అసలైన ఆకలి

10
10

[box type=’note’ fontsize=’16’] శ్రీ ప్రసూన్ రాయ్ ఆంగ్లంలో వ్రాసిన ‘హంగ్రీ’ అనే కథని ‘అసలైన ఆకలి’ పేరిట తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. [/box]

[dropcap]రా[/dropcap]హుల్‍కి ఆకలి వేస్తోంది! అదో వింత భావన, అతడిని అశాంతికి గురి చేస్తోంది. తన శరీరం, మనసు ఏం కోరుకుంటున్నాయో రాహుల్‍కి అర్థం కావడం లేదు.

27 ఏళ్ళ యువకుడైన రాహుల్, తమ అమ్మమ్మ కర్మకాండకి హాజరయ్యేందుకు తమ పూర్వీకుల ఇంటికి వెడుతున్నాడు. రాహుల్ నిన్ననే కోల్‌కతా చేరాడు. అంత్యక్రియలు పూర్తయ్యాయి కానీ, ఇంకా ఆచారపరమైన కర్మకాండలు మిగిలి ఉన్నాయి. రాహుల్ పశ్చిమ బెంగాల్‍లో శివారు ప్రాంతమైన అజీమ్‍గంజ్ వెళ్ళేందుకు కోల్‌కతా నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. నాలుగున్నర గంటల ప్రయాణం… మధ్యాహ్నం సమయానికి చేరిపోతాడనుకున్నాడు. అయితే హఠాత్తుగా జరిగిన అనుకోని ఆలస్యం వల్ల ప్రయాణ కాలం మరో రెండు గంటలు ఎక్కువయింది. వేసవి.. పెరుగుతున్న ఎండ, ఉక్కబోత వల్ల రాహుల్‍కి విపరీతమైన చెమటలు పడుతున్నాయి. బోగీలో అసహనంగా కూర్చున్నాడు.

రాహుల్ తన జీవితంలో అధికభాగం కొలరాడోలోని డెన్వర్‍లో గడిపాడు. రాహుల్‌కి సంవత్సరం కన్నా తక్కువ వయసు ఉండగానే అతని తల్లిదండ్రులు అమెరికా వలస వెళ్ళిపోయారు. రద్దీగా, ఇరుకుగా ఉన్న ఆ బోగీలో కూర్చుని ఉండగా రాహుల్ ఆలోచనలు బాల్యం వైపు మళ్ళాయి. ప్రతీ ఏడాది రాహుల్ తన తల్లిదండ్రులతో కలిసి కోల్‍కతా వచ్చినప్పుడు అమ్మమ్మ కూడా తమ ఊరు నుంచి కోల్‍కతా వచ్చేది. కుటుంబంతా కలిసి రాహుల్ వాళ్ళ అపార్ట్‌మెంట్‌లో నెలకి పైగా గడిపేవరు. అమ్మమ్మ ఉండే గ్రామంలోని తమ పూర్వీకుల ఇంటికి రాహుల్ ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ ఊరికి వెళ్ళడం రాహుల్ తండ్రికి ఇష్టం ఉండేది కాదు! అక్కడి అపరిశుభ్ర వాతావరణం, నిరక్షర సంస్కృతి ఆయనకి నచ్చేవి కావు. రాహుల్ మనసులో అమ్మమ్మ జ్ఞాపకాలు పెద్దగా లేవు, కానీ హృదయాంతరాలలో ఆమె తన పట్ల చూపిన ప్రేమ వెచ్చదనం ఇంకా ఉంది. కోలకతా వచ్చినప్పుడు ఆవిడ స్వయంగా చేసి తన కోసం తెచ్చే కలకండ మిఠాయి గుర్తుంది.

అజీమ్‍గంజ్‌లో దిగాకా, ‘నా కడుపులో ఎలకలేంటి, ఏనుగులే పరిగెడుతున్నాయి… అర్జెంటుగా ఏదైనా తినాలి’ అనుకున్నాడు.

కానీ గ్రామీణ వాతావరణంలోని ఆ చిన్న రైల్వే స్టేషన్, గాలిలో అడ్డూ అదుపు లేకుండా పైకి లేస్తున్న ధూళి – అక్కడి పరిశుభ్రత పట్ల అని అతనిలో చిన్న సంశయం కలిగించాయి. అతని పూర్వీకుల గ్రామం ‘హల్దిపారా’ ఇంకో పది కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్‍లో వెళ్ళాలి. కడుపులో ఇంత గాస్ట్రిక్ గడబిడగా ఉన్నందున, ఏమీ తినకుండా ఆ కాస్తా దూరం కూడా వెళ్ళేలా లేడు. ఒంటరిగా ప్రయాణిస్తూ, తన తల్లిదండ్రుల తరఫున వెళ్తున్నాడు. జబ్బు పడకూడదు మరి.

