అతనో రైతు మరి!

3
9

(శ్రీ దేబాశిష్ సమంతరాయ్ ఆంగ్లంలో రచించిన ‘ది బెట్’ అనే కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.)

[dropcap]అ[/dropcap]తను – నాలుగు కళ్ళకీ, రెండు కెమెరా లెన్సులకి ఫోకస్ అయి ఉన్నాడు.

అతను ఎప్పుడు చనిపోతాడు?

ఖచ్చితంగా చనిపోతాడు.

ఎందుకంటే అతనో రైతు మరి!

అయితే తాను అకాలంలో చనిపోతానని, అది కూడా ఏ రోగమూ లేకుండా అనీ, రైతుకి తెలియదు.

అతని మరణం మీద పందేలు కాస్తున్నారు, కేవలం ఇద్దరే కాదు, ఎందరెందరో. అతని చావు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఒకరిద్దరు కాదు, ఎందరెందరో. ఆ పందెం కూడా వందల మందిది కాదు, వేల లేదా లక్షల మందిది కూడా కాదు. కోటి మందిది. చావు నుంచి ఓ రైతు ఎలా తప్పించుకోగలడు? చచ్చిపోతాడు, ఇష్టపడి కాదు, వేలాది మంది కోరుకుంటున్నారు కాబట్టి, చావక తప్పదు!

పాచిపోయిన అన్నం తిన్నాడు, త్రేన్చాడు. భార్యతో కులాసాగా మాట్లాడాడు. తన పిల్లలు తనకన్నా మెరుగైన జీవితం గడుపుతారని, తన కన్నా ఉన్నత స్థితిలో ఉంటారని భావించాడు.

తన పరిమితులు, తన ఉనికి గురించి ఆలోచించలేకపోతున్నాడు. అదేమంత అవసరం కూడా కాదు. తాను తన జీవితాన్ని అత్యంత సరళంగా గడుపుతున్నానీ; భౌతికమైన సంపదలు, విలాసాలు ఉన్న జీవితాల కంటే చాలా మెరుగని అతనికి తెలియదు.

అతనికి చాలా విషయాలు తెలియవు, ఎందుకంటే అతనో రైతు మరి. ప్రపంచం ఏ గమ్యం వైపు దూసుకుపోతోందో అతనికి తెలియదు. అమాయకుడు, అందుకే సంతోషంగా ఉంటాడు.

అతనికి తెలిసింది ఒక్కటే, బాగా సంబంధం ఉన్నది ఒక్కటే – అదే అతని సాగుభూమి!

నేలతో ఎలా కలిసిపోవాలో అతనికి బాగా తెలుసు. ప్రేమమయమన స్పర్శతో ఆ నేలతల్లిని మెప్పించి, తన ఒడిలో పంటలు పండించి ఇచ్చే భూమాతగా మార్చుకోవడం తెలుసు.

ఆ రాత్రి అతని భార్య అతని అలసిన శరీరానికి నూనె పట్టించి మర్దనా చేస్తోంది. అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తోంది.

“ఈ నేలని నమ్ముకుంటూ ఎంత కాలం ఒళ్ళు గుల్ల చేసుకుంటారు?”

“మరింకేం చేయాలి?”

“మిగతా వాళ్ళలానే ఏదైనా కొట్టు తెరవండి. రోజూ ఇలా మట్టీ, నీళ్ళతో పని చేయాల్సిన అవసరం ఉండదు.”

“అందరూ వ్యాపారం చేస్తే, మరి వ్యవసాయం ఎవరు చేస్తారు?”

“ఛా. మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఆ పొలంలోనే పడి ఉండండి.”

అతను నవ్వుతాడు. అయితే ఆ నవ్వులో ఆత్మవిశ్వాసం లేదు. అతను తనకి వారసత్వంగా వచ్చిన ఆ ఆస్తిని ఎప్పుడూ నిర్లక్షం చేయలేదు. పైగా దానితో సంబంధం ఉన్నందుకు ఆనందం కలుగుతుంది అతనికి.

సూర్యోదయంతోనే నాగలి భుజాన వేసుకుని పొలానికి వెడతాడు. ఆ పొలానికి అతను మానసికంగా చేరువై ఉన్నాడు. విత్తనాలు మొలకెత్తి, పొలంలో పచ్చదనం పరుచుకుంటే అతనికి ఎంతో సంతోషం. తన సామర్థ్యం మీద విశ్వాసం పెరుగుతుంది.

