటు ధరించి ఉన్న నేను ఆ గుంపులో అతనికి కనిపించాను. ‘ఏం జరిగింది?’ అని నన్ను అడిగాడు. నేను అతనికి కథ మొత్తం చెప్పాను. పెద్దగా నవ్వుతూ హారన్‌ ఊదుతూ ప్రమాదకరమైన పోర్షన్‌ను కనీసం తడబడకుండా దాటుకుంటూ నేరుగా ముందుకు సాగాడు. అతను దాటగానే అందరూ ధైర్యం తెచ్చుకుని ప్రయాణానికి సిద్ధం అయ్యారు. ఇప్పుడు ఎవరికి వారు ముందుగా దాటాలనే ఉత్సాహంతో మరో కొత్త రకమైన గందరగోళాన్ని సృష్టించారు. వందలాది ఇంజన్లు, వందలాది హారన్ల శబ్దం అక్కడ భరించలేనంతగా మొదలయింది. ఆ రోజు, స్వేచ్ఛాయుత దేశంలో పెరిగిన వ్యక్తికి, బానిసత్వంలో పెరిగిన వ్యక్తికి మధ్య వైఖరిలో తేడాను నేను నా కళ్లతో చూశాను. స్వేచ్ఛను అనుభవించే మనిషిలో తనకోసం ఆలోచించుకుని, నిర్ణయించుకునే శక్తి ఉంటుంది. కాని బానిస ఆ శక్తిని కోల్పోతాడు. అతను ఎల్లప్పుడూ తన ఆలోచనలను ఇతరుల నుండి తీసుకుంటాడు, తన నిర్ణయాలలో తడబడతాడు, చాలా తరచుగా ఎవరో ముందుగా నడిచిన మార్గాన్నే అనుసరిస్తాడు”.

“ఈ సంఘటన నుండి నేను ఓ విలువైన పాఠం నేర్చుకున్నాను. నా జీవితానికి నేనే పరీక్ష పెట్టాను. నా జీవిత గమనంలో, నేను నా స్వంత కీలకమైన నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడల్లా, నేను సంతోషంగా ఉన్నాను. నాలో నేను అనంతమైన స్వేచ్ఛను అనుభవించాను. నన్ను నేను స్వేచ్ఛా జీవిని అని ప్రకటించుకున్నాను. దానితో నాలో ఉత్సాహం పెరిగింది. నా జీవితాన్ని నేను ఆస్వాదించసాగాను. జీవితానికి ఓ అర్థం ఉందని నాకు అలాంటప్పుడే అనిపించేది. కాని, నిజం చెప్పాలంటే, అలాంటి సందర్భాలు నా జీవితంలోనూ చాలా తక్కువగానే ఉండేవి . చాలా సార్లు, నేను కీలకమైన సమయంలో ధైర్యాన్ని కోల్పోయి ఇతర వ్యక్తుల జ్ఞానం క్రింద ఆశ్రయం పొందాను. భయంతో సురక్షితమైన మార్గాన్ని ఎన్నుకున్నాను. నా కుటుంబం, నేను చెందిన బూర్జువా వర్గం మరియు వారు సమర్థించిన విలువలు నా నుండి ఏ నిర్ణయాలను ఆశించాయో, వాటినే నేను స్వీకరించాను. ఒకలా ఆలోచించినా మరోలా నటించాను. దానితో తరువాత నేను లోలోన కుళ్ళిపోయి, ఓడిపోయిన భావాన్ని అనుభవించాను. ఆ నిర్ణయాలు నాకు మనిషిగా సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. నేను ధైర్యం కోల్పోయిన ప్రతి సారీ, నా జీవితం నాకు అర్థరహితంగా తోచి భారంగా మారేది.”

