అతనొక్కడే!

1
11

[గంధం నాగేశ్వరరావు గారు రాసిన ‘అతనొక్కడే!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కొ[/dropcap]త్తగా ఉద్యోగంలో చేరిన రిక్రూట్‍లని స్టోర్ రూమ్ దగ్గరకు తీసుకొచ్చాడు ఇన్‌స్ట్రక్టర్. యూనిఫాంలోని స్టోర్ కీపర్‌కి సెల్యూట్ చేసి ఆర్డర్ కాపీ అందించాడు. స్టోర్ కీపర్‌కి కుడికన్ను లేదు. అతను ఆర్డర్ కాపీలోని వరుసగా ఉన్న పేర్లు చదువుతూ ట్రైనింగ్‍కి అవసరమైన స్టోర్ ఆర్టికల్స్ ఇవ్వసాగేడు. అందరూ ఆర్టికల్స్ తీసుకుని కిట్‌బ్యాగుల్లో సర్దుకున్నారు. చివరగా స్టోర్ కీపర్‌కి సెల్యూట్ చేసి రిక్రూట్‍లతో బయలుదేరాడు ఇన్‌స్ట్రక్టర్.

“ఆ ఒంటి కన్ను మనిషి ఎవరు సార్? కన్నులేని అతను కానిస్టేబుల్ ఎలా అయ్యాడు?” దారిలో ఇన్‌స్ట్రక్టర్‌ని ఓ రిక్రూట్ అడిగేడు

అతనివైపు నవ్వుతూ చూసాడు ఇన్‌స్ట్రక్టర్.

***

“నాకు చిన్న సాయం చెయ్యాలి” అన్నాడతను.

“ఏం సాయం?” అడిగాడు రెండో అతను.

“నా ఏటిఎమ్ కార్డు ఇస్తాను. నా కూతురికి ఇచ్చి ఫీజ్ కట్టేయని చెప్పాలి. డ్యూటికి వచ్చేటప్పుడు మర్చిపోయి నాతో తెచ్చేసాను.”

“అలాగే” అంగీకరించాడు రెండో అతను.

నాలుగు కర్రలు పాతి నీడకోసం చెట్టు కొమ్మలు పరచిన పందిరి కింద కల్లు సరఫరా చేసే మనిషికి కాస్త ఎడంగా కూర్చున్న వాళ్ళ మధ్య ఆ సంభాషణ జరుగుతోంది. ఆ కల్లు దుకాణం గెడ్డపల్లి అనే ఏజెన్సీ గ్రామంలోని పోలీసు క్యాంపుకి కిలోమీటరు దూరంలో రోడ్డు పక్క ఉంది. నిజానికి గెడ్డపల్లి అంటే ముప్పై కుటుంబాలు నివసించే కోయ గ్రామం. ఆ ప్రాంతంలో ఒక వెదురు లారీ తగలబడడంతో జాగ్రత్త కోసం పోలీసు క్యాంపు ఏర్పాటయింది.

అక్కడ దొరికే జీలుగ కల్లు కోసం క్యాంపు నుంచి పోలీసులు వచ్చి వెళుతుంటారు. విప్పసారా కూడా అక్కడ లభ్యమని కొంతమందికి తెలుసు. అందుచేత సాయంకాలం ఆరు నుండి రాత్రి ఎనిమిది వరకు అక్కడ జనం కనిపిస్తాం.

“ఉదయం ఎన్ని గంటలకి బయలుదేరుతారు?” అడిగాడు రెండోవ్యక్తి.

“ఆరు గంటలకి రెడీగా ఉండమన్నారు” చెప్పాడు మొదటి మనిషి.

ఆ తరువాత వాళ్ళిద్దరూ అక్కడ తమ పని ముగించుకుని మాట్లాడుకుంటూ క్యాంపుకి వెళ్ళి పోయారు. అంతవరక వారిని నీడలా అంటిపెట్టుకున్న వ్యక్తి కాస్త ముందుకెళ్ళి మరో దారిలో గ్రామంవైపు నడిచాడు.

***

అసహనంగా కదిలేడతడు.

