[box type=’note’ fontsize=’16’] మనిషి జీవితం నిరంతరం ఒక అన్వేషణ. తనని తాను అన్వేషించటం, తన మూలాలను అన్వేషించటం, సుఖాన్ని అన్వేషించటం… ఈ అన్వేషణలో మనిషి తత్వాన్ని వివరించే చొప్పదండి సుధాకర్ కవిత ‘అతడే ఒక యోగం’. [/box]
అతడి కన్నా ముందే గదిలోకి ఒక వెలుగు ప్రవహిస్తుంది
అతడి రాకతో ఆత్మలో జ్యోతి ప్రజ్వరిల్లుతుంది
కాయాన్ని కాదు కాదు – కాలన్నే నిలవేసే సంకల్పం అతడిది
గాలితో ఆయువుని లీలగా ఆహ్వానించగల నేర్పు అతడిది.
ఓర్పు వీరుడు, తూర్పు శూరుడు, సంకల్ప శిఖరం, సమతా దీపం – !
మాటే మంత్రం, కదలికే కనికట్టు – ఇవ్వడం తప్ప
పుచ్చుకోవడం తెలియని ఇనకులుడు – !
స్వార్థం తప్ప ఏమీ లేని లోకంలో తానే ఓ కర్పూరహారతి!
పంచభూతాల్తో ప్రాణాన్ని మమేకం చేయగల మహామేధావి
సామాన్యంగా ఉంటాడు… అసామాన్యంగా సంభాషిస్తాడు
మాట్లాడితే తప్ప మనిషిని అంచనా వేయలేం
వచ్చే వాళ్ళు వస్తారు – పోయే వాళ్ళు పోతారు
అతడు మాత్రం ద్వీపస్తంభంలా దిక్సూచిలా నిలబడతాడు
ఉద్యోగం ఉపాధి కాదు – జీతం గిట్టుబాటు కాదు – !
అయినా ఎన్నడూ చిరునవ్వు చెరగదు
ప్రాణవాయువు కనిపించదు – అయినా ప్రాణం నిలబెడుతుంది
అతడూ అంతే – ! కనిపించినా కనిపించనట్టు
వినిపించినా వినిపించనట్టూ విశిష్టత ఏమీ లేనట్టు
గురుత్వాకర్షణ శక్తిలాగా గురుతుల్యుడై
సకల ప్రపంచానికి ఇరుసై భూగోళాన్ని తిప్పుతూ ఉంటాడు!
రేపటి వసంతం… మన నట్టింటి దీపం –
అతడొక అనంతం – !
చొప్పదండి సుధాకర్