అస్తిత్వం

0
11

[ఎం.ఎస్. శ్రీరామ్ గారు కన్నడంలో రచించిన కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ రంగనాథ రామచంద్రరావు.]

[dropcap]ని[/dropcap]జాం ఆస్పత్రి నుంచి దేవరకొండ బాలరాజు తప్పించుకున్న ఉత్తేజకరమైన కథ వార్తామాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమవుతూనే ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఉస్మానియా ఆస్పత్రి నుంచి కొండపల్లి సీతారామయ్య తప్పించుకుని పోయినంత సంచలనాన్ని ఈ వార్త కలిగించింది. అప్పట్లో సీతారామయ్య తప్పించుకున్నప్పుడు దృశ్యమాధ్యమాలు లేవు. ఇప్పుడు 24 గంటల సమాచారం కాలంలో ఇది సులభంగా పక్కకు తోసివేసే వార్త కాదు. బాలరాజు ఆస్పత్రి నుంచి ఎలా తప్పించుకున్నాడన్నది గుట్టుగానే మిగిలిపోయింది. అదే ఆస్పత్రిలో చేరిన సత్యం రామలింగరాజును కోర్టుకు తీసుకుని వెళ్లే సమయంలోని కోలాహలం, బందోబస్తు సమయంలో బాలరాజు పరారీ అయ్యాడు.

కొన్ని రోజుల క్రితం విచిత్రమైన పరిస్థితిలో కత్తిపోట్లకు గురైన బాలరాజు శరీరం బ్రహ్మానందరెడ్డి పార్క్ బయట పడివుంది. దాన్ని ఎన్‌కౌంటర్ అని వివరించి బాలరాజును అరెస్టు చేశామనే వార్తను హెూం మంత్రిగారు మాధ్యమాలకు ఇచ్చారు. ఏమైనా కానీ సంవత్సరాల కొద్దీ పోలీస్ దాఖలాలలో మాత్రమే అస్తిత్వంలో ఉన్న బాలరాజు స్వయంగా ఖైదులో సేవలు పొందుతున్నాడు. అతని బాధల మధ్య ఎక్కువగా విచారణ జరపడానికి సాధ్యం కాలేదు. నాలుగైదు రోజుల్లో డిశ్చార్జ్ కాబోతున్న బాలరాజు ఇలా చేజారిపోతాడని ఎవరూ ఊహించలేదు. ఒక విధంగా తమ చేతికి తనంతట తానే దొరికిపోయిన బాలరాజు ఇప్పుడు అందరి కళ్లల్లో దుమ్ము కొట్టాడు.

బాలరాజు గుర్తించి దర్యాప్తు జరుపుతున్న పోలీస్ అధికారి దానయ్య నాయుడు ఘనతకు ఇది ఒక పెద్దపెట్టుగా పరివర్తన చెందింది. బాలరాజు వార్డు దగ్గర డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‍ను ఇదెలా జరిగిందని అడిగినప్పటికీ, ఆ విచారణ వల్ల ఏమి ప్రయోజనం లేదని అతనికి తెలుసు. తన ప్రశ్నావళి వల్ల కొన్ని కుంటిసాకులు దొరికాయి తప్ప, తప్పించుకొనిపోయిన బాలరాజు మాత్రం వెనక్కి తిరిగిరావడం అసాధ్యం. అయినా దానయ్య ఊరి చుట్టూ నాకాబందీ చేయించి బాలరాజును వెతికించే పని ప్రారంభించాడు

ఈ ఒక్క ఘటన వల్ల పోలీసు విభాగంలో దానయ్య భవిష్యత్తు దుర్భరంగా మారింది. అతని కెరీర్ ఇక్కడితో ఫినిష్ అయ్యింది. ఈ తీవ్రమైన కళంకాన్ని మోసుకుని అతను ఈ డిపార్ట్మెంట‌‍లో కొనసాగడానికి అవకాశమే లేదు. వార్తా మాధ్యమాలు బాలరాజు సెన్సేషనల్ ఎస్కేప్ ప్రసారం చేయడంలో ఎలాంటి సంకోచం చూపలేదు. అతని అరెస్టును లైవ్ కవరేజ్ చేసిన తీరులోనే దీన్ని కూడా కవర్ చేసి తమ తమ దేశభక్తిని ప్రదర్శించారు. ఒక్కొక్కసారి కవర్ చేసేటప్పుడూ దానయ్య నాయుడు, అప్పుడు గాయాలతో ఆస్పత్రిలో పడివున్న బాలరాజు ఫోటోలను ప్రసారం చేసి, బాలరాజు తప్పించుకున్న ప్రకరణాన్ని, కందహార్ ప్రకరణంలో జైలు నుంచి మసూద్ అజర్లాంటి తీవ్రవాదిని వదిలిపెట్టిన ఘటనతో పోల్చి, బాలరాజు తప్పించుకోవడం అంతే ప్రమాదకరమని వర్ణించారు. బాలరాజు సంచలనాత్మకమైన పరారీ వల్ల నక్సల్‍వాదానికి ఎంత మద్దతు దొరకవచ్చని, దాని గురించి అనేక చర్చా గోష్ఠులు ఏర్పాటు చేయబడ్డాయి.

దానయ్య నాయుడు మీద జరిగిన మాధ్యమాల దాడులవల్ల ఒక సందర్భంలో తాను సర్వీస్‌కు రాజీనామా ఇవ్వాలనీ అతను ఆలోచించాడు. ఎలా ఉన్నప్పటికీ తన సర్వీసంతటా బాలరాజు తప్పించుకున్నాడనే భూతం వేధించటం వల్ల, పోలీస్ ఉద్యోగంలో కొనసాగటంలో అతనికి అర్థం కనిపించలేదు. అతని పట్ల అభిమానమున్న, అతని కార్యదక్షతను చూసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి చంద్రపల్లి రెడ్డిగారు అతని తరఫున మాట్లాడుతూ, కార్యదక్షులైన అధికారుల ఒక తప్పును ఇంతగా సాగదీయడం న్యాయం కాదని చెప్పారు. దానికి పూరకంగా నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో దానయ్య గతంలో సాధించిన అనేక విజయాలను మీడియా వారి ముందు పట్టిక చేశారు. ఇప్పుడు ఇలా ఒక ఉగ్రవాదియైన నక్సలైట్ తప్పించుకోవటానికి కారణమైన దానయ్య నాయుడును సమర్థించుకు వచ్చిన హోం మంత్రిగారు రాజీనామా ఇవ్వాలని ప్రతిపక్షంవారు, పత్రికా విలేకరులు డిమాండ్ చేస్తున్న సమయంలో, మంత్రిగారు మౌనం వహించారు.

దానయ్య నాయుడు తన పదవిలో, పోలీస్ డిపార్ట్మెంట్‌లో కొనసాగడం అసాధ్యమైన విషయంగా మారింది. అతన్ని ‘నాన్ సెన్సిటివ్’ ప్రాంతానికి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల, అతన్ని డిప్యూటేషన్ మీద రాజేంద్రనగర్ సర్దార్ వల్లభభాయ్ పోలీస్ ట్రైనింగ్ అకాడెమీకి బదిలీ చేయడం జరిగింది.

రెండుసార్లు దానయ్య నాయుడు చేతికి చిక్కినా – తప్పించుకుని పారిపోయిన బాలరాజుకు ఇది ఎన్నవ జన్మనో లెక్కలేదు. ఏలూరు బాంబ్ సంఘటన జరిగినపుడు దానయ్య అక్కడే తణుకులో అధికారిగా ఉన్నాడు. కొద్ది టైమింగ్ వ్యత్యాసం జరగకపోయివుంటే అప్పుడే బాలరాజును అరెస్ట్ చేసేవాడు. అయితే తాను అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి బాలారాజు అని తెలిసే సమయానికి అతను పరారీయై గుండు కొట్టించుకుని తిరుపతి జనసమూహ మాయాజాలంలో మాయమైపోయాడు.

***

గ్రామానికి అప్పట్లో సర్పంచ్ అయిన ఇందిరమ్మ, మాజి సర్పంచ్ అయిన నరేందర్ గౌడ్, ఇతర గ్రామపెద్దలు తమ గ్రామాన్ని దేశంలోనే ఒక ప్రముఖ గ్రామంగా మార్చాలని కొన్ని సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. నరేందర్ మొదటిసారి సర్పంచ్ అయినప్పటి నుంచీ, ప్రపంచం తన గ్రామాన్ని గమనించాలనే భూతం అతని తలలో దూరి సవారి చేయసాగింది. అందువల్లనే ఏ ప్రణాళిక ప్రభుత్వం ప్రవేశపెట్టినా, మొదట దాన్ని తమ గ్రామానికి అమలు చేయటం కోసం తిరిగేవాడు. క్రితంసారి కూడా ఎన్నికలు జరిగినప్పుడు తమ గ్రామ సర్పంచ్ పదవిని మహిళలకు కేటాయించడం వల్ల దాన్నొక అవకాశంలా నరేందర్ చూశాడు. భార్య ఇందిరమ్మను రంగంలోకి దింపి, తాను బయటి విషయాలను చూసుకునే బాధ్యత వహించాడు. తమాషాగా తాను గ్రామ సర్పంచ్ గారి వ్యక్తిగత కార్యదర్శి అని చెప్పుకుంటున్నప్పటికీ ముఖ్యమైన నిర్ణయాలను తాను తీసుకోవడమూ, దానికి ఇందిరమ్మచేత దస్తకత్తును చేయించడమూ అతనికి అంగీకారమైన రివాజైంది. అందువల్లనే నరేందర్‍ను గ్రామస్థులంతా సర్పంచ్ పదవిలోనే చూసేవారు.

గత సంవత్సరం ఆ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి నుంచి ‘నిర్మల్ పురస్కార్’ లభించింది. గ్రామ శుభ్రత కోసం రెడ్డప్ప మాస్టారు మొదలుకొని అందరూ పంతం పట్టినట్లు శ్రమించి, ఈ పురస్కారానికి గ్రామాన్ని సిద్ధం చేశారు. ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి, ఇందిరమ్మ, ఆమె సహచరుడిగా నరేందర్ గౌడ్ ఇద్దరూ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ విజ్ఞాన భవన్‌లో జరిగే వైభవమైన సభలో ప్రవేశించటానికి నరేందర్‌కు అనుమతి దొరకటం కష్టమైనప్పటికీ, రాజకీయ పైరవీ చేసి – ఏదో ఒక విధంగా ఒక పాస్‌ను సంపాదించుకుని లోపలికి వెళ్లాడు. కార్యక్రమం తర్వాత గెలిచిన సర్పంచ్‍లకు తేనీటి విందు కార్యక్రమమూ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులను చూడగలిగే, వారితో మొబైల్‍లో ఫోటో తీయించుకునే కార్యక్రమం జరుగుతుండగానే ఐదు నిమిషాల కాలం అతడికి నందన్ నిలేకణితో కలిసే అవకాశం దొరికిందట. ఒక సంవత్సరం క్రితం జలగాంవ్ లోని ఒక గ్రామంలో సోనియా గాంధీ చేతుల మీదుగా గ్రామస్థులకు యు.ఐ.డి. కార్డు ఇప్పించడం నరేందర్ గౌడ్ టీవీలో చూశాడు.