పోలీసు క్యాంపుకి నాలుగు కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవిలో పదిమంది సభ్యులతో ఉన్నాడతను. ఆ రోజు ఓ ముఖ్యమైన సమాచారం చిక్కుతుందని తెలిసి తన దళంతో వచ్చాడు. ఆ దళంలో రెండు ఆటోమేటిక్ ఆయుధాలు, మూడు మజిల్ లోడ్ తుపాకులు ఉన్నాయి. నాటు ఆయుధాలు ఉన్నా వాటి ఉపయోగం అంతంత మాత్రమే. దళం శక్తివంతం కావాలంటే ఆయుధ బలం పెరగాలి. ఆ ఉద్దేశంతోనే దళాన్ని తీసుకుని సాయంకాలమే అక్కడకి చేరుకోన్నాడతను. రాత్రయినా ఎలాంటి సమాచారం అందలేదు.

అందుకే అతను అసహనంగా కదిలేడు.

ఆలోచనల తీవ్రతకి ఆకలి కూడా తెలియడం లేదు. ఇద్దరు సభ్యులు రెండు వైపులా కాపలా కాస్తుంటే మిగతారు విశ్రాంతి తీసుకుంటున్నారు. గ్రామం నుండి ముగ్గురు రావడంతో అంతా ఎలర్ట్ అయ్యారు. ఒకతను దళ సభ్యులకు భోజనం పెడుతుంటే, మరో వ్యక్తి దళనాయకుడ్ని సమీపించి లోగొంతుతో చెప్పాడు.

“అన్నా! రేపు ప్రొద్దున్న క్యాంపు నుంచి వ్యాను బయలుదేరి కొయ్యలగూడెం మీదుగా హెడ్ క్వార్టరికి వెళుతోంది. డ్రైవర్‌తో కలసి వ్యానులో అయిదుగురు ఉంటారు.”

చీకటల్లో కనిపించలేదు కాని ఆ సమాచారం కోసమే ఎదురుచూస్తున్న అతని ముఖం వెలిగింది. ఈ మధ్య కొన్ని నెలల కాలంలో ఏ కార్యక్రమం చేపట్టకపోవడంతో తమ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఈ అవకాశం సద్వినియోగం చేసువాలి. దళనాయకుడు కూడా భోజనం చేసాక గ్రామస్థులు వెళ్ళిపోయారు. తరువాత ఏం చెయ్యలో నిర్ణయించి సభ్యులకు అదేశాలు ఇచ్చాడతను. కొంతసేపు విశ్రాంతి తరువాత మొత్తం సభ్యులు అక్కడ నుంచి బయలుదేరారు.

అడవి దారులు తెలిసినవే కాబట్టి చీకటల్లో కూడా చురుగ్గా నడుస్తున్నారు. నడక వల్ల శరీరానికి చెమటలు పట్టి చలి తెలియడం లేదు. తెల్లవారుజామున కొండ పక్క నుంచి కాస్త ముందుకెళ్ళి ఒక చోట ఆగారు. వంద గజాల దూరంలో మెలితిరిగిన తారు రోడ్డు కొండచిలువలా ఉంది.

అతని సూచనలు అందుకుని ఇద్దరు సభ్యులు బ్యాగులు తగిలించుకుని రోడ్డు వైపు నడిచారు. అప్పటికి చీకటి పల్చబడి పొగమంచు తెల్లగా కనిపిస్తోంది. వాళ్ళు రోడ్డు చేరుకుని చుట్టూ పరిశీలనగా చూసారు. అటు ఎవరూ తిరగరని, ఎలాంటి వాహనం రాదని తెలిసినా జాగ్రత్తపడడం వారికి అలవాటై పోయింది. చిన్నపాటి గునపంతో రోడ్డు మధ్య అడుగులోతు, అడుగున్నర వెడల్పు గొయ్యి తవ్వారు. గొయ్యి లోపల పేలుడు పదార్థం ఉంచి దానిక రెండు వైర్లు కలిపారు. గొయ్యి పక్క నుంచి చిన్న గాడి తవ్వి వైరు అందులో పెట్టి తిరిగి పూడ్చేసారు. రెండో చివర వైరు పట్టుకుని తుప్పల వెనక్కి వెళ్ళారు. మందుపాతర పేల్చడానికి అవసరమైన ఇన్‌స్ట్రుమెంట్‌కి  వైర్లు కనెక్ట్ చేసి బ్యాటరీలు అమర్చారు.