అయితే, తన మీద తనకి ఎంత నమ్మకం ఉన్న రైతు చావు కోసం ఎందరెందరో  ప్రణాళికలు రూపొందిస్తారు, కుట్రలు చేస్తారు. కానీ రైతుకి ఇవేవి అర్థం కావు.

“మీకు తెలుసా, సంబాల్‌పూర్ దగ్గర ‘అతాబిరా’లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడట.” చెప్పింది అతని భార్య.

“అంత దూరపు ప్రాంతాల వార్తలు నీకెట్లా తెలుస్తున్నాయ్?” అడిగాడు.

“టివీ ద్వారా” చెప్పిందామె.

“ఇంకా ఏం తెలుసు నీకు?”

“ఈసారి ప్రభుత్వం ఇక మౌనంగా ఉండదని నేను అనుకుంటున్నాను. రైతుల అప్పులు ఖచ్చితంగా మాఫీ చేస్తారు” ఆమె ఓదార్పుగా చెప్పింది.

“అవునా? టివీలో అలా చెప్పారా?” రైతులో విశ్వాసం పెరిగింది. అతనికి ప్రభుత్వం పట్ల తిరుగులేని విశ్వాసం. ఈసారి ప్రభుత్వం తప్పకుండా కొన్ని గట్టి చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాడు.

గత రెండేళ్ళుగా అతను పూర్తిగా అలసిపోయాడు. మంచి పంట వస్తుందనే ఆశతో అప్పు చేస్తాడు, పంట చేతికొచ్చాకా అప్పు తీర్చవచ్చని ఆశించాడు. కానీ భవిష్యత్తు అస్పష్టం.

అయితే అతని భార్య అప్పు చేయవద్దని అంది. చేతిలో ఉన్నదాంతోనే వ్యవసాయం చేయమని చెప్పింది. “అప్పు చేసి ఉపయోగం ఏంటి? మళ్ళీ నష్టం వస్తే..” అంది.

నిజానికి గత రెండేళ్ళుగా అతనికి ఆదాయం అనేదే లేదు. గత ఏడాది అతివృష్టి వల్ల పంట పాడయిపోతే, అంతకు ముందు ఏడాది కరువు..

మరి ఆ రైతు ఏం చేయగలడు?

ఒకదాని తరువాత మరొకటిగా దురదృష్టాలు వెంటాడాయి. గత ఏడాది ఓ భూస్వామి వద్ద ఎక్కువ వడ్డీకి అప్పుచేశాడు. పంట చేతికి రాగానే, అసలూ, వడ్డీ రెండూ తిరిగి చెల్లించేస్తానని చెప్పాడు.

అయితే ఓ వ్యక్తి వరుసగా నష్టాలు పొందుతుంటే, అతను దాచుకున్న కొద్దిపాటి డబ్బూ వ్యయమైపోతుంటే అతని విశ్వాసం సడలిపోతుంది. ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది.

అతని పరిస్థితి అదే. విశ్వాసం సడలింది, బ్రతుకు చెదిరింది.

భూస్వామికి అప్పు ఎలా తిరిగి చెల్లించడం?

ఈ ఏడాది కాక పై ఏడాది తీసుకున్న అప్పునే ఇంకా తీర్చలేదు. గత ఏడాది ఎంతో దీనంగా భూస్వామిని వేడుకున్నాడు “అయ్యా! నా మీద నమ్మకం ఉంచండి. ఈ ఏడు పంట నాశనమైపోయింది. వచ్చే ఏడాది అసలుతో పాటు వడ్డీ కూడా ఒకేసారి కట్టేస్తాను. నా ఇల్లు మీ ఇంటి దగ్గరే, నేనెక్కడికి పారిపోతాను?”

అయినా భూస్వామికి నమ్మకం కలగలేదు. రైతు భార్య కూడా వేడుకొంది. “ఒకవేళ ప్రభుత్వం మా బ్యాంకు రుణాన్ని మాఫీ చేస్తే, మొత్తం మీ అప్పు తీర్చేస్తాం” అన్నాడు.

“అదేం కుదరదు. ఇప్పుడే తీర్చాలి. నువ్వు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావో నాకు అనవసరం” అన్నాడా భూస్వామి.