నరేందర్ పదేపదే “మీరు మా గ్రామానికి రావాలి” అని నిలేకణిని ఆహ్వానించాడు. నిలేకణితోపాటు ఫోటో తీసుకున్నాడు. ఆ క్షణంలో నిలేకణి “మీ గ్రామంలోని ప్రతి వ్యక్తికి ఆధార్ నెంబర్ వచ్చి- వందకు వంద శాతం కవర్ అయిన వెంటనే; అంటే ఏ ఒక్కరినీ వదలకుండా. అందరికీ ఐడెంటిటీ కార్డ్ ఇప్పించిన వెంటనే ఈ-మెయిల్ పంపించు. నేను కచ్చితంగా మీ గ్రామానికి వస్తాను” అన్నారట. ఇది ఎంత నిజమో తెలియకపోయినా నరేందర్ గౌడ్ నిలేకణితో నిలబడి తీయించుకున్న ఫోటో మాత్రం అతని మొబైల్లో రాజిల్లుతోంది.

***

మూడేళ్ల క్రితం సాయంకాలం వేళలో ఈ వార్త తెలిసినపుడు, మేఘనకు ఎలా ప్రతిస్పందించాలో తెలియలేదు. తన నాలుగేళ్ల వైవాహిక జీవితంలో అనేక గొడవలు, మనస్తాపాలు జరిగినప్పటికీ, ఇలా హఠాత్తుగా ఒకేసారి ఇంత పెద్ద నిర్ణయం సంజూ తీసుకుంటాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. వార్త రావడానికి ఒక వారం ముందు మాత్రమే సంజూ చార్‌ధామ్ యాత్రకు వెళతానని ఉత్తర భారతానికి బయలుదేరాడు. గడిచిన కొన్ని నెలల్లో విపరీతమైన భక్తిమార్గం వైపు మరలిన సంజూ అన్నిటినీ ముందుగానే ఆలోచించుకున్నాడు. ప్రణాళికలో మేఘనాకు ఎలాంటి పాత్ర కూడా లేదు. ఆమెకు తీర్థయాత్రలు అంతగా ఇష్టం లేకపోయినా, ఇలా తన సలహాలు వినకుండా లోలోపలే ఈ కుట్ర చేయటం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. బయలుదేరడానికి ముందు, ఆమె వచ్చేలా వుంటే తననూ తీసుకుని వెళ్లేవాణ్ణి అని చెప్పినా, అది మనస్ఫూర్తిగా వచ్చిన మాట కాదని మేఘనకు తెలుసు. అతను ఉద్యోగానికి నెలరోజులు సెలవు పెట్టి, గంగోత్రి, యమునోత్రి, బదరి, కేదారనాథ్ మాత్రమే కాకుండా హరిద్వార్, రిషికేశ్, ఉత్తరకాశి మొదలైన దైవ క్షేత్రయాత్రలు, అలాగే ముసూరీలో కాస్త మస్తీ చేయాలని, సవారి ట్రావెల్స్ ప్యాకేజీ టూరు డబ్బు చెల్లించి ఒక్కడే బయలుదేరడానికి సిద్ధమయ్యాడు.

ముప్ఫయేళ్లకే వచ్చిన ఈ వైరాగ్యాన్ని చూసి మేఘన ఆశ్చర్యపడినా, సంజూలో ఉన్న వైపరీత్యాన్ని ఆమె కొన్నాళ్ల క్రితమే గమనించింది. అందువల్లనే అతను చెప్పే మాటలను గంభీరంగా పరిగణించటంలో అర్థం లేదనుకుంది. ఇలా అన్ని టికెట్లను తీసుకొని, తర్వాత వెళ్లనే వెళ్లనని అతను చెప్పినా ఆమె ఆశ్చర్యపడేది కాదు.

తన యాత్ర వివరాలేవీ సంజూ ఆమెకు చెప్పనే లేదు. ఫార్మా కంపెనీ ఒక దానిలో మెడికల్ రెప్‍గా ఉద్యోగం చేస్తున్న సంజూ రోజంతా ఎక్కడ ఉంటాడో ఆమెకు తెలిసేది తక్కువే. సోమవారం ఊరు మీద బయలుదేరితే శుక్రవారం తిరిగి వచ్చేవాడు. అతను ఫోన్ చేసి చెబితేనే అతను ఎక్కడున్నాడో తెలిసేది. వారానికి ఒకసారి బట్టలు ఉతక్కోటానికి మాత్రం ఇంటికి వస్తాడన్నంత వరకూ తనకూ, అతను లేనప్పుడు తను వెళ్లివుంటున్న తన పుట్టింటి వాళ్లందరికీ అలవాటైపోయింది. అతను ఊరికి వచ్చినప్పుడు మాత్రం సుడిగాలిలా ఇంటినంతా గెలికి వెళ్లిపోయేవాడు.

ఇలా ఒకనెల చార్‍ధామ్ యాత్రకు బయలుదేరినప్పుడు, ఆమెకు తెలిసింది కేవలం సఫారి ట్రావెల్స్ కంపెనీ హైదరాబాద్ చిరునామా, ఫోన్ నెంబర్ మాత్రమే. బయలుదేరుతున్న బృందంలో 35 మంది ఉన్నారనీ, ఉత్తర భారత్ చేరిన వెంటనే ఒక మినీ బస్సులో అన్నిచోట్ల వెళతారని తెలిసింది. బస్సులో ఉన్నవారి సరాసరి వయస్సు అరవైయనీ, అందరికన్నా చిన్నవాడు తానేననీ సంజూ మొదటిరోజు యాత్ర తర్వాత చేసిన ఫోన్లో తెలిపాడు. ఆ మాటలు చెబుతూనే, “చూడు ఈ విధమైన తీర్థయాత్రలు చేసేటప్పుడు తమకు అత్యంత ఇష్టమైనదాన్ని త్యాగం చేసి రావడం అలవాటు..” చెప్పి దీర్ఘమౌనం వహించాడు. అతను ఎప్పుడూ అలాగే. ఏదో ఒక సూటిపోటి మాట అనడానికి అవకాశమిచ్చి గొడవపడటం పాత అలవాటు. మేఘన ఆ మౌనాన్ని భరించలేక, “అలాగైతే, వంకాయ త్యాగం చేసి వస్తావా?” అని అడిగింది. అప్పుడతను గబుక్కున జవాబు ఇచ్చి, ఫోన్ పెట్టేశాడు. అతని కంఠం వినటం అదే చివరిసారి. అతడి నుంచి ఊహించని మాటలు రావడం కొత్త కాకపోయినప్పటికీ, మేఘన దీనికి మాత్రం సిద్ధంగా లేదు.

“ఎందుకు, నాకు అత్యంత ప్రియమైనది వంకాయ మాత్రమేనా? అంతకన్నా ప్రియమైనదానివి నువ్వు. బహుశా అంతకన్నా ప్రియమైనది సంసార జీవితం. లేదా నా ప్రాణం నాకు ఇష్టం కాదని నువ్వు ఎలా భావించావు మేఘనా?” అని అంటూనే అతను ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత అతను ఫోన్ ఎత్తలేదు. మాట్లాడలేదు. ఆ రోజు సాయంత్రం మేఘనకు సవారి ట్రావెల్స్ నుంచి ఫోన్ వచ్చింది. 35 మంది ఉన్న బృందం నుంచి సంజూ కనిపించకుండా పోయాడనీ, పోలీస్ స్టేషన్‍లో అతను కనిపించకుండా పోయిన విషయం గురించి ఫిర్యాదు రాయిస్తున్నామనీ, ఆ ఫిర్యాదు ప్రతిని హైదరాబాద్లోని తమ కార్యాలయంవారు ఆమెకు చేర్చుతారని, ట్రావెల్స్ యజమాని స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు. ఇది జరిగి మూడు సంవత్సరాలు గడిచాయి.

***

సుమారు పదిహేనేళ్ల తర్వాత తమ గ్రామంలో అలాంటి ఒక సంఘటన జరగాల్సి ఉంది. అదే శివాలయం, అదే పాఠశాల ఆవరణ. రెడ్డప్ప మాస్టారుకు మోహన ప్రభుదాస్, దేవాలయ నిర్మాణాల సంఘటనలన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. అయితే ఈసారి ఇక్కడ ప్రత్యక్షమైన మనిషికీ, పదిహేనేళ్ల క్రితం వచ్చిన ప్రభుదాసూ చాలా వ్యత్యాసం ఉంది. లేదా రెడ్డప్ప మాస్టారుకూ వయసు మీరటం వల్ల అలా అనిపించిందో ఏమో. ఇప్పుడిప్పుడూ అన్నీ మారుతున్నట్టు కనిపిస్తున్నాయి.

పదవి విరమణ చేసి ఎనిమిది సంవత్సరాలు దాటినప్పటికీ రెడ్డప్ప మాస్టారు దినచర్యల్లో ఎలాంటి మార్పులు కలగలేదు. ప్రతిరోజు పాఠశాల ప్రారంభం కావడానికి అరగంట ముందే వచ్చి, పాఠశాల ఆవరణను శుభ్రం చేయించి, పిల్లల కోసం రెడ్డప్ప మాస్టారు ఎదురుచూస్తూ నిలుచునేవారు. ఏకోపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలకు రెడ్డప్ప మాస్టారు పదవీ విరమణ చేసిన రెండు సంవత్సరాల తర్వాత గోపాల్ యాదవ్ అనే యువఉపాధ్యాయుడిని ప్రభుత్వం నియమించింది. మొదట్లో అత్యంత ఉత్సాహాన్ని చూపి రెడ్డప్ప మాస్టారు మెప్పుదలను పొందిన యువకుడైన గోపాల్‍కు ఈమధ్య వివాహం జరిగినప్పటి నుంచి వెనుకటి ఉత్సాహం తగ్గిందని మాస్టారుకు అనిపించింది. అందులో తప్పేమీ లేదేమో! మొదట్లో పాఠశాల ఆవరణలోనే కట్టించిన కొత్త గదిలో నివాసమున్న గోపాల్, వివాహం తర్వాత జడ్చర్లలో సంసారం పెట్టి, రోజు అప్-డౌన్ చేస్తున్నాడు. జడ్చర్ల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు పాఠశాల ఆరంభమైన ముప్పావు గంట తర్వాత వస్తుండటం వల్ల, రెడ్డప్ప మాస్టారే ఉదయం పాఠశాల ప్రారంభించి, అతను వచ్చిన తర్వాత తాను కాసేపు విశ్రాంతి తీసుకునేవారు.

