అసలైన అర్చన

0
5

[dropcap]జ[/dropcap]యపురం జమీందారు జయవర్మ యువకుడు. ఆయనకు వివాహమై, జమీందారిణి జయలక్ష్మీదేవి జమీలో అడుగుపెట్ట గానే కోట కళకళలాడ కాడసాగింది. ఆమె సనాతన ధర్మాలపట్ల మక్కువగలది. ప్రతి పండుగ, పబ్బం చక్కగా నిర్వహించేది. సద్ బ్రాహ్మణులకు, పేదలకు దానధర్మాలు చేస్తుండేది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో గుమ్మాలను పసుపుకుంకుమలతో అలంకరించేది. మామిడి తోరణాలు కట్టించేది. వాకిళ్ళ ముందు ఆవుపేడ చల్లించి, ముగ్గులు పెట్టించేది. దివాణం మొత్తం లక్ష్మీ కళతో నిండిపోసాగింది.

తమ జమీలోని ప్రజలంతా దైవభక్తితో, పూజలు వ్రతాలూ చేస్తూ మంచి మనస్సుతో, ఉన్నతులుగా, ఉత్తమ మానవులుగా ఉంటే తమకు, ప్రజలందరికీ శుభంజరుగుతుందని జమీందారిణి జయలక్ష్మీదేవి నమ్మకం.

అందుకే ఆమె తన జమీలోని స్త్రీలందరినీ శ్రావణమాసంలో మంగళవార గౌరీపూజలు ప్రతి గృహంలో తప్పక జరుపుకోవాలని, ఆ గౌరీదేవి ఆశీస్సులతో తన జమీలోని స్త్రీలంతా సౌభాగ్యవతులుగా ఉంటే అంతా సంతోషం నిండి ఉంటుందనీ ఆమె నమ్మిక.

ఇలా ఉండగా ఆ ఏడాది శ్రావణమాసం రానే వచ్చింది. జయలక్ష్మీదేవి తమ జమీలోని లక్ష్మీదేవి ఆలయంలో పునిస్త్రీలందరినీ పిలిచి శ్రావణ మంగళగౌరీ పూజలు, శుక్రవారపు వరలక్ష్మీ వ్రతాలు చేయించాలని తలపెట్టి జమీందారుగారిని అనుమతి కోరింది. జయవర్మ సంతోషంతో జమీ అంతా చాటింపు వేయిoచాడు. ప్రతి మహిళా మంగళ శుక్రవారాల్లో జమీందారిణి చేయించే వ్రతాల్లో తప్పక పాల్గొనాలని, శుచిశుభ్రతలతో వచ్చి వాయినాలు పుచ్చుకోవాలనీను.

జమీలోని మహిళలంతా అమితానందంతో ముస్తాబై, తమకున్న మంచి మంచి, ఖరీదైన చీరలు ధరించి, నగలు పెట్టుకుని, లక్ష్మీ అమ్మవారి ఆలయానికి శ్రావణ మంగళగౌరీ పూజకు రాసాగారు. జమీందారిణి కంట పడాలని అందరూ ముందుగా వచ్చి వారి వారి హోదాలకు తగిన వారితో కలసి గుంపులు గుంపులుగా వరుసల్లో కూర్చోసాగారు.

పేదరాళ్ళు పేదరాళ్ళ వద్ద ధనికులు ధనికుల వద్ద, పదవుల్లో ఉన్న వారంతా ఒకచోట చేరారు. జమీందారిణి వచ్చి అందరికీ సామూహిక పూజలకై పూల సజ్జలు, లక్ష్మీ విగ్రహాలు, పూజాసామగ్రి అన్నీ తెచ్చి సేవకురాళ్ళ చేత ఇప్పించింది. అంతా లక్ష్మీ దేవి విగ్రహాలను తమ ముందుంచిన పీఠాలపై ఉంచుకుని, పూజకై తయారుగా ఉన్నారు. పూజారిగారు, సహస్రనామం చదువుతుండగా, పూలు లక్ష్మీ విగ్రహంపై చల్లుతూ, జమీందారిణిని చూస్తూ ఆమె తమ వైపు చూస్తే నవ్వాలనీ, పలుకరించాలనీ ఆరాటపడసాగారు. వారందరి హృదయాల్లో దేవత లక్ష్మీ దేవి కాక, జమీదారిణి లక్ష్మీదేవి రూపం నిల్చిపోయి ఉంది.

పాపం ఆ ఆలయాన్ని నిత్యం చిమ్మి తుడిచి, ముగ్గులు పెట్టి శుభ్రపరచే సీతమ్మ, తన పనంతా పూర్తి చేసుకుని వచ్చేసరికి పూజ మొదలైంది. ఆమె తడిసిన పాత చీరతో చెమటలు కారే శరీరంతో, అలకారం లేకుండా ఆలస్యంగా రావటాన అందరితో కలసి కూర్చునే అవకాశం లేకపోయింది. పైగా అక్కడికి కాపలాగా వచ్చిన సేవకులు సీతమ్మను లోనికి అనుమతించలేదు.

సీతమ్మ ఆలయం వెలుపలే తాను శుభ్రంచేసి ముగ్గులు వేసిన తావులో ఆలయం వెలుపల దొరికిన ఒక చిన్న అరచేయంత నాపరాతి ముక్కను తెచ్చుకుని కడిగి శుభ్రపరుచుకుని , తాను ముగ్గులో వేసిన పూలు తెచ్చి కడుక్కుని, పురోహితుడు మంత్రాలు చదివినప్పుడల్లా తానూ భక్తితో ఉచ్చరిస్తూ కళ్ళు మూసుకుని, తన ముందు ఉన్నది లక్ష్మీ దేవి విగ్రహమేననీ, తాను పూజించేది ఆమెనేనని మనస్పూర్తిగా విశ్వసిస్తూ పూజించసాగింది. సీతమ్మ హృదయంలో దేవత లక్ష్మీదేవి రూపం నిల్చిపోయి తాను అర్పిస్తున్న పూలు ఆమెకే అందుతున్నాయనీ ఆమె తన పూజ స్వీకరిస్తున్నదనే పూర్తి నమ్మకంతో పూజ చేయసాగింది.

ఆ పురాతన దేవాలయం లోనిది స్వయం భూ లక్ష్మీదేవి విగ్రహo. ఎంతో మహిమకల దేవత ఆమె. పూజ పూర్తయ్యాక అందరూ వాయనాలు ఒకరికొకరు ఇచ్చుకోమని పూజారిగారు చెప్పారు. ఎంతోమంది మహిళలు, జమీందారిణికి వాయనం ఇవ్వాలని ముందుగానే మంచి మంచి రుచికరమైన పిండివంటలు శ్రధ్ధగా తయారుచేసి కొంగులచాటున దాచి ఉంచుకున్నారు. నైవేద్యం చేశాక వారంతా జమీందారిణి తమ వైపు వస్తుందేమోని వేచిచూడసాగారు.

కానీ ఆమె గర్భగుడి లోకి వెళ్ళి, అమ్మవారి విగ్రహానికి తన నైవేద్యం చెల్లించి, బయటికి రాగానే పూజారి “అమ్మా! మీరంతా ఒకరికొకరు మీ మీ వాయనాలను ఇచ్చుకోండి!” అని చెప్ప గానే ముత్తైదువలంతా, తమ హోదాకు తగిన తమ స్నేహితురాళ్ళకు వాయనాలు ఇచ్చుకున్నారు. జమీందారిణి బయటికి వెళ్ళను దేవాలయం ముఖద్వారం వద్దకు రాగానే అంతా పక్కకు జరిగి ఆమెకు దారి చేశారు.

జమీందారిణి బయటికి వచ్చి, గుమ్మం బయట పూజ చేసుకున్న పేదరాలైన సీతమ్మ ముందు రాతిపై కూర్చుని ఆమె “ఇస్తినమ్మ వాయనం” అంటుండగా, “పుచ్చుకుంటినమ్మ వాయనం” అంటున్న ఓ ముత్తైదువను ఆశ్చర్యంగా చూడసాగింది. ఆ ముత్తైదువ, వంటినిండా నగలతో, ఖరీదైన పట్టు చీరతో, ఎంతో ముఖ వర్ఛస్సుతో అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. ఇంతకూ ఆ పేదరాలిచ్చిన వాయనం ఏంటా అని చూసిన జమీందారిణి ఆశ్చర్యచకితయైంది. ఆ వాయనం కేవలం రాగి దోశలు! వాయనం అందుకుని ఆ ముత్తైదువ లేచి, క్షణంలో మాయమైంది. జమీందారిణికి ఆమే లక్ష్మీదేవి అమ్మవారనీ భక్తీతో ఆలయం బయట పూజించిన పేదరాలు వద్ద వాయనం పుచ్చుకుని వెళ్ళిందని తెల్సుకుని నిశ్చేష్టురాలైంది.

భక్తి ముఖ్యం కానీ ఆర్భాటం, ధనం కాదని అందరికీ తెల్సి వచ్చింది.

ఆర్భాటంకంటే అంతరాత్మలో భక్తిపూరిత పూజే భగవంతుడు మెచ్చేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here