“నేను మీకు ఇప్పుడు నన్ను ప్రభావితం చేసిన ఒక ఆంగ్లేయుడి గురించి చెప్పాను కదా. ఇది కూడా ఆ సమయంలో నాలో ఉన్న న్యూనతా భావం యొక్క లక్షణమే. అదే సంవత్సరం ఉరి తీయబడిన సర్దార్ భగత్ సింగ్ ఉదాహరణను నేను మీకు చెప్పవచ్చు. తనకు తానుగా నిర్ణయం తీసుకునే ధైర్యం ఎప్పుడూ ప్రదర్శించిన మహాత్మా గాంధీని నేను మీకు ఉదాహరణగా చెప్పవచ్చు. కాని వీటికన్నా ఆ ఆంగ్లేయుని ధైర్యం నా పై ఎక్కువ ప్రభావం చూపింది. ఇది ఆ రోజుల్లో నాలో అంతర్లీనంగా ఉన్న న్యూనతాభావం యొక్క ప్రభావమే కదా.”

తనను తాను ఇంతగా పరిశీలించుకుంటూ విశ్లేషించుకుంటూ భారతీయత వైపుకు, అత్మగౌరవమైన జీవితం వైపుకు బల్‌రాజ్ చేసిన ప్రయాణంలో ఎంతో సంఘర్షణ ఉంది. పైగా ఆయన చదివిన కాలేజి, పెరిగిన పరిసరాలు, చేసిన ఉద్యోగాలు అన్నీ విదేశీ అనుభవంతో పాశ్చాత్య ప్రభావంతో నిండి ఉన్నవే. ఆ జీవితంలో తనను ప్రభావితం చేసిన వ్యక్తుల స్వేచ్ఛాపూరిత జీవితాన్ని భారతీయులు ఎందుకు అనుభవించలేకపోతున్నారో, తోటి భారతీయుల ఆత్మగౌరవ పోరాటంలో ఆ అకర్షణ ఎందుకు లేదు అన్నదాని గురించి ఆయన ఎంతో ఆలోచించేవారు. ఉన్నతమైన జీవితాన్ని అనుభవించే సమయంలో కూడా జనం మధ్య వారిలో ఒకరిగా ఉండడంలోని ఆత్మగౌరవాన్ని ఎంచుకున్నారు. అందువలన ఎప్పుడూ ముందు వరుసలో ఆయన ఎక్కడా కనపడరు. భారతీయ నటులలో కూడా ఆయన ప్రస్తావన చాలా మంది తరువాతే వస్తుంది. కాని తప్పకుండా వచ్చితీరుతుంది. బల్‌రాజ్ సినిమాలలోనూ, నటనలోనూ ప్రదర్శించే నిజాయితీ ఆయనను విస్మరించనివ్వదు కాని ఆయన పట్ల సినీ అభిమానులలో ఆకర్షణను కలగించదు. స్వేచ్ఛాపురిత నిర్ణయాలతో వ్యక్తిత్వంతో తాను నమ్మిన దారిలో నడిచిన ఆయన బానిస ఆలోచనలను వదిలించుకోలేని సామాన్య జనులకు ప్రతినిధిగా మిగిలిపోవాలని నిర్ణయించుకోవడం వలన వారు ఎన్నుకున్న స్వేచ్ఛాపూరిత నటనా మార్గం చాలా మంది నటులను ఆకర్షించదు. కాని ఆ మార్గంలో ఉన్న నిజాయితీని అర్థం చేసుకోగలిగే సినీ అభిమానులు మాత్రం ఆయనను మర్చిపోలేరు. ఆయనను ప్రేమించకుండా ఉండలేరు.