ఈ పదిహేను సంవత్సరాలలో పాఠశాల చాలావరకు అభివృద్ధి చెందింది. రెడ్డప్ప మాస్టారు దగ్గర చదువుకొని, తర్వాత జడ్చర్ల, హైదరాబాద్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేసి వచ్చిన నరేందర్ గౌడ్ గత కొన్ని సంవత్సరాలలో సర్పంచ్ పదవిని అలంకరించి మంచి పనులు చేశాడు. చాలా సంవత్సరాలు అప్పల రెడ్డి కాశీవిశ్వనాథరెడ్డి గుప్పిట్లో గ్రామం బాగానే ఉన్నప్పటికీ, నాయకత్వపు మార్పు వల్ల గ్రామానికి కొత్త ఉత్సాహం వచ్చినట్టుంది. అందరూ గౌరవిస్తున్న కాశీ విశ్వనాథరెడ్డిగారు చివరి ఎన్నికల్లో తక్కువ ఓట్లతో గెలిచారు. సామాన్యంగా వ్యతిరేకత లేకుండా ఎన్నికవుతున్న విశ్వనాథరెడ్డిగారు తమ నాయకత్వపు ఆధిక్యతను పోగొట్టుకుంటున్నారని గ్రామస్థులకు అనిపించసాగింది. మోహన ప్రభుదాస్ తమ గ్రామానికి వచ్చి శివాలయం జీర్ణోద్ధరణ చేస్తానని చెప్పినప్పుడు గ్రామంలో- శ్రీ ప్రకాష్ చంద్ శ్రీమల్ ద్వారా ప్రవేశించిన అయోధ్య రామమందిర రాజకీయ ఫలంగా కాశీ విశ్వనాథరెడ్డి తమ చురుకుదనాన్ని పోగొట్టుకున్నారని భావన గ్రామస్థులకు ఉండేది. అయినప్పటికీ, వారి ఆత్మకు శాంతి కలిగేలా, చివరివరకూ ఆయననే గ్రామసర్పంచ్‍గా ఎన్నుకున్నారు. ఆయన మరణించిన తర్వాతే సర్పంచ్ పదవికి జోరుగా పోటీలు జరిగాయి. అప్పుడు విద్యావంతుడైన నరేందర‌‍కు సర్పంచ్ స్థానం లభించింది. నరేందర్ గౌడ్ విజయానికి కాశీ విశ్వనాథరెడ్డిగారి కుమారుడైన ప్రవీణ్ రెడ్డి సహకారాన్ని అతను గుర్తించాడు. ఇద్దరూ జడ్చర్ల ఉన్నత పాఠశాలలోను, హైదరాబాదులో ఇంటర్ కలిసి చదువుకుని, మంచి మిత్రులయ్యారు. ప్రవీణ్ మెడిసిన్ చేసి ఇప్పుడు హైదరాబాదులో కార్డియాక్ సర్జన్ ఉన్నాడు. అందువల్ల అతనికి గ్రామం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ గ్రామానికి రావడానికి సమయం లేదు. అప్పుడప్పుడు గ్రామానికి వస్తున్న ప్రవీ‍ణ్‍కు సహధ్యాయుడు నరేందర‌కు పనులు పట్ల శ్రద్ధ చూసి అత్యంత గర్వమూ, గౌరవమూ కలిగేవి.

నరేందర్ గౌడ్‌కు అధికారం చేతికి వచ్చిన వెంటనే ముందుగా తన దృష్టిని కేంద్రీకరించింది గ్రామ ప్రాథమిక పాఠశాల మీద. అక్కడ రెడ్డప్ప మాస్టార్లాంటి సజ్జనులు ఉన్నంతవరకూ పాఠశాలకు ఏదైనా జరగరానిది జరిగితే తన పదవి పోతుందని అతనికి తెలుసు.

అందువల్ల తాను సర్పంచ్ అయిన వెంటనే పాఠశాలకు ప్రహరి గోడ, ఆడపిల్లలకు మరుగుదొడ్ల నిర్మాణం, చిన్న గ్రంథాలయం, మధ్యాహ్నపు వేడి వేడి భోజనం – వీటి మీద నిఘా వహించి, పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వచ్చేలా చేశాడు. రెడ్డప్ప మాస్టారు నివృత్తులైన వెంటనే సర్వశిక్ష అభయాన్ సొమ్ము నుంచి ఆయనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం ఇచ్చి ధన్యుడైనట్టు భావించాడు. రెడ్డప్ప మాస్టారు నివృత్తులైనప్పటికీ పాఠశాలకు రావటం మానలేదు. పెన్షన్ వస్తుండటమే చాలంటూ, పిల్లల మధ్య ఉండటమే తన ధర్మం అనే మాస్టారుకు ధనసహాయం చేసి ధన్యతాభావం పొందటం ఒక ఆలోచన అయితే, పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా పరివర్తించాలన్న దూరదృష్టి వల్ల నరేందర్ గౌడ్ పని చేసేవాడు. అందువల్లనే చాలా సంవత్సరాల కాలం ఏకోపాధ్యాయ పాఠశాలగా కొనసాగుతున్న తమ గ్రామ పాఠశాల ఇప్పుడు – ఇద్దరు ఉపాధ్యాయుల పాఠశాలగా పరివర్తన చెందింది.

నరేందర్ సర్పంచిగిరి మొదటి అవధి ముగిసిన తర్వాత రెండవ అవధి ఎన్నికలలో నిలబడటానికి అవకాశం తప్పింది. మహిళల రిజర్వేషన్ చట్టం కింద ఈసారి తమ గ్రామానికి ఆ చట్టాన్ని అమలుచేయటంతో ఆ పదవి మహిళలకు కేటాయించబడింది. నరేందర్ కోరిక మేరకు గ్రామస్తులు అతని భార్య ఇందిరమ్మను ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించారు. ఇందిరా గాంధి పేరును కలిగిన ఇందిరమ్మ పెరిగి ఇలా గ్రామసర్పంచ్ అవుతుందని ఆమె తల్లిదండ్రులు ఊహించనూ, ఆశించనూ లేదనిపిస్తుంది. అయితే సర్పంచ్ అయిన ఇందిరమ్మ నరేందర్ చేతిలో కీలుబొమ్మగా అతను చెప్పిన చోటంత దస్తకత్ పెడుతూనే తన సర్పంచిగిరిని కొనసాగించింది.

***

ఇలా సంజూకు జీవితం పట్ల జుగుప్స కలగటానికి కారణం ఏమిటన్నది మాత్రం మేఘనాకు తెలియనే లేదు. పెళ్లి అయినప్పటి నుంచీ ఎప్పుడైనా ఒకసారి పిచ్చితనం చూపించటం ఆమె గమనించినప్పటికీ అతను కనిపించకుండా పోవడానికి ముందరి ఆరు నెలల్లో ఇది అన్ని పరిమితులను దాటింది. ముందుగా ఈ గొడవ ప్రారంభమైనది ఆఫీసులో జరిగిన ఒక సంఘటన వల్ల. తన సహోద్యోగి ఒకనికి ప్రమోషన్ వచ్చిందని సంజూ ఇంట్లో కేకలు వేశాడు: “ఆ బెంగాలీ వాడికి ఇన్సెంటివూ, ప్రమోషనూ ఇచ్చారు, నాకు నామం పెట్టారు..” మేఘన అతనికి నచ్చజెప్పిన విధానం అతనికి నచ్చలేదనిపిస్తోంది. మేఘన తర్కపు తీరే భిన్నంగా ఉంది.

“అతని మొత్తం విజయాలు నీకన్నా ఉత్తమంగా వుండాలికదా సంజూ. లేకపోతే మీ కంపెనీవారు దీన్ని ఎలా సమర్థించుకోగలరు?” అని ఆమె అడగటంతో అతను గాభరాపడ్డాడు.

“అవును.. అయితే అతనికి ఇచ్చింది మెట్రో మార్కెట్. ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ వేసి సాయంత్రం ‘రబీంద్ర శొంగీత్, దుర్గా పూజం’టూ హాయిగా ఉండేవాడికీ, రూరల్ – మొఫ్యూసిల్ అని రాత్రి వరకూ ముడ్డి కింద బైక్ దూర్చుకుని వెళ్లే నన్నూ ఒకే కొలమానంతో కొలవడం సరైందికాదు కదా?” మేఘన తన రక్షణకు రావచ్చనే ఆత్రుతతో అడిగాడు.

ఎల్లప్పుడూ దోసకాయంత చల్లగా ఉండే మేఘన అతన్ని అడిగింది: “చూడు సంజూ, నీకు అన్యాయం జరిగిందనే ఈ వాదనను దృష్టిలో పెట్టుకుని వెళితే నువ్వు పూర్తిగా నాశనమైపోతావు. ఇది కార్పోరేట్ ప్రపంచం. ఇక్కడి నియమాలు, రాజకీయాలు భిన్నమైనవి. రహస్యమైనవి. ఈ యుద్ధం చేయడానికి నువ్వు తయారుగా ఉండాలి. లేకపోతే వైరాగ్యంతో బతకాలి. నీకు యుద్ధం చేసే శక్తి ఉందా?”

“అలా అంటే ఏమిటి?”

“యుద్ధం కథ వదిలెయ్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మనస్సుతో జవాబివ్వు. నీకు నువ్వు వెళుతున్న దారి అర్థమవుతోందా?”

“ఇంక నువ్వొకదానివి నాకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి మిగిలావు. సరేలే చెప్పు.. దీన్నీ ప్రయత్నించి చూద్దాం”

“నీకు ఇప్పుడు వస్తున్న జీతం చాలుతుందా? చాలదా? ఒక ఐదువందలు ఎక్కువ వస్తే నీ జీవితంలో మౌలికమైన మార్పులు ఏవైనా వచ్చేవా?”

“లేదు”

“అకస్మాత్తుగా ఆ బెంగాలి బాబుకు నీకు వచ్చినంతే లేదా నీకన్నా తక్కువ జీతం వచ్చివుంటే నీకు ఇంత కోపం వచ్చివుండేదా?”

“లేదు”

“నువ్వు ఉద్యోగం వదిలేస్తే అత్యవసరంగా నీకు ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరుకుతుందా?”

“బహుశా లేదు. నేను లైను మార్చకపోతే, ఇదే విధమైన ఉద్యోగం దొరకవచ్చు”

“ఈ బెంగాలీ నాశనమైతే, నీకు మరొక మరాఠీ, తెలుగు, కన్నడిగుడు, తమిళుడితో పోటీ ఉండనే ఉంటుందికదా? అన్నట్టు, మీ కాలేజిలో, మీ క్లాసులో మొదటి ర్యాంక్ వస్తున్న వ్యక్తి ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నాడు?”

