అతీత జగత్తుకు సహృదయుని పరిణామం

0
7

[శ్రీ కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘అతీత జగత్తుకు సహృదయుని పరిణామం’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

~

ఆ చెలి వచ్చి తా జలకమాడిన యంతటిసేపు కృష్ణ వే
ణీ చలదూర్మికల్ రసధునీ పరివర్తన వైఖరిని సుభా
రోచులు క్రుమ్మరించినవి ప్రోవులవడ్డ వెలుంగు నవ్వులే
పూచెను పువ్వులై తరగ మొత్తములన్ వెలిగించు వెన్నెలై

ఇది శృంగార వీధి లోని స్నాన సుందరి అన్న శీర్షికతో వ్రాసిన పద్యాలలో మొదటి పద్యం. స్నానసుందరి కృష్ణా నదిలో స్నానం చేస్తున్న సన్నివేశం. ఈ స్నాన సుందరి స్నానం చేస్తున్నప్పుడు కృష్ణవేణీ తరంగాలు రసధునీ ప్రవాహము పరివర్తన చెందినట్టుగా అనిపిస్తున్నది. ఆ రసధుని అమృతపు తరంగాల కాంతులను వెల్లడి చేస్తున్నవి. కుప్పలు కుప్పలుగా పడ్డ ఆమె నవ్వులు పువ్వులుగా మారినవి. తరంగాలన్నింటినీ పరిణమింపజేసే వెన్నెలగా మారిపోతూ ఉన్నవి. కృష్ణవేణీ తరంగాలు అమృతపు రోచులు వెల్లడించడం మొదటి సన్నివేశం. ఆమె నవ్వులు పువ్వులుగా మారిపోవడం రెండవ సన్నివేశం. ఆ నవ్వులే వెన్నెలగా పరిణమించడం మూడవ సన్నివేశం. ఆమె స్నానం చేయడం భౌతిక జగత్తు నుండి కావ్య వస్తువు విభావ వస్తువుగా పరిణమించడాన్ని సూచిస్తుంది. ఈ ట్రాన్సఫర్మేషన్ మూడు స్థాయిల్లో జరుగుతుంది. కావ్యము దివ్య వస్తువుగా పరిణమించడం, విశ్వజనీనం కావడం, భావుక జగత్తుకు అమృతప్రాయంగా ఆనందాన్ని కలిగించడం మొదటి పరిణామం. రెండవ పరిణామం.. ఆమె నవ్వులు అనగా కావ్య శబ్దం, శైలి, అక్షర రమ్యత, మొదలైనవి ఆ భౌతిక వస్తువును అనగా తరంగాలను పూవులుగా మార్చటం రెండవ సన్నివేశం. మూడవది కావ్యము సమగ్ర స్థితిలో సహృదయులను భౌతిక సన్నివేశం నుండి ఉన్నతీకరించి రసానందమును పొందటంగా తెలియజేస్తుంది. కావ్యం వస్తువుగా, శైలిగా, ఆనందముగా మూడుగా మారిపోవడం ఆత్యంతికంగా రస భావనతో అతీత జగత్తునకు సహృదయుని పరిణమింపజేయడం ఇక్కడ జరుగుతున్న అంశం. అందువల్ల ఈ కావ్య సుందరి సామాన్య సుందరి కాదు. ‘ఆ చెలి’ అన్నప్పుడు తత్ వాచకమైన శబ్దం దివ్యభూమికను బ్రహ్మవస్తువును సూచిస్తున్నది. తత్త్వమసి ఇత్యాది శబ్దాలలో ఉన్న తత్ శబ్దంలో దీన్ని పోల్చుకొని చూడవచ్చు. చెలి అన్న శబ్దం చెలువము కలది, అంటే సౌందర్యవతి అని అర్థం. చెలి అన్న శబ్దానికి సఖి అని, కవితో నిత్యమూ సన్నిహితంగా ఉండేదని అర్థం చెప్పుకోవచ్చు. అంటే ప్రసాదరాయ కులపతి తన ఇంద్రాణి సప్తశతి తొలి శ్లోకాలలో ఆ మహాశక్తిని కవి సఖిగా పేర్కొన్నాడు. ఇక్కడ పద్య ప్రారంభంలో ఆ చెలి అన్న నిర్దేశం సర్వ వాఙ్మయ స్వరూపిణి అయిన బ్రహ్మ సరస్సు నుండి ప్రవహించే సరో రూపమైన మహా సరస్వతిని సూచిస్తున్నది.

విశ్వనాథ ఒక చోట తనను నిత్య సరస్వతీకునిగా వర్ణించుకున్నాడు. మరొక చోట గా బ్రాహ్మీమయమూర్తినిగా చెప్పుకున్నాడు. ఈ రెండు సన్నివేశాలను కావ్యానంద స్వరూపిణి అయిన సరస్వతీ దేవి ఆయనకు ఎంత సన్నిహితంగా ఉన్నదో తెలియవస్తున్నది. బ్రాహ్మీమయమూర్తి అన్నచోట సరస్వతీమయమైన చైతన్యమే కాకుండా పరబ్రహ్మ చైతన్యము నిండుకొని ఉన్న వ్యక్తిగా భావించుకోవచ్చు. భగవద్గీత తొలి అధ్యాయాలలో బ్రాహ్మీ స్థితి అన్నమాటలు వాడింది. ఈ బ్రాహ్మీ స్థితి పొందిన వాడు తనకున్న పరిమితులను అతిక్రమించి విభావ జగత్తులోని విస్తృతమైన స్థితిలో నిలచి ఉంటాడు. అతనిని లౌకికమైన పరిమితులు నియమించలేవు. అందువల్ల అన్ని పరిమితులను దాటి అతడు విశ్వలయ స్థితిలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ ఘట్టంలో చివరి పద్యంలో

నా కవితన్ విశాల జఘనా, ఒక ఔచితి లేదు, భాష లే,
దాకృతి లేద ఊరక రసాకృతి నే ప్రవహించి పోదు నీ
వాకృతిఅందమార్చిన రసాత్మతవు నీకును నాకభిన్నతా
శ్రీకత కల్గెనా పులకరించెను పొమ్ము రస ప్రపంచముల్

ఈ పద్యంలో కవి తన పరమైన సృజన వేళలో తాను రచించే రీతిని వెల్లడిస్తున్నాడు. మహాకవి తన రచనను నిర్మించే వేళలో ఆత్యంతికమైన రసస్ఫూర్తిని గురించియే భావిస్తుంటాడు. ఈ సందర్భంలో కవికి కావలసిన ఛందస్సు, వ్యాకరణము, అలంకారము, భాష, ఔచిత్యము మొదలైనవన్నీ అతని ప్రయత్నం లేకుండానే స్వయముగానే అభివ్యక్తమవుతూ అతని రచనను ఉద్దీప్తం చేస్తాయి. సాధన సామగ్రి అంతా అతని అభ్యాసం చేత అప్రయత్నంగానే రూపుదిద్దుకుంటూ ఉంటుంది. శబ్దములు నేను నేను అంటూ వెంటపడి వస్తూ ఉంటాయి. ఈ స్థితిలో ఒక తాదాత్మ్య లక్షణాన్ని పొందిన కవి కావ్య పరమార్థమైన రసమును మాత్రమే భావిస్తూ ఆ ప్రవాహాన్ని కొనసాగిస్తూ పోతుంటాడు. నేను విశ్వనాథ కల్పవృక్షం రాస్తున్న సందర్భంలో ఒకటి రెండు సన్నివేశాలలో ప్రత్యక్షంగానే ఉన్నాను. అప్పుడు ప్రయాణం చేస్తున్నా, మిత్రుల మధ్య ఉన్నా, ఆయన రచనా ప్రయత్నం సాగుతూ ఉండేది. ఇరవై ముప్పై పద్యాలు ఆయన మనసులోనే నిర్మాణం చేసేవారు. తరువాత వాటిని కాగితం మీద పెట్టేవారు. ఈ ఇరవై ముప్ఫై పద్యాల కల్పనలో ఆయన ఛందస్సునో, కథనో, ఔచిత్యాన్నో పట్టించుకొన్నట్టుగా ఉండేది కాదు. శ్రీగిరి శతకంలో

శ్రీనీరధి నిషంగ భక్తజన శ్రేయోనుషంగ
మానాథ శరసంగ ప్రౌఢ వృషభరాణ్మాధ్య త్తురంగ
క్ష్మానూతన శతాంగ సంగతోష్ణేశ సౌరాంబు భంగ
శూలాభిషంగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ

ఈ పద్యంలో ధారాప్రవాహంలో నాలుగవ పాదంలో ప్రాస లేకపోయిందన్న భావన కూడా ఆయనకు కలుగలేదు. తరువాత తెలిసినా దాన్ని పట్టించుకోలేదు. మహాకవి సృజనవేళ భాషాది ఉపకరణములను ఆయన సృజన రీతిని అనుసరించే ఉంటవని చెప్పటానికి ఇంతకన్న వేరే ఉదాహరణము అక్కఱలేదు. నా కవితలో ఔచితి లేదు, భాష లేదు, రూప నిర్మాణం లేదు అని చెప్తే అవి లేవని అర్థం కాదు. వాటిని గూర్చి నేను పట్టించుకోనని అర్థం. తనకు కావలసింది రస పారమ్యమైన రచన. అవి ఉన్నప్పుడు మిగిలిన అంశములన్నీ కూడా దాని అడుగులకు మడుగులొత్తవలసిందే.

ఒక మహాకవి సామాన్య స్థితిలో మనకు కనిపించే పద్ధతికి, కావ్య నిర్మాణం చేసే సమయంలో ఆయన చేతస్సు ప్రసరించే పద్ధతికి ఎంతో ఆంతర్యం ఉంటుంది.

నీవే క్షేత్రమగు, నేను కర్షకుడ తండ్రీ నిన్ను పండించెదన్ అని మాస్వామి శతకంలో చెప్పినప్పుడు ఆయన భూమిలో దైవాన్ని సమృద్ధిగా విస్తరింపజేస్తున్నానని, పండిస్తున్నానని వెల్లడిస్తున్నాడు. దైవాన్ని క్షేత్రంగా భావించి దానిని ఇక్కడ సమృద్ధిగా పండింపజేయడం అంటే ద్యవాపృథ్వుల మధ్య ఒక సమావేశాన్ని ఏర్పరుస్తున్నట్టు భావించాలి.

ఏపున మంటినుండి యుదయించిన జానకి మింటినుండి ఆ
వాపముగన్న రాఘవుడు వచ్చి ఋగధ్వజములందు నుండి ద్యా
వాపృథువుల్ సమాహరణ భావము పొందిన రీతి సంగమ
వాపృతి పండు వెన్నెల మయంబుగ జేసెద రాత్మరోదసిన్

ఈ పద్యంలో సీతారాముల దాంపత్యం ద్యావాపృథువుల సమాగమం లాగా ఈ పృథ్విని ఆత్మ రోదసిని పండువెన్నెల మయంగా చేయడం కల్పవృక్ష రచనకు తాత్పర్యంగా చెప్తున్నాడు. మా స్వామిలో సూచనగా చెప్పబడ్డ అంశం కల్పవృక్షంలో మహాగ్రంథంగా విస్తరించింది. పృథ్విపైన శ్రీకృష్ణ చైతన్యాన్ని ఆవిష్కరించడం, శ్రీఅరవిందుల తత్త్వ సాధనలో భాగమైన అంశం. ఇదే అంశం అరణ్య కాండలో సీతకు రావణుడికి మధ్య సంఘర్షణగా తెలియజేస్తూ

ఆమె ఖండించి తినియైన అసురగుణము
కాల్నిల్వ ద్రొక్కగా పంక్తి కంథరుండు
అన్నింటిని నాశనము చేసియైన గాని
దైవగుణము ప్రతిష్ఠింప జనకజాత

అన్న పద్యంలోనూ చెప్పబడింది. సీతాదేవి దివ్యచైతన్యం ఏ స్థాయిలో ఉన్నదో తెలియవలెనంటే ఆమె అశోకవనిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ కోకిలలు, చిలుకలు, మరాలములు, నెమళ్లు.. అన్నీ రాముడిని స్ఫురింపజేస్తూ రామమయంగానే పరిణమింపజేసినవి. ఇక్కడ ఆ జగన్మాత తాను ముందే అశోకవనికి వచ్చి ఈ పరిణామాన్ని ఎంతగా వేగవంతం చేసిందో తెలియజేయడానికి ఈ పద్యం ఉపకరిస్తుంది. ఒక మహాకవి చైతన్యం విశ్వవ్యాప్తమైన చైతన్యంతో సంవదిస్తూ ఉంటుందనడానికి ఈ పద్యం ఉదాహరణ ప్రాయంగా స్ఫురిస్తుంది. కల్పవృక్షంలో రాక్షస పాత్రలు దైవ భావన తమ చైతన్యంలో సుప్త స్థితిలో ఉన్నట్టుగా స్వామి వారిలోని ఆ చైతన్యాన్ని మేల్కొల్పినట్టుగా ఈ రచన కొనసాగింది. అందువల్లనే రావణుడు కల్పవృక్షంలో తన సంహారానికి ముందు సంశయ ఖండం నుండి నిస్సంశయ ఖండందాకా ప్రయాణించి రామ తత్త్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటాడు. ‘ఇది నారాయణ మూలమౌ తరువు- ఇతనికి దేవికింగలుగు నింతటి భేదము దీప్త భావనా తతముగ దేవియే యితడు’ వైష్ణవ భూమికను శ్రీవిద్యా సంప్రదాయాన్ని సాక్షాత్కారం చేసుకొంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here