“అరువి” వో హృదయ విదారక గాథ, వో చెంపపెట్టు కూడా

7
6

[box type=’note’ fontsize=’16’] “ఈ సినిమా చూశాకా, వద్దన్నా మనసులో మెదిలే ప్రశ్న మన భాషలో ఇలాంటి చిత్రాలు యెందుకు రావు? సమాధానం నా దగ్గర కూడా లేదు” అంటున్నారు పరేష్ ఎన్. దోషిఅరువి‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

Heartrending “Aruvi”
[dropcap]వ[/dropcap]స్తే వొకేసారి మంచి సినెమాలు కట్టగట్టుకుని వస్తాయి. ఈ వారం యే సినెమా కూడా చూసే ధైర్యం చేసేలా లేవు. అప్పుడు పడ్డాను నెట్ మీద. అదే సుఖమనిపించింది. యెన్నో వారాల నుంచీ వాయిదా వేస్తున్న “అరువి” చూసి రాత్రంతా ఆ దుఃఖ భారంతో నిద్రకు వెలిఅయి, తెల్లారెప్పుడో నిద్రపోయాను. అంతగా కదిలించిన చిత్రం. వద్దన్నా మనసులో మెదిలే ప్రశ్న మన భాషలో ఇలాంటి చిత్రాలు యెందుకు రావు? సమాధానం నా దగ్గర కూడా లేదు.

2018లో వచ్చిన మంచి చిత్రాలలో దీన్ని తప్పకుండా చేర్చవచ్చు. ఈ యేడు తమిళంలోనే మంచి చిత్రాలు యెక్కువ వచ్చినట్టు అనుమానం. “అతి”కి మారుపేరుగా చెప్పుకునే తమిళ చిత్రాలలో ఇంత గొప్ప సంవేదనశీలి, హృదయస్పర్శి, వైవిద్యభరిత చిత్రాలు కూడా వస్తున్నాయి. ఇలాంటివి నాలాంటివాళ్ళు సబ్ టైటిల్స్ పుణ్యమాని చూడగలుగుతున్నారు. అదీ అమేజాన్ ప్రైం లాంటి వాళ్ళ సౌజన్యంతో.

వొక ఆడ టెర్రరిస్టు పట్టుబడుతుంది. ఆమెనూ, ఆమె అనుచరులనూ అందరినీ ఇంటర్వ్యూలు చేస్తూ వుంటాడు లా ఎంఫోర్స్మెంట్ అధికారి షకీల్ (మొహమ్మద్ అలి బేగ్). బయట మీడియా, సాధారణ జనాల కుతూహలం, కోలాహలం. నెమ్మదిగా కథ ముందుకూ వెనక్కూ కదులుతూ చివరికొచ్చేసరికి మనల్ను కంట తడి పెట్టించేస్తుంది.

తల్లి, తండ్రి, తమ్ముడుతో వుంటుంది అరువి. తండ్రి కూచి. తండ్రి ఆమెను విపరీతంగా గారాబం చేస్తాడు. ఇది నేను వ్రాయడం లీనియర్ గా వ్రాస్తున్నా కాని తెరపై కథనం వో లెక్కతో ముందుకూ వెనక్కూ కదులుతూ వుంటుంది. ముఖ్యంగా యెదిగిన అరువి తండ్రిని గుర్తు చేసుకోవడం ద్వారా. ఆమె అలా యే యే సందర్భాలలో తలచుకుంటుంది అన్నది గమనిస్తే దర్శకుని వ్యూహం కూడా అర్థమవుతుంది. వ్యూహం అన్నప్పుడు మూడు కథలను వొకే చిత్రంలో జడలా అల్లేశాడు. దేనికదే కథ చెప్పినా వొక trilogy అయ్యేది. కానీ ఈ అనుభవం వేరు.

