అశ్విని

0
12

[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల రచించిన ‘అశ్విని’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ఆ[/dropcap]నంద రావు గారూ! మీరు పూర్తిగా కోలుకున్నారండీ! పిన్ని గారికి ఫోన్ చేసాను! డ్రైవర్‍ని పంపుతున్నారు. మీరు వేసుకోవలసిన మందులు, పిన్ని గారు పంపిన ఫ్లాస్కు, బట్టలు అన్నింటినీ సర్ది పెట్టాను. రండి! డ్రైవర్ వచ్చేవరకూ అలా సోఫాలో కూచోండి.” అని చెప్పి, ఆనందరావు గారిని మంచం మీదనుంచి లేపి ఆసరాగా నడుం చుట్టూ చేయి వేసి నడిపించుకుని తీసుకుని వెళ్ళింది అశ్విని.

హాస్పిటల్ అటెండర్ బేగ్‌ను తీసుకుని వచ్చాడు.

సోఫాలో కూచున్న ఆనంద రావు గారి కళ్ళు చెమ్మ గిల్లాయి. అశ్విని వైపు కృతజ్ఞతగా చూసారు.

ఆయన గొంతు కంపిస్తూ ఉండగా

“అమ్మా! అశ్వినీ, కన్న బిడ్డలా సేవ చేసావు తల్లీ” అన్నారు. ‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ అని అక్కడ రాసి ఉన్న మదర్‌ థెరిస్సా సూక్తిని చూసారు.

“అది నా బాధ్యత బాబాయి గారూ!”

“బాధ్యతలో ప్రేమను పంచిన నీ సేవా ధర్మానికి ఋణం తీర్చుకోలేనమ్మా!”

“కారు వచ్చేవరకూ, రెస్ట్ తీసుకోండి బాబాయిగారు. పిన్ని గారికి నా నమస్కారాలను అందజేయండి. అదిగో కారు వచ్చింది! మీ డ్రైవర్ వస్తున్నాడు..”

“అమ్మా! అశ్వినీ! నీకో మాట చెప్పాలి. నువ్వు సేవ చేసింది నాకు ఒక్కడికే కాదమ్మా! నువ్వు రెండు ప్రాణాలను బ్రతికించావు. నువ్వు పిన్ని అని పిలిచే నా శ్రీమతి, నేను బాగుండాలని, నా చేతుల మీదుగా తను పోవాలనీ నిత్యం అనేక పూజలూ, ప్రార్థనలనూ చేస్తుంది. నాకు ఏమైనా జరిగితే. తను ఏమై పోతుందో తెలియదమ్మా!”

“అవును బాబాయి గారూ! మీరు స్పృహ తప్పగానే పిన్ని గారు వెంటనే ఇక్కడకు పంపించడం వల్లనే తగిన చికిత్సను అందుకోగలిగారు. ఆమె సమయస్ఫూర్తి గొప్పది..”

“ఆరోగ్య సమస్యలతో ఆమె బయటకు కదలి రాలేదు. నీ గురించి విని నిన్ను చూడాలని తహతహలాడుతోంది. నీకు స్వయంగా వండి వడ్డించి. కన్నుల నిండుగా నిన్ను చూడాలని ఆశ పడుతోంది.”

“నాకు కూడా పిన్ని గారిని చూడాలని కోరికగా ఉంది. తప్పకుండా వస్తాను. వెళ్ళి రండి బాబాయి గారూ!” అంటూ సాగనంపింది. తోడుగా కారు వరకూ వచ్చి కూచో బెట్టింది.

అప్పటికే నర్సు అశ్విని కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి రోగుల మంచాలు.

ఆనంద రావు గారి ఇంటికి వెళ్ళిన అశ్విని అక్కడ రాజ్యలక్ష్మి గారిని చూడగానే వెంటనే గుర్తించింది. కాని ఎటువంటి భావమూ ప్రకటించలేదు. ఆవిడ ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. రక రకాల ప్రియ భోజనాలను వడ్డించింది. మంచి చీరను బహూకరించింది.

అశ్విని ఆమె తనను గుర్తించ లేదని అనుకుంది. అవును ఒకసారి మాత్రమే చూసింది. గుర్తించక పోవడం సహజమే.

“పిన్ని గారూ, కొన్ని రోజుల పాటు వీలు చూసుకుని వచ్చి మీకు మసాజ్ చేస్తాను. కొన్ని ఎక్సర్ సైజులు చేయిస్తాను. మీ నడక చాలా మటుకు మెరుగు పడవచ్చు.” అంది.

“అశ్వినీ!! నీ సేవా భావం చాలా గొప్పదమ్మా! తప్పకుండా రా! నిన్ను చూస్తుంటేనే సగం ఆరోగ్యం తిరిగి వచ్చినట్లుందమ్మా!” అంది రాజ్యలక్ష్మి.

ఆమె ప్రశంసలు అన్నీ హృదయం లోంచి వచ్చినవే.

***

ఆ రోజు..

వినయ విధేయలకు ప్రతిరూపంగా కనబడిన ఆ అమ్మాయిని రాజ్యలక్ష్మి ముచ్చటగా చూసింది.

నగరానికి దూరంగా ఉన్న హాస్పటల్‌లో ఉద్యోగ నిమిత్తం చేరడానికి వచ్చింది.