అదంతా ఓసారి పరిశీలించి తృప్తి చెందాడు నాయకుడు. చాలా రోజుల నుంచి నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం తెల్లారేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. తమ దళానికి ఆయుధ బలం పెరుగుతుంది. తిరుగులేని నాయకునిగా తను రూపుదిద్దుకుంటాడు. సభ్యులతోపాటు తుప్పల వెనుక కూర్చున్న అతని బుర్రలో ఆలోచనలు కదులుతున్నాయి. సూర్యుని తొలికిరణాలు అడవి మీద ప్రసరించాయి.

***

ఎప్పటిలా తెల్లవారు జామున నిద్రలేచాడు సాంబయ్య,

బీడీ ముట్టించి బేరక్ బయటకు చూసాడు. రాత్రి కురిసిన మంచుకి పరిసరాలు తడితడిగా ఉన్నాయి. బీడీ కాల్చడం పూర్తయ్యాక బయటకొచ్చి గెడ్డవైపు నడిచాడు. ఎత్తు మీదున్న గెడ్డపల్లి గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే గెడ్డ అది. సాంబయ్య కాలకృత్యాలు ముగించుకుని గెడ్డలో మునిగాడు. అక్కడ వీచే చలిగాలికి చాలామంది సూర్యుడు తలమీదకొచ్చేవరకు స్నానం చెయ్యరు. కాని సాంబయ్య వారందరికంటే భిన్నమైన మనిషి.

బేరక్ చేరుకుని ఎప్పుడో ముప్ఫై రెండేళ్ళ క్రితం ఉద్యోగంలో చేరిన కొత్తలో కొన్న ఆంజనేయస్వామి ఫోటోకి దణ్ణం పెట్టి నుదుట సిందూరం దిద్దుకున్నాడు. మెస్ నుంచి మగ్గుతో టీ తెచ్చుకుని క్యాంపులోని చెట్టు క్రింద కూర్చుని తాగసాగేడు. అది పాపికొండల సమీపంలోని దట్టమైన ఏజెన్సీ ప్రాంతం కావడంతో వాతావరణం చల్లగా, నిశ్శబ్దంగా ఉంది. క్యాంపులోని జవాన్లు ఒక్కొక్కరు లేచి తమ పనులు చేసుకుంటున్నారు. మెయిన్ సెంట్రీ ఎవరితోనో టీ తెప్పించుకొని తాగుతున్నాడు.

అక్కడ పేదా గొప్పా తేడాల్లేవు. అంతా కలిసి పెరేడ్ చేసినట్టే కలిసి భోజనం చేస్తారు.

సాంబయ్య టీ తాగేక బీడీ ముట్టించాడు. అతని మనస్సు ఉత్సాహంతో ఉరకలేస్తోంది. స్టోర్ ఆర్టికల్స్ తీసుకురావడానికి హెడ్ క్వార్టర్‌కి ఆ రోజు వ్యాన్ బయలుదేరుతోంది. దానికి ఎస్కార్టుగా నలుగురు జవాన్లు వెళు తున్నారు. వారిలో సాంబయ్య ఒకడు.

అతని మనసంతా మనవరాలిని చూడాలనే కోరికతో నిండిపోయింది. రెండు నెలల క్రితం డ్యూటీకి వస్తున్నప్పుడు మనవరాలు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. కొడుక్కి కూతురు పుట్టడం, ఆ పిల్లకి సాంబయ్య తల్లి పేరు పెట్టడం రెండేళ్ళ క్రితం జరిగింది. తాతని ఒక్క క్షణం కూడా వదలదా పిల్ల. మీసాలు లేని తాత ముఖం పరికించి చూస్తుంది. గరుకు తేలిన గెడ్డం మీద ముద్దు పెట్టి తన ప్రేమని ప్రకటిస్తుంది.

కొడుక్కి ఉద్యోగం లేకపోవడం సాంబయ్య ప్రధాన సమస్య. శ్రీకాకుళం జిల్లా మారుమూల గ్రామంలో పుట్టాడు సాంబయ్య. ముప్ఫైమూడేళ్ళ క్రితం స్పెషల్ పోలీసులో జవానుగా చేరాడు. ఆ ఉద్యోగం అంటే అతనికి ప్రాణం. తన కొడుకుని కూడా స్పెషల్ పోలీసులో చేర్చాలనేది అతని కోరిక. కాని కొడుకు తల్లి పోలిక కావడంతో ఎత్తు తక్కువ. అందుచేత కానిస్టేబుల్‌గా సెలెక్ట్ కాలేదు. ఎత్తులో మినహాయింపు కోసం ప్రయత్నిస్తున్నాడు సాంబయ్య. ఇప్పుడు హెడ్ క్వార్టర్‌కి వెళ్ళాక అదే పని మీద కమాండెంట్‍ని కలవాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే సెలక్షన్ నాటికి పర్మిషన్ తీసుకోవాలనేది అతని ఆలోచన.