1966లో సినీ సంగీత దర్శకులలో అప్పటికే ఉన్నతమైన స్థానంలో ఉన్న సలీల్ చౌదరి ఓ కథ సమకూర్చుకుని దర్శకత్వం వహించారు అదే ‘పింజరే కే పంఛీ’. సినిమా కథ చాలా గొప్పది. కాని దర్శకత్వంలో ఎన్నో లోపాలు కనపడతాయి. ఈ సినిమాలో ముఖ్య తారాగణం, మీనా కుమారి, బల్‌రాజ్ సహ్ని, మెహమూద్. అభి భట్టాచార్య ఓ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఇందులో బల్‌రాజ్ సహ్ని యాసిన్ ఖాన్ అనే ఓ ముస్లిం మధ్యవయస్కుడిగా కనిపిస్తారు. చేయని తప్పుకు జైలు పాలవుతాడు యాసిన్ ఖాన్. ఓసారి తోటి ఖైదీలతో ఓ వాహనంలో వెళుతూ అతనికి పారిపోయే అవకాశం వస్తుంది. అతనితో పాటు చిల్లర దొంగతనాలు చేసే లాలు కూడా పారిపోతాడు. ఇద్దరూ ఒ ఇంట్లోకి దూరి ఓ వ్యక్తి సూట్‌కేస్ దొంగిలిస్తారు. తమను వెంబడిస్తున్న పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఓ పెద్ద ఇంట్లోకి దూరి దాక్కుంటారు. దొంగలించిన సూట్‌కేస్ లోని బట్టలను మార్చుకుని తమ జైలు యూనిఫారాలను కాల్చేస్తారు. బైట పోలీసు పహరా పెరగడంతో ఇక వారికి ఆ రోజు అక్కడే ఉండిపోవలసి వస్తుంది. అదే సమయంలో ఆ ఇంటికి వచ్చిన ఇంటి యజమాని వాళ్ళు ఆ ఇంటికి కొత్తగా అద్దెకు వచ్చిన కుటుంబం అని నిశ్చయించుకుంటాడు. ఇక దానితో బైట పరిస్థితి చక్కబడేవరకు తాము ఆ ఇంట్లో ఉండిపోవచ్చని వారికి అనిపిస్తుంది.

ఇంతలో ఆ ఇంటికి కోడలిగా హీనా అనే ఓ యువతి వస్తుంది. ఆమె భర్త ఆ ఇంటిని అద్దెకు తీసుకుని ఆమెను ముందు పంపించాడని, అతను తరువాత వస్తాడని ఇంటి యజమాని ద్వారా ఆ ఇద్దరికీ ముందే తెలుస్తుంది. ఆ ఇంటి నుండి బైటకు వెళ్లలేక వాళ్ళూ తాము ఆమె భర్త బంధువులమని చెప్పుకుంటారు. కుటుంబ ప్రేమ మరచిన వారికి ఆమె చూపే ప్రేమ గౌరవం కట్టిపడేస్తాయి. మామగారి హోదాలో యాసిన్ ఖాన్‌కి ఆమె సేవలు చేస్తుంది. వదినగా లాలుతో అనుబంధం పెంచుకుంటుంది. తమ దగ్గర డబ్బు లేకపోయినా ఎలాగో తంటాలు పడి ఆమెని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఆ ఇద్దరు.

ఈలోగా ఆమె భర్త ఆమెకు రాసిన ఉత్తరం హీనా కంట పడుతుంది. తాను అక్కడకు రాలేనని, తమ పెళ్ళిని మర్చిపోయి మరో జీవితాన్ని ప్రారంభించమని అతను ఉత్తరం రాయడంతో హీనా మథనపడుతుంది. దీనితో ఆమె మంచం పడుతుంది. ఆమెను కాపాడుకోవాలని విశ్వప్రయత్నం చేస్తారు ఆ యిద్దరూ. హీనా భర్త గుండె జబ్బు మనిషని తానెక్కువ రోజులు బ్రతకనని అతను అనుమానంతో హీనాకు ఆ ఉత్తరం రాస్తాడు. కాని తనకే జబ్బు లేదని తెలిసిన తరువాత ఆమెను కలవాలనుకుంటాడు. ఈలోగా హీనా పరిస్థితి గమనించి యాసిన్ ఖాన్ ఆమె భర్తను తీసుకురావాలని అడ్రస్సు పట్టుకుని అతన్ని కిడ్నాప్ చేసి తీసుకువస్తాడు. కాని హీనా దొంగల మధ్య ఉందని తెలుసుకున్న ఆమె భర్త పోలీసులను తీసుకువస్తాడు. పరిస్థితి విషమించిన హీనాను హస్పిటల్‌కు తీసుకువెళ్ళే సమయంలో పోలీసులు దాడి చేసి యాసిన్‌ను షూట్ చేస్తారు. అతను హీనా చేతిలో మరణిస్తాడు. పోలీసులకు హీనా నిజం చెబుతుంది. వారు దొంగలయినా వారు ఆ ఇంట లేకపోతే తాను జీవించగలిగే దాన్ని కాదని భర్తకు చెబుతుంది. లాలు జైలుకు వెళ్ళిపోతాడు. కాని మంచిగా బ్రతికే మరో అవకాశం వస్తే వదులుకోవద్దన్న యాసిన్ మాటలకు కట్టుబడి నీతిగా జీవించాలని నిశ్చయించుకుంటాడు.

