అసలు సంగతి

0
6

[dropcap]మ[/dropcap]ల్యాద్రిపురంలో అందరికీ మూఢనమ్మకాతో బాటు దైవభక్తి కూడా ఎక్కువ. కానీ ఊరిలో చాలామందికి అనారోగ్యాలు కలుగుతుంటాయి. మానసిక శాంతి కూడా ఉండటం లేదు. ఎన్ని పూజలు చేస్తూన్నా, ఎన్ని మంత్రాలు చదువుతున్నా ఎందుకు ఈ విధంగా అనారోగ్యాలు కలుగుతున్నాయో వారికి అంతుబట్టడం లేదు.

ఇలా ఉండగా ఆ ఊరికి ఒక రోజు ఆనందస్వామి అనే సాధువు వచ్చాడు. ఆయన ఆ ఊరి హనుమంతుడి గుడి మంటపంలో కూర్చుని అనేక మంచి విషయాలు చెబుతూ, భక్తి సంబంధమైన పాటలు పాడుతూ పెద్దా చిన్నా అందరినీ ఉత్తేజపరచసాగాడు. కొద్ది రోజుల్లోనే ఆనందస్వామి అక్కడికి వచ్చే వారి మొహాల్లో ఒక విధమైన నీరసం, కొందరు శక్తి లేక భారంగా వేరొకరి సహాయంతో రావడం గమనించాడు. అలా అక్కడికి వచ్చిన రామయ్య అనే అతన్ని పిలచి, “ఎందుకు చాలామంది నీరసంగా కనబడుతున్నారు? ఏమైంది? ఆరోగ్యంగా కనబడకపోవడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు.

“ఏం చెప్పమంటారు స్వామీ, కొన్నాళ్ళ కిందట ఊరులో అందరూ బాగుండేవారు. పచ్చటి పొలాలతో కళకళలాడేది. మా మంచి ఊరును చూసిన ఎవరికి కన్ను కుట్టిందో కానీ, ఎవరో దుర్మార్గులు ఊరికి చేతబడి చేశారు. అప్పటినుండి చాలామంది అనారోగ్యం పాలైపోతున్నారు. దానికోసం ఎందరో మంత్ర తంత్రాలు చేసేవారిని రప్పించి పూజలు, అష్టదిగ్బంధాలు చేయించారు. అయినా అనారోగ్య బాధలు తగ్గలేదు” అని బాధగా చెప్పాడు.

సాధువు కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించి, “నాయనా ఇద్దరం ఒక్కసారి ఊరంతా తిరిగి చూద్దాము. అసలు ఎక్కడలోపం ఉందో తెలుసుకోవచ్చు. ప్రజలకు మేలు చేయడం సాధువుగా నా బాధ్యత” చెప్పాడు సాధువు.

“స్వామీ మీరు మేలు చేస్తానంటే కాదంటానా, నాతో రండి ఊరంతా చూపిస్తాను, మా గ్రామం చిన్నదే” చెప్పాడు రామయ్య.

ఊరంతా చూసిన ఆనందస్వామికి విషయం అర్థమయింది.

“నేను చెప్ఫినట్టు చేస్తే మీ అందరి ఆరోగ్యాలు బాగుపడతాయి, శక్తి పుంజూకుని పొలం పనులు బాగా చేసి పొలాలు బాగా పండిస్తారు” చెప్పాడు.

“చెప్పండి స్వామీ మీమీద నమ్మకం ఉంది, మీరేది చెప్పినా ఆచరిస్తాము” అన్నాడు రామయ్య.

“ఇక్కడ చూడు మురుగు నీళ్ళు నిలచి పోయి దుర్గంధం వ్యాపించింది. అదిగో కుప్పతొట్టిలో ఇంట్లో మిగిలిపోయిన, పనికిరాని ఆహార పదార్థాలు వేశారు. అవి కుళ్ళి ఈగలు ఎగురుతున్నాయి. కాలవలో దోమలు ఎక్కువ అయ్యాయి. అలా చూడు పొలంలో చెత్తను తగుల బెడుతూ పొగవ్యాపింప చేస్తున్నాడా వ్యక్తి. ఆ పొగ వలన వాతావరణ కాలుష్యం, ఊపిరి తిత్తుల వ్యాధులు వస్తాయి. ఈగలు, దోమలు మనుషులకు ఎన్నో రోగాలు కలుగ చేస్తాయి. అదిగో ఆ చిన్న పిల్లల్ని చూడు ఏ రక్షణా లేకుండా మంచం మీద పెట్టి అమ్ముతున్న మిఠాయిలు తింటున్నారు. మనకు కనబడకుండానే ఎంతో దుమ్ము వాటి మీద పడి అనారోగ్యం కలుగ చేస్తోంది” అని వివరించాడు ఆనందస్వామి. మరికొంత దూరం పొయ్యేసరికి ఒక వ్యక్తి బాగా మాసిపోయిన బట్టలు తొడుక్కుని కనిపించాడు.

“అతన్ని చూడు, ఎంత అపరిశుభ్రంగా ఉన్నాడో మాసిన బట్టల్లో సూక్ష్మక్రిములు ఉండి అనారోగ్యాలు కలుగచేస్తాయి. ఇప్పుడు అర్థమయ్యాయా ఆనారోగ్యాలకు కారణాలు. ఈ ఊరికి కావలసింది మంత్రాలు, తంత్రాలు కాదు, కేవలం పరిశుభ్రత. అసలు చేతబడి అనేది మూఢనమ్మకం, ఒకరిని చేతబడితో నాశనం చేసేంత శక్తి ఎవరికీ ఉండదు. ఆహారం వ్యర్థం కాకుండా చూడాలి. శుభ్రమైన భట్టలు ధరించాలి, దాని వలన మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. అందరూ సాధ్యమైనంత వరకు వ్యాయామం, నడక చేయాలి, దాని వలన శక్తియుక్తులు లభిస్తాయి” చెప్పాడు సాధువు.

రెండో రోజు గుడి మంటపంలో ఆనందస్వామి ఈ విషయాలపై వారికి నమ్మకం కలిగించటానికి ఓ మంత్రంతో ప్రారంభించి, ఏ విధంగా ఆరోగ్యసూత్రాలు పాటించాలో చెప్పాడు

ఆ ఊరి పెద్దను కూడా సాధువు మాటలు ఆలోచనలో పడేశాయి. అప్పటినుండి ఊరి ప్రజలంతా కలసి కట్టుగా గ్రామన్ని శుభ్రపరచి రహదార్లకు ఇరవైపులా కానుగచెట్లు, వేప చెట్లు పెంచారు. త్వరలోనే అనారోగ్యాలు తగ్గి ఊరు ఆరోగ్య మల్యాద్రిపురంగా పేరు పొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here