రైతు భార్య తన రెండు చేతులకి ఉన్న గాజులని తీసి భూస్వామి ముందు పెట్టింది. వాటిని తన పెళ్ళైనప్పటి నుండి ధరిస్తోంది. వాటిని తీసుకోమని భూస్వామిని ప్రార్థించింది.

ఎంత కష్టమొచ్చినా వాటిని ఇంతకు ముందెప్పుడూ తీయలేదు. ఇదే మొదటిసారి.

“అయ్యా, వీటిని తీస్కోండి.. మళ్ళీ ఏడాది పంట వచ్చే వరకు సమయం ఇవ్వండి” అంది.

“నొక్కితే వంగిపోతున్నాయి.. ఇవెంత బరువుంటాయ్?” అన్నాడు భూస్వామి. కానీ వెంటనే అతని స్వరం మారింది. “సరే కానీ, ఒకే ఊరి వాడివని, మనం అన్నదమ్ముళ్ళ వంటి వాళ్ళమనీ ఈ సారికి వదిలేస్తున్నాను. వచ్చే ఏడాది ఏం చెప్పినా వినను” అన్నాడు.

రైతు మీద భారం ఎక్కువ. పంట నష్టంతో పాటు, భూస్వామికి తీర్చాల్సిన అప్పు, పండగలు పబ్బాల సందర్భంగా బంధుమిత్రులకి ఇచ్చే కానుకల బరువు.. అతనికి ఆదాయం ఇచ్చే ఒకే వనరు ఆ పొలం మాత్రమే.

తన పొలం ఎన్నడూ తనని మోసం చేయదని రైతు నమ్ముతాడు. అప్పులు తీర్చేసి స్వేచ్ఛగా బ్రతకాలనీ, తన భార్య బంగారు గాజులని విడిపించాలని, తన పిల్లలు తన కంటే మెరుగ్గా వ్యవసాయం చేసి బాగా సంపాదించాలని లేదా ప్రభుత్వోద్యోగం చేసుకుంటూ మెరుగైన జీవితం గడపాలని కలలు కంటాడు.

ఆ రైతు వద్దకి ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి.

“చూడు, ఈ ప్రాంతంలో నువ్వో మంచి రైతువి. నీ పొలాన్ని ఈ జిల్లాలో ఒక ‘మోడల్ ఫీల్డ్’ గా చేస్తాం.”

“దాని వల్ల నాకేం ప్రయోజనం?”

“నీకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు వస్తాయి. ఆర్థికంగా కూడా లాభం ఉంటుంది.”

కానీ ఆ రైతు తిరస్కరించాడు.

ప్రభుత్వ వ్యవస్థల గురించి, వాటి నియమ నిబంధనల గురించి అతనికి బాగా తెలుసు.

గత రెండేళ్ళుగా అతను నష్టాలలోనే ఉన్నాడు. ఒక పూట కడుపు నింపుకోడానికే నానా తిప్పలు పడుతున్నాడు. ప్రభుత్వం ఏం చేయగలదు? కొన్ని సానుకూల చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా, ప్రభుత్వం ఓ మనిషి కన్నా నిస్సహాయంగా ఉంటోంది.

అతని వద్దకి ఓ అధికారి వచ్చాడు.

“ఏం కావాలి సార్?” అడిగాడు రైతు.

“మీ పంటకి బీమా చేయించండి. పంటకి భరోసా ఉంటుంది. వరద వచ్చి నష్టమొచ్చినా, మేం పరిహారం ఇస్తాం. లేదా వర్షాలు లేక నేల బీటలువారినా మేం పరిహారం ఇస్తాం.”

రైతుకి అర్థం కాలేదు.

‘వీళ్ళకి నా మీద ఎందుకింత దయ?’

‘ప్రభుత్వం సామాన్యుడి గురించి ఎప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టింది?’

అయితే రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రకటించబడ్డాయి.

కానీ రైతు చావు కోసం ఎన్నో కుట్రలు మొదలయ్యాయి.

అతని చావుకి ముహుర్తం కూడా నిర్ణయించారు.

అతని అన్ని వివరాలు, అతని చుట్టుపక్కల స్థితిగతులు అన్నీ – అధికారంలో ఉన్నవారికి – ఎసి గదుల్లో ఉన్నవారికి క్షుణ్ణంగా తెలుసు. అన్నీ నిర్ణయించేది వారే. “ఈ రైతు త్వరలో చనిపోతాడు.”