“పోటీ ఉండనే వుంటుంది. అన్నట్టు మన టాపర్ గోపాల్ యాదవ్, పాపం, బి.ఎస్.సి. తర్వాత బి.ఎడ్. చేసి జడ్చర్ల దగ్గరున్న పల్లెలోని ఒక పాఠశాలలో మాస్టారుగా ఉన్నాడట. అతని టాలెంట్‌కు అతను ఏదేదో అయివుండొచ్చు. అయితే అతన్ని చూసి చాలా ఏళ్లే గడిచాయి. గుర్తు కూడా పట్టలేనేమో..”

“సంజూ ఇప్పుడు చెప్పు. నువ్వు ఎవరి మీద, ఎందుకు, ఏమి సాధించటానికి యుద్ధం చేస్తున్నావు? ఆ బెంగాలి నీ ప్రపంచంలో లేడని నువ్వు భావిస్తే నీ జీవితం ప్రశాంతమవుతుంది. ఆలోచించి చూడు. అలా కాకుండా ఊహాగానాల సమస్యలను తలలో పెట్టుకుని, ఏదో రేసులో నువ్వు గెలిచినప్పటికీ, దాన్ని సాధించటం వల్ల నీకు ఎలాంటి సంతృప్తి కలగదు. ఈ పోటీని వదిలెయ్. నీ సంపాదనతో మన సంసారం సాగిపోతోంది. డబ్బులకు ఇబ్బంది లేదు. నిన్ను నువ్వు చంపుకోకు. ఇలా ఊరకూరకే..” అని అతని మీద తొలకరి వాన కురిపించింది.

సంజూ వాదనలో ఓడిపోయాడు. ఆమె చెప్పినదాంట్లో అర్థముంది. అయితే ఆ అర్థాన్ని గ్రహించి నడుచుకుంటే జీవితంలో ఆకాంక్షా కానీ, గొప్ప కాంక్ష కానీ ఉండదు. ఆ తీవ్రత లేని రోజున సేల్స్‌లో ఉండే తన కెరీరే ముగిసినట్టే. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అతనికి మేఘన ఇరాదా మీదే అనుమానం కలగటం మొదలైంది. ఈమె ఎందుకు ఆ బెంగాలీవాడి పరంగా మాట్లాడుతోంది. తనకు వ్యతిరేకంగా ఆఫీసువాళ్లే కాకుండా ఇంటివాళ్లు కూడా కుట్ర జరిపి వుండొచ్చా అని ఏవేవో ఆలోచించి, మేఘన మీద ఆ రోజు విపరీతంగా కేకలు వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ భోజనాలు చేసి పడుకున్నారు.

***

నరేందర్ గౌడ్ పాఠశాల ఆవరణ మాత్రమే కాకుండా, ఊరి శివాలయం జీర్ణోద్ధరణ కార్యాన్నీ చేబట్టాడు. జడ్చర్ల రామాలయం పూజారి గతంలో చేసిన రాజకీయాన్ని మనస్సులో పెట్టుకుని తమ సొంత గ్రామానికి చెందిన బ్రాహ్మణ కుర్రవాడిని అర్చకత్వానికి సిద్ధం చేసి తర్ఫీదు ఇప్పించాడు. మన సమస్యలకు స్థానికంగా మనమే పరిష్కారాలను వెతుక్కోవాలన్నదే నరేందర్ పాలనా మంత్రమైంది. ఆ కారణంగానే రాష్ట్రప్రభుత్వ నుంచి రావలసిన నిధులు ఆలస్యమైనా గ్రామంలో ఏ పనులు ఆగేవికావు. మంచి ఆలోచనలు ఉంటే ధనసహాయాన్ని ఎక్కడి నుంచైనా తీసుకుని రావచ్చన్నది నరేందర్ గౌడ్ తత్వం.

శివాలయం జీర్ణోద్ధరణ జరుగుతున్న సమయంలోనే ఆలయం చుట్టూ అరుగు కట్టించి, పాఠశాలకూ, దేవాలయానికి మధ్యనున్న స్థలంలో గ్రామానికి వచ్చే అధికారులు, బయటి నుంచి వచ్చి గ్రామంలో సేవచేసే ఇతరులకోసం మూడు గదులనూ – దానికి ఆనుకునే మరుగుదొడ్లను గౌడ్ కట్టించాడు. ఈ గది, ఇతర సౌకర్యాలకు అతను గ్రామం సివిల్ లైన్స్ అని పిలుస్తుండేవాడు. ఔరంగాబాద్ దగ్గరి ఒక గ్రామంలో ఇలా బయటివారి కోసమే నాలుగైదు ఇండ్లను కట్టించి, సకల సౌకర్యాలను సమకూర్చిన ‘పూరా యోజన’ గురించి నరేందర్ విన్నాడు. ఇక్కడ కూడా అలాంటి సౌకర్యాలు సమకూర్చితే, గ్రామానికి ఒక బ్యాంకు శాఖ వచ్చి, పాఠశాల మాస్టార్లు, పోస్టాఫీసుకు చెందిన పోస్ట్ మాస్టారు, బ్యాంకు మేనేజరు ఇలా అందరూ గ్రామంలోనే నివసించవచ్చనే గొప్ప ఆకాంక్షతో కూడిన ఆలోచన గౌడ్‍కు వుండేది.

ఈ ఆలోచనలన్నిటి మధ్య పాఠశాల ఆవరణలోని గదిలో నివాసమున్న గోపాల్ యాదవ్, వివాహం తర్వాత జడ్చర్లలో సంసారం పెట్టడం నరేందర్ గౌడ‌కు చాలా విసుగు తెప్పించింది.. అప్పుడు అతను గోపాల్‍ను పిలిపించడమూ జరిగింది. అయితే గోపాల్ మాత్రం తన “మామగారు గొడవ చేసి జడ్చర్లలో ఒక అద్దె ఇల్లు ఇప్పించడమే కాకుండా, వరకట్నం డబ్బును ఇచ్చారనీ, ఏమి చేయడానికి కుదరదు దొరా” అన్నప్పుడు నరేందర‌కు ఏమి చెప్పాలో తోచలేదు. బస్సు కోసం ఎదురుచూడటానికి బదులుగా బైక్ అయినా కొనుక్కోమని చేసిన సూచనను గోపాల్ “పెళ్లి ఖర్చు నుంచి కుదుటపడిన తర్వాతే” అని వాయిదా వేసి మరిచిపోయాడు.

***

నిజాం ఆస్పత్రి నుంచి చేపట్టిన ఈ పరుగు మాత్రం బాలరాజుకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. ఒకటి తప్పించుకున్ని తీరు సీనియర్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య తప్పించుకున్నట్టుగా, కట్టుకథగా మారే తీరులో ఉంది. రెండు సమర్థుడైన అధికారి అని పేరుబడ్డ దానయ్య నాయుడు నుంచి తప్పించుకోవడం వల్ల, అది కూడా రెండవసారి పరారీ కావడం వల్ల, తనలో ఇంకా ధైర్యం ఉందనే ఆత్మవిశ్వాసం బాలరాజుకు తిరిగి వచ్చింది. మూడు – అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే – తన పట్ల కొంచమైనా తెలుసుకోవటానికి ప్రయత్నించిన ఈ దానయ్యను అతని పదవి నుంచి తొలగించి దూరానికి తరమటంలో కారకుడైనందుకు సంతృప్తి ఉంది. ఇప్పుడు సైఫాబాద్ పోలీస్ కేంద్ర కార్యాలయం నుంచి రాజేంద్రనగరానికి వెళ్లి తాను తప్పించుకున్న విధానం గురించి కట్టుకథలను ముందరి తరాల అధికారులకు బోధించడం కన్నా పెద్ద వ్యంగ్యం దానయ్య జీవితంలో ఏముంటుంది? వీటన్నిటినో గుర్తు చేసుకున్నప్పుడు బాలరాజుకు అత్యంత సంతోషం కలగడంలో అనుమానమే లేదు.

బాలరాజు తనకున్న తక్షణ భయాలను తొందరగా నివారించుకోవలసి ఉంది. గతసారి తప్పించుకొని పారిపోయినప్పుడు తనను నక్సల్ అని గుర్తించినవారు తక్కువ. తన ఫోటోలూ అందుబాటులో లేవు. అయితే ఈసారి వార్త మాధ్యమాల లైవ్ కవరేజ్ వల్ల తన ముఖ కవళికలు అన్నిచోట్ల కనిపిస్తున్నాయి. నగరానికి, రాష్ట్రానికి నాకాబంది విధించారు. రాకపోకల నిషేధం. కత్తిపోట్ల గాయాల గుర్తులు, గాయాలకు వేసిన కుట్ల గుర్తులు పచ్చిగానే ఉన్నాయి. అందువల్ల తాను తప్పించుకొని తిరగడం సాధారణమైన విషయమేమీ కాదు. తన ముఖకవళికలను మౌలికంగా మార్చడానికి ఏదైనా చేయాల్సి వస్తుందని ఆలోచించాడు.

డీప్‌గా దాక్కోవాలి. అది ఎలాంటి ప్రదేశం కావాలి? తన మారిన ముఖం ఏ విధంగా ఉండాలి? అత్యంత సామాన్యుడిలా నగరంలో కలిసిపోవాలా? ముంబైలాంటి జనసమూహంలో అనామకుడు కావాలా? అందరూ అనుమానించి వెతుకగలిగిన అడవికి తన కేడర్లతో చేరిపోవాలా? ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తున్నవాడు ఏదో ఒక నిర్ణయాన్ని వెంటనే చేబట్టాలని అనుకున్నాడు.

ఏమి తోచక తనకు దొరికిన పాత పేపర్‍ను తిరగవేస్తున్నప్పుడు బాలరాజుకు ఉంగరాల జుట్టు కలిగిన సాయిబాబా ఫోటో కనిపించింది. అసారాంజి బాపు, మురారి బాపు, సుధాంశుజీ మహారాజ్, స్వామి సుఖబోధానంద, గురుమా ఆనందమయి.. అందరినీ గుర్తు చేసుకున్నప్పుడు వాళ్లందరూ ఎంత మాటకారులు అనిపించింది. బాబాగారి ప్రవచనాన్ని అతను విన్నట్టు జ్ఞాపకమే లేదు. అవును జాదూ చేసి విభూతి తెప్పిస్తారనే (ధనంతులైన భక్తులకు రోలెక్స్ గడియారాలను గాలిలోంచి సృష్టిస్తారు) విషయం తప్ప బాబా జీవితదర్శనం ఏమిటన్నది బహిరంగంగా ఎవరికీ తెలిసినట్టు లేదు. బాబా ప్రవచనాలు ఇచ్చింది తక్కువే, అయితే కీర్తి మాత్రం ఉన్నత శిఖరానిది. ప్రజలను కౌగిలించుకొని తన గొప్పతనాన్ని చూపించే మాత అమృతానందమయిలా తాను తనదైన శైలిని వంట పట్టించుకోవటం గురించి బాలరాజు కాస్త ఆలోచించాడు.

