[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘అతి పురాతన నిరంతర నాటకం!!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఎ[/dropcap]వరు పోసారో ఊపిరి?
ఈ అర్భకుని దేహపు గుడిలోనికి.
బుద్ధెరిగిన నాటినుండి ఊగిసలాడుతునే ఉన్నాడు,
పగలూ, రేయీ ఎండా,వానలనక పరుగెడ్తునే ఉన్నాడు.
ఊపిరి ఉనికిని ఆద మరిచి, తన దేహాన్ని ప్రేమిస్తూ.
ఒల్లొంచో, తలనమ్ముకునో తాపత్రయ పడుతూ
తనతో వచ్చిన దేహాన్ని నిండుగా పోషించడానికి,
తనకాపదింప బడ్డ పాత్రకు న్యాయం చేయడానికి,
భువిపై తనతో ముడిపడిన, పడుతున్న సమూహాలను
తగు న్యాయం చేయడానికి బాధ్యతలలో బంధీయై,
తన పాత్రలోకి దూరి తెగ ఆయాసపడుతున్నాడు,
కలలు జీవితంలో ఒక భాగమని తనకు తెలిసినా ,
కానీ జీవితమే ఓ సుదీర్ఘమైన కల అని గుర్తించలేక,
వీలులేక ‘నేను’ అనే బలీయమైన భావనతో,
అది, ఇది అననేమిటి?, మంచి,చెడులన్నిటిని
తన నడతలో,నడకలో విభిన్న పోకడలతో
సుశిక్షితుడైన నటునిలా మేటిగా ప్రదర్శిస్తున్నాడు,
ఎవడో తననే పనిగట్టుకు చూస్తున్నాడన్నట్టు
అద్భుతంగా నటిస్తే ఏదో బహుమానమున్నట్టు.
అతి పురాతన సుదీర్ఘ నిరంతర నాటకమిది
ఎవడాడిస్తున్న నాటకమవునో మరి ఇది?
ఎవడి ఆనందం ఇందులో ఇమిడిఉంది?
ఆ అజ్ఞాతుడు ప్రేక్షకుడైతే కానే కాడు,
తప్పక స్థితప్రజ్ఞుడైన ఓ దర్శకుడై వుంటాడు.
తోలు బొమ్మలకు ప్రాణం పోసి, కిందకు తోసి
కొన్నిటిని ముచ్చటగా చివరి వరకూ ఆడిస్తూ
మరి కొన్నిటిని అర్థాంతరంగా కకావికలం చేస్తూ
ఆ బొమ్మల భావావేశాలతో తనకు పనిలేదన్నట్టు
ముగింపులు వ్రాయబడని కథా, కథనాలతో,
వాటిని నడపడానికి ప్రణాళికలే అవసరం లేదన్నట్టు,
ఆ బొమ్మల కర్మఫలానికి తాను బాద్యుడినే కానన్నట్టు,
సుఖ దుఃఖాలను తానెప్పుడు చవి చూడలేదన్నట్టు
నిష్కర్షగా, నియంతలా తన కనుసన్నలలో, సైగలతో
తనకి తోచిన విధంగా నాటకాన్ని నడిపిస్తున్నాడు మరి
ఆ అతి పురాతన దర్శకుడు!!!