అతి సర్వత్ర వర్జయేత్

1
7

[నంద్యాల సుధామణి గారు రచించిన ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“హలో.. పెద్దమ్మా! నేను జాహ్నవిని మాట్లాడుతున్నాను.. వినబడుతోందా?”

“హా.. జానూ.. నువ్వా.. చెప్పమ్మా.. మీరంతా బాగున్నారా? పిల్లాడు, మీ ఆయన క్షేమమే కదా?” నేను కుశల సమాచారాలు అడిగాను.

“హు.. యేమి బాగుండడం లెండి పెద్దమ్మా!” నిట్టూర్పులు విడుస్తూ అంది.

“అదేంటే అట్లా అంటావు? ఏమైందే? ఆరోగ్యాలు యేమైనా సరిగ్గా లేవా? మరేమైనా సమస్యలా?” అడిగాను నేను ఆత్రుతతో.

“అవేం లేవు లెండి పెద్దమ్మా! కానీ, రెండ్రోజుల నుంచి మనసంతా చేదుగా మారిపోయింది.. దుఃఖం ఆగడం లేదు” నిస్పృహగా అన్నది జాహ్నవి.

“విషయమేంటో చెప్పకుండా ఈ సస్పెన్సేమిటే? ఎవరన్నా యేమన్నా అన్నారా? చుట్టుపక్కల వాళ్లెవరన్నా గొడవ పెట్టుకున్నారా?” నేను ఏదో ఉపద్రవాన్ని ఊహిస్తూ అన్నాను.

“నేను ఒకటి చెప్పాలనుకుంటే మీరు ఇంకోటి ఊహించుకుంటారు పెద్దమ్మా! హు.. మీరెప్పుడూ ఇంతే! మీకు నారూ గుర్తున్నాడా? నారూ.. అదే నారాయణ.. వాడు.. కాలం చేశాడు పెద్దమ్మా! ఊ.. ఊ.. ఊ.. (పెద్దగా యేడుపు)”

తను తేరుకోవడానికి అవకాశమిస్తూ మౌనం పాటించాను. వెక్కిళ్లు తగ్గలేదు జాహ్నవికి.

“మీ బంధువులబ్బాయా నారూ అంటే? నాకెవరూ గుర్తుకురావడం లేదే నారాయణ అంటే! పాపం పోయాడా? ఎవరి బిడ్డో.. యేమో!” అన్నాను నేను నారాయణను గుర్తుకుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ.

“అబ్బబ్బ! ఇదే మీతో వచ్చిన చిక్కు! పేర్లు అసలు గుర్తుండవు మీకు. అన్నీ మరిచిపోతారు. నారాయణ అంటే నా ఫ్రెండ్ గీతా వాళ్ల కుక్క పెద్దమ్మా! కుక్కంటే కేవలం కుక్క కాదు. వాడు వాళ్ల బిడ్డ. సొంత పిల్లాడిలా పెంచుకున్నారు. మీకు వాడి గురించి ఎన్నోసార్లు చెప్పాను. హు.. అయినా మీరు మర్చిపోయారా? వాడు కాలమైపోయాడు పెద్దమ్మా! ఊ. .ఊ..ఊ..” అంటూ మళ్లీ యేడుపు ఈసారి మంద్రస్థాయిలో మొదలెట్టింది.

“అయ్యో పాపమే.. పాపం వాడు దాటుకున్నాడా? అయినా గీతా వాళ్లు ఇప్పుడు సింగపూర్‌లో లేరనుకుంటానే?” అన్నాను నిజం గానే బాధపడుతూ.

వెక్కిళ్లు బలవంతాన ఆపు చేసుకుంటూ.. “అవును పెద్దమ్మా.. వాళ్లు లండన్ వెళ్లి ఆరునెలలయింది.. అంతే!” మళ్లీ వెక్కిళ్లు ఆపుతూ మాట్లాడ్డం మొదలెట్టింది.

“పాపం.. యేమైందే వాడికి? ఇక్కడున్నప్పుడు బాగానే వున్నాడు కదా..”

“వాళ్లకు ఆ లండన్‌కు వెళ్లినప్పటి నుంచీ శని పట్టుకుంది పెద్దమ్మా! అక్కడికెళ్లాక గీతకు జాబ్ దొరకలేదు.. నారూకు కూడా ఆ చలికి తట్టుకోవడం కష్టం అయింది. ఇంకా వాళ్లు స్తిమితపడనే లేదు. ఇంతలో నెత్తిన పిడుగు పడ్డట్టుగా నారూ మరణించడం!” ముక్కు ఎగపీలుస్తూ అన్నది జాహ్నవి.

“యేమైందే వాడికి.. అంత సడన్‌గా.. ప్రాణం మీదికి వచ్చేటంతగా?” నేను బాధపడుతూ అన్నాను.

“ఏమో తెలీదు. పెద్దగా జ్వరం వచ్చిందట. ఫిట్స్ వచ్చాయట! వెటర్నరీ డాక్టర్ అపాయింట్‌మెంట్ దొరికి వెళ్లేటప్పటికి సమయం మించిపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడట! గీత చేతిలోనే ఆఖరు శ్వాస వదిలాడు వాడు. ఇక చూడండి వీళ్ల బాధ వర్ణించలేము. గీత ఈ రెండు రోజుల నించి అన్నం, నీళ్లు మానేసింది. కొత్తగా వెళ్లారు కదా.. పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. మా గురుకుల్ గ్రూప్ వాళ్లే వాళ్లకు సపోర్ట్ ఇచ్చారు”

“అయ్యయ్యో! అలా అయిందా పాపం!” సానుభూతి వెలిబుచ్చాను.

కొంచెం ఆగి తనే అన్నది.

“రాఘవన్ గారు అంత దుఃఖాన్ని భరిస్తూ అంత్యక్రియలు యేర్పాట్లు చేశారు. ఎలక్ట్రిక్ క్రిమెటోరియమ్‌లో దహనక్రియలు జరిపారు. వాళ్ల అపార్ట్‌మెంట్ క్లబ్ హౌస్‌లో ఘనంగా ఒక సంతాపసభ యేర్పాటు చేశారు. నారూ ఫోటో ఒకటి పెద్దది పెట్టి, వాడి చితాభస్మం ఉన్న బాక్స్ పెట్టారట! అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో వుండే డాగ్ లవర్స్ అందరూ వచ్చి, వాడి ఫోటోకు పూలు సమర్పించి నారూకు శ్రద్ధాంజలి ఘటించారట!” (జాహ్నవికి పత్రికా భాష వాడటం అలవాటు లెండి. తాను చాలా మంచిభాషను మాట్లాడుతూ తెలుగుభాషామ తల్లికి సేవ చేస్తున్నాననుకుంటుంది. చిత్రంగా అనిపిస్తాయి దాని మాటలు! అయినా తప్పేం లేదు కదా!)

“గీత దుఃఖానికి అంతులేదు పెద్దమ్మా! ఎలా ఓదార్చాలో తెలీడం లేదు. సొంత పిల్లాడిని పోగొట్టుకున్నట్టుగా ఏడుస్తోంది. సరే పెద్దమ్మా.. మా ఆయన వస్తున్నట్టున్నారు. ఆయనకు రెండ్రోజుల్నించీ నారూ గొడవతో పిచ్చెక్కింది. ‘ఇక నారూ మాట మాట్లాడితే చూసుకో. వాణ్ని తలచుకుని యేడ్చావంటే చూసుకో.. నేను ఇంట్లో వుండను.. నా ఫ్రెండ్స్ ఇంట్లో వుండిపోతా..’ అని బెదిరించి వెళ్లారు.. పొద్దున ఆఫీసుకు వెళ్తూ. రేపు ఆయన ఆఫీసుకెళ్లాక మాట్లాడతాను లెండి” అని ఫోన్ ఠక్కున కట్ చేసింది.

నేను తుఫాను వెలిసినట్టయి ఊపిరిపీల్చుకున్నాను. నారూ ఆత్మశాంతి కోసం మనసులోనే ప్రార్థించాను.

జాహ్నవి మా మరిది కూతురు. మేము, మా మరుదులు వేరుగా వున్నా, ఉమ్మడికుటుంబం భావనతో వుంటాము. అదీగాక మా ఇద్దరి యిళ్లూ దగ్గర కావడంతో బాగా చనువు నా దగ్గర. అన్ని విషయాలూ నాతో పంచుకోకుంటే తోచదు దానికి.

జాహ్నవి జంతుప్రేమికురాలు. తను బయటికి వెళ్లిందంటే ఇంటికి నేరుగా వస్తుందన్న ఆశ వుండదు. అక్కడేదో కుక్క అనారోగ్యంతో వుందనీ, దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాననీ, ఇక్కడేదో పిల్లిని కుక్క పట్టుకోబోతే విడిపించి తెచ్చాననీ, ఆవుకు ఆకలేస్తున్నట్టు తన వైపు జాలిగా చూస్తే.. ఆకుకూర, అరటిపండ్లు కొని తినిపించి, అక్కడే ఒక ఇంట్లో నించి బకెట్‌తో నీళ్లు తెచ్చి తాగించి వచ్చాననీ చెబుతుంటుంది. ఇలా రకరకాలుగా జంతుసేవ చేస్తుంటుంది.

ఒకరోజు ఒక అట్టపెట్టెలో పావురాన్ని పట్టుకొచ్చి బాల్కనీలో పెట్టింది. అక్కడెవరో పావురాన్ని రాయి పెట్టి కొడితే, అది పడిపోయి వుంటే, పక్కనున్న వాళ్లను అడిగి అట్టపెట్టె ఇప్పించుకుని అందులో పెట్టుకుని తెచ్చుకుంది. దానికి మందు రాసి, దానికి బాగయ్యేదాకా సేవలు చేసింది. ఒకరోజు అది ఎగిరివెళ్లిపోతే.. జాహ్నవి యేడుపు చూడాలీ.. ఓదార్చడానికి శక్యం కాలేదు ఎవరికీ..

“అయినా అన్ని దెబ్బతిన్న జంతువులూ, పక్షులూ నీకే కనిపిస్తాయి కదే.. మాకొక్కటీ కనిపించవు!” అంటుంటాను నేను.

“ఏమో పెద్దమ్మా! వాటిని చూడగానే, వాటికేదైనా ప్రాబ్లమ్ వుంటే వాటి కళ్లలోకి చూస్తే తెలిసిపోతుంది నాకు. తెలిసి తెలిసీ యెట్లా వదిలేస్తాను చెప్పండి. నాకు మనుషులకూ, జంతువులకూ పెద్ద తేడా కనిపించదు పెద్దమ్మా! నిజానికి జంతువులే ఎక్కువ ఫ్రెండ్లీగా వుంటాయి” అంటుంది.

అలా దానికి మా కాలనీలో, చుట్టుపక్కలా వుండే వెటర్నరీ డాక్టర్లు, ఆస్పత్రులూ అన్నీ పరిచయమే!

అన్నింటికంటే విశేషమైన సంఘటన యేమిటంటే..

ఆ సంవత్సరం దానికి పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం రోజు అంతా రెడీ అయ్యాక “గుడికి పోయి వస్తా పెద్దమ్మా” అని వెళ్లిన పిల్ల ఎంతకీ రాలేదు. వియ్యాల వాళ్లు వచ్చే సమయమైంది. భయపడిపోయి తలా ఒక దిక్కుపరిగెత్తారు మగవాళ్లు అందరూ. ఆడవాళ్లమంతా గేటు బయట నిల్చుకుని ఎదురు చూస్తున్నాము, దాని రాక కోసం. అందరి మనసులలో యేవేవో భయాలు! అప్పుడు నింపాదిగా నడుచుకుంటూ వస్తోంది.

“ఇంతసేపు యేమైపోయావే?” అన్నాం అందరం కోరస్‌గా.

“మరేం లేదు పెద్దమ్మా! గుడి ముందర గోమాత కనబడింది. ఆమె కాలు మీద ఎవరో బాగా కొట్టేసరికి కుంటుతూ వుంది. రక్తం కూడా వస్తోంది. చూడలేక పోయాను పెద్దమ్మా! మెడికల్ షాప్ అతన్ని అడిగి డెట్టాల్, నీళ్లూ తీసుకుని, దాని గాయం కడిగి, బోరిక్ పౌడర్ వేసి, గట్టిగా కట్టుకట్టాను. తినడానికి యేదో కొనిపెట్టాను. పాపం అవన్నీ మెడికల్ షాపతను ఫ్రీగా ఇచ్చాడు లెండి. డబ్బివ్వబోతే ఒద్దన్నాడు. ఎంత మంచివాడో చూడండి..” అని ఇంకా యేదో చెప్పబోతూ వుంటే..

“ఇంక చాల్లే.. ఉద్ధరించావు! నీవూ నీ గోసేవా.. జంతుసేవా..! నువ్వు ఎక్కడికి పోయినావోనని భయపడి చచ్చాం తెల్సా? వాళ్లొచ్చే టయమయింది. ఇక లోపలికి పోయి బట్టలు మార్చుకోపో.. దేనికైనా సమయం, సందర్భం వుంటుంది. ఒక పక్క ఇంట్లో నిశ్చితార్థం జరుగుతూ వుంటే గోసేవ చేసి వచ్చిందంట గోసేవ!” కసిరింది వాళ్ల అమ్మ.

మేమంతా నవ్వాలో, యేడవాలో తెలియని ముఖాలతో ఒకర్నొకరం చూసుకున్నాం. తేరుకోని పనుల్లోకి దిగాము.

జాహ్నవికి పెళ్లయ్యాక భర్తతో సింగపూర్ వెళ్లింది. ఒక బాబు పుట్టాడు.

వాళ్ల అపార్ట్‌మెంట్ లోనే గీత, రాఘవన్ దంపతులతో తనకు బాగా స్నేహం కుదిరింది. జాహ్నవి, ఆమె భర్త ‘గురుకుల్ సొసైటీ’ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాత గురువుగారి సత్సంగంలో సభ్యులు. వాళ్లు యోగాసనాలు వెయ్యడం, ప్రాణాయామాలు చెయ్యడం, భజనలు చెయ్యడం, గురువుగారి ప్రవచనాలు ఆన్‌లైన్‌లో వినడం వీటితో బిజీగా వుంటారు. గీతా వాళ్లు కూడా ఆ సత్సంగసభ్యులే! అక్కడంతా అందరూ ఒకరినొకరు ‘అన్నా.. అక్కా..’ అని పిలుచుకుంటారు.

ప్రపంచంలో యే దేశానికి వెళ్లినా ఈ గురుకుల్ సొసైటీ సభ్యులుంటారు.

గీత, రాఘవన్ లకు పెళ్లై ఏడెనిమిదేళ్లయినా పిల్లలు పుట్టలేదు. ఎందరో డాక్టర్ల దగ్గర ఎన్నో రకాల ట్రీట్‌మెంట్‌లు తీసుకుని విసిగిపోయారు.

ఒకసారి సింగపూర్ నుంచి వాళ్ల తల్లిదండ్రులను చూడటానికి భారతదేశానికి వచ్చారు గీతా, రాఘవన్.

గీత వాళ్ల సొంతవూరు చెన్నై దగ్గర యేదో చిన్న పల్లెటూరు. ఆ ట్రిప్‌లో అక్కడికెళ్లారట. అక్కడ వాళ్లకు ఒక కుక్కపిల్ల చాలా దీనస్థితిలో తారసపడింది. దాన్ని పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందులు ఇప్పించి, ఇంటికి తీసుకెళ్లారు. దానికి బాగయ్యేసరికి గీతకు బాగా అలవాటైపోయింది. భార్యాభర్తలిద్దరికీ కూడా దానితో ఒక బంధం యేర్పడింది. గీతా వాళ్ల నాన్నగారు దానికి ‘నారాయణ’ అని పేరు పెట్టారు.

దాన్ని విడిచివుండలేక దాన్ని కూడా సింగపూర్ తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. విమానంలో పెంపుడు జంతువులను తీసుకెళ్లాలంటే బోలెడంత ఖర్చు. వాటిని ఒక బోనులాంటి దాంట్లో పెడతారు. దాంట్లోనే తిండీనీళ్లూ పెడతారు. వాటిని మనతో వుండనివ్వరు. వేరే యేదో యేర్పాటు వుంటుంది వాటికి. అవి ఒంటరిగా బెంబేలు పడుతూ వుంటాయి. మనకేమో వాటిపై దిగులు! ఇవన్నీ భరించి సింగపూర్ తీసుకొచ్చారు.

అది ఊరకుక్కే గానీ, చాలా తెలివైనది. వీళ్లిద్దరూ భజన చేస్తుంటే, అది కూడా తన భాషలో రాగాలు తీస్తుంది. యోగాసనాలు వేస్తుంటే, ఆసక్తిగా చూస్తుంది. వీళ్లు ధ్యానం చేసుకుంటుంటే అది కూడా గురువుగారి ఫోటో వైపే చూస్తూ కూర్చుంటుంది. అస్సలు అల్లరి చెయ్యదు.

వీళ్లు ఆఫీసులకు వెళ్లి వచ్చేటప్పటికి ఏమాత్రం గొడవ చెయ్యకుండా, ఇంటిని సంరక్షిస్తుంది. ఇంటికి అతిథులొస్తే మామూలుగా కుక్కలు చికాకు పడతాయి. నారూకు ఇంటికెవరైనా వస్తే ఇష్టం. వాళ్లకు అనుకూలంగా ప్రవర్తిస్తుంది. ఆడుకుంటుంది.

అలా మా జాహ్నవికీ అది ఎంతో దగ్గరయింది. గీతా, రాఘవన్ అయితే అది తమ బిడ్డేనని భావించి, తమకు బిడ్డలు లేరనే బాధను మరిచిపోయారు. ఇలా ఐదారేళ్లు గడిచాయి.

రాఘవన్‌కు లండన్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. అలా వాళ్లు లండన్‌కు నారూను కూడా తీసుకెళ్లారు. పాపం.. అక్కడ అనుకోని విధంగా ఇలా జరిగింది.

ఆ మరుసటి రోజు ఫోన్ చేస్తానన్న జాహ్నవి మళ్లీ నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేసింది.

ఈ రోజు చాలా ఉత్సాహంగా మాట్లాడుతోంది.

“పెద్దమ్మా.. నేనొక మంచిపని చేశాను తెలుసా? మీరైతే నన్ను మెచ్చుకోకుండా వుండలేరు..” యేదో సాధించేసిన ఆనందంతో అన్నది జాను.

“అబ్బా.. అంత మంచి పనేమి చేశావే.. చెప్పు చెప్పు..” అని ఆత్రుత ప్రదర్శించాను.

“మొన్నేమైందంటే..గీతా వాళ్లాయన నాకు ఫోన్ చేశాడు. ‘జాహ్నవి అక్కా.. గీత బాధ చూడలేక పోతున్నాను. నారాయణను మరిచిపోలేక పోతోంది. ‘వాడిని యమభటులు కొట్టేస్తున్నారేమో.. వాడు మనల్ని విడిచి రానంటూంటే లాక్కెళ్తున్నారేమో, యమలోకంలో యేమేమి శిక్షలు వేస్తున్నారో.. నా బిడ్డ ఎన్ని బాధలు పడుతున్నాడో.. వాడు స్వర్గానికి వెళ్లాడని తెలిస్తేనే నాకు నిశ్చింత. వాడి ఆత్మకు శాంతి కలిగిందంటే నాకు ఇక ఆలోచన వుండదు. చనిపోయిన వాళ్లతో ఫోన్‌లో నయినా మాట్లాడే వీలుంటే ఎంత బాగుండేది.. టీవీలో లాగా చూడగలిగితే ఎంత బాగుండేది?’ అంటూ మాట్లాడుతోంది. ఏడుపు ఉధృతం తగ్గింది కానీ, చాలా బాధపడుతోంది. వాళ్లమ్మా నాన్నా, మా అమ్మా నాన్నా ఎంత ఓదార్చినా వినడం లేదు. అందునా ఈ మధ్య మన గురువుగారు ‘గరుడపురాణం’ లో విషయాలు చెప్పారు కదా.. అవన్నీ గుర్తుచేసుకుని ఆందోళన పడుతోంది. రాత్రిపూట నిద్రపోదు. పడుకున్నా వాడినే కలవరిస్తూ లేచేస్తుంది. హిస్టీరిక్‌గా యేడుస్తోంది. నారూ సంగతేమో గానీ, మేమిద్దరం నరకం చూస్తున్నామక్కా. సింగపూర్‌లో వుంటే మీరుండేవారు. ఇక్కడ చాలా ఒంటరివాళ్లం అయ్యామక్కా! తనకు నారూ స్వర్గంలో సుఖంగా వున్నాడన్న నమ్మకం కలిగేలా చేస్తే కానీ తను తేలిక పడదని పిస్తోందక్కా.. మీరేదైనా సలహా చెప్పండి.’ అని చాలా బాధపడుతూ అడిగాడు పెద్దమ్మా! తప్పో ఒప్పోగానీ, నేనొక సలహా ఇచ్చాను.. ఉండండి.. వాడికేమో కావాలట..” అని పిల్లవాడు యేదో పిలుస్తుంటే వాడితో మాట్లాడుతోంది.

నా మనసు పరిపరి విధాలుగా పరిగెత్తింది. ఇదే తెలిసీ తెలియని పిల్ల. పైగా వాళ్లకు తనేం సలహా ఇచ్చిందో.. యేమోనని భయం వేసింది నాకు.

“ఏమి సలహా ఇస్తివే? తొరగా చెప్పు” అన్నాను ఉత్సుకతతో.

“కాశీ గంగలో నారాయణ అస్తికలు, చితాభస్మం నిమజ్జనం చేస్తే, వాడికి పిండప్రదానం చేయిస్తే ఉత్తమ గతులు కలుగుతాయని అంటారు. మరి అవి మనుషులకు చేస్తారు కానీ, జంతువులకు చేస్తారో.. లేదో.. మరి! అయినా ఈ మధ్యే మా అమ్మానాన్నా కాశీకి పోయి పిండప్రదానాలూ అవీ చేశారు. ఆ పురోహితుడి నంబరు నా దగ్గరుంది. అడగమంటే అడుగుతాను అన్నా’ అన్నాను. ‘మరి మీరు లండన్ నుంచి రావడం, పోవడం అందునా ఈ డిసెంబర్‌లో మరీ రేట్లు ఎక్కువుంటాయి కదా?’ అని కూడా చెప్పాను పెద్దమ్మా! కానీ రాఘవన్ ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ‘మరేం ఫరవాలేదక్కా.. డబ్బు పోతే పోతుంది. గీత స్తిమితపడితే చాలు. మీరు కనుక్కోండి’ అన్నాడు పెద్దమ్మా..”

అది ఇంకా యేదో మాట్లాడ బోతుంటే మధ్యలో నేను అందుకున్నాను. “ఆ అపరకర్మలూ, శ్రాద్ధాలూ మనుషులకు ఉద్దేశించినవి కదమ్మా! జీవుల పరిణామ క్రమం, కర్మసిద్ధాంతం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏక కణజీవి నుంచి మనిషి జన్మ దాకా 84 లక్షల జీవులుగా జీవుడి పరిణామక్రమం సాగుతుందంటారు. పూర్ణమైన పరిణతి కలిగిన మనిషికే ఈ అపరకర్మలూ అవీ చెప్పారు కానీ, జంతువులకు కాదు కదే?” నేను వివరించడానికి ప్రయత్నించాను.

“ఇవన్నీ సరే పెద్దమ్మా.. గీత మళ్లీ మనిషి కావాలంటే తనకు నారాయణ స్వర్గంలో సుఖంగా వున్నాడన్న నమ్మకం కలిగించాలి. అయినా కాశీ కాలభైరవ క్షేత్రం కదా పెద్దమ్మా! అంతటి శివుడే ఒక శునక స్వరూపానికి అంతటి పూజనీయత కల్పించాడంటే అందులో యేదో విశేషం వుంటుంది కదా! అందుకే కాశీలో పురోహితుడితో మాట్లాడాను. విషయం చెప్పాను. ముందు ‘జంతువులకు ఇలాంటి క్రియలు వుండవు.. మేము చెయ్యము..’ అన్నాడు ఆయన. నేను గీత పరిస్థితి చెప్పాను. కష్టం మీద ఒప్పుకున్నాడు. ఫీజు బాగానే అడిగాడనుకోండి. అయినా తన గురువుగారితో సంప్రదించి, జంతువులకు కూడా అపరకర్మలు చేసే పద్ధతులు వున్నాయని తెలుసుకున్నాడు. డబ్బు ఖర్చు అయినా గీత కోసం తప్పదు కదా! వాళ్లు బాగానే వున్నవాళ్లే లెండి పెద్దమ్మా! వాళ్లు టికెట్‌లు కూడా బుక్ చేసుకున్నారు. రెండున్నర రెట్లు రేటు పడ్డాయి టికెట్లు.. కాశీలో త్రీ స్టార్ హోటల్‌లో రూములు కూడా బుక్ చేయించాను. వీళ్లను చూడడానికి వాళ్లిద్దరి అమ్మానాన్నలూ వస్తున్నారు, చెన్నై నుంచి. మరి నాలుగు ఫామిలీస్ అందరూ గురుకుల్ వాళ్లే.. కుక్కకు అపరకర్మలు ఎలా చేస్తున్నారో చూడ్డానికి వస్తున్నారు విమానంలో. వాళ్లంతా బెంగుళూరు, చెన్నై నుంచి వస్తున్నారు. గీతకు కొంచెం ఉత్సాహం వచ్చిందట. కాస్త తిని తిరుగుతోంది. నేను చేసింది మంచిపనే కదా పెద్దమ్మా.. చెప్పండి.. చెప్పండి” అని త్వరపెట్టింది జాహ్నవి.

తన మాటలు వింటుంటే నా మొహంలో వేగంగా రంగులు మారుతున్నాయి.

కుక్క చనిపోవడమేమిటి? ఇంత ఖర్చు, ఇంతింత హడావిడి యేమిటి? ఈ బెంగపెట్టుకోవడమేమిటి? ఈ కర్మకాండలు చూడడానికి ఇంకో నాలుగు కుటుంబాలు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టుకోని కాశీకి వెళ్లడమేమిటి? జంతువులకు ఈ కర్మకాండలు వర్తించవంటే వినకుండా ఆ పురోహితుడిని ఒప్పించడం యేమిటి? ఈ కాలం పిల్లలకు అసలు డబ్బు విలువ తెలియడం లేదు. వీళ్లకు సామాజిక స్పృహ అసలు వుందా? యోగా, భక్తి, గురువు, సాధన అనే పేరుతో యేదో కొంత సంప్రదాయ మార్గంలో వున్నారని తృప్తిపడాల్సిందే గానీ, వీళ్లకు జీవితం లోతులు తెలియడం లేదు. భక్తిని, గురుబోధను నిజ జీవితంలోకి తెచ్చుకునే జ్ఞానం లేదు. అంతా అరకొర అవగాహన.. మిడిమిడి జ్ఞానం.. ఇలా ఆలోచనలలో కొట్టుకుపోతున్నాను.

తనేదో మాట్లాడుతూనే వుంది. నేనేం జవాబు చెప్పాలో ఊహించుకుంటూ మౌనంగా వున్నాను.

“లైన్‌లో వున్నారా పెద్దమ్మా! మాట్లాడటం లేదేమిటి? నిజంగా నేను చేసింది మంచి పనేకదా.. చెప్పండి” అన్నది జాహ్నవి.

“మంచిపనేలే కానీ, కాలభైరవుడు, శునకస్వరూపం, కాశీ క్షేత్ర పాలకుడు ఇవన్నీ సరిగ్గా తత్త్వస్వరూపంగా పెద్దల ద్వారా అవగాహన చేసుకోవలసినవి జానూ. ఇవన్నీ పైపైన మాట్లాడే మాటలు కాదు. సరే.. ఇదంతా విని మీ ఆయనేమన్నారు చెప్పు?” అన్నాను.

“ఇదంతా అనవసరం.. వేస్టాఫ్ మనీ. నీ తెలిసీతెలియనితనంతో వాళ్లకు కూడా లేనిపోని ఖర్చు పెట్టిస్తున్నావు.. అని ముక్కచివాట్లు పెట్టారు పెద్దమ్మా.. మహా ప్రాక్టికల్ మనిషి లెండి!” అన్నది జాహ్నవి.. నిష్ఠూరంగా.

నాకేమో జాహ్నవీ వాళ్లాయన మాటలే సరైనవనిపించాయి.

మరో పదిరోజుల తరువాత ఆనందంగా ఫోన్ చేసింది జాహ్నవి. “పెద్దమ్మా! గీతా వాళ్లు ఇండియాకు వచ్చి, కాశీలో నారూ అస్తికల నిమజ్జనం, శ్రాద్ధం అన్నీ బాగా జరిపించారట. అక్కడి పురోహితుల సలహా మేరకు ప్రయాగ, గయ కూడా వెళ్లి అక్కడ కూడా శ్రాద్ధాలూ, అవీ పెట్టారట. నారుకే కాదు, రాఘవన్ వాళ్ల నాన్నగారు, గీతా వాళ్ల నాన్నగారూ వాళ్ల పెద్దవాళ్లకు కూడా శ్రాద్ధాలు, పిండప్రదానాలూ చేశారట. భారీగా అన్నదానాలు, ఇతర దానాలూ చేశారట. గుళ్లూగోపురాలూ అన్నీ తిరిగారు. ప్రార్థనలు చేశారు నారూ కోసం.

పురోహితుడు బాగా డబ్బు లాగాడు. మొత్తం లండన్ నుంచి వచ్చిన ప్రయాణం ఖర్చులు, పురోహితుడి ఖర్చులు, హోటల్ ఖర్చులు, భోజనాలు, లాజిస్టిక్ ఖర్చులు కలిసి పదిలక్షల దాకా వదిలాయి. గీత ఇప్పుడు సంతోషంగా వుంది. ఆమెకు నారూ స్వర్గంలో సుఖంగా వున్నాడన్న విశ్వాసం యేర్పడింది.

ఇంకో విశేషం యేంటంటే.. వాళ్ల అమ్మానాన్నా వాళ్లు వాళ్ల బంధువుల పిల్లవాడిని దత్తత తీసుకునేందుకు ఒప్పించారు గీతనూ, రాఘవన్‌నూ. మూడునెలల పిల్లవాడు. తల్లి పురిటిలోనే చనిపోయింది. పేదవాళ్లు. వాళ్ల సమస్య ఈ విధంగా పరిష్కారం అవుతోంది. గీత వాళ్ల అమ్మావాళ్ల దగ్గరే కొన్నాళ్లు వుండి, ఆ పిల్లాడిని అలవాటు చేసుకుంటుందట!

కానీ, నా వల్ల వాళ్లకు చాలా డబ్బు ఖర్చయింది పెద్దమ్మా.. అదే నాకు బాధగా వుంది. అదే రాఘవన్ గారితో అన్నాను. ‘డబ్బు పోతే పోయిందక్కా.. గీతకు మనసు స్థిమితపడింది. అది చాలు నాకు!’ అన్నాడు పెద్దమ్మా. ఈ ట్రిప్ వల్ల ఒక బిడ్డను పోగొట్టుకున్న వాళ్లకు మరొక బిడ్డ దొరికాడు. నెలరోజుల్లో మళ్లీ వచ్చి దత్తత వ్యవహారాలు చూసుకుంటాడట రాఘవన్. నాకు తృప్తిగా వుంది పెద్దమ్మా.. నేను చేసింది మంచిపనే కదా.. చెప్పండి.. చెప్పండి..” అని తొందరపెట్టేసింది జాహ్నవి.

“ఎదుటివారి మనశ్శాంతి కోసం తాపత్రయపడ్డావు. అది మంచి సంస్కారం జానూ! నీకు మంచే జరుగుతుంది” అన్నాను నేను తనను ప్రోత్సాహపరుస్తూ. వాళ్లాయన వస్తున్నట్టున్నాడని గభాల్న ఫోన్ పెట్టేసింది జాహ్నవి.

తల తిప్పి పక్కకు చూస్తును కదా.. మా పక్క ఫ్లాట్ల వాళ్లు, నా స్నేహితురాళ్లు, రామలక్ష్మి, శారద వచ్చి నిశ్శబ్దంగా కూర్చుని వున్నారు. రోజూ ఇదే సమయానికి మేము ముగ్గురమూ ‘సౌందర్యలహరి’ పారాయణం చేసుకుంటాము.

“ఒక పదినిముషాలు ఆగి పారాయణం మొదలెడదాం ఇందిరా.. యేమైంది చెప్పండి.. వాళ్లు కాశీకి వచ్చి కార్యక్రమాలు పూర్తిచేసుకున్నారా? గీతకు మనశ్శాంతి కలిగిందా” ఆత్రుతగా అడిగింది రామలక్ష్మి.

ఈ కథ వాళ్లకు ముందుగానే చెప్పాను. ఇప్పుడు పూర్తిగా చెప్పాను.

“దీనిపైన మీ ఇద్దరి అభిప్రాయం చెప్పండి. ఈ పిల్లలు ముగ్గురూ చేసిన పని మంచిదేనంటారా?” అడిగాను.

“గీత, రాఘవన్, జాహ్నవి ముగ్గురూ ముగ్గురే.. మంచిపిల్లలు. చిన్నవయసులోనే గురుసేవ చేసుకుంటున్నారు. జంతువులను తమతో సమానంగా చూసుకోగల మానవతావాదులు. జీవకారుణ్యం కలవారు! అంతమాత్రాన మనుషులకు జరిపినట్టు జంతువులకు కూడా అపరకర్మలు జరపాలనుకోవడం నాకు నచ్చలేదు. పురోహితుణ్ని డబ్బు ఆశకు గురిచేసి, ఒక అసత్యపు ప్రక్రియ ద్వారా గీతకు మనశ్శాంతి కలిగించడంలో, జాహ్నవి ఓ మంచి స్నేహితురాలిగా మార్కులు పొందింది. కానీ, మన వేదవిహితమైన మన మంత్రశాస్త్రాన్ని అవహేళన చేసినట్టయింది. అది నా మనసును గుచ్చుతోంది. మరే మతంలోనైనా ఇలాంటి పనిని జరగనిస్తారా? డబ్బుతో దైవాన్నయినా లొంగదీయవచ్చనే అతి ఆత్మవిశ్వాసం వీళ్లది..” ఆగింది శారద.

“కుక్క అస్తికలు గంగానదిలో కలపడం వరకు ఓకే. అన్నదానాలూ, ఇతర దానాలూ చేయడం మంచిదే! కానీ, కులము, వంశము, గోత్రం ఇవన్నీ అవసరమైన అపరక్రతువుకు మనిషి కాని కుక్కను అర్హంగా భావించడం వీళ్లు చేసిన పొరబాటు. నారూకు ఆత్మశాంతే కావాలంటే ‘శునక సంరక్షణా కేంద్రాలకు, జంతుసంరక్షణా కేంద్రాలకు, గోసేవా కేంద్రాలకు కొంత డబ్బును కేటాయించి వుండవచ్చు. లేదా అనాథశరణాలయాలకు దానం చేసివుండవచ్చు. ‘అక్షయపాత్ర ‘లాంటి సెంటర్లకు దానం చేసి పదిమందికి భోజనం పెట్టడం ద్వారా నారూకు ఆత్మశాంతిని కలిగించి వుండవచ్చు. ఈ కార్యక్రమాలను చూడటానికి వచ్చిన నాలుగు కుటుంబాలవారు దీన్ని ప్రచారం చేసి, కుక్కలకు అపరకర్మలు చేయవచ్చనే భావాన్ని పదిమందికీ పంచుతారు. ఇదొక ఫాషన్‌గా, మానవతా వాదులమనే బ్రాండ్ వేసుకోవడానికి అనుకూలమైన విషయంగా.. ఒక వేలంవెర్రిలా ముందు ముందు మారే అవకాశం వుంది. కానీ, పిల్లలు తెలిసీ తెలియని తనంతో మన మతానికి తూట్లు పొడిచారు. పిల్లలు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది” తన అభిప్రాయం చెప్పింది రామలక్ష్మి.

“జంతువులకు కూడా అపరకర్మలు చేసే పద్ధతేదో కనుగొన్నారట.. కాశీపండితులు! అయినా జంతువుల పేరిట వేలంవెర్రి ఎప్పుడో ముదిరింది లెండి. కుక్కలకు అన్నాలు కలిపి నోట్లో పెట్టడాలూ, వందలాది డాలర్లు ఖర్చుపెట్టి వాటికి స్విమ్మింగ్ పూల్సు, ట్రైనింగ్‌లూ ఇప్పించడాలు, వాటికి హెయిర్ డ్రెస్‌లు, డ్రెస్‌లు, బూట్లు తొడగడాలు, వాటికి శ్రీమంతాలు చెయ్యడం.. ఇవన్నీ మా జాహ్నవి చెబుతూనే వుంటుంది. ఈ కథ అంతటిలో గీతకు పెంచుకునేందుకు ఒక బిడ్డ దొరకడం అన్నింటికన్నా ఆనందకరమైన విషయం!” అన్నాను నేను.

చర్చను అక్కడ ముగించి ముగ్గురం పారాయణం మొదలుపెట్టాము. కానీ నా మనసు కింది శ్లోకం పైనే నిమగ్నమైంది.

శ్లో.

అవిద్యానామన్తస్తిమిర మిహిర ద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబక మకరంద శ్రుతి ఝరీ।
దరిద్రాణాం చింతామణి గుణనికా.. జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి॥

తాత్పర్యం: అమ్మా! నీ పాదధూళి అజ్ఞానుల మనసులలోని అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడంలో సూర్యోదయం వంటిది. జడులకు చేతనత్వమును కలిగించే జ్ఞానపుష్ప మకరంద ప్రవాహం అవుతున్నది. దరిద్రులకు కోరిన కోరికలనిచ్చే చింతామణి హారం అవుతున్నది. సంసారసముద్రంలో మునిగిన బాధితులను ఉద్ధరించడంలో సముద్రమగ్నమైన భూమిని ఉద్ధరించిన వరాహదంష్ట్ర అవుతున్నది.

‘ఈ అవిద్యే సంసారానికి మూలకందం. దీని నుంచి బయటపడే జ్ఞానకిరణాన్ని సమస్త మానవాళికీ ప్రసాదించు తల్లీ!’ నా మనసు ప్రార్థిస్తోంది ఆ చింతామణి గుణనికను!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here