తనది అత్యవసర సమయాలకు హాజరు కావలసిన వృత్తి. హాస్పిటల్‌కు దగ్గరగా నివాసం ఏర్పరుచు కున్నప్పుడే అది వీలవుతుంది. హాస్పిటల్ వారు ఇంకా వసతిని ఏర్పాటు చేయలేదు.

అద్దెకు ఇవ్వబడును అన్న సూచనను చూసింది. లోనికి ప్రవేశించి పిలిచింది.

అశ్విని తాను ఉద్యోగ నిమిత్తం వచ్చాననీ నివాస వసతి కావలసిన ఆవసరాన్ని గురించి చెప్పింది. వారు సూచించినట్టు ఒక గది చాలు అని చెప్పింది.

“అవునమ్మా! అద్దెకు ఇస్తాము” జవాబు వచ్చింది.

“నేను ఒక్కతినే అండి. మా అమ్మా నాన్నలు పల్లెలో ఉంటారు. నేను స్థిరపడ్డాక వాళ్ళు రావచ్చు. అంతలో హాస్పిటల్ వాళ్ళు వసతిని ఏర్పాటు చేస్తారు. కొన్ని నెలల పాటు మాత్రమేనండీ.”

“హాస్పిటల్ అంటున్నావు, డాక్టరువా?” ఆ ప్రశ్నలో కొంత సందేహం తోచింది.

“నేను హాస్పిటల్ నర్సునండీ..”

“నర్సువా!” రాజ్యలక్ష్మి గారి ముఖ కవళికలు మారాయి.

చూసినప్పుడు వెంటనే కలిగిన ఆసక్తిని అంతా మటుమాయం అయింది.

“నాకు మడీ ఆచారాలు ఎక్కువ. నర్సు ఉద్యోగం అంటున్నావు! కుదరదు! వెళ్ళి రా అమ్మా!” అంటూ తలుపు మూసింది.

హతాశయురాలయింది అశ్విని. ఉండడానికి చోటు దొరకక ఒంటరిగా ఎక్కడ ఉండాలో తెలియక దిగులు పడింది. ఆ వీధి వరుసలో ఉన్న సంపన్న గృహస్థులు అందరూ నర్సు వృత్తి అని చెప్పగానే ముభావం చూపారు. మరి కొందరు చులకన చేసారు.

తిరిగి తిరిగి దూరంగా ఉన్న ఉద్యోగినుల హాస్టల్‌లో వసతిని పొందింది.. కష్టనష్టాలను లెక్క చేయక విధులను నిర్వహించింది. హాస్పిటల్‌లో ప్రశంసా పాత్రురాలయింది. ఆమె రాకతో నగరానికి సుదూరంగా ఉన్న హాస్పిటలు రోగుల పాలిట సంజీవనిగా మారింది.

***

అశ్విని ఆనాటి దృశ్యాన్ని మననం చేసుకుంది.

ఆవిడ ఇచ్చిన చీరను పెట్టెలో స్మృతి చిహ్నంగా దాచింది.

జగమంతా తమ కుటుంబంగా భావించిన వృత్తి పట్ల తొలి రోజే కలిగిన అనుభవం కొంత కలత కలిగించింది. తామెంతో శుచి శుభ్రతలను కలిగిన ఆరోగ్యవంతులం అని భావించిన వాళ్ళకు నర్సింగ్ పట్ల ఉన్న తేలిక భావాన్ని ఆమె గుర్తించింది.

సమయం చూసుకుని వచ్చి రాజ్యలక్ష్మి గారికి తగిన సేవా చికిత్సలను చేస్తోంది అశ్విని.

రాజ్యలక్ష్మికి అశ్విని తోడి అనుబంధం ఆత్మీయం అయింది.

ఆమె తన కాళ్ళకు మర్దనా చేస్తుంటే ఆమె మనసులో కన్న తల్లి ప్రేమ పెల్లుబికింది.

ఆమెకు మనసులో లీలగా మెలి పెడుతున్న జ్ఞాపకానికొక స్పష్టత కలిగింది.

పశ్చాత్తాపం కలిగింది.

కాని ఇన్ని రోజులూ పైకి వెల్లడించాలంటే సంకోచం కలిగింది

కాని ఆ రోజు ఉండబట్ట లేకపోయింది.

అశ్విని వేడి నీళ్ళళ్లో బట్టను తడిపి నడుముకు, కాళ్ళకు అద్దు తోంది.

రాజ్యలక్ష్మి కంపించే స్వరంతో, “అశ్వినీ నన్ను క్షమించమ్మా!” అంది.

అశ్విని తల ఎత్తి ఆమెను చూసింది.

ఆనాటి సంఘటన ఇద్దరి మనసులో మెదిలింది.

‘ఏరువలె నిరంతరమును బాఱుచుండు/ గాలివోలె నెల్లప్పుడు గదలుచుండు/ ధరణి రీతి రేల్బవలును దిరుగుచుండు/ క్షణము విశ్రాంతి నెఱుగడు గద భటుండు’ అన్నారు చిలకమర్తి. అలాగే నిత్యం రోగుల సేవలో తలమునకలవుతూ విశ్రాంతి, విరామం లేకుండా తమ విధులను నిర్వర్తించే నర్సులు ఆరోగ్య రక్షణా భటులు.

మానవతా ధర్మం రంగరించిన వృత్తిలో అశ్విని కరుణకు ప్రతిరూపమయింది. వారూవీరూ అనక చేసిన సేవకు కృతజ్ఞతల మెరుపులలో ఆమె అశ్వినీ దేవతగా అమృతమయిగా అవతరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here