అతిరాత్రం

2
56

బందరు పక్కనే ఉన్నా పల్లెటూరు బైరాగిపాలెం మా పూర్వికులది. ఎక్కడినుంచో వచ్చి ఓ ముస్లిం ఫకీరు అక్కడ స్థిరపడ్డాడని మా ఊరికి ఆ పేరొచ్చిందని చెప్తారు. ప్రస్తుతం ఆ మతస్థుల జనాభా తక్కువే అయినా ఇప్పటికీ పీర్ల పండుగా వంటివి ఊర్లో అందరూ కలిసే జరుపుకుంటారు. మా తాతయ్యకు నలుగురు కొడుకులు అంతా ఉద్యోగ రీత్యా వేరే ఊర్లలో స్థిరపడ్డారు. కానీ ఆయన బ్రతికున్నంత కాలం అందరూ సెలవులకి అక్కడికి చేరుకొనేవాళ్ళం. మా నాయనమ్మ మాకు పిండివంటలతోపాటు తాతయ్యతో మసీదులో ఉండే మస్తాన్ సాహెబ్ దగ్గర్నుంచి తెప్పించిన మంత్రించిన తాయత్తులు కూడా సిద్ధం చేసేది. ఊర్లో వాళ్ళ కళ్ళు మంచివి కావని, నజర్ తగులుతుందని పిల్లలకి, దుష్టశక్తుల నుంచీ కాపాడుతుందని పెద్దలకి కట్టేది. ఆ మస్తాన్ సాహెబ్ శక్తుల గురించి చిన్నప్పుడు ఎన్నో కధలు వినేవాళ్ళం.
“ఆయన ఎప్పుడో చచ్చిపోయాడన్నా. ఇప్పుడున్న సాహెబు అంత సీను లేదు” ఇంకా ఆ ఊర్లోనే ఉన్నా మా తాతయ్య తమ్ముడి సంతతిలో, నాకు తమ్ముడి వరస అయ్యే పెదనాన్న కొడుకు చెప్పాడు.
“ఒక్కసారి ట్రై చేద్దాంరా!” ఆశగా అన్నా నేను.
“ఆడి కంటే పెడన పెద్ద మసీదులో ఒక పెద్దాయన ఉన్నాడంట. ఈ మధ్య ఇలాటి విషయాల్లో ఆయన గురించే చెప్పుకొంటున్నారు. ఆడికి పోదాం” అని తీసుకుపోయాడు.
సరే ఎలాగోలా నా పని అయితే చాలని నేను అనుకొన్నా.
“ఈ నీళ్లు మక్కా నుంచీ తెచ్చాయి. ఇంటి చుట్టూ చల్లుకొంటే ఏ ఆత్మలు రావు” తెల్లటి పొడవైన గెడ్డం, తలపైన నల్లటి టోపీ, లోపల లాల్చీ పైజామా లాంటి డ్రెస్‌ను మొత్తం కప్పేసిన బుడిద రంగు అంగీతో మసీదు ద్వారం ముందు కుర్చీలో కూర్చొని చేతిలోని నల్లని గుండ్రపు పూసల మాలను తిప్పుతూ నాకు ఓ బాటిల్ అందించాడు సాయిబుగారు.
“కాదు సాహెబ్, నేను ఒక ఆత్మతో మాటలాడాలి. ముఝే బాత్ కర్నా హై” నేను మళ్ళీ చెప్పాను.
ఆయన నన్ను తీక్షణంగా చూసి “షైతాన్ సే బాత్ కర్తా? హిమ్మత్ హై?” అన్నాడు.
స్థిరంగా తలూపాను నేను. నన్ను లోపలికి తీసుకు పోయి ఒక గదిలో పరుపు మీద కూర్చోమన్నారు. ఫకీర్ గారు నా ఎదురుగా కూర్చొని, ఒక చెంబులో నీళ్లు తెప్పించి మా మధ్య పెట్టించారు.
“దేఖ్. మామూలు పసుపు నీళ్లు. నీ మాస్టార్ పేరు చెప్పూ. నేను మంత్రం వేసి పిలుస్తా. వాడు ఇక్కడికి వస్తే ఈ చెంబులో నీళ్లు మరుగుతాయ్. అదే గుర్తు. అప్పుడు అడుగు. మధ్యలో భయం వేస్తే, ఈ ఉప్పు ఆ చెంబులో వేసేయ్. డర్నా నహీ. సరేనా?”
నేను మా తమ్ముడూ చెరో గుప్పిళ్లలో ఉప్పు పట్టుకొని కూర్చున్నాం. ఫకీరుగారు మంత్రాలు చదవడం మొదలు పెట్టారు. దాదాపు పావుగంట తరవాత చెంబులో కొద్దిగా అలికిడి కనిపించింది. మెల్లగా నీళ్లు మరగనారంభించాయి. “లే ఓ ఆగయా” అన్నాడు ఫకీరు. “సార్….. నేనూ…. ఒకటి అడగాలి మిమ్మల్ని” మాట తడబడుతుంది నాకు.
చెంబు వంకా మంత్రాలు చదువుతన్న సాయిబు వంకా మార్చి మార్చి చూస్తున్నాడు మా వాడు.
కానిమ్మని చేతితో సైగ చేశాడు ఫకీరు నాకు.
“సార్… అదీ… నేను తెలుసుకదా మీకు…. మీరు… మీరేనా?… అసలు మీ పేరేంటి?……”
చెంబు ఊగిపోతోంది. బదులు లేదు.
నేను ఫకీర్ వంక చూసాను. “బోల్. సైతాన్. మాటాడు” అంటూ తన చేతిలోని పొడిని చెంబు వైపు గాల్లోకి చల్లాడు. అయినా ఫలితం లేదు.
మళ్ళీ అడగమన్నాడు, “మీరెందుకు ఆత్మహత్య చేసుకున్నారు?” అనడిగా, జవాబు లేదు. మంత్రాలు చదివాడు ఫలితం లేదు. ఈ తంతు ఒక గంటవరకు కొనసాగింది. నేను ఏదో అడగడం, సాయిబుగారు బెదిరించడం ఇలా. చివరికి నీళ్లు చల్లబడిపోయాయి.
“అది నీతో మాట్లాడదు” అని, నా చేతికి ఒక తాయత్తు కట్టి, నేనిచ్చిన డబ్బు సున్నితంగా తిరస్కరించి “అల్లా భలా కరేగా” అని ఆశీర్వదించి పంపేశాడు ముసలాయన.

