అశ్వత్థామ

0
11

[box type=’note’ fontsize=’16’] మహా భారతము లోని అతి పరాక్రమవంతుడైన వ్యక్తిగా గుర్తింపు ఉన్నవాడైనప్పటికీ చివరలో తన దుందుడుకు చర్య వల్ల దుర్మార్గుడిగా అపకీర్తి మూటకట్టుకున్న అశ్వత్థామ గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]

[dropcap]మ[/dropcap]హా భారతములోని కీలకమైన ప్రాధాన్యత కలిగిన పాత్రలలో అశ్వత్థామ ఒకరు. ఈయన పాండవుల, కౌరవుల గురువైన ద్రోణాచార్యుని కుమారుడు ఇతని తల్లి కృపి. కురుక్షేత్ర యుద్ధములో కౌరవుల తరుఫున పోరాడిన మహారథులలో ఒకడు.  అలాగే పాండవుల పక్షాన ఉన్న అనేక మంది యోధులను చంపినా లేదా ఓడించిన ఘనత కలిగినవాడు అశ్వత్థామ. ఆయనకు యుద్ధములో ఉపయోగించ కూడని  బ్రహ్మాస్త్రము ప్రయోగించటం తెలుసు. మహా భారతము లోని అతి పరాక్రమవంతుడైన వ్యక్తిగా గుర్తింపు ఉన్నవాడైనప్పటికీ చివరలో తన దుందుడుకు చర్య వల్ల దుర్మార్గుడిగా పేరు సంపాదించుకున్నాడు.

అశ్వత్థామ శివుని అంశ వలన జన్మించిన వాడు కాదు  కానీ రుద్ర యమ మరియు క్రోధ అనే శక్తుల వల్ల జన్మించినవాడు.  ఇతడు మరణము లేని చిరంజీవి. సప్తచిరంజీవులలో ఒకడు అశ్వత్థామ. మిగిలిన వారు బలి చక్రవర్తి వ్వాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు. పరశురాముడు.

అశ్వత్థామకు పుట్టుకతోనే  నుదుటిపైనా ఒక మణి  ఉండేది.  ఆ మణి వలన ఆయన జబ్బుల వల్ల, నొప్పులవల్ల లేదా ఏ శస్త్రాల వల్ల  బాధింపబడడు కానీ పాండవులకు లొంగిపోయినప్పుడు అశ్వత్థామ ఆ మణి ని వారికి అప్పగిస్తాడు. ద్రోణాచార్యుడు చనిపోయినాక 18వ రోజు కురుక్షేత్ర యుద్దానికి కౌరవుల పక్షాన సైన్యాధిపత్యము వహిస్తాడు. అశ్వత్థామకు శక్తివంతమైన నారాయణాస్త్రము, బ్రహ్మాస్త్రము ప్రయోగించటము తెలుసు. అశ్వత్థామ కర్ణునిలాగా దుర్యోధనుని ప్రతి చర్యను సమర్థించ లేదు. లాక్షాగృహాన్ని దహింపజేయటంలోనూ, జూదము ఆటలోను, ఘోష యాత్రలోను అశ్వత్థామ ఏమాత్రము కల్పించుకోలేదు. అశ్వత్థామ ఉత్తర గోగ్రహణములో పాల్గొన్నాడు కానీ ఆ సందర్భములో అర్జునుని పొగుడుతూ కర్ణునితో వాదనకు దిగాడు. ఎందుకంటే మొదటినుండి అశ్వత్థామకు పాండవులు అందులో అర్జునుడు అంటే అభిమానము. ఉద్యోగ ధర్మముగా దుర్యోధనుని తరుఫున యుద్ధములో పాల్గొన్నాడు. అశ్వత్థామ ద్రౌపది స్వయంవరంలో పాల్గొన్నాడు కానీ లక్ష్యాన్ని చేధించలేకపోయాడు, అర్జునుడిని ఏ సందర్భములోను జయించలేదు. అర్జునుడు అశ్వత్థామలకు మాత్రమే ద్రోణాచార్యుడు శక్తివంతమైన నారాయణాస్త్రము, బ్రహ్మాస్త్రము ఉపయోగించటం నేర్పాడు. కానీ అశ్వత్థామకు ఈ అస్త్రాలను ఉపసంహరించటం చేతకాదు. అర్జునిడికి వాటి ప్రయోగము ఉపసంహరణ రెండు తెలుసు.అర్జునుడు అంటే అశ్వత్థామకు ప్రేమ గౌరవము రెండు ఉన్నాయి తండ్రి ద్రోణాచార్యుడు అర్జునుడిని అభిమానించటమే దానికి కారణము.

ఉత్తర గోగ్రహణము అప్పుడు అశ్వత్థామ అర్జునుడితో యుద్ధములో పోరాడినప్పటికీ అందరిలాగానే ఓడిపోతాడు. అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధములో కర్ణుడిని అర్జుని బాణాలనుండి రెండు సార్లు కాపాడతాడు. సాత్యకి చేతిలో అశ్వత్థామ రెండు సార్లు పరాజయము పొందినప్పటికీ చివరికి సాత్యకిని ఓడిస్తాడు. అశ్వత్థామ ఘటోత్కచునితో జరిగిన యుద్ధములో ఘటోత్కచుడు ప్రయోగించిన రాక్షస మాయకు ఎదురు నిలిచినవాడు. కౌరవ సేనలో అశ్వత్థామ ఒక్కడే ఘటోత్కచుని అక్షౌహిణి రాక్షస సేనను ఘటోత్కచుని కొడుకుతో సహా చంపుతాడు. 13 వ రోజు యుద్ధములో పద్మవ్యూహాన్ని ఛేదించటానికి ప్రయత్నించిన అభిమన్యుడిని ఓడించాలని ప్రయత్నించినా సఫలము కాడు.

కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. అశ్వత్థామ  తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో మరణం పాలైనాడు. కక్షతో రగిలిపోయిన అశ్వథ్థామ చనిపోతున్న తండ్రి దగ్గర యుద్ధానంతరం ఎలాగైనా దృష్టద్యుమ్నుని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు. పాండవ సైన్యము పై నారాయణాస్త్రమును ప్రయోగిస్తాడు. పాండవ సేన ఆ అస్త్రానికి పూర్తిగా లొంగిపోతుంది. శ్రీ కృష్ణుడు పాండవులను రక్షిస్తాడు. అశ్వత్థామ పాండవులను పూర్తిగా భూమి మీద లేకుండా చేస్తానని, తాను ఎలాగైనా పాండవులను చంపుతానని దుర్యోధనునకు మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటి పూట ఎలా దాడి చేస్తాయో, అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందర్నీ గంగానదీ తీరానికి తరలించాడు.

అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు. ద్రౌపదీ పుత్రులైన ఐదుమంది ఉపపాండవులను చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించు కోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేక పోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి, కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్ళిస్తాడు. వారిలో అర్జునుని కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది. పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్టించాల్సిన పరీక్షిత్తు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బతికిస్తాడు.

అశ్వత్థామను 3 వేల సంవత్సరాలపాటు కుష్ఠు వ్యాధిగ్రస్థుడివి కమ్మని కృష్ణుడు శపిస్తాడు. ఈ విధమైన చర్య వలన భారతములో అశ్వత్థామ మహావీరుడైనప్పటికీ చెడును మూటకట్టుకుంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here