యాభై ఏళ్ల బాలరాజు ముందుగా ముప్ఫయేళ్ల యువకుడిలా కనిపించడం ఎలా అని ఆలోచించాడు. ఆ పరివర్తన జరిగితే, మిగతావన్నీ తమంతట తామే జరగడంలో అతనికి అనుమానం లేదు. భాష ప్రమేయం లేకుండానే, మాటల అవసరం లేకుండానే మౌనిగా మారే తీరేమిటి? టీవీ కెమెరా ఫోటోల నుంచి తప్పించుకోవడానికి కంటి ముందుండటం మంచి ఆలోచననా.. ఇలా బాలరాజుకు అనేక ఆలోచనలు. మౌనం అన్నది ఒక చక్కటి అస్త్రం అనిపించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్దే దాన్ని విజయవంతంగా ప్రయోగించేవారు. మౌనంలో ఒక్కొక్కసారి మౌఢ్యమూ దాగిపోయే అవకాశం, భాషా ప్రయోగపు నిరర్థకత.. ప్రవచనాలు ఇవ్వవలసిన అవసరం లేని సాధువు కావడం చాలా కష్టమైన విషయమని బాలరాజు ఆలోచించాడు.

***

ప్రతి శనివారం సంజూ ఆ వారపు నివేదికను అప్పగించడానికి తన కార్యాలయానికి వెళ్లడం అలవాటు. ఆరోజు ఆఫీసుకు వెళ్లినప్పుడు ఆ బెంగాలీ కృషిని బాస్ పొగిడాడు. “చూడు, అతను చూపించేటంత ఉత్సాహం నువ్వూ చూపించి ఉంటే, మన మార్కెట్ మొఫ్యూసిల్ విభాగంలోనూ పెరగటంలో అనుమానమే లేదు..” అని ఉపన్యాసం ఇచ్చాడు. ఈ ఉపన్యాసం వింటుండగానే సంజూకు మేఘన ఉపదేశమూ గుర్తొచ్చి ఒళ్లంతా చిరచిరలాడింది.

ఇంటికి వెళ్లడానికి బైక్ ఎక్కిన వాడికి ఎంత కోపం వచ్చిందంటే – బైకును సెల్ఫ్ స్టార్ట్ చేసే బటన్ నొక్కటానికి బదులుగా కుడికాలితో కిక్కు కొట్టి స్టార్ట్ చేశాడు. కాలుజారి నేలకు తగిలి నొప్పెట్టింది. అతను మండిపడుతూనే ఇంటికి వచ్చాడు.

ఇంటికి వచ్చే సమయానికి ఇంట్లో కరెంట్ లేదు. గత సంవత్సరం వేయించిన యుపిఎస్ కూడా చేయిచ్చింది. ఇల్లు అంధకారంలో ఉంది. మేఘనా విద్యుత్ విభాగం వారిని తిట్టిపోసింది. “చూడు సంజూ, ఉదయం పోయిన కరెంటు ఇంకా రాలేదు. మధ్యాహ్నం విపరీతమైన ఉక్క అని ఐదు నిమిషాలు ఫ్యాన్ వేసే సమయానికి యూపీఎస్ బ్యాటరీ కూడా ఖాళీ అయిపోయింది..” అంది.

సంజూకు ఈ మాటలు మరింత కోపాన్ని తెప్పించాయి. అసలే మండిపడుతున్న అతని కోపాగ్నికి మేఘన మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. యుపిఎస్ మీద ఫ్యాన్ పనిచేయిస్తే బ్యాటరీ ఖాళీ కావడంలో ఆశ్చర్యం ఏముంది?

“అయితే దుకాణంలో కరెంటు పోయినప్పుడు, ఎ.సి. కూడా నడిపిస్తారు కదా మహానుభావా?” అని మేఘన వేసిన ప్రశ్న సంజును మరింతగా రెచ్చగొట్టింది. బ్యాటరీకూ, యూపీఎస్‍కూ, జనరేటర్‌కూ ఉన్న వ్యత్యాసం తెలియని పల్లెటూరి బైతుకు ఏమి చెప్పాలి? అని లోలోపల మండిపడుతూ, “కంప్లైంట్ అయినా ఇచ్చావా?” అని అడిగాడు.

“లేదు సంజూ. అన్నిచోట్లా పోయివుంటుంది. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చివుంటారని నేను ఇవ్వలేదు” అని అంటూ అతని ఉంగరాలు జుత్తులో మేఘన వేళ్లు కదిలించింది.

ఇలా వారం అలసట తర్వాత బెంగాలీ విజయగాథను ఆలకించి వచ్చిన సంజూకు వేడినీటి స్నానం, ఫ్యాను గాలి, రాత్రి బల్బు వెలుతురు, చార్జింగ్ చేయాల్సిన లాప్‌టాప్, మొబైలు, అన్నీ జ్ఞాపకం వచ్చి జుట్టు పీక్కోవాలనిపించింది.

ఈమెకు బుద్ధి చెప్పటం ఎలాగో తెలియక సంజూ మొబైల్ వెలుతురులో ల్యాండ్‌లైన్ నుంచి విద్యుత్ విభాగం వారికి ఫోన్ చేశాడు. విద్యుత్ విభాగం వారి మీద కోప్పడుతూనే కంప్లైంట్ చేసిన అతనికి అటువైపు నుంచి వచ్చిన జవాబూ ఆశ్చర్యం కలిగించింది. సంజూ కేకలన్నీ విని విభాగం వారు అడిగిన ప్రశ్న ఇంతే-

“సార్ మీ కోపతాపాలన్నీ సరే. మీరు చివరిసారిగా విద్యుత్ బిల్లు ఎప్పుడు కట్టారో చెప్తారా? దానికి జవాబు తెలుసుకొని మీ విద్యుత్ బిల్లు చెల్లించిన రసీదును తీసుకొని రండి. ఐదు నిముషాల్లో మీ కనెక్షన్ మరలా వేయిస్తాం”

సంజూకు అప్పుడు గుర్తొచ్చింది. మూడు వారాల కిందటి విషయం. గత నెల కరెంట్ బిల్లు కట్టడానికి మేఘనకు చెప్పి ఆమె చేతిలో చెక్కును ఇచ్చాడు. అయితే ఆ చెక్కు ఆమె హ్యాండ్ బ్యాగ్ అనే మాయాలోకంలో చేరిపోయి, బయటికి రానేలేదు. మేఘన ఇలా చేస్తుండటం ఇది మొదటిసారి కాదు. ఇంటి బయటి బాధ్యతలేవీ ఆమె సంతోషంగా స్వీకరించేదీ కాదు. సహజంగా చేస్తూ ఉండేదికాదు. పైగా ఈ ఘటన వల్ల సంజూ చెక్కే ఇవ్వలేదని వాదించింది. అయితే, ఇలా వాదించిన తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్ నుంచి బయటికి వచ్చిన చెక్కును చీకట్లోనే ఆమె కళ్ల ముందు పట్టుకొని, “ఇది ఏమిటి?” అని సంజూ అడిగాడు.

“ఉండొచ్చు. తప్పు నాదే. ‘చిల్’. ఇప్పుడు ఎలాగూ బిల్లు కట్టడానికి సాధ్యంకాదు. రాత్రి చీకట్లోనే కాలం గడపాలి. నా దగ్గర పెర్ఫ్యూమ్ క్యాండిల్స్ ఉన్నాయి. రా, కొవ్వొత్తి వెలుగులో రొమాంటిక్ డిన్నర్ చేద్దాం” అంది.

సంజూ రెచ్చిపోయాడు. “మొదట ఇంట్లో అగ్గిపెట్ట ఎక్కడుందో చూడు, అది కూడా ఉండదు” అని అతను చెప్పటం నిజమే అయింది. అయినా మేఘన పట్టుదల మేరకు గ్యాస్ స్టవ్ మంటతో వెలిగించుకున్న గుమగుమలాడే చతురస్రాకారపు కొవ్వొత్తుల వెలుగులో చారన్నం తిని భార్యాభర్తలిద్దరూ పక్కమీద వాలారు.

ఆదివారమూ అంధకారంలో గడిచింది. చివరికి సోమవారం మేఘన చెక్కు సమర్పించి, రసీదు పొంది విద్యుత్ విభాగం వారిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఒక విచిత్రమైన రహస్యం తెలిసింది. ఇంటి విద్యుత్ ఫీజును విద్యుత్ విభాగంవారు మీటర్ కిందనే దాచిపెట్టారు. ఈ విషయాన్ని ఫోన్‍లో విన్న సంజూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఒక చిన్న విషయానికి ఎంత హింసను అనుభవించాల్సి వచ్చిందని ఫోన్ లోనే కేకలు వేశాడు. మేఘన ఎంతగా ‘చిల్’ అన్నప్పటికీ బయటి 35 డిగ్రీల వాతావరణపు చెమట తగ్గనే లేదు.

ఇలా జరిగిన ఫ్లాష్బ్యాక్ తర్వాత సంజూ మేఘన ఉదాసీనతను క్షమించలేకపోయాడు. తాను బిల్ కట్టడం మరవటమే కాకుండా, అన్ని సమస్యలకూ తిని, పడుకునే పరిష్కారాన్ని సూచించే, అన్ని జటిల సమస్యలకూ ‘చిల్’ అనే ఆమె ఉదాసీన బుద్ధి అతనికి విపరీతమైన అసహనాన్ని కలిగించింది. ఈమెకు మరవలేని ఒక గుణపాఠం చెప్పాల్సిందే అని ఆరోజే శాంతిని కోల్పోయిన ఆ సాధువు నిర్ణయించుకున్నాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల్లో చార్‌ధామ్ యాత్ర విషయాన్ని అతను ప్రకటించాడు.

సవారి ట్రావెల్స్ నుంచి యజమాని ఫోన్, సంజూ విషయం విన్నప్పుడు మేఘనకు చెవిలో అతని చివరి ఫోన్ కాల్ విషయం మరల మ్రోగింది. బతికివున్నాడో, చనిపోయాడో తెలియనటువంటి త్రిశంకు స్వర్గంలో తోసి, సందిగ్ధమైన వార్తను తెలిపి సంజూ ఉత్తర కాశీ నుంచి మాయమయ్యాడు.

అది జరిగిన కొన్ని రోజుల తర్వాత, వివాహం జరిగిన నాలుగేళ్లు తిని, పడుకునే అలవాటు ఫలంగా మేఘనకు తాను గర్భవతి అయ్యిందని అర్థమై వాంతికొచ్చింది.