ఆరిపోయిన బీడి ముట్టించి రెండు దమ్ములు లాగి దాన్ని అవతలికి విసిరేసి బేరక్‍ లోకి నడిచాడు. యూనిఫాం వేసుకుని బ్యాగ్ సర్దుకున్నాడు. మెస్‌లో చపాతీలు తిని, రైఫిల్‌తో పాటు తూటాలు తీసుకున్నాడు. గుడ్డతో రైఫిల్‌ని శుభ్రంగా తుడిచి, తూటాల్ని బండిల్‌లో సర్ది బెల్ట్ పైన కట్టుకున్నాడు. మరికొద్ది నిమిషాల్లో ఎస్కార్టు పార్టీని తీసుకుని క్యాంపు నుంచి వ్యాను బయలుదేరింది.

ఇరువైపులా దట్టంగా పరుచుకున్న అడవిలో మెలితిరిగి వెళుతోంది తారురోడ్డు. చల్లని గాలి వ్యానులోకి విసురుగా వస్తోంది. చెట్లతో నిండిన కొండలు, లోయలు వెనక్కి జరుగుతున్నాయి. వాహనాలు తిరగని మార్గమైనా వ్యాను నెమ్మదిగా వెళుతోంది. ఎన్నో కొండలు, లోయల మధ్య వేసిన సింగిల్ రోడ్డు కావడం వల్ల మలుపులు అధికంగా ఉన్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. ఘాటు రోడ్డు మలుపులో స్పీడ్ బాగా తగ్గించాడు డ్రైవరు.

హఠాత్తుగా పెద్ద పేలుడు.

నాలుగైదు అడుగులు ఎత్తుపైకి లేచి కింద పడింది వ్యాను. ఆ అకస్మిక సంఘటనకి లోపల ఉన్న వాళ్ళకి మతి పోయింది. ముందుగా డ్రైవరు డోరు తెరుచుకుని కిందికి దూకి చెట్లలో అదృశ్యయ్యాడు. వ్యానుకి తూటాలు తగిలిన శబ్దం వస్తోంది. ఎస్కార్టు వాళ్ళకి ఆలోచించుకునే సమయం లేకపోయింది. ఒక్కొక్కరు దూకేసి చెట్లలోకి పారిపోయారు. తల సీటుని తాకడంతో కళ్ళ ముందు నక్షత్రాలు కదిలాయి సాంబయ్యకి. అతను తేరుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది. తుపాకులు పేలుతున్న శబ్దం వినపడుతోంది. వ్యానులో అడ్డదిడ్డంగా పడున్నాయి రైఫిల్స్‌. కన్నుమూసి తెరిచేంతలో మృత్యువు సమీపంగా వచ్చి వెళ్ళింది.

తన రైఫిల్ అందుకుని తూటాలు లోడు చేసాడు సాంబయ్య. పాకుతూ వ్యాను వెనుక డోరు దగ్గరకు వచ్చాడు. రైఫిల్‍ని కుడిచేత్తో బేలన్స్ ఆఫ్ పాయింట్ దగ్గర పట్టుకుని ఎడమ చెయ్యి కింద ఆనించి శరీరాన్ని కొద్దిగా పైకి లేపాడు. ఒక్కొక్క తూటా ఆగి ఆగి వ్యాను మీదకి దూసుకొస్తోంది. రోడ్డు పక్క దట్టంగా విస్తరించిన తుప్పలవైపు ఓసారి చూసి ఊపిరి బిగపట్టి మెరుపులా కిందికి దూకాడు.

వెనువెంటనే తుప్పల్లోకి జంప్ చేసి పాదరసంలా ఓ రాయి వెనక్కి జరిగాడు. అప్పుడు వదిలాడు బిగపట్టిన ఊపిరి. ఆయాసంతో గుండెలు ఎగసిపడుతున్నాయి. కొన్ని క్షణాల తరువాత రాయి వెనుక నుంచి తలెత్తి తూటాలు వస్తున్న దిక్కు చూసాడు. దట్టమైన పొదల వెనుక శత్రువు ఉన్నాడని గ్రహించాడు.

ఒకవైపు నుంచే దాడి జరుగుతోంది కాబట్టి శత్రువుల సంఖ్య పరిమితిని ఊహించాడు సాంబయ్య. కొండ మలుపు అంతమయ్యే చోట మందుపాతర పెట్టి వ్యాను వేగం తగ్గినపుడు పేల్చాడు శత్రువు. అదే మందు పాతర వ్యాను మధ్యలో పేలి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అంటే తమని చంపడం శత్రువు ఉద్దేశం కాదు. తమని భయపెట్టి ఆయుధాలు పట్టుకెళ్ళాలని అనుకుని ఉంటాడు. అందుకే వ్యానులో ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళు కూడా పారిపోవడం కోసమే శత్రువు ఆగి ఆగి తూటాలు పేలుస్తున్నాడు.

సాంబయ్య చిన్నగా నవ్వుకొని జేబులోంచి బీడికట్ట, అగ్గిపెట్టి బయటకు తీసి ఒక బీడీ ముట్టించుకున్నాడు. శత్రువు ఆలోచన అర్థమయింది కాబట్టి తను వేచి చూడటం తప్ప చేయగలిగిందేమీ లేదని అతనికి తెలుసు.

ట్రైనింగ్ ఫీల్డ్ క్రాఫ్ట్ చివరలో సాంబయ్యకి సెంట్రీ డ్యూటీ పడింది. రాత్రి పన్నెండు నుండి మూడు గంటల వరకూ చెయ్యాలి ఆ డ్యూటీ. అడవి మధ్యలో గుడారాల్లో అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు. కన్ను పొడుచుకున్నా కనిపించని ఆ చీకటిలో ఏదైనా జంతువు మీద పడుతుందేమోననే భయంతో ఓ చెట్టు వెనుక నిలుచున్నాడు సాంబయ్య. చెక్ చేయడానికి వచ్చిన ఇన్‌స్ట్రక్టర్ సాంబయ్య భయాన్ని గుర్తించాడు. దగ్గరకొచ్చి భుజంమీద చెయ్యివేసి చెప్పాడు. “ఓ జవాను చేతిలో లోడు చేసిన రైఫిల్ ఉంటే దెయ్యాలు, భూతాలే కాదు జంతువులు కూడా దగ్గరకు రావు. మనని చూసి అంతా భయపడాలి తప్ప మనం కాదు. ఈ మూడు గంటల కాలం నువ్వే ఈ ప్రాంతానికి అధికారివి, మా రక్షకుడివి”.

ఆ మాటలు తారకమంత్రంలా సాంబయ్య భయాన్ని దూరం చేసాయి. తన సర్వీసులో మరెప్పుడూ భయపడలేదు. తూటాలు పేలుతున్న శబ్దం ఆగిపోవడంతో తలెత్తి చూసాడు. శత్రువు ఏం చేస్తున్నాడో కనపడకపోయినా దృష్టి మరల్చలేదు. తుప్పల వెనుక చిన్నగా ఆకులు కదిలాయి. రెండు ఆకారాలు చెట్లని చాటు చేసుకుని ముందుకి కదులుతున్నాయి. సాంబయ్య రైఫిల్ రాయి మీదకి తెచ్చి సేఫ్టీక్యాచ్ బొటనవేలితో నెట్టి చూపుడు వేలుతో ట్రిగ్గర్ నొక్కాడు.

“ధన్”

తూటా శత్రు శిబిరంవైపు దూసుకుపోయింది. ముందుకొస్తున్న ఆకారాలు మెరుపులా వెనక్కి గెంతి తుప్పల్లో మాయమయ్యాయి. ఇప్పుడు తూటాలు సాంబయ్య షెల్టర్ తీసుకున్న రాయివైపు రాసాగాయి. తలవంచి కదలకుండా ఉండిపోయాడతను. కొద్దిసేపు ఆగి మరో తూటా ఫైర్ చేసాడు.

నెమ్మదిగా సమయం గడుస్తోంది.

అతను తమని ముందుకు రానివ్వడం లేదని శత్రువు గ్రహించినట్టు కాల్పులు నిలిచిపోయాయి. సాంబయ్య తలపైకెత్తి చూసాడు. యుద్ధభూమిలో సైనికుని అసంకల్పిత కదలిక ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తుంది. అందుకే షెల్టర్ వెనుక ఉన్నవాడు బయటపడడు. ఆ నియమం అతిక్రమించాడు సాంబయ్య. ఒక్కసారిగా ఆటోమెటిక్ వెపన్ ఫైర్ అయింది. వరుసగా సాంబయ్య ఉన్న రాయిమీదకి దూసుకువచ్చాయి తూటాలు.

అతను వెనక్క పడిపోయాడు.

కుడి కంటిలో నిప్పుకణం దూర్చినట్టు భరింపశక్యం కాని బాధ. చేతి వెళ్ళతో కన్ను అదుముకున్నాడు. రక్తంతో చెయ్యి తడిసిపోయింది. జేబులోంచి ఖర్చీఫ్ తీసి అడ్డుగా ఉంచాడు. అయినా రక్తం కారుతూనే ఉంది. ఓ అడవి తీగ తెంచి ఖర్చీఫ్ మీదుగా తల చుట్టూకట్టుకున్నాడు. తను అలా ఎక్కువసేపు ఉంటే శత్రువు ముందుకొచ్చేస్తాడనే అనుమానంతో రైఫిల్ అందుకున్నాడు. శత్రుశిబిరం వీదకి సెన్సాఫ్ డైరెక్షన్‍తో ఒక తూటా కాల్చాడు.

శత్రువు అసహనానికి గురైనట్టు కాల్పులు అధికమయ్యాయి. ఎక్కువసేపు అలా ఫైర్ చేసి శత్రువు తూటాలు వృథా చెయ్యడని సాంబయ్యకి తెలుసు. అతని అంచనా నిజం చేస్తూ కాల్పులు ఆగిపోయాయి.

కంటి నుంచి కారుతున్న రక్తంతో షర్టు తడుస్తోంది. సాంబయ్య మెదడు పనిచెయ్యడం లేదు. ఎడమ కన్ను కూడా మసకబారింది. తన శక్తి హరించుకుపోతున్నదని గ్రహించాడు. చివరిసారిగా మరోసారి ట్రిగ్గర్ నొక్కాడు. తూటా ఎటో దూసుకుపోయింది.

ఏవో వాహనాలు వస్తున్న శబ్దం వెలువడుతుండగా తలవాల్చి పక్కకి జారిపోయాడు సాంబయ్య.

***

మాటల్లోనే మెస్ దాటి బేరక్ సమీపించారు అంతా. హాలులోకి ప్రవేశించాక అప్పటికే బెడ్స్ కేటాయించడంతో రిక్రూట్‌లు ఎవరి మంచం దగ్గర వాళ్ళు నిలుచున్నారు.

“మీ కిట్ బ్యాగులకి తాళం వేసుకుని మీ వస్తువులు జాగ్రత్త చేసుకోండి. ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే రికవరితో పాటు పనిష్మెంట్ ఉంటుంది. రోజుకి ఒకరు బేరక్ శుభ్రం చెయ్యాలి. ఉదయం పెరేడ్ గ్రౌండ్‌కి వచ్చేటప్పుడు మీ పక్కలు ఒక పద్ధతిలో మడతపెట్టి రావాలి. అదెలా మడతపెట్టాలో సాయంకాలం వచ్చినప్పుడు చూపిస్తాను” వారిని ఉద్దేశించి చెప్పాడు ఇన్‌స్ట్రక్టర్.

స్టోర్ దగ్గర మాట్లాడిన రిక్రూట్ గొంతు విప్పాడు.

“ఇందాక తప్పుగా మాట్లాడాను సార్! క్షమించండి..”

“సీనియర్లని గౌరవంగా చూడాలనే సంగతి గుర్తు పెట్టుకోండి. నిజానికి సాంబయ్య ర్యాంక్ నా ర్యాంక్‌తో సమానం కాదు. అయినా గౌరవంతో సెల్యూట్ చేసాను. ఎందుకంటే, ఈ బెటాలియన్ పుట్టాక ఇండియన్ పోలీసు మెడల్ తీసుకున్నది అతనొక్కడే. సాంబయ్య గురించి తెలుసుకోకుండా మీ ట్రైనింగ్ పూర్తికాదు”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here