హీనాగా మీనాకుమారి నటన బావుంటుంది. కాని ఈ సినిమా సమయంలో ఆమె విపరీతమైన మనోవేదనను అనుభవిస్తుంది. ఈ సినిమాకు సంభాషణలు రాసిన గుల్జార్‌తో ఆమెకు అప్పుడే పరిచయం ఏర్పడింది. ఆమె మేకప్ రూంలో గుల్జార్‌ని చూసి ఆమె భర్త కమల్ అమ్రోహి అసిస్టెంట్, బాఖర్ అలీ అందరి ఎదుట మీనాకుమారిని చెంపదెబ్బ కొట్టాడట. భర్త పనివాడితో తిన్నఆ చెంపదెబ్బ మీనాకుమారి భరించలేకపోయింది. భర్త దగ్గరకు వెళ్ళకూడదని నిశ్చయించుకుంది. ఉండడానికి ఇల్లు లేక చెల్లెలి భర్త అయిన మెహమూద్ ఇంట రోజులు గడిపింది. ఆ సమయంలోనే విపరీతంగా తాగడానికి ఆమె అలవాటుపడింది. ఆమె శరీరంలో ఆ మార్పు కనిపిస్తుంది. సినిమా ప్రారంభానికి చివరకు ఆమె లావు పెరగడం గమనించవచ్చు. అలాగే ఆమె ముఖంలో చాలా చోట్ల ఓ నిర్వేదం, అశక్తత కనిపిస్తాయి కూడా. ఈ సమయంలోనే మెహమూద్ ఇచ్చిన ఆశ్రయానికి ఆమె కొంత ఆస్తి రాసిచ్చిందని, అయినా ఆమె ఆఖరి రోజుల్లో ఆమెను ఎవరూ చూసుకోలేదని, చనిపోయినప్పుడు ఆమె హాస్పిటల్ బిల్ కూడా ఎవరూ కట్టకపోతే నటి నర్గిస్ దత్ ఆ బిల్లులను కట్టారన్నది చాలా మందికి తెలిసిన నిజం. ఈ సినిమా ప్రస్తావనకు వచ్చిన ప్రతి సారి మీనాకుమారి వ్యక్తిగత జీవితంలో చరమ స్థాయికి చేరిన ఆమె విషాదం గురించి సినీ ప్రేమికులు చెప్పుకుంటారు.

ఇక ఎన్నో సినిమాలకు గొప్ప సంగీతాన్ని అందించిన సలీల్ చౌదరి ఈ సినిమా సంగీతంతో ప్రేక్షకులకు చేరువ కాలేకపోయారు. సినిమాలో ఐదు పాటలుంటాయి. వీటిని మన్నా డే, లతా, ఆశా భోంస్లేలు పాడారు. ఓ పాటకు మీనాకుమారి కూడా గొంతు కలిపారు. నాలుగు పాటలను శైలేంద్ర రాస్తే, ‘ఐసా హోగా’ అనే ఓ పాటను గుల్జార్ రాసారు. మంచి సాహిత్యం ఉన్నా ఈ పాటలు అంతగా పాపులర్ కాలేకపోయాయి. సినిమా ఘోరంగా ఫెయిల్ అవడం కూడా కారణం కావచ్చు.