***

ఇందిరమ్మ సర్పంచ్‍గిరిలో అన్ని ఒక ఆధీనంలో జరుగుతున్న గ్రామానికి మరొక ఆగంతకుడు ఉన్నటువంటి ప్రత్యక్షం కావడం గ్రామస్తులందరికీ మోహన ప్రభుదాస్ జ్ఞాపకాన్ని తెచ్చి పెట్టింది. పదిహేను సంవత్సరాల క్రితం వచ్చిన అనుమానాలే పునరావృతమయ్యాయి. తర్వాత జరిగిన సంఘటనలూ గ్రామ పెద్దల మనసులో సంచరించాయి. ఇప్పుడు యువకులైన పిల్లలంతా అప్పటి రోజుల్లో ఇదే పాఠశాల విద్యార్థులు కావటమూ, వారికి మోహన్ కాకా అత్యంత ప్రియమైన కాకా కావటం మరువలేకపోయారు. అయితే మోహన్ కాకా వాస్తవానికి అనివార్య పరిస్థితిలో రాజకీయపు స్పర్శ తగిలి అతను ఊరికి శాపం పెట్టి వెళ్లిపోయాడు.

మోహన్ కాకా పంచ, కాకి రంగు షర్టు ధరించి అభినయ పూర్వకంగా మాట్లాడేవారైతే, ఈ కొత్త వ్యక్తి రూపం భిన్నంగా ఉంది. ఇతను యువకుడు. కాషాయ రంగు బట్టలు ధరించాడు. దేవాలయం అరుగుమీద పడుకుంటాడు. కాకా తీరులోనే హ్యాండ్ పంప్ వాడి స్నానం చేసి శుభ్రమవుతాడు. పైగా శివాలయం బయటి ప్రాంగణం కసవు చిమ్మి, నీళ్లు చిలకరించి, శుభ్రం చేసేవాడు. ఎప్పటిలాగే ఈ కొత్త వ్యక్తిని ముందుగా చూసినవారు రెడ్డప్ప మాస్టారు.

మాస్టారు ఆ వ్యక్తిని పలకరించడానికి ప్రయత్నించారు. అతను వేషభూషణాల వల్ల ఒక సంచారిలా, దిక్కులేని బికారీలా మాస్టార్ గారికి అనిపించలేదు. రెడ్డప్ప మాస్టారు అడిగిన ప్రశ్నలకు అతను ఎలాంటి జవాబు ఇవ్వకుండా మౌనంగా నిలబడటం వల్ల అతని పూర్వాపరాలూ తెలియలేదు. ముందుగా అతనికి చెవిటితనం ఉండొచ్చుననే అనుమానం మాస్టారుకు వచ్చింది. అయితే అతను శబ్దానికి ప్రతిస్పందించటం వల్ల కేవలం మాటలు మాత్రమే రావని మాస్టారు నిర్ధారించారు. ఇలా మాటలురాని వ్యక్తిని ఎలా పలకరించాలో తెలియక మాస్టారుగారు హైరానాపడ్డారు. ఒక విధంగా చూస్తే తమ గ్రామ పాఠశాలలో, మాటలురాని లేదా ఇంకేదో అంగవైకల్యం కలిగిన విద్యార్థికి రెడ్డప్ప మాస్టారు ఎన్నడూ పాఠం చెప్పలేదు. ఈ మధ్యనే వికలాంగులు అనే పదాన్నీ వాడకూడదని రెడ్డప్ప మాస్టారు గుర్తు చేసుకుని, ‘దివ్యాంగులు’ అనే పదాన్ని నాలుగుసార్లు గొణిగారు.

ఉంగరాల జుట్టు, లావాటి మీసాలు, నాలుగు రోజుల గడ్డం ఉన్న ఈ మనిషి తమ ప్రాంతంవాడు కాదేమోనని మాస్టార్ గారికి అనిపించింది. అందువల్ల తమ ఇబ్బంది భాషదో లేదా కేవలం మాటలదో అనే అనుమానం వచ్చినప్పటికీ, అతనికి మాటలు వచ్చుంటే ఏదో ఒక భాషలో ఒకటి రెండు పదాలనైనా వెలువడించేవాడని అనిపించి మాస్టారుగారు మౌనం వహించారు. “నీ పేరేమి? ఎక్కడి నుంచి వచ్చావు?” అని రెండు ప్రశ్నలను తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ రాసి అతని ముందు పట్టుకున్నారు. అయితే ఆ మనిషి ఆ కాగితాన్ని ఏదో శూన్యాన్ని చూసినట్టు చూస్తుండటంతో అతనికి కళ్లు సరిగ్గా కనిపిస్తున్నాయా అనే అనుమానం ఒక్క క్షణం వేధించింది. అయితే ఆ మనిషి లోపాలు ఏమిటో పట్టిక చేయడానికి మునుపే సర్పంచ్ అయిన ఇందిరమ్మతో ఈ పరిస్థితి గురించి చెప్పాలని నిర్ణయించుకున్న మాస్టారు గోపాల్ యాదవ్ రాకకోసం ఎదురుచూశారు. అతను రాగానే పిల్లలను, పాఠశాల బాధ్యతను అతనికి అప్పగించి, కొత్త ఆగంతకుడిని సర్పంచ్ దగ్గరికి మాస్టార్ గారు తీసుకొనిపోయారు.

గోపాల్ యాదవ్‍కు ఈ బాబాను గతంలో ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చింది. అయితే కచ్చితంగా ఇలా అని చెప్పడానికి సాధ్యపడక సతమతమయ్యాడు. సరే, ఏదో ఒక రోజున తెలియవచ్చు, ఇప్పుడు బుర్రపాడు చేసుకుని చేసేదేముందని అనుకుంటూ పాఠాలు, ప్రవచనాలవైపు తన దృష్టిని సారించాడు.

రెడ్డప్ప మాస్టారు నియమోల్లంఘన చేయని సజ్జనులు. అందువల్లనే ఆయనకు సర్పంచ్ అన్నప్పుడు ఇందిరమ్మ గుర్తుకొచ్చేదే తప్ప నరేంద్రగౌడ్ ఎప్పుడూ గుర్తుకురాలేదు. కొత్తవ్యక్తిని తెచ్చి మాస్టారు ఇందిరమ్మ ముందు నిలబెట్టారు.

***

నరేంద్రర్ గౌడ్ ఢిల్లీలో నిలేకణిని కలిసి తమ గ్రామానికి ఆహ్వానించిన విషయం గ్రామంలో గొప్ప వార్తగా వ్యాపించింది. అలాగే మూడు నెలలలోపు గ్రామస్థులందరికీ ఆధార్ కార్డ్ కోసం నమోదు చేయించి, నీలేకణిని గ్రామానికి ఆహ్వానించాలనే ప్రణాళికకు గ్రామంలోని పెద్దలూ అంగీకారం తెలిపారు.

ఎడమచేతి బొటనవేలు అనే నిస్సహాయత చిహ్నాన్ని స్వావలంబన అస్త్రంగా పరివర్తించే ఈ ఆధార్ ఐడికార్డ్ గురించి నరేందర్ ఉత్సాహంతో మాట్లాడాడు. ఈ ప్రణాళిక వల్ల గ్రామంలో అందరి ఇళ్లకూ గ్యాసు, విద్యుత్ మీటరు, బ్యాంకు అకౌంటు, సొమ్ము, భత్యం చీటి ద్వారా దొరికే బియ్యం, పప్పు, కిరాసానాయిల్, చక్కెర అన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుందని ప్రకటించాడు. ఐడి కార్డ్ ప్రక్రియ జరపడానికి పక్క ఊరికి చెందిన పోస్ట్ మాస్టరును, బ్యాంక్ మేనేజరును వేధించాడు. దీని ప్రక్రియ సులభమైనది కాదని, గ్రామంలో అందరికీ ఐడి కార్డ్ ఇప్పించడం కష్టమైన పనని వాళ్లందరూ చెప్పినప్పటికీ నరేందర్ వినలేదు. “ప్రయత్నించడంలో తప్పేమిటి? దీనివల్ల మన గ్రామానికి మంచి పేరు, అధిక సౌకర్యాలు దొరికేటట్టయితే ఎందుకు ప్రయత్నించకూడదు?” అని అడిగాడు.

గ్రామ పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం కోసమే ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించడం జరిగింది. బ్యాంక్ తరపున వచ్చిన జనం అస్తిత్వపు సమాచారాన్ని సేకరించే ప్రక్రియను వివరించారు. కావలసిన దాఖలాల పట్టికను ఇచ్చారు. దాఖలా పట్టికను చూసి నరేందర్ నివ్వెరపోయాడు.

“అది కాదన్నా, ఇప్పటికే ఓటర్ కార్డూ, పాన్ కార్డూ, రేషన్ కార్డు, డిఎల్లూ, అన్నీ ఉన్నవారికి ఈ బొటనవేలు కార్డు ఎందుకు? ఏదీ దొరకనటువంటి బీదవాళ్లకు కావలసింది ఇది. ముఖ్యంగా దళితవాడకు ఐడి కార్డును మీరు ఎలా ఇస్తారు?”

నరేందర్ ప్రతిసారి నాలుగు ప్రశ్నలు అడిగిన వెంటనే బ్యాంకు తరఫున వచ్చినవారు “దీన్ని ఆలోచించాలి” అని మాత్రమే చెప్పి తమ సూట్‍కేసును క్లోజ్ చేసి సాయంత్రం వేళకు ఊరికి తిరిగి వెళ్లిపోయేవాళ్లు. చివరికి ఏదో విధంగా దాఖలాలు ఉన్నవారితోనే ప్రారంభించి, లేనివారిని తర్వాత చేర్చుకుంటామనే ఒప్పందమూ జరిగింది.

ఇలా దాఖలాలు ఏవీ లేనివారినీ నమోదు చేయడానికీ ఒక విధానముందని తర్వాత తెలిసింది. అది ఇలా – గ్రామానికి చెందిన ఎవరైనా ప్రముఖ వ్యక్తి – ఈ మనిషి ఫలానావాడని గుర్తించి తమ తరఫున దస్తకత్తు పెడితే, దాఖలాలు లేనివారికీ బొటనవేలు ఐడి కార్డ్ దొరుకుతుందని తెలిసినప్పుడు, తమ తరఫున పాఠశాల నుంచి నివృత్తులైన, అయితే ఇంకా పాఠాలు చెబుతున్న రెడ్డప్ప మాస్టారు దీనికి సరైన వ్యక్తని గ్రామపెద్దలు నిర్ణయించారు. పాఠశాల ఆవరణలోనే నమోదు కార్యక్రమం వుండటంవల్ల, మాస్టారు ప్రజలను పరిచయం చేయడానికి దూరంగా వెళ్లాల్సిన అవసరమూ లేదు. పైగా అదే ఊరివారైన మాస్టారుకు తెలియనివారు ఎవరూ లేరని అందరికీ అంగీకారమైంది. ఈ నమోదుకు పరిచయం చేసేవారి హక్కు బాధ్యతలను, పరిచయ ప్రక్రియను వివరించటానికి ఒక ట్రైనింగ్ కార్యక్రమానికి మాస్టారు వెళ్లివచ్చారు. మాస్టారుగారి నమోదుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం బహుశా మూడు వారాలలో పూర్తికావచ్చు అని నరేందర్ అంచనా వేశాడు.