ఈ సమాచారం అందుకున్న చాలామంది సంతోషించారు. “ఖచ్చితంగా చస్తాడు! ఈసారి! మన సంతోషపు రోజులు వచ్చేస్తున్నాయి.”

కౌంట్ డౌన్ మొదలయింది. ఇక ఏడు రోజులు.. ఆరు.. అయిదు.. నాలుగు.. మూడు.. రెండు… ఒకటి.

నేడే ఆ సుముహూర్తం!

అయితే తన చావు మరికొందరికి ప్రయోజనకరమని రైతుకి ఎలా తెలుస్తుంది?

అతని అన్ని చర్యలను వారు గమనిస్తుంటారు. అతడు దారి మళ్ళకుండా చూస్తారు. ప్రణాళికలో చిన్న లోపం కూడా ఉండదు. ప్రతీది చాలా జాగ్రత్తగా అమలవుతుంది: అతను పొలానికి ఎప్పుడు వెళ్తున్నాడు, ఎప్పుడు తిరిగి వస్తున్నాడు, వస్తున్నప్పుడు అతని ముఖంలో భావాలేంటి; అది దిగులుగా ఉందా లేదా. పొలానికి వెళ్తున్నప్పుడు అతని వదనంలో ఆశ గోచరిస్తోందా అని కూడా చూస్తారు; వచ్చేడప్పుడు ఆ ఆశ సందేహంగా మారిందా లేక పూర్తిగా నశించిందా అని చూస్తారు. అతను తోటి గ్రామస్థులతో ఎలా కలుస్తున్నాడు, అంతకు ముందులానే ఉత్సాహంగా ఉంటున్నాడా, తన కష్టాలు సుఖాలు ఇతరులతో పంచుకుంటున్నాడా లేక ఆలోచనల్లో మునిగి ఒంటరిగా ఇంటి ముందు కూర్చుంటున్నాడా? ఎండిన ఆకాశం నుంచి ఏ పరిష్కారం కనిపించక క్రుంగిపోయి ఉన్నాడా?

అవును, అతని కోసం ఎన్నో వ్యూహాలు. వీటిని విజయవంతంగా అమలు చేయడానికి మరికొన్ని ప్రణాళికలు.

దృష్టంతా రైతు పైనే. అయితే అది అతని బ్రతుకాశపై కాదు, చావుకు దగ్గరవుతున్నాడన్న అంచనాపై.

ఆ నాలుగు కళ్లు ఆ రైతునే గమనిస్తున్నాయి. అతని మానసిక క్రుంగుబాటు రోజు రోజుకీ ఎలా తీవ్రమవుతోందో; అది అతని చావుకి రాజధాని నగరంలో తాము రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా ఉందా లేదా; లేదా తమ పథకంలో ఏవైనా మార్పులు అవసరమా?

అయితే రైతు గురించి నికార్సయిన సమాచారం కావాలంటే అతని కుటుంబంతో సన్నిహితంగా ఉండాలి. పరిస్థితులను బేరీజు వేయడంలో అతని సామర్థ్యాన్ని గణించాలి. అతన్ని ఛిద్రం చేయగల కారణాన్ని గుర్తించాలి. ఈ వివరాలన్నీ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న – రైతు భవిష్యత్తుని నిర్ణయించే – ఆఫీసుకు పంపాలి.

అయితే పాపం, తనకి అంతగా నప్పని ఆధునిక సమాజంలో జీవించాలంటే నెగ్గుకురావాలన్న విషయం తెలియదు ఆ రైతుకి. ఈ వ్యూహాంలో చిక్కుకుపోయాడు. అతనికి తెలిసినదల్లా నాగలి, తన పొలం – అంతే. తన రెండు చేతులను నమ్ముకుంటాడు. అతను విధిపై కాక, తన శ్రమపై గురి. అతను కష్టపడి సంపాదించిన డబ్బుతో జీవిస్తాడు, సులువుగా వచ్చిన ధనంతో కాదు. అందుకే అతను రైతు.

బహుశా కొంతమంది అతని చావు కోసం ఎదురుచూస్తూ ఉండచ్చు. అమాయకుడు, నిరాడంబరుడు అయిన అతనిపై కుట్రలు పన్నడం తేలిక.