సినిమాలో బల్‌రాజ్ సహ్ని అద్భుతంగా నటించిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అతని భార్యగా షౌకత్ అజ్మీ అతిథి పాత్రలో కనిపిస్తారు. అనుక్షణం తనలోని కోపం, మంచితనం మధ్యన నిరంతర యుద్దం చేసే ఓ అసహాయ బీద వ్యక్తిగా ఆయనలోని సంఘర్షణను బల్‌రాజ్ చూపించే సీన్లు బావుంటాయి. కాని సినిమాలో మెహమూద్‌కి ఎక్కువ స్పేస్ ఇవ్వడం. గంభీరమైన దుఃఖాన్ని, మెహమూద్ హస్యంతో డామినేట్ చేసే ప్రయత్నంతో సినిమాలో సీరియస్‌నెస్ తగ్గి, అనవసరమైన కొన్ని సీన్ల మధ్య ప్రధానమైన మూడ్ నలిగిపోతుంది. అప్పట్లో మిస్ ఇండియాగా సెలక్ట్ అయిన పర్సిస్ ఖాంబట్టా ఈ సినిమాలో ఓ పాత్రలో కనిపిస్తారు. అది కథను డైవర్ట్ చేసింది. ఇలాంటి కొన్ని అనవసరమైన సీన్లు దర్శకత్వ లోపాన్ని చూపిస్తాయి. వీటన్నిటి మధ్యన కూడా కథా గాంభీర్యం చెడిపోకుండా బల్‌రాజ్ చేసిన ప్రయత్నాన్ని గమనించవచ్చు. “నేను జైల్లో ఉన్నప్పుడు లోపల అందరూ దొంగలే బైట అంతా నిజాయితీపరులే అనుకున్నాను. కాని ఇప్పుడు ఆలోచిస్తే మనిద్దరేం నేరస్థులం, బైట ప్రపంచంలో ప్రతి ఒక్కడు నేరస్థుడే” అంటూ మెహమూద్‌తో ఆయన మాట్లాడే సీన్, వెంటనే “లాలు నేను ఓ మనిషిని చంపాను, కాని నువ్వు చిన్నవాడివి, అమాయకుడివి. నా మాట విని ఈ జేబులు కత్తిరించడం మానుకో. నేను తిరిగి మంచి మార్గం వైపుకు రాలేకపోవచ్చు. కాని నీకు జీవితం మరో అవకాశం తప్పకుండా ఇస్తుంది. అప్పుడు నిజాయితీగా జీవించడానికి ప్రయత్నించు” అని మాట్లాడేటప్పుడు ఆయన గొంతులో పలికే అసహాయత, పశ్చాత్తాపం, మంచితనం మనసును ద్రవింపజేస్తాయి. బల్‌రాజ్ చేసిన మంచి సీన్లలో ఇది ఒకటి.

వీటన్నిటి మధ్య కూడా సినిమా చాలా వరకు సాగదీసినట్టుగానే అనిపిస్తుంది. బల్‌రాజ్ సహ్ని ముందు మెహమూద్‌వి కుప్పిగంతులు అనిపిస్తాయి. వీరిద్దరి కలయికలో చాలా గాప్ కనిపించడం కూడా ప్రేక్షకులకు సినిమా పట్ల నిరాశకు కారణం అవుతుంది.

కాని బల్‌రాజ్ సహ్ని చాలా వరకు మంచికి, చెడుకు, పరిస్థితులకు ఆలోచనలకు, మనిషి పడే సంఘర్షణను చూపే కథలను ఎన్నుకుని నటించారు. ఆ విధంగా గమనిస్తే యాసీన్ ఖాన్ పాత్రకు ఆయన పూర్తిగా న్యాయం చేశారని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here