వేలిముద్ర, కంటి చిత్రం, ఫోటో, అన్నిటినీ ఒక చిన్న వెబ్ క్యామ్, ఇతర పరికరాల ద్వారా లాప్‍టాప్‌లో సంగ్రహించే ఈ ప్రక్రియ పాఠశాల పిల్లల కుతూహలానికి, వినోదానికి మూలమైంది. నరేందర్ అంచనా వేసిన దానికన్నా ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, మూడు నెలల వ్యవధిలో గ్రామస్తులందరి వివరాలను నమోదు చేయడం పూర్తయింది.

ఇది సామాన్యమైన విజయం కాదు. నరేందర్ గౌడ్ గ్రామపెద్దల సభ జరిపి నిలేకణిని గ్రామానికి ఆహ్వానించిన విషయాన్నీ, అతనికి ఈమెయిల్ పంపించే ఇరాదానూ వారి ముందు పెట్టాడు.

వెంటనే పెద్దలు అడిగిన ప్రశ్నే ముఖ్యమైంది. గ్రామంలో అందరి వివరాలు నమోదు అయ్యాయా? మనకు కచ్చితంగా తెలియకుండా, ఈ విషయం గురించి మనం ఎక్కువగా సాగదీయకూడదు. ఇలా అడిగిన ప్రశ్నకు నరేందర్, ఇందిరమ్మలు కరాకండితంగా అవునని జవాబు ఇచ్చారు. “అందరి వివరాలు నమోదు చేయడం జరిగింది. మన గ్రామస్థులందరిదీ, రోజూ జడ్చర్ల నుంచి అప్-డౌన్ చేసే గోపాల్ యాదవ్ మాస్టారు, రోజుకు రెండు గంటలు పోస్ట్ ఆఫీస్ తెరిచి ఉత్తరాలను జోడించే, ఉత్తరాలను పంచే, అలాగే ఇంగ్లాండ్ లెటర్లను అమ్మే జడ్చర్ల పోస్ట్ మాస్టారూ, అందరూ మా నమోదు కింద బొటనవేలు వొత్తి, కంప్యూటర్‍కు కన్నుకొట్టి వెళ్లినవారే”

“ఒక సంవత్సరం నుంచి మన గ్రామంలో నివాసమున్న ఆ మౌనీ బాబా, ఆ బాబా బొటనవేలి గుర్తు తీసుకోవడం జరిగిందా?” ఈ ప్రశ్న వచ్చినప్పుడు మొత్తం చర్చ ఒక్క క్షణం ఆగిపోయింది. అవును, మౌనీ బాబా గుర్తింపు వివరాలను సేకరించలేదు. రేపటి రోజున మళ్లీ అందరినీ పిలిచి గుర్తించపు వివరాలను నమోదు చేద్దాం. అక్కడితో మన గ్రామం ‘నిర్మల్ గ్రామం’ మాత్రం కాకుండా ‘ఆధార్ గ్రామం’ కూడా అవుతుంది.

ఇంకా ఒక గంట సేపు జరిగిన చర్చలో బాబా తప్ప మిగిలిన వారంతా నమోదు కావడంలో అనుమానమే లేదనే విషయాన్ని నిర్ధారించుకున్నారు.

***

బాబాగారిని పరిచయం చేసే పనిని మళ్లీ రెడ్డప్ప మాస్టారికే అప్పజెప్పడం జరిగింది. మాస్టారుగారు దీని గురించి అనుమానం వ్యక్తపరిచారు. తమకు ఇచ్చిన ట్రైనింగ్‍లో తెలియని వ్యక్తులను పరిచయం చేయకూడదు, అలా చేస్తే కలగబోయే కష్టనష్టాల గురించి చక్కగా వివరించారు. అందువల్ల బాబా విషయంలో తాము దస్తకత్తు చేయడానికి మాస్టర్ గారు సంకోచించారు.

“మాస్టారుగారు మిగిలింది ఒక వ్యక్తి మాత్రమే. ఇది పూర్తిచేస్తే మన గ్రామం దేశంలోనే మొదటి ‘ఆధార్ గ్రామం’ అవుతుంది. మనకు దేశస్థాయిలో దొరకగలిగే పేరుప్రఖ్యాతుల గురించి ఆలోచించి చూడండి. ఇది దేశసేవకు సంబంధించిన విషయం కాదా?” అంటూ మాస్టార్ గారిని పురమాయించాడు.

“అదికాదు నరేందర్, బాబా మంచి మనిషి అన్నది నిజమే. ఒక సంవత్సరం నుంచి అతను మన దగ్గర ఉన్నాడు. ఇక్కడే దేవుడికి, పిల్లలకు సేవ చేస్తున్నాడన్నది నిజమే. అయితే అతని పేరు కూడా మనకు తెలియదుకదా, ఇక మిగతా వివరాలను ఎలా పూర్తి చేయడం? మాటలేరాని అతని వివరాలేవీ మన దగ్గర లేవు.”

“మాస్టార్ గారూ, ఆధార్‍కు కావలసిన వివరాలు మీరు పరిచయం చేసిన చాలామందికి లేవు. దళితవాడ అయిలయ్య పుట్టినరోజు మీకు తెలుసా? లేదు. అయినా అందాజు మీద అతన్ని ఆగస్టు 13వ తారీఖున పుట్టించారు కదా! ఇలాగే చేస్తున్న మంచి పనికి దయచేసి అడ్డు చెప్పకండి.”

“అది కాదయ్యా, పుట్టినప్పటినుంచి చూసిన అయిలయ్య, పేరే తెలియని ఈ బైరాగీ ఒకటేనా?”

“మాస్టార్ గారు, ఈ బాబాను ముందుగా చూసినవారూ మీరే. గ్రామంలో పెట్టుకోమని చెప్పినవారూ మీరే. ప్రతిరోజూ అతన్ని సమీపం నుంచి చూస్తున్నవారూ మీరే. ఒక సంవత్సరం నుంచి గమనించిన తర్వాత కూడా మీకు అనుమానమా? మేమందరమూ అతన్ని ప్రేమతో మౌనీబాబా అని పిలుస్తున్నాం కదా? అదే పేరుతో నమోదు చేయండి.”

ఏదో విధంగా మాస్టారును ఒప్పించటానికి నరేందర్ గౌడ్‍కు ఒక అరగంట సమయం పట్టింది. మరుసటి రోజున బాబాగారి బయోమెట్రిక్ పూర్తయితే నీలేకణిని గ్రామానికి ఆహ్వానిస్తూ సందేశాన్ని పంపించవచ్చని గౌడ్ ఆలోచించాడు.

***

మౌనీ బాబాను గ్రామంలో ఉంచుకోవడానికి ముఖ్యకారణం ఒక విధంగా రెడ్డప్ప మాస్టారే. ఏమీ మాట్లాడని ఈ బాబాను సర్పంచ్ దగ్గరికి తీసుకొని పోయినప్పుడు మళ్లీ అవే ప్రశ్నల చుట్టూ చర్చలు జరిగాయి. “ఇతను ఎవరు? ఇతని చరిత్ర ఏమిటి?” అంటూ. గత పదిహేను సంవత్సరాలలో అపరిచితుల విషయంలో అడిగే ప్రశ్నలు ఏవీ మారలేదు. పదిహేను సంవత్సరాల క్రిందట మోహన ప్రభుదాస్‌ను తీసుకొనిపోయినప్పుడు కూడా అప్పలరెడ్డి కాశీవిశ్వనాథరెడ్డిగారు ఇవే ప్రశ్నలు అడిగారు. అయితే ఈ ప్రశ్నలు అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ అవసరమైనవి. దేవుడి ముందు ప్రత్యక్షమయ్యే ఈ అవధూతలను అనవసరంగా ఇలా ప్రశ్నించి ప్రయోజనమేమిటి అని రెడ్డప్ప మాస్టార్‍కు అప్పటికీ ఇప్పటికీ అర్థం కాలేదు. అయినా గ్రామంలో ఏమి చేయాలనుకున్నా అది సర్పంచ్, గ్రామపెద్దల ఆశీర్వాదంతో చేయడం మంచిదనే సూత్రాన్ని రెడ్డప్ప మాస్టారు ఇప్పటికీ పాటిస్తున్నారు.

ఒక వారం గ్రామంలో వుండే అవకాశం ఇద్దాం, తర్వాత చూద్దామనే నిర్ణయం పంచాయతీలో తీసుకున్నారు. ఇలా మౌనంగా వున్న ఈ ఆగంతకుడికి దేవాలయం అరుగుమీద పడుకోవటానికి, హ్యాండ్ పంప్ నీళ్లతో స్నానం చేసుకోవడానికి అనుమతి దొరికింది. ముందుగా ఏమీ మాట్లాడకుండా ధ్యానంలో నిమగ్నమై ఉండే బాబా రానురానూ పిల్లలతో కలిసిపోసాగాడు. చిన్న పిల్లలు తన గడ్డాన్ని లాగటం ఒక ఆటగా చేసిన బాబా, పాఠశాల ఆట సమయంలో పిల్లలతో బారాకట్ట ఆడటం, తన కాషాయం రంగు వస్త్రాన్ని బంతిలా చుట్టి విసిరేయటం చేయసాగాడు. తన దగ్గరకు వచ్చిన జనులను ఒళ్లు తడిమి ఆశీర్వదించే కొత్త విధానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ బాబాలలో ఒకటి మాత్రం భిన్నమైన ఆలోచన ఉండేది. స్వాములందరూ తమ దేహం మీది పైభాగాన్ని ఖుల్లా వదులుతుంటే, ఈ బాబా మాత్రం ఎప్పుడూ కాషాయం రంగు ఒక చిన్న కుర్తాను ధరించే ఉండేవాడు.

బాబా కీర్తి నెమ్మదిగా ఇరుగుపొరుగు గ్రామాలకు వ్యాపించసాగింది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన సమస్యలకు బాబాగారి సంతోషం, ప్రేమతో కూడిన టచ్ వల్ల పరిష్కారం దొరుకుతుందనే విషయం వ్యాపించింది.