రైతుల మరణాలపై టివీల్లోనూ, పత్రికల్లోనూ ఎన్నో వార్తలు వచ్చాయి. చానళ్ల టిఆర్‍పి రేటింగుల కోసం వాస్తవాలను మరుగునపరిచి – కట్టుకథలను అందంగా చూపించారు. మీడియాలో అతి తీవ్రమైన పోటీ ఉంది. రైతు చావు వార్తని ఏ చానల్ ముందు ప్రసారం చేస్తుంది? ఎవరి పరిశీలన, సహానుభూతి –  పదునుగా ఉంది? ఎవరి పరిధి ఎంత విస్తృతం? ప్రభుత్వాన్ని ఎవరు కుదపగలరు? ఈ ఘటనని ఎవరు ప్రభావవంతంగా వెల్లడించగలరు? తాము సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ఎవరు జనాలని నమ్మించగలరు?

ఎన్నో వ్యూహాలు. గందరగోళం. టిఆర్‍పి కోసం చర్చోపచర్చలు.

ఓ మారుమూల పల్లెలో ఓ రైతు చనిపోతే ఈ ఛానెల్ ఆ సమాచారాన్ని, అంత త్వరగా ఎలా పట్టుకోగలిదిందా అని మిగతా ఛానెళ్ళ మధ్య బెంగ. చనిపోయిన ఆ రైతు ఫొటో, వివరాలు – అతి త్వరగా – రాష్ట్రమంతటా తెలిసేట్టు ఎలా చేయగలిగిందా చానెల్?

ఏం చేయాలి? ఎవరికీ మార్గం కనిపించడం లేదు. తమ రిపోర్టర్లందరికీ సీనియర్ అధికారులు గట్టి హెచ్చరికలు చేశారు; రైతు ఆత్మహత్య గురించి అందరి కంటే ముందుగా మీరు సమాచారం సేకరించకపోతే, ఆ వార్త అందరికంటే ముందుగా మన చానెల్‍లో ప్రసారం కాకపోతే మీ ఉద్యోగాలు ఊడతాయి అని.

పాపం, కింది స్థాయి ఉద్యోగులు ఏం చేయగలరు?

ఉద్యోగపు ఆటల్లో గెలవాలన్నా, టిఆర్‌పి సాధించాలన్నా, రైతు చావు విషయంలో అనుకున్నది అనుకున్నట్టు జరగాలన్నా – ఈ యుద్ధంలో కొత్త ఎత్తుగడలు పన్నాలి.

కాటకంతో ప్రభావితమైన ప్రాంతాలు గుర్తించబడ్డాయి.

అలాగే అప్పుల్లో ఉన్న రైతులను గుర్తించారు.

జీవితం పైన ఆశ నశించిన రైతుని, బీడుబారిన అతని పొలం పట్ల నిరాశగా ఉన్న రైతుని, కుటుంబతో సహా పస్తులుంటున్న రైతుని గుర్తించారు.

నేల నుండి బంగారం పండించడం తెలిసిన రైతు ఓడిపోయాడు. తన కష్టంతో ఎందరికో అన్నం పెట్టే రైతుకి నేడు తినడానికి తిండి కరువయింది. దీనికి తోడు అప్పుల బాధ! పండిన పంటకి సరైన ధర రాకపోవడం! పాపం, నిస్సహాయుడైన రైతు క్రుంగిపోయాడు.

ఆ నాలుగు కళ్ళు – నిరంతరం – తమ చానెల్‌తో సంప్రదిస్తున్నాయి.

అప్పటికే ఒప్పందం కుదిరిపోయింది. ‘ఓ రైతుని గుర్తించండి. అతని గురించి రోజూ రిపోర్ట్ ఇవ్వండి. అతను చనిపోయిన క్షణాల్లోనే మనం మన చానెల్‍లో ఫొటోలతో సహా వార్త ప్రసారం చేయాలి. మీకు తగిన పారితోషికం అందుతుంది. అంత మొత్తాన్ని మీరు జీవితంలో ఎప్పుడూ ఊహించి ఉండరు. అవసరమైతే ఇంకా ఎక్కువే ఇస్తాం.’

రైతుని గుర్తించడం జరిగింది. అన్నీ లెక్కలు కట్టడమూ జరిగిపోయింది. ఇంక కొద్ది రోజులే మిగిలింది. సుముహుర్తం కోసం ఎదురుచూపు.

రైతు ఇంట్లోంచి గలాభా వినబడుతోంది. రైతు భార్య తలని నేలకి కొట్టుకుంటూ గట్టిగా ఏడుస్తోంది. ఆరోజు సాయంత్రం రైతు ఇంటికి ఎవరో వచ్చారు. బహుశా భూస్వామి అని ఆ నాలుగు కళ్ళు ఊహించాయి.