స్టేషన్ నుండి బయటకు రాగానే, రోడ్డు మీద ఓ మూలగా ఉన్న చిన్న మిఠాయిల కొట్టుపై రాహుల్ దృష్టి పడింది. దూరం నుంచీ చూస్తున్నా ఆ కొట్టు పరిశుభ్రంగా ఉందనిపించింది. ‘ఇక్కడ ఏదైనా తిందాం. పొద్దున్న రైలెక్కేముందు బ్రేక్‍ఫాస్ట్ తినకపోవడం ఇబ్బందిపెట్టింది’ అనుకున్నాడు.

ఆ కొట్లోకి నడిచాడు రాహుల్. రోడ్డు పక్కగా ఉన్న ఓ బల్లపై కూర్చున్నాడు. ఒక ప్లేట్ సమోసాలు ఇవ్వమని అడిగాడు. సమోసాలను అప్పుడే వేడిగా తయారుచేస్తున్నారు. రెండు తాజా సమోసాలను ఓ పళ్ళెంలో పెట్టి రాహుల్ ముందు ఉంచాడు కొట్టతను. మొదటి సమోసా చిన్న ముక్క కొరకబోతూ, రాహుల్ ఎందుకో రోడ్డు వైపు చూశాడు. తన బల్ల పక్కనే ఓ ముసలావిడ… బహుశా బిచ్చగత్తేమో… నిలబడి సమోసాల వైపు ఆశగా చూస్తోంది!

రాహుల్ సమోసాని కొరకలేకపోయాడు. అతనికి అసౌకర్యంగా ఉంది. ‘ఈవిడ నిన్న రాత్రి నుంచి అసలు ఏమైనా తిని ఉంటుందా? నా ఆకలి ఆమె ఆకలి కంటే ఎక్కువ కాదు! చూస్తుంటే ఆవిడ విచారంగానూ, నిస్సహాయంగానూ ఉన్నట్టుంది’ అనుకున్నాడు.

తన పళ్ళెంలోంచి ఓ సమోసా తీసి ఆవిడకిచ్చాడు. ఊహించని ఆనందంతో ఆ సమోసాని అందుకుంది, రాహుల్ దీవించి, అక్కడ్నించి వెళ్ళిపోయింది. ఆమె చూపులు రాహుల్ హృదయాన్ని కరిగించాయి. ఏదో వింత వేదన అతని హృదయంలో కలిగింది. ఇటువంటి దృశ్యాలు రాహుల్‍కి పెద్దగా అనుభవం కాలేదు. కాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు. తన పళ్ళెంలోని మరో సమోసాని తిని, లేచాడు. జీర్ణరసాల దాహం తీర్చినందుకు తృప్తిగా ఉంది. కాస్త శక్తి వచ్చినట్టు భావించాడు.

బస్‌స్టాప్‍ సమీపిస్తుండగా, సమయం తెలుసుకోడానికి చేతి గడియారం వైపు చూశాడు. మరో పావుగంటలో బస్ బయల్దేరుతుంది. బస్‌స్టాండ్ చేరి ఎదురుచూస్తుండగా, తన ఆఫీసులో తనకున్న ‘ఎప్రైజల్’ గుర్తొచ్చింది. బాస్ ఏమంటాడో అనుకున్నాడు. తన ఆర్థిక స్థితి, తన కెరీర్‍లో ఎదుగుదల – బాస్ ఇచ్చే రేటింగ్ పైనే ఆధారపడి ఉన్నాయి. అతని మనసంతా రాబోయే ఎప్రైజల్, బాస్ రేటింగ్ పైనే ఉంది. అలా నిలబడి ఆలోచిస్తునే ఉన్నాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత తన హాస్య స్వభావంతోనూ, ప్రతిభతోనూ చక్కని కెరీర్ ఏర్పర్చుకున్నాడు.  రాబోయే కాలంలో కెరీర్‍లో పైకి ఎదగగలనని నమ్ముతున్నాడు.