మోహన ప్రభుదాస్ వచ్చినప్పుడు జరిగిన తీరులోనే బాబా వచ్చినప్పుడూ రెండు విషయాలు ముందుకు వచ్చాయని రెడ్డప్ప మాస్టార్ గుర్తించారు. ఒకటి- ఊళ్లో రెండుసార్లు కరువులు వచ్చిన తర్వాత వర్షం వచ్చింది. రెండు- శివాలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది.

ఈ బాబా ప్రభుదాస్ లాగే తన వంట తానే చేసుకునేవాడు. పైగా ప్రతిరోజూ ఏదో ఒక కరకరలాడే చిరుతిండిని చేసి పిల్లలకు పంచేవాడు. దేవాలయం అరుగుమీది నుంచి పాఠశాల ఆవరణలో ఉన్న ఒక గదికి ఎలాంటి గొడవ లేకుండా ఒకరోజు నాజూకుగా బాబా స్థానాంతరం చెందాడు. ఆ గ్రామంలో స్థిరంగా ఉండాలంటే పాకశాస్త్రం కరతలామలకం కావాలేమో? ప్రభుదాసు కూడా అతిథుల భోజనాలు, ఉపచారాలు చూసుకుంటూనే ఇక్కడే స్థిరపడ్డాడనే విషయం మాస్టార్ గుర్తుతెచ్చుకున్నారు.

ఆరు నెలల్లో పిల్లల మౌనీబాబా అని పేరుపొందిన ఈ బాబా వేరే ఊరినుంచి వచ్చే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ప్రతి సాయంత్రం ఒక గంటసేపు దర్శనమిచ్చి, ఒళ్లు తడిమి, ఒక పండు ఇచ్చి పంపడంలో నిష్ణాతుడయ్యాడు. ఏమీ మాట్లాడకుండా వుండటంవల్ల, ప్రవచనాల, భజనాల గొడవలు లేకుండా జీవితం సాగిపోతోంది.

***

సంజూ బతికివున్నాడో లేదో తెలియని మేఘన అతన్ని శాపం పెట్టని రోజే లేదు. మూడేళ్ల క్రితం ఉత్తరకాశి నుంచి కనిపించకుండా పోయిన సంజూ ఎక్కడైనా దాక్కున్నాడో, ఆత్మహత్య చేసుకున్నాడో తెలియనే లేదు. సంజూ తిరిగిరావాలని మేఘన కోరుకోకపోయినప్పటికీ అతని విషయానికొక ముగింపును ఆమె కోరుకుంది. అల్ప కారణాలకు కోపంతో తీవ్రంగా ప్రతిస్పందిస్తున్న అతనితో మళ్లీ సంసారం చేయడానికి ఆమె సిద్ధంగా లేదు. అందువల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తకోసం మాత్రమే ఆమె ఎదురుచూస్తూ ఉంది. అయితే ఏ వార్త కూడా తనకు అందలేదు. అతని అకౌంటు, పి.ఎఫ్, అతని సమస్త వస్తువులకూ తానే నామినీ అయినప్పటికీ, అతని మరణవార్త నిర్ధారణ అయ్యేవరకు ఆమె వాటిని తీసుకోవటానికి లేదు. చనిపోయాడని నమ్మటానికీ (presumed dead) చట్టం ప్రకారం జరగటానికి అనేక సంవత్సరాలు ఎదురుచూడాలి.

గర్భవతి అయిందని తెలియడానికి ముందే అత్యంత ప్రియమైన ప్రాణాన్ని, ప్రేమికుడినీ, చార్‌ధామ్ యాత్రా ఫలంగా త్యాగం చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకున్న సంజూకు ఆత్మహత్య చేసుకునేటంత ధైర్యం లేదని అతని స్నేహితులు, మేఘన తల్లిదండ్రులు చెప్పారు. ఇది మేఘనకు అసహనాన్ని కలిగించే విషయమైంది. అలాగైతే ఈ మనిషి మళ్లీ ఎక్కడైనా, ఎప్పుడైనా అవతరించవచ్చు. ఒకవేళ అతను ఎదుటికి వస్తే, చేసుకోకుండా ఆపిన ఆ ప్రాణత్యాగపు బెదిరింపును తానే స్వయంగా నిలబడి నిజం చేయాలని మేఘనకు అనేకసార్లు అనిపించింది.

మేఘన గర్భవతి కావడం పాత విషయం. ఇప్పుడు ఆమె కూతురికి రెండేళ్లు దాటాయి. అయితే రెండేళ్లయిన కూతురికి మాటలు రాకపోవడం ఆమెకు విచారానికి కారణమైంది. సంజూ చార్‍ధామ్‌కు వెళ్లినప్పటి నుంచి మేఘన జీవనశైలిపోయింది. ఎప్పుడూ సంతోషంగా, దేన్నీ బుర్రకెక్కించుకోకుండా బిందాస్‌గా ‘చిల్’ చేస్తున్న ఆమె ఇప్పుడు ఒంటరిగా అన్నిటిని నిభాయించుకోవలసి వచ్చింది. పైగా కూతురి మాటల విషయంగా ఆసుపత్రి, గుడి, బాబా అంటూ తిరిగినప్పటికీ ఎవరికి ఏ సమస్యా కనిపించక, పరిష్కారమూ తోచక ఆమె మాత్రం పరేషాను అయింది.

ఈ కాలంలో మేఘన అతిగా దేవుడికి మొరపోవటం ప్రారంభించింది. చూసిన, తెలిసిన, తోడుగా తిరిగిన మానవుల నుంచి ఎలాంటి మనశ్శాంతి దొరకనప్పుడు, చూడని, తెలియని దేవుడే మిన్న అని ప్రజలకు చెబుతూనే తన వారాల ఉపవాసం, రోజుకు రెండుసార్లు గుడికి వెళ్లడం మొదలైనవన్నీ చేస్తుండేది.

ఇలా ఉండగా ఒకరోజు జడ్చర్ల సమీపంలోని గ్రామంలో భగవంతుడి లక్షణాలున్న పిల్లల మౌనీ బాబాగారి విషయం మేఘనకు చేరింది. ఈ విషయం గురించి తెలుసుకున్న సహోద్యోగివొకరు ‘ఇతను పీడియాట్రిక్ బాబా’ అని, ‘చూడటంలో నష్టమేమీ లేదు’ అని చెప్పింది. “నీకు సంతృప్తి కలుగుతుందని అనుకుంటే నీ కూతురును మాట్లాడని ఆ మౌనీ బాబా దగ్గర ఒళ్లు తడిమించుకొని రా. మాట్లాడని బాబానే నీ కూతురికి మాటలు వచ్చేలా చేయవచ్చు.”

ఎందుకో బాబా మౌని అనే కారణంగానే మేఘన మనసుకు ఇది తాకింది. హైదరాబాదు నుంచి టాక్సీ చేసుకొని దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకోవటం జరిగింది. శనివారమైతే అనుకూలంగా ఉంటుందని అన్నీ ఏర్పాట్లను చేసుకున్నారు. బాబా సాయంత్రం వేళ ఆరు నుంచి ఏడు వరకు మాత్రమే దర్శనం ఇస్తుండటం వల్ల ఆ సమయానికి వెళ్లి, రాత్రికంతా హైదరాబాదుకు తిరిగి రావాలని కార్యక్రమాన్ని వేసుకున్నారు. బయలుదేరడానికి ముందు అన్నిటిని మరొకసారి నిర్ధారించుకొని హైదరాబాద్ నగరాన్ని వదిలారు.

సాయంత్రం వాళ్లు జడ్చర్ల చేరి, అక్కడి నుంచి గ్రామాన్ని చేరే సమయానికి గ్రామం కాస్త అల్లకల్లోలంగా మారుతుండటం గమనించారు. దర్శనానికి వచ్చిన జనాల, పిల్లల ఒక చిన్న సంత అక్కడ గుమిగూడివుంది. ఎండ వేడికి పిల్లలు ఏడుస్తున్నారు. ఆ గ్రామంలో ఎక్కడా బాబా కనిపించనేలేదు. బాబాగారి గదిలో ఉన్న వంటసామాన్లు అలాగే ఉన్నప్పటికీ, బాబాగారి బట్టలు, జోలే మాత్రం బాబాతో పాటు కనిపించకుండా పోయాయి.

ఆ గ్రామానికి వచ్చినంత ఆశ్చర్యజనకంగా బాబా కనిపించకుండా పోయాడు. బస్సు ఎక్కినట్టు వార్తలేదు. ఎవరూ బాబాను చూడలేదు. నేల నుంచి వేడిమి, పొగ గొట్టంలోంచి పొగ లేచిపోయినట్టు బాబా మాయమయ్యారు.

ఏమీ తోచక మేఘన గ్రామంలోని శివాలయానికి ప్రదక్షణ చేసి నమస్కారం పెట్టింది. కూతురి చేత దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయించింది.

లేచినపుడు బిడ్డ ‘మా’ అన్నట్టు అనిపించింది. మేఘన బిడ్డ వైపు చూసింది. బిడ్డ నవ్వుతోంది. “నువ్వు ‘మా’ అన్నావా? చెప్పు మరొకసారి చెప్పు” అని మేఘన అడిగినప్పుడు బిడ్డ తుంటరితనంతో నవ్విందే తప్ప ఏమీ చెప్పలేదు.

తన కూతురు మాట్లాడటం నిజమో, భ్రమనో అర్థం కాకుండానే మేఘన కారు ఎక్కింది. కొత్త టాక్సీ చప్పుడు చేయకుండా మౌనంగా దుమ్ము రేపుతూ జాతీయ రహదారి వైపు వేగంగా వెళ్లిపోయింది.

సూర్యాస్తమయాన్ని తదేకంగా చూస్తూ కూర్చున్న రెడ్డప్ప మాస్టారుకు కళ్లు మసకబారుతున్నట్టు అనిపించింది. గొంతు బిగుసుకుపోయి మాటలే రానట్టు మాస్టారు మౌనంగా కూర్చున్నారు. హైదరాబాద్ బస్సులో కూర్చున్న గోపాల్ యాదవ్‍కు ఉన్నట్టుండి ఈ మౌనీ బాబా ముఖం గుర్తొచ్చింది. ఎక్కడో చూసినట్టు ఉందని సంవత్సరంగా గింజుకుంటున్నవాడికి ఈరోజు ఒక జాడ దొరికినట్టుంది. అయితే అది నిజమో తెలుసుకోవటానికి ముందే బాబా అడ్రస్ లేకుండా పోయాడు.

నరేందర్ గౌడ్ నూటికి నూరు శాతం ఆధార్ వివరాల నమోదు కృషి గురించి నీలేకణికి ఉత్తరం రాయటానికి సిద్ధమయ్యాడు.

కన్నడ మూలం: ఎం.ఎస్. శ్రీరామ్

అనువాదం: రంగనాథ రామచంద్రరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here