భూస్వామి ఏమంటున్నాడో వినడానికి ఆ నాలుగు కళ్ళు ప్రయత్నించాయి. భూస్వామి తిడుతున్న తిట్లని వారు జీర్ణించుకోలేకపోతున్నారా? అదే నిజమైతే పరిస్థితి తమకి అనుకూలం అని అనుకున్నారు. “నా అసలూ, చక్రవడ్డీ కలిపి నెల రోజుల్లో ఇవ్వకపోతే నీ పొలం, ఇల్లూ స్వాధీనం చేసుకుంటాను” అని హెచ్చరించి వెళ్ళిపోయాడు.

నాలుగు కళ్ళు సంతోషంతో పొంగిపోయాయి. ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమవుతోంది. తదుపరి చర్యలను జాగ్రత్తగా తీసుకున్నాయా కళ్ళు. ఈ వార్తని చానెల్‍కి చేరవేశాయి. మర్నాడు ఉదయం రైతు సైకిల్ పై బయల్దేరాడు. ఎక్కడికి? ఆ నాలుగు కళ్లు అతన్ని అనుసరించాయి. రైతు దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి ఓ పురుగుల మందు కొట్టు వద్ద ఆగి ఏవో కొన్ని పొట్లాలు కొన్నాడు. వెంటనే ఈ వార్త చానల్‍కి చేరిపోయింది. “సార్. మనం అనుకుంటున్నది రేపే జరిగేలా ఉంది. మీరు సిద్ధమా?” అని అడిగాయా కళ్లు. వాటికి ఇలాంటి అవకాశం ఇంతకు ముందెన్నడూ దొరకలేదు. రైతు వలలో పడ్డాడు.

సాయంత్రమైంది. ముసురు కమ్మింది. వర్షం పడేలా ఉంది. ఆ నాలుగు కళ్ళకి భయం వేసింది, ఎక్కడ తమ ప్రణాళికలన్నీ వృథా అవుతాయో అని.

ఆకాశం వంధ్యలా ఉంది.. మబ్బులు కమ్మినా, వాన కురవడం లేదు.

రైతు కూడా భయపడ్డాడు, ఎక్కడ తన ప్రణాళికలన్నీ వృథా అవుతాయో అని.

ప్రతీవారూ తమ తమ లెక్కలలో మునిగి ఉన్నారు – రైతు, నాలుగు కళ్లు, ప్రతిపక్షం, ఇంకా చానెళ్ళు.

తెల్లారింది. రోజూ లానే రైతు పొలానికి బయలుదేరాడు. బీటలు వారిన నేల నుండి రైతు ఏం ఆశిస్తాడు? అతని చేతిలో ఒక సంచీ ఉంది. ఆ సంచీతో ఎక్కడికి? అందులో పురుగుల మందు ఉన్నట్టుంది. రైతు గుర్తించలేని విధంగా కాస్త దూరం నుంచి రెండు కెమెరాలు రహస్యంగా తమ పని చేసుకుంటున్నాయి – హఠాత్తుగా ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని చిత్రీకరించాలని! ఆ నాలుగు కళ్లు రైతుపై నిఘా వేసి ఉంచాయి.

రైతు తన సంచీని కిందపెట్టాడు. పొలంలోంచి కాస్త మట్టిని చేతిలోకి తీసుకున్నాడు. దున్నిన పొలాన్ని కళ్లారా చూసుకున్నాడు, సంచిలోంచి పొట్లం బయటకి తీశాడు. ఈ రకంగా సుముహుర్తం సమీపించింది.

ఆశ్చర్యం! ఆ రైతు పురుగుల మందు తాగలేదు. పురుగుల మందుతో బాటు రైతు సంచీ లోంచి కొన్ని మొలకలను బయటకు తీశాడు. ఎంతో శ్రద్ధగా వాటిని నాటసాగాడు. తను అనుభవిస్తున్న దౌర్భాగ్యాన్ని తన తర్వాతి తరం ఎదుర్కోకూడదని అతని ఉద్దేశం. నాట్లు వేస్తే వర్షం అదే కురుస్తుందని అతని గొప్ప నమ్మకం.

ఎందుకంత విశ్వాసం? అతనో రైతు మరి!

~

ఆంగ్ల మూలం: దేబాశిష్ సమంతరాయ్

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here