ఇంతలో, రాహుల్‍కి మళ్ళీ ఆకలి వేస్తున్నట్టు అనిపించింది. మళ్ళీ ఎందుకు ఆకలివేస్తోందో అతనికి అర్థం కాలేదు. తల తిరుగుతున్నట్టు అనిపించి కాస్త కంగారు పడ్డాడు.

‘ఇప్పుడేగా సమోసా తిన్నాను!’ అనుకున్నాడు. ‘ఊహూ, ఇది ఆకలై ఉండదు. మరి దీన్నేమంటారు?’

ఇంతలో, దేశదిమ్మరిలా తిరిగో ఓ స్థానికుడొచ్చి రాహుల్ పక్కన నిలుచున్నాడు. “భగవంతుడు నీకు మేలు చేయుగాక! నీ ఆలోచనలన్నీ నాకు తెలుసు.. నీ కలలు నిజమవుతాయి… నా ఆధ్యాత్మిక శక్తి నీ భవిష్యత్తును తెలుపుతోంది” అన్నాడు రాహుల్‌తో.

రాహుల్ అతన్ని పట్టించుకోలేదు. మరో వైపు చూడసాగాడు. ఆ దేశదిమ్మరి మరింత దగ్గరగా వచ్చి, రాహుల్ చెవిలో చెబుతున్నట్లుగా – “నాయానా, నేను రెండు రోజుల నుంచీ ఏమీ తినలేదు” అన్నాడు గుసగుసగా.

ఈసారి రాహుల్ అతనికేసి తేరిపార చూశాడు. ఆ ముసలతని శరీరం అతని అసలు వయసుని తెలీనివ్వడం లేదు. ఎముకల గూడులా ఉన్నాడు. చూస్తుంటేనే, పేదవాడనీ, సరిగా తిండి తినడం లేదనీ, జబ్బులతో ఉన్నాడని తెలిసిపోతోంది. పర్సులోంచి ఓ పెద్ద నోటు తీసి అతనికిచ్చాడు.

సంతోషం పట్టలేని ఆ దేశదిమ్మరి రాహుల్ తలపై చేయి ఉంచి దీవించాడు. వెళ్ళబోతూ “నిన్ను దేవుడే పంపాడు నాయానా! ఇక నేను అన్నం కోసం ఎవరినీ అడుక్కోనక్కరలేదు. ఇక నా దృష్టి అంతా భగవంతుడిపై నిలుపుతాను” అన్నాడు.

బస్ వచ్చింది. రాహుల్ ఎక్కి కూర్చున్నాడు. కిటికీలోంచి బయటకు చూస్తుండగా, పక్కన ఆగి ఉన్న బస్‍లో ప్రయాణీకులను డబ్బు అడుగుతూ కనబడ్డాడు ఆ దేశదిమ్మరి. హఠాత్తుగా రాహుల్ మనసుకి ఏదో తోచి నవ్వుకున్నాడు. వినోదంగా అనిపించింది. ‘మేమిద్దరం ఒకటే! ఒకే జాతికి చెందిన ధూర్తులం! దేవుడి కోసం కేటాయించాల్సిన సమయంలో అతను మరింత డబ్బు కోసం అడుక్కుంటున్నాడు; అమ్మమ్మ కోసం బాధపడాల్సిన సమయంలో నేను ఎప్రైజల్ గురించి ఆలోచిస్తున్నాను! మేమిద్దరం డబ్బు కోసం ఆకలితో ఉన్నాం!’ అనుకున్నాడు.

బస్ బయల్దేరుతుండగా, ఓ యువతి చేతిలో బిడ్డతో గబగబా పరుగెత్తుకుని వచి ఎక్కి రాహుల్ పక్క సీట్లో కూర్చుంది. ఆ బిడ్డ తెగ ఏడుస్తోంది, సముదాయించడానికి అవస్థ పడుతోంది తల్లి.

ఆ బిడ్డ ఏడుపు ప్రయాణీకులందరికీ ఇబ్బందిగా ఉంది. తల్లికి తత్తరపాటుగా ఉంది. కాస్త సాయం చేయాలని నిర్ణయించుకున్న రాహుల్ తన సీట్లోంచే – రకరకాల హావభావాలను ముఖంలో పలికించి ఆ బిడ్డని ఊర్కోబెట్టాడు. మొదట చిన్నగా నవ్వి, తర్వాత గట్టిగా నవ్విందా బిడ్డ.

ఆ తల్లి గట్టిగా నిట్టూర్చి, “ధన్యవాదాలు! చాలాసేపటి నుంచి నేను పాపని సముదాయించలేకపోయాను. ఆకలిగా ఉందేమోననుకుని పాలు పట్టాను. పాలు తాగినా ఏడుపు ఆపలేదు! మొత్తానికి మీరు సముదాయించగలిగారు” అంది.

కిటికీ నుంచి చల్లని గాలి తగులుతుండగా రాహుల్ తన చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నాడు. పెద్దయ్యాకా కూడా తను ఏ విధంగా తల్లిదండ్రుల ధ్యాస తన మీదే ఉండాలని కోరుకునేవాడో తలచుకున్నాడు. “పాప మీ ధ్యాసని కోరుకుంది” అన్నాడు.

సాయంత్రం నాలుగయ్యేసరికి తన పూర్వీకుల గ్రామం చేరుకున్నాడు. దూరపు బంధువులు పలకరించి ఇంట్లోకి తీసుకువెళ్ళారు. కాళ్ళూ చేతులు కడుకున్నాకా, టీ తాగించారు. ఆ తరువాత అందరూ కలసి ఆచారపరమైన కార్యక్రమాలు పూర్తి చేసారు. ఇదంతా పూర్తి అవడానికి మరో గంట పట్టింది. ఈ గ్రామానికి రాహుల్ రావడం ఇదే మొదటిసారి. అమ్మమ్మ తన జీవితాంతం గడిపినా ఆ మట్టి ఇల్లంతా కలయతిరిగాడు.

ఈ గ్రామపు వాతావారణం బానే ఉందనిపించింది. అన్నిటి నడుమ ప్రశాంతంగా అనిపించింది. ఇంతలో అతనికి మళ్ళీ ఆకలి వేసింది. ‘ఏం జరుగుతోంది? నాకెందుకు మాటిమాటికి ఆకలి వేస్తోంది?’ అనుకున్నాడు.

ఈ వింత భావన గురించి ఆలోచిస్తుండగా, అత్త వరసయ్యే ఓ దూరపు బంధువు అతని దగ్గరికి వచ్చింది. “రాహుల్, చనిపోవడానికి కొద్ది రోజులు ముందు మీ అమ్మమ్మ చేసిన కలకండ మిఠాయిలు ఇవిగో. వీటిని నీ కోసమే చేసినట్టు తను చెప్పింది. ఆమె చేసే కలకండ నీకిష్టమని ఆమెకు తెలుసు. బహుశా తను ఎక్కువ రోజులు బ్రతకదని ఆమెకు తెలుసేమో, అందుకే ఈ మిఠాయిలు తయారు చేసినట్టుంది” అంది.

రాహుల్‍లో ఉద్వేగం కలిగింది. అత్త చేతిలోంచి ఒక మిఠాయి ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఆ కలకండ వెన్నముద్దలా అతని నోట్లో కరిగిపోయింది. చాలా సేపటి తర్వాత ఆకలి తీరినట్లనిపించింది!

అందరూ వెళ్ళిపోయాకా, రాహుల్ అమ్మమ్మ మంచం మీద కూర్చున్నాడు. ‘నాకు ఆకలిగా ఉందని నాకు తెలుసు. రోజంతా నా ఆకలి నా స్వభావం లోని వివిధ అంశాలను నాకు చూపింది. నాకు ఆహారం కోసం ఆకలి వేసింది, డబ్బు కోసం ఆకలేసింది, గెలుపు కోసం, ధ్యాస కోసం ఆకలేసింది! అయినా నాకింకా ఆకలిగానే ఉంది!’ అనుకున్నాడు.

కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా, గదంతా కలయజూశాడు. అమ్మమ్మ అక్కడ తిరుగాడుతున్నట్టే ఉంది. రాహుల్ పైకి చూస్తూ, ఎవరో అజ్ఞాత వ్యక్తికి చెప్తున్నట్టుగా, “నాలోని అసలైన ఆకలిని ఏదీ తీర్చలేకపోయింది… కానీ నీ కలకండ తీర్చింది! నన్ను క్షమించు అమ్మమ్మా, నీ చివరి క్షణాల్లో నీతో ఉండలేకపోయాను…. నాకిప్పుడు అసలైన ఆకలి… నీ ప్రేమ పొందాలనే ఆకలి బాగా వేస్తోంది…” అన్నాడు.

ఆంగ్ల మూలం: ప్రసూన్ రాయ్

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here