అరుణ్ ప్రభు పురుషోత్తమన్. ఈ పేరు గుర్తు పెట్టుకోండి. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం అతనే. ఇది అతని మొదటి చిత్రమంటే నమ్మలేము. అంత బాగా చేశాడు. తర్వాత చెప్పుకోవాల్సింది మరచిపోలేని అరువి (అదితి బాలన్) ముఖాన్నీ, నటననీ. చాలా బాగా చేసింది. మిగతా పాత్రలు వేసిన వారందరూ కూడా చాలా బాగా చేశారు. షెల్లి కేలిస్త్ చాయాగ్రహణం దర్శకుని వ్యూహాన్ని సహకరిస్తూ అందంగా వుంది. నాకు పాటలు ఆ అనువాదం వల్ల పూర్తి లోతు అందక పోయినా ఆ పాటల సాహిత్యమూ సంగీతమూ (బిందు మాలిని, వేదాంత్ భరద్వాజ్) బాగున్నాయి. తమిళం వచ్చినవారు చాలా బాగా ఆస్వాదించగలరు. తప్పక చూడాల్సిన చిత్రం ఇది. చిన్న చిన్న చోట్ల అభ్యంతరం అనిపించినా అవి ఈ చిత్రం సాధించిన దాని ముందు పట్టించుకోతగ్గది కాదనిపిస్తుంది. యెలాగంటే, వో చోట అరువి కన్స్యూమరిజం మీద చాలా పెద్ద ఉపన్యాసం లాంటి డైలాగులు చెబుతుంది. అది వొక్కటే వో చిత్రంగా తీయవచ్చు, లేదా రేఖామాత్రంగా స్పర్శించి చూసేవాడు తన మనసులో దాన్ని uncompress చేసుకోవచ్చు. కాని సినెమాకు మాత్రం అది భాష కాదు.

ఇక్కడి నుంచి కథను అనివార్యంగా నేను చర్చించాలి. కాబట్టి spoiler alert ఇవ్వబడిందిగా భావించి ముందుకెళ్ళండి.

కథ మూడు పాయలు అన్నాను కదా. వొకటి సెక్సు పట్ల మనకున్న “నైతికత” (so called). వొక మనిషికి ఎయిడ్స్ సోకిందని తెలీగానే ఆ మనిషి నైతికతను ప్రశ్నిచి, ఆ మనిషిని వెలివేయడం, హీనంగా చూడటం వగైరా. ఈ విషయంలో ఆడా మగా తేడా లేదు. అందుకే ఈ చిత్రంలో వో ట్రాన్స్జెండర్ ఎమిలి (అంజలి వరదన్, చాలా బాగా చేసింది) అరువికి తోడు నిలుస్తుంది. మరోపక్క అలాంటి మనుషులకు అక్కున చేర్చుకుని మానసికంగా ధైర్యం ఇవ్వకపోవడంతో పాటు సరైన వైద్య సదుపాయాలు కూడా తగినంతగా లేవు. ఇంకో కథ మన టీవీలలో వచ్చే రకరకాల రచ్చబండ కార్యక్రమాల మీద నుంచి ముసుగు యెత్తేయడం. కేవలం ఆ షోల మీద నుంచే కాదు, ప్రేక్షకులమైన మన మనస్సులో పేరుకుపోయిన jundgementality (అన్నిటి మీదా తీర్పులు ప్రకటించే బుద్ధి), voyeurism (ఇతరుల వ్యక్తిగత జీవితాలలో తొంగి చూసే బుధ్ధి) ల మీద నుంచి కూడా తెరలు యెత్తేస్తుంది ఈ చిత్రం. అరువి కథను టీవీలో వొక ఎపిసోడ్ చేస్తున్నప్పుడు రకరకాల మార్పుల కనుగుణంగా ఆ నిర్మాత తన వ్యూహాలను మార్చుకోవడం, అతనికి యెంతసేపూ తన TRPల ఆదాయాల గోల తప్ప నిజాయితీ తో తీయాలనే ఆలోచన లేనట్టు ప్రవర్తిస్తాడు. అలా ఆ షోలో వ్యాఖ్యాత కూడా. ఇక మూడో పాయ వో ఎయిడ్స్ సోకిన మనిషి పడే నరక యాతన మన కళ్ళ ముందు పెట్టడం. నిజంగానే హృదయవిదారకంగా చూపించాడు, ఆ మానసికావరణంలోని వొంటరితనం, అదీ చాలా విశాలమైన ప్రకృతి మధ్య, జనావాసాలకు దూరమైన స్థావరంలో. చూస్తున్న మనకు లోపలెక్కడో కల్లుక్కు మంటుంది.

ఇక కథ చెప్పనే లేదు కదూ. Obvious అనతగ్గవి కేవలం రేఖామాత్రంగా చూపించాడు, ఆ దృశ్యాల చిత్రీకరణ కూడా లేదు. లేదంటే ముగ్గురు ఆమెను చెరిచారు అన్నది చెప్పడానికి రెచ్చిపోయి చిత్రీకరించే వీలున్న కథ కదా, అవేమాత్రం లేవు ఇందులో. అవసరమూ లేదు. అల్లారుముద్దుగా పెరిగిన అరువి ఇప్పుడు కాలేజీ విద్యార్థిని. ఆ వయసులో వుండే ఉత్సాహం, అల్లరీ అన్నీ వుంటాయి. వొక ప్రమాదంలో ఆమెకు వైద్య చికిత్స అవసరమవుతుంది. ఆ క్రమంలో ఆమెకు ఎయిడ్స్ సోకుతుంది. వ్యాధి బయటపడగానే, అప్పటిదాకా ప్రేమగా చూసిన కుటుంబమే ఆమెను అమానుషంగా మానసికంగా హింసిస్తారు, వెలి వేస్తారు, చిత్రవధ చేస్తారు. తనకు యే పాపమూ తెలీదు అని మొత్తుకున్నా వినరు, నమ్మరు. ఆమె ఇల్లు వదిలి తన స్నేహితురాలింట కొన్నాళ్ళు తలదాచుకుంటుంది. ఆ అమ్మాయి తండ్రి మొదట అత్యాచారం చేస్తాడు, తాగిన మైకంలో. తర్వాత అరువి వో ట్రాన్స్జెండర్ అయిన ఎమిలితో కలిసి వుంటుంది. ఇద్దరూ వో కార్ఖానాలో బట్టలు కుట్టే పనికి వెళ్తుంటారు. అక్కడి యజమాని ఆమెపై అత్యాచారం చేసిన రెండవ వ్యక్తి. కుంగిపోయిన ఆమె మానసిక పరిస్థితిని వో బాబా నయం చేస్తానంటూ చెరుస్తాడు. ఇక లాభం లేదని చెప్పి వీళ్ళందరినీ లోకం ముందు దోషులుగా నిలబెట్టాలని అరువి టీవి రచ్చబండ లాంటి షో సహాయం తీసుకుంటుంది. షో నిర్మాతల వ్యూహాలు వొకలా వుంటే, చేత గన్ను పట్టి అరువి తన కథను చెబుతుంది, అందరినీ భయభ్రాంతులు చేసి. చివరకు పోలీసులకు సరండర్ అయిపోతుంది. చివరి పాయ ఆమె ఎయిడ్స్ తో తల్లడిల్లడం, తోడు కోసం ప్రేమకోసం తల్లడిల్లడం అనివార్యంగా చెప్పాల్సిన కథ.

ఇది స్థూలంగా కథ అయితే, ఇందులో ఉపకథలు అనేకం. చాలా నైపుణ్యంగా అల్లినవి. వొకే చిత్రంలో ఎయిడ్స్ సోకిన మనిషి వ్యథ, వో ట్రాన్స్జెండర్ వ్యక్తి ని వో ముఖ్య పాత్రలో మన ముందు పెట్టడం, సెక్సు పట్ల సమాజానికి వున్న ద్వంద్వ వైఖరి, కుటుంబంలో కూడా సెక్సు విషయంలో చాలా తీవ్రమైన భావజాలం వుండి కుటుంబ సభ్యురాలినే, ప్రెమించి పెద్ద చేసిన అమ్మాయినే అమానుషంగా హిన్సిచే గుణం, టీవీలలో వచ్చే దొంగ షోలు, ప్రేక్షకులలఓ వుండే voyeurism, judgementality ఇలాంటివన్ని చాలా సమర్థవంతంగా చెప్పగలగడం నిజంగా గొప్ప విషయమే. అరువి నా strong recommendation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here