అసలు కంటే వడ్డీ ముద్దు

0
14

[‘అసలు కంటే వడ్డీ ముద్దు’ అనే కథని అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

[dropcap]రా[/dropcap]ఘవయ్య జానకమ్మలకు ప్రకాశం ఒక్కడే కొడుకు. చిన్నతనం నుంచి బాగా చదువుకునేవాడు. ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ నే ఉండేవాడు. అలాంటి ప్రకాశం ఇంజనీరింగ్ చదువుకుంటానంటే తండ్రి కొడుకు ఇష్టమైన చదువు చదువుకుంటాడని ఇంజనీరింగ్ లోనే చేర్పించాడు.

ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అమెరికా వెళతానంటే ఒక్కగానొక్క కొడుకును వదిలి ఉండటం ఇష్టం లేకపోయినా భయం బాధగా ఉన్నా కూడా కాలాన్ని బట్టి పోవాలి కదా! అనుకుంటూ అమెరికా చదువుకు పంపించడానికి ఇష్టపడ్డాడు.

ఇంజనీరింగ్ పూర్తి అయినతర్వాత ఒక రెండేళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత తప్పకుండా ఇండియా తిరిగి వస్తానని తల్లిదండ్రులకు ఎంతగానో నచ్చ చెప్పాడు ప్రకాశం.

అలా చెప్పి వెళుతున్న వాళ్ళేగాని ఆ తర్వాత తిరిగిరానివాళ్ళని ఎంతో మందిని చూసాడు రాఘవయ్య. అయినా కొడుకు కోరికను కాదనలేక పంపించటానికి సిధ్ధపడ్డాడు.

జానకమ్మగారు మాత్రం ఎంతగానో దిగులుపడ్డారు. ఒక్కగానొక్క కొడుకు తమను విడిచిపెట్టివెళుతన్నాడు. మళ్ళీతిరిగి వస్తాడో రాడో అని ఆమె భయం. తన స్నేహితురాలి కొడుకు కూడా ఇలానే చెప్పి అమెరికాకు వెళ్ళాడు. తరువాత అక్కడే ఇల్లు వాకిలి కొనుక్కున్నాడు. వీళ్ళు పాపం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయారు.

విదేశాలకు వెళ్ళిన తమ కొడుకు మాత్రం తిరిగివస్తాడా. ఇప్పుడు ఇలానే చెబుతాడు. బాధగా ఉన్నా ‘కాలాన్నిబట్టి పోక తప్పదు కదా’ అనుకుని కొడుకుని అన్ని జాగ్రత్తలు చెప్పి అమెరికా పంపించారు రాఘవయ్య జానకమ్మలు.

కొడుకుపై ప్రేమను చంపుకోలేక ఆరునెలలు కాగానే కొడుకు ఎక్కడ ఇబ్బంది పడతాడోనని అతనికి కావలసిన పచ్చళ్ళు, పొడులు తినుబండారాలను చేసి పంపించేది జానకమ్మ. తల్లి మమకారం అదే మరి. అలా రెండేళ్లు గడిచిపోయింది. రోజు ఫోన్లో మాట్లాడి క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండేవాడు. చదువు అయిపోయింది. తరువాత క్యాంపస్‌లో జరిగిన ఇంటర్వూలో మంచి ఉద్యోగం వచ్చిందని అక్కడే ఉద్యోగంలో చేరాడు.

ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక సంవత్సరానికి సెలవు పెట్టి వచ్చి ఒక నెలరోజుల పాటు ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళాడు.

“పెళ్లి సంబంధాలు చూస్తాం చేసుకోరా!” అని అడిగితే “ఇంకొక రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత చేసుకుంటా. నాన్న బ్యాంకులో తీసుకున్న లోన్ తీరిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటాను” అని చెప్పాడు ప్రకాశం.

“దానికి దీనికి ముడి పెట్టవాకు. త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా! మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి” అని తల్లి చెప్పింది.

“లేదమ్మా నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు. ఈసారి వచ్చినపుడు తప్పకుండా చూస్తాగా!” అని ఒట్టు వేసి అమెరికా వెళ్లిపోయాడు ప్రకాశం.

ఏడాది గడిచింది. రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు గడిచినా మళ్లీ రాలేదు. ఫోన్లో మాత్రం ప్రతి రోజు మాట్లాడతాడు. అదిగో వస్తానంటాడు ఇదిగో వస్తానంటాడు కాని రాలేదు. పెళ్ళి గురించి ఎన్నిసార్లు అడిగినా ఏ విధమైనటువంటి సమాధానం చెప్పటం లేదు.

చివరిగా ఒకనాడు ఉరుము లేని పిడుగులా తల్లి తోటి “అమ్మా నీకు ఒక విషయం చెబుతాను, బాధపడకు” అన్నాడు. “అమెరికాలో మన వాళ్ళ అమ్మాయి, నాతో చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయి చాలా బాగుంటుంది. ఆ అమ్మాయిని యిష్టపడ్డా! నీకు తప్పకుండా నచ్చుతుంది. నీకు ఫోటో కూడా పంపిస్తున్నాను చూడు” అన్నాడు. “ఆ అమ్మాయి అమెరికాలో పుట్టి పెరిగినా కూడా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా తెలిసింది. పేరు కూడా సరస్వతి. బాగుంది కదమ్మా. నీకు తప్పకుండా నచ్చుతుంది అమ్మా. నువ్వు చూస్తే నీకు నచ్చుతుంది” అంటాడు కానీ తల్లి మనసుని అర్థం చేసుకోలేదు.

జానకమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ కోపంతో “మాకేం నువ్వు చెప్పక్కర్లేదు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో” అన్నది.

ప్రకాశం తను అనుకున్నట్లుగానే ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొడుకు తన మాట వినకుండా వివాహం చేసుకున్నాడని మాటలు తగ్గించేసింది జానకమ్మ. తండ్రితో మొదటి నుంచి తక్కువగానే మాట్లాడేవాడు.

కానీ ప్రకాశం మాత్రం ఇది వరకు చేసినట్లుగానే రోజూ తల్లికి ఫోన్ చేస్తూనే ఉండేవాడు. ఏదో ఒకటి రెండు పొడి ముక్కలు మాట్లాడి ఫోన్ పెట్టేసేది జానకమ్మ.

కాలం ఆగదుకదా! ఇలా ఒక ఆరునెలల కాలం గడిచిపోయింది. తర్వాత ఒక రోజున “అమ్మా! నీ కోడలు కడుపుతో ఉన్నది” అని చెప్పాడు ప్రకాశం.

“నాకెందుకు చెప్పటం?” అన్నది జానకమ్మ.

బాధతో, “అది కాదమ్మా. నీకు తప్పితే ఎవరికి చెప్పుతాను నేను?” అన్నాడు ప్రకాశం.

“సరే మంచిది. అయితే” అన్నది జానకమ్మ.

కొడుకుతో సంభాషణ జరుగుతున్నది. కాని ఎప్పుడూ కూడా ఆమె ఆ అమ్మాయితో మాట్లాడింది లేదు. మళ్ళీ నాలుగు నెలలు గడిచిపోయింది. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి “అమ్మా మీకు మనవడు పుట్టాడు” అని చెప్పాడు ప్రకాశం.

ఆ మాట వినేటప్పటికీ కొడుకు మీద ఎంత కోపం ఉన్నా కూడా మనవడు పుట్టాడన్నమాట వినగానే కొంత సంతోషాన్ని కలుగజేసింది. “సరే అయితే” అని చెప్పి, “మంచిది జాగ్రత్తగా ఉండండి” అని పెట్టేసింది.

పిల్లవాడు పుట్టిన తర్వాత పిల్లవాడిని రోజు ఫోన్లో చూపిస్తూనే ఉన్నాడు. వాడు చేసే పనులన్నీ చెబుతున్నాడు. మూడు నెలలు అయిన తర్వాత పిల్లవాడికి పేరు పెట్టిన విషయం చెబుతూ ఫోటోలు వీడియోలు పెట్టాడు. మరి ఆరు నెలల కాలం గడిచిపోయింది. పిల్లవాడికి 11వ నెల రాగానే “అమ్మా! నీ మనవడికి తిరుపతిలో పుట్టు వెంట్రుకల తీయిద్దాం అని చెప్పి మేము ఇండియా వస్తున్నాం” అన్నాడు కొడుకు.

“సరే మీ ఇష్టం” అన్నది జానకమ్మ.

కొడుకు కన్నా ముందు మనవడు, పసివాడు ఇబ్బంది పడకూడదు కదా! అని తిరుపతిలో ముందుగానే ఏర్పాట్లన్నీ చూశాడు రాఘవయ్య.

వారు అనుకున్నట్లుగానే పసివాడిని తీసుకొని కొడుకు కోడలు వస్తున్న సమయానికి రాఘవయ్య జానకమ్మలు హైదరాబాదు విమానాశ్రయానికి వెళ్లారు. విమానం దిగి వచ్చిన మనవడిని చూడగానే జానకమ్మ అన్నీ మర్చిపోయి దగ్గరకు తీసుకున్నది. పసివాడు కూడా రోజు వీడియో కాల్‌లో చూస్తున్న నాయనమ్మని గుర్తుపట్టి దగ్గరకు వచ్చాడు. సరే అందరూ కలిసి నెమ్మదిగా ఇంటికి చేరుకున్నారు.

నాలుగు రోజులు సర్దుకున్న తర్వాత అందరూ కలిసి బయలుదేరి తిరుపతి వెళ్లి పుట్టు వెంట్రుకలు కార్యక్రమం ముగించుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు.

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాఘవయ్య గారు తన స్నేహితులని బంధువులని అందరిని పిలిచి మనవడికి భారీ ఎత్తున ఒక ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు.

తర్వాత పది రోజులకి మరల కొడుకు కోడలు అమెరికాకు ప్రయాణమయ్యారు. అప్పుడు ప్రకాశం “నాన్నా ఎన్నిసార్లు మిమ్మల్ని రమ్మన్నా ఏదో ఒక వంక చెబుతూ మీరు రాలేదు. ఈసారి మనవడి కోసమైనా మీరు తప్పకుండా అమెరికాకు రండి. టిక్కెట్లు పంపిస్తాను” అని అన్నాడు. “వీసా ప్రయత్నాలు చేయండి. ఈసారి కాదనవాకండి” అన్నాడు.

“చూద్దాంలే” అని అన్నారు.

కొడుకు కోడలు మనవడు తిరిగి అమెరికా వెళ్ళిపోయినారు. ఇల్లంతా బోసిపోతున్నది. జానకమ్మ గారికి మనవడు కళ్ళల్లో మెదులుతూ ఏ పని కుదురుగా చేయలేకపోతున్నది. మనసంతా పిల్లవాడి ఆటపాటలే గుర్తుకు వస్తున్నాయి. రాఘవయ్యగారికి ఏదో గిలిగానే ఉన్నది. మనవడు కళ్ళల్లో మెదులుతున్నట్టే ఉన్నది.

అలా ఒక రెండు నెలల కాలం గడిచిపోయింది. “అమ్మా! మీరు వీసా చేయించుకోండి. ఏప్రిల్‌లో ఇక్కడికి మీరు రావచ్చు” అని చెప్పాడు ప్రకాశం.

సరే అలాగే అన్నారు రాఘవయ్య గారు. వీసా ప్రయత్నాలు ప్రారంభించారు రాఘవయ్యగారు. వీసా వచ్చింది. కొడుకు మేలో అక్కడికి రావడానికి టికెట్లు తీసుకొని పంపించాడు.

ఇక ప్రయాణానికి ఒక రెండు నెలల సమయం ఉన్నది. ఈ రెండు నెలలు జానకమ్మకు పనులతో ఊపిరి ఆడలేదు. మనవడికి కావలసిన వస్తువులు గుడ్డలు డ్రస్సులు కొన్నది. కొడుకు కోడలుకు కావలసినటువంటి తినుబండారాలు అన్ని సిద్ధం చేసుకోసాగింది. అలా చూస్తూ ఉండగానే రెండు నెలల కాలం గడిచిపోయింది.

ఇద్దరికీ కలిసి చెరిరెండు సూట్‌కేసులు మొత్తం నాలుగు అయినాయి. అప్పుడు రాఘవయ్య గారు “నాలుగు సూట్‌కేసులలో సర్ది తెస్తున్నావు. వచ్చేటప్పుడు వీటన్నిటి నిండా ఏం మోసుకొస్తావు?” అన్నారు.

“మనవడి ముద్దు ముచ్చట్లన్నీ మూటగట్టుకొని వస్తాను లేండి” అన్నది జానకమ్మ.

“అయితే ఇంతకీ కొడుకు మీద కోపం పోయిందన్నమాట” అన్నారు రాఘవయ్య.

“కొడుకు మీద కోపం కాదు, మనవడి మీద మమకారం ఇది” అన్నది జానకమ్మ.

“అవును కదూ! మరి అందుకే అంటారు ‘అసలు కంటే వడ్డీ ముద్ద’ని” అన్నారు రాఘవయ్య.

“ఏం మీకు మాత్రం ఆ ముద్దు లేదా ఏమిటి?” అన్నది జానకమ్మ.

“నిజమే పడమటికి వాలిపోతున్న మన జీవితాలకి మనవళ్ళ ముచ్చట్లే కొండంత బలం కదా! అందుకే ఊరికే అనలేదు మన పెద్దవాళ్ళు అసలు కంటే వడ్డీముద్దని.”

ఇలా ఇద్దరు సంభాషించుకుంటూ మనవడి ఆటపాటలను అనుభవించబోయే ఆనందాలను తలచుకుంటూ అమెరికాకు తమ ప్రయాణాన్ని కొనసాగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here