మానసిక సంఘర్షణలను సహజంగా చిత్రించిన నవల ‘అతిథి’

0
8

[2014లో స్వాతి మాసపత్రికతో అనుబంధంగా అందించబడిన అత్తలూరి విజయలక్ష్మి గారి ‘అతిథి’ నవలను సమీక్షిస్తున్నారు రామలక్ష్మి సుంకరణం గారు.]

[dropcap]అ[/dropcap]త్తలూరి విజయలక్ష్మి గారు ప్రముఖ తెలుగు రచయిత్రి. స్వస్థలం తెనాలి అయినా, విద్యాభ్యాసం, ఉద్యోగం మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది. ఈమె అనేక కథలు, నవలలు, నాటికలు వ్రాసారు. పబ్లిక్ రిలేషన్స్‌లో డిగ్రీ చదవి, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై సీవరేజ్‌ బోర్డులో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలో అధికార హోదాలో పదవీ విరమణ పొందారు. ఈమె 2013లో ‘సరసిజ’ అనే పేరుతో ఒక సాహిత్య సంస్థను నెలకొల్పారు. 1975- 84 వరకూ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రెండు వందలకు పైగా వీరి నాటకాలు, కథలు ప్రసారమయ్యాయి. వీరు వ్రాసిన జానపద, సాంఘిక నాటకాలు అమెరికాలో కూడా ప్రదర్శింపబడ్డాయి. కాంతి రేఖ, నివేదిత, పల్లకిలో పల్లవి వంటి టీవీ సీరియల్స్, అనేక టెలీఫిలిమ్స్ ప్రసారమయ్యాయి. యవనిక, అంతర్మథనం వంటి నాటిక సంపుటాలు, కొన్ని కథల సంపుటాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రచనలు ఖ్యాతి పొందాయి.

ప్రస్తుతం ‘లేఖిని’ సాహిత్య వేదిక అధ్యక్షురాలిగా తనవంతు బాధ్యతలను గొప్పగా నిర్వహిస్తున్నారు. రచయిత్రితో నా పరిచయం అతి తక్కువ అయినా, గత సంవత్సరం లేఖిని వారి ‘మాతృదేవోభవ’ పురస్కారాల సందర్భంగా స్వయంగా వ్రాసిన లఘు నాటికలో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాటక రంగాన్ని పునరుద్ధరించాలని అంటుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా సమయపాలన, నిబద్ధత కనబడతాయి. అనుకోకుండా ఈ పుస్తకం కంటపడడం, ఆసక్తిగా చదవడం కాకతాళీయమే. వారికి ధన్యవాదాలతో..

నవలా సమీక్ష:

‘అతిథి’ అనే ఈ నవల 2014 సం.లో స్వాతి మాసపత్రికతో పాటు అనుబంధంగా అందించబడింది. కథాంశం మొత్తం మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. కథాకాలం పూర్వ భాగంలో ఉత్తరాలు, ల్యాండ్‌ఫోన్లే తప్ప మొబైల్ ఫోన్లు లేవు. ఒక వ్యక్తి జీవన ప్రయాణంలో అతిథిలా పరిచయమై మాయమైన స్త్రీ ఎన్నో ఏళ్ళ తర్వాత తన యింటికే మరోసారి అతిథిగా వస్తే.. ఆ వ్యక్తి లో చెలరేగే అలజడి, మానసిక సంఘర్షణలను ఎంతో సహజంగా చిత్రించారు రచయిత్రి. తన జీవితంలోకి రెండు సార్లు అనుకోకుండా వచ్చిన అతిథి, ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి అలజడి రేపబోతోందోననే ఉత్కంఠను చివరివరకూ కొనసాగించడంతో, ఆపకుండా చదివిస్తుంది ఈ నవల. ప్రతి పాత్రనూ ఉన్నతంగా తీర్చిదిద్దారు. ముగింపు కొందరికి విధి వైచిత్రిగా అనిపిస్తుంది.

ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో చాలా సహజంగా చూస్తున్న లివిన్ రిలేషన్‌షిప్ భావజాలం పదేళ్ల క్రితమే మొలక దశలో ఉందని, తదనంతర పరిణామాల వల్ల ఆ బంధం నిలబడిందా, లేదా అనే విషయం అంతర్లీనంగా ఉండడం రచయిత్రి సామాజిక అవగాహనకు నిదర్శనం. ప్రకృతి కాంతను పెళ్ళికూతురిగా చేసినట్లు గ్రామీణ వాతావరణం ఉందిట. ప్రకృతి సన్నాయి వాయించడం, ఆకాశం చిరు జల్లుల రూపంలో అక్షింతలు వేయడం, పువ్వులు నీటిలో స్విమ్మింగ్ చేయడం వంటి ఉపమానాలు చదివినప్పుడు రచయిత్రి భావుకత అర్థమవుతుంది. చివరకు భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించే రీతిలో ముగింపు ఇవ్వడం బావుంది. ఇది రేపటి తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

ఇక కథ లోకి వెళ్తే..

రాజశేఖర్, విమల భార్యాభర్తలు. కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. అనే విధంగా భర్త, పిల్లలే లోకం అనుకుని, ఉన్నంతలో గుట్టుగా సంసారం చేస్తూ సాగిపోయే మధ్యతరగతి మహిళ విమల. పిల్లలు కావ్య, రమ్య ఇద్దరూ ఉన్నత చదువులు చదివి చక్కటి సంబంధాలు కుదిరి అమెరికాలో స్థిరపడ్డారంటే అందుకు కారణం విమలే అని రాజశేఖర్ బలంగా నమ్ముతాడు. బాధ్యతలు తీరి, అన్యోన్యంగా సాగిపోయే వారి జంట మలి వయసులో మరింతగా ఎంజాయ్ చెయ్యాలని రాజశేఖర్ ఉద్దేశం. భర్త అడుగుజాడల్లో నడుస్తూనే, కుటుంబ బాగోగులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్న విమలంటే అతనికి వల్లమాలిన ప్రేమ. భర్త మరో స్త్రీ వైపు కన్నెత్తి చూడకూడదనే సగటు భార్య పొజెసివ్‌నెస్ కూడా ఉంది విమలకు.

విమల మేనత్త కూతురు ‘మలయ’ అమెరికాలో ఉంటుంది. చాలా కాలం తర్వాత ఇండియా వచ్చిందని, హైదరాబాద్ వచ్చి విమల ఇంట్లో పది రోజులు గడపాలని అనుకుంటోందని ఫోన్ వస్తుంది. ఇప్పుడిప్పుడే బాధ్యతల నుండి బయటికి వచ్చి, నవ దంపతుల్లా కొత్త జీవితాన్ని విమలతో గడపాలనుకుంటున్న రాజశేఖర్‌కు ఇది నచ్చలేదు. అయినా, విమల మాట కాదనలేక సరేనంటాడు.

అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మలయను చూడగానే స్థాణువైపోతాడు రాజశేఖర్. మలయ మాత్రం చివరివరకూ రాజశేఖర్‌ని గుర్తు పట్టనట్లే ఉంటుంది. ‘కాలేజీలో చదివేటప్పుడు మిస్ యూనివర్సిటీగా, గొప్ప సింగర్‌గా పేరు తెచ్చుకున్న సమీరే ఈ మలయా?’ అనే విషయం ఎంతకీ అర్థం కాదు రాజశేఖర్‌కి. మధ్యవయసు ప్రభావంతో పూర్తిగా గుర్తు పట్టలేకున్నా, తను సమీరే అని అర్థమౌతుంది. ఇన్నేళ్ల తర్వాత తనపై కక్ష సాధించడానికే వచ్చిందా? విమల తనకు దూరమైపోతుందా? అసలు మలయ మనసులో ఏముంది? పేరెందుకు మార్చుకుంది?  అని కుమిలిపోతూ ఉంటాడు. ఈ తాగుడు అలవాటు ఏంటి? తననింకా మర్చిపోలేదా? తనేమో తగిన భార్య, కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. ఈ ఆలోచన రాగానే కొంత గిల్టీగా అనిపించింది రాజశేఖర్‌కి. అయినా, తప్పు చేసింది సమీరే గానీ, తను ఏమాత్రం కాదు అని మనసుకు నచ్చజెప్పుకున్నాడు.

అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఉంటున్న మలయ ఆహారపు అలవాట్లు, చలాకీతనం, పెళ్ళి గురించి తన అభిప్రాయాలు విమలకి కాస్త వింతగా అనిపించినా.. ఇంటికి వచ్చిన అతిథిగా అర్థం చేసుకుని ప్రేమగా చూస్తుంది. కథ ఇక్కడ మొదలై, మధ్యలో గత కాలపు జ్ఞాపకాలతో ఆసక్తికరంగా సాగింది.

రాజశేఖర్ తండ్రి చనిపోవడంతో, తల్లి మీనాక్షికి కారుణ్య నియామకం ద్వారా విజయవాడ మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్యోగం వస్తుంది. పిల్లలు శేఖర్, భాస్కర్, మీనాక్షి తల్లిదండ్రులు వారి స్వగ్రామం ఉయ్యూరులో ఉంటారు. ఆ ఊరిలో వారికి చాలా గౌరవం ఉంది. వారాంతంలో ఇంటికి వస్తుంటుంది మీనాక్షి. తల్లి పెంపకంలో చాలా క్రమశిక్షణతో పెరుగుతారు పిల్లలు.

భాస్కర్ డాక్టర్ చదివి, వేరే కులానికి చెందిన కొలీగ్ డా. వరూధినిని పెళ్ళి చేసుకుంటాడు. డబ్బు, అందం చూసి చేసుకున్న పెళ్ళి నిలబడిందా, తదనంతర పరిణామాలు శేఖర్ జీవితాన్ని ఎలా మార్చాయన్నది గతం.

శేఖర్ ఎమ్మెస్సీలో పీజీ చేస్తున్నప్పుడే బీఎస్సీ చదివే సమీర పరిచయం అవుతుంది. మనసులు కలవడంతో ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. సమీర మొదటి నుంచీ అభ్యుదయ భావాలు గలది. తనలో రెండు రకాల షేడ్స్ ఉంటాయి. పల్లెటూరి వాతావరణం, సాంప్రదాయ కట్టూబొట్టు లాంటివి చాలా ఇష్టం. మరోవైపు పెళ్ళి పేరుతో ఎవరో ఒకరికి జీవితాంతం కట్టుబడి ఉండడం నచ్చని వ్యక్తిత్వం.

శేఖర్ ఇందుకు విరుద్ధం. జీవితంలో పెళ్ళి అనేది సంఘంలో గౌరవంగా నిలబెడుతుందనేవాడు.

సమీర ఎంత చనువుగా ఉన్నా, గీత దాటని ప్రవరాఖ్యుడిలా ఉండేవాడు శేఖర్. వయసు ప్రభావమో, సమీర ప్రేమో ఒకరోజు ఆ గీత దాటి స్నేహాన్ని మించిన మరో అంచును తాకి పరవశించారు ఇద్దరూ. కాసేపటికి విషయం అర్ధమై, చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు శేఖర్. ముందు ఇది గాంధర్వ వివాహం అనుకోమన్నా, తనకోసం పెళ్ళికి ఒప్పుకుంటుంది సమీర. పరీక్షలు అవడంతో ఢిల్లీ వెళ్ళిపోతుంది సమీర. ఫోన్ చేస్తానని చెప్పిన సమీర నుంచి తిరిగి ఫోన్ రాలేదు. ఇద్దరి మధ్యా ఇక ఎప్పటికీ కాంటాక్ట్స్ ఉండవనే అనుకున్నాడు.

కానీ, ఇప్పుడిలా మలయగా సమీర రావడం, అదీ తనకు చెల్లెలి వరస అవడం జీర్ణించుకోలేక పోతున్నాడు శేఖర్. విమలని వదులుకోవడం మాత్రం ఇష్టం లేదు శేఖర్ కు. ఒకరోజు విమల అనుమతితో శేఖర్, సమీర బయటికి వెళ్తారు.

ఇక్కడికి రావడానికి కారణం, శేఖర్‌ని గట్టిగా నిలదీయాలనే. ఈ వారం రోజుల్లో విమల, శేఖర్‌ల అన్యోన్య దాంపత్యం మరియు విమల నిష్కల్మష మనస్తత్వం చూసిన మలయకి తన గతం వల్ల వాళ్ళు విడిపోకూడదని అనిపించింది. జరిగిన దాంట్లో తన తప్పు కూడా ఉందని ఒప్పుకుంటుంది. ఇదే విషయం రాజశేఖర్కి చెప్పింది. ఇక తిరిగి అమెరికా వెళ్ళకుండా, శేఖర్ అన్నయ్య భాస్కర్ నడిపే హాస్పిటల్‌లో తనవంతు సహాయం అందిస్తానని కోరింది. అప్పటికే గుణవంతురాలైన భార్య ఉంది భాస్కర్‌కి. తమ గతం గురించి మాత్రం ఎన్నటికీ ఎవరికీ తెలియనివ్వనని మాట తీసుకుంటుంది. ఇలా కథ సుఖాంతం అయ్యింది.

ఏ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇద్దరూ విడిపోయారు, విమలతో శేఖర్ పెళ్లి ఎలా అయింది, భాస్కర్ జీవితం ఏ మలుపులు తిరిగింది, వివాహ వ్యవస్థ యొక్క గొప్పదనం ఏమిటి? ఇత్యాది విషయాలను కథలో భాగంగా అంతర్లీనంగా, ఆసక్తికరంగా చెప్పారు రచయిత్రి. వారి రచనా పటిమకు జోహార్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here