***

“మార్నింగ్ వికాస్. హౌ ఆర్ యూ ?”
“వెరీ గుడ్ మార్నింగ్ సార్. యామ్ పైన్… మీరెలా ఉన్నారు?”
“ఆ… హా… హా… అసలు బ్రతికే లేనివాడిని ఎలాగున్నారు అని అడుగుతున్నావే” నవ్వేసారు ఆయన.
తనకు ఇష్టమైన పసుపు రంగు షర్ట్, నీటుగా టక్ చేసుకొని, ఎప్పటిలాగే పాలిష్ చేసిన బూట్లు వేసుకొని వచ్చి నా గదిలో కుర్చీలో కూర్చున్నారు హర్షల్ దివేకర్ గారు.
నాకు నవ్వు రాలేదు. “ఎందుకు సార్… ? ఎందుకిలా చేశారు?” అడిగేసాను.
కాసేపు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయిన ఆయన మెల్లగా రిక్త హస్తాలను చూపిస్తూ, “తట్టుకోలేకపోయాను వికాస్. ఒంటరితనం, చుట్టాల దెప్పిపొడుపులు భరించలేకపోయాను”
“అవన్నీ అర్థం చేసుకోగలను సార్. కానీ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లారు? ఈ కోర్టు విడాకులు మంజూరు చేసినా పై కోర్టుకెళ్లి కనీసం ఒక్క పిల్లాడినన్నా మీ వద్దకు తెచ్చుకొనే వీలుండేది. అదీ కాకపొతే, మేడం పిల్లల్ని బాగానే చూసుకొనే వాళ్ళు కదా? వాళ్లకు ఏదైనా లోటు జరిగితే నా లాటివాళ్ళు చూస్తూ ఊరుకునే వాళ్ళం కాదు కదా అండీ. అన్నింటికీ మించి మీ అమ్మగారు ఇంకా బ్రతికే ఉన్నారు, ఆవిడ వాళ్ళను వదిలిపెట్టేది కాదు. మీకు ఉన్నాది వాళ్ల చదువులకీ, దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధిలో ఉపయోగపడిన మీ పేటెంటు ఫార్ములాని వాడుకున్నందుకు ఇస్రో మీకు చెల్లిస్తున్న రాయల్టీ మొత్తం వాళ్ళ జీవితానికి సరిపోయేది. రీసర్చ్ కోసం మీ దగ్గర చేరిన నాటినుంచీ, ఆ పసి వాళ్ళని ఈ చేతులతో ఎత్తుకొని ఆడించాను. మీ మరణం కన్నా, ఆ చిన్నారులు దూరం అవ్వడమే నన్ను ఎక్కువ బాధిస్తుంది సార్. ఎందుకు చేసారిలా?” అన్నాను.
తల ఆడిస్తూ లేచి గదిలో అటూ ఇటూ తిరుగుతూ, “నిజమేనోయ్! మా పెద్దమ్మాయి పుట్టిన ఏడాదే నువ్వు నా దగ్గరకొచ్చావు. రోదసి యాత్రలో దేశానికి ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించడానికి రేయింబవళ్లు కష్టపడి ఆ ఫార్ములాను కనుగొనే ప్రయత్నంలోనే నేను నా భార్యను నిర్లక్ష్యం చేశానని తనకు అనిపించింది. అలా ఆమె నాకు దూరం జరుగుతూ పోయింది. నా పని హడావిడినంతా తను నాకు వ్యతిరేకంగా ఎత్తి చూపిస్తూ కోర్టుకెక్కింది. విడాకులు ఇచ్చేసారు. పేటెంటు దక్కింది, పెళ్ళాం – పిల్లలు దూరమయ్యారు. వారాంతంలో రెండు గంటలు నా కూతురూ, కొడుకు నన్ను కలిసేది. మా అమ్మా, నేనూ అసలు బయటవారిని ఎదుర్కోలేక పోయేవాళ్ళం. కాలేజీ నుంచి ఇంటికొస్తే ఒంటరితనం వెక్కిరించేది” అని చెప్పుకు పోతున్నాయన్ని నేను మధ్యలోనే ఆపి వేసి
“మీరు మళ్ళీ అదే చెప్తున్నారు. కానీ ఏమీ ఎరగని ఆ పిల్లల్ని ఎందుకు…?” అన్నాను.
“అదే చెప్తున్నానయ్యా. శాస్త్రీయ సమస్యల్ని పరిష్కరించినట్టు నా జీవిత వైఫల్యాన్ని కూడా సరిదిద్దుకుందామని ఎంతో ప్రయత్నం చేసాను. మీ మేడమ్‌ని ఎన