అశ్రుభోగ-1

0
70

ప్రకటాహంకృతి తామసంబలమి,వాగ్భవ్యాకృతుల్ పూర్వ సూ
రి కదంబంబుల నెగ్గు బల్కితినొ దుర్మేధా ప్రభావంబునన్
వికలంబై మది పొంగే దుఃఖములు, ఆ విశ్వాత్మ సందర్శించువా
రకలంకుల్ మది వారి కొల్చెదను దివ్య ప్రీతి సంసిద్ధికై

చిరమగు కేశపాతమున చిక్కిన ముండము-లేమ లేమి లే
బరమగు ధూళి వేల్లితము పంకిల శయ్యయు, శ్రద్ద లేని ని
ష్ఠురములు స్నానపానములు, శోభనెరుంగని వస్తపంక్తియున్
హరి హరి! ఏమి ఈ బ్రతుకు లచ్చపు జీవములేని బొమ్మలై

దారులు మూతబడ్డవి – పదార్పిత మేదిని పంక సంకులం
బై ఋభువుల్ పిశాచముల వైఖరి రూపున మార్పు పొందిరో
స్వైర మనంబునన్ వికృతి సంధిని ఊహల సాలె గూండ్లలో
చేరగనౌనో విప్లుతము చెందిన కామన చిత్తబంధమై

అశ్రువు లేడరాలిపడె నచ్చట ఒక్కొక మొలవచ్చె – ఈ
ఆశ్రయమెల్ల నేడుపులె, ఆత్త దరిద్రమె, ప్రాణ పంజరం
బశ్రుత దుఖలంబి నిడుపైన వ్యధాపగలైన వేదనల్
ఓ శ్రితరక్ష! నే బ్రతికియుంటినో లేదొ యెరుంగ నెంతకున్

కొల్లలు పూల్‌చివుళ్లు తమిగూర్చు వచస్సులు, పొంగు నవ్వులున్
బల్లిదమైన ఆదరణ బంధములందు నిబద్దుడై చనన్
వల్లకియం దపస్వరము వైఖరి ప్రాకిన యట్లు నేనొ నా
యుల్లమొ వేడొ తానదిమి యుంచిన యట్లుగ మర్మ భేదమై

ఎవ్వతె మందు చల్లినదో ఈ బ్రతుకిట్లఘభోగి దష్టమై
ఎవ్వతె భ్రాంతి నూయిబడ నిట్లలయించెనో క్షుద్రకావ్యమై
త్రవ్వుచుబోతి నీ యిరుల దారుల నెవ్వరో చేదవేసినా
రవ్వ త్రిలోకసుందరి! దయామయి! తా చిరకాలబంధుతన్!

అతని చల్ల చూపులు వియన్నది నా పయి పొంగి పొర్ల సం
జాత వినూత్న దేహినయి సంగత చిత్తము నూత్న జన్మమై
ప్రాతరుద్ర సూర్యకర భాసుర పంకజమట్లు విప్పుకో
శ్రీతరుణీ మనోరమణ చేర్పవె త్వత్ పదయుగ్మ సన్నిధిన్

తన ఎదలోని కోరికల దాచుచు నేదో నిగూఢ హావ గం
ధిని వెలయించి-ధర్మ గుణనీతుల పల్కుచు ద్వ్యర్థి కావ్యమై
చెనకుచు ప్రీతి భావమున చేసినదౌ ఉపచారరీతి నా
మనికి తుఫానుగా కలచి మానిసి మారిన యట్లోనర్చెనే

ధర్మములున్ రహస్యములు తా వినినట్టివి చిల్కపలులై
పేర్మి విశేషముల్ పదును పెట్టిన మన్మథు వాడి తూపులై
కూర్మి అపూర్వమై మనసుకోసల భావకవిత్వ రీతియై
అర్మిలి స్వప్నమే మెలకు వన్నటునిల్చితి మాయ కౌగిటన్

మాయ విచిత్రమౌ భ్రమణమార్గము క్రూరమృగాళి పైబడం
జేయును,వ్యూహమై తెరువు జేడ్పడు, భీతి సమావరించు చా
వే యెడనుండి వ్రాలునొ, గతించిన కాలము రూపుకట్టు చిం
తాయతి చిత్రమైన గురుతై యపమృత్యువువోని రాత్రియై

భావములేర్పరింపగల పద్దతి మోహము తీర్పలేదు – ఉ
జ్జీవితముంబొనర్చు తన చేతమునందున భ్రాంతి చిత్రముల్
ఆవల సర్పముల్ కుసుమ హారములై, వికృతుల్ సురూపలై
జీవములేని నవ్వులు వశీకరణామృత చాంద్రరోచులన్నటుల్

ఆయమ చేరువైన నయనాంచల రోచులు శక్ర చాపరేఖాయతి
ఆయమ చిత్తదర్పణమునందున మన్మథు డాటబొమ్మయై
ప్రేయసి! తాను నే ననుసరించిన వేళలు వ్యోమయానమై
ఏ యెడతోచెనో మును గడించిన పున్నెము విచ్యుతంబుగా

అక్కథితవ్యవేళల రహస్సమయంబుల స్వప్నవేళలం
దిక్కరియున్న నేనొకడ తేలితి దుష్కర కాననంబునన్
టక్కరి వందునో అణగి టక్కున తేలిన కామనల్ మరీ
ముక్కలు వేసి నన్ వికృతి ముంగిటి కీడ్చెనో భగ్నచేతనన్

మనసును వెళ్లబోసికొను మాటల గోలది ఎంతసేపు దీ
నిని వదలించుకొంచు గుణనిర్మితి యైనపుడే ప్రశాంతమౌ
మనికి కలంచు భూతమది మాయును క్రొత్తచివుళ్లు వేసెడున్
నినుబడి సాగివత్తు జననీ ఒక నూతన జన్మ పొందగన్

లోకము వే వికారముల లోగిలి, చిత్తము నిత్య ఘర్షణ
వ్యాకృతి వ్యక్తులెల్లర రహస్యము వారిధి దావవహ్ని హే
లాకృతి నీవు ఈ యునికి లంగరువై బ్రతుకోడ నిల్పుకో
చేకొని భిన్న సంభృతుల చిక్కుల తీరిచి వేల్పు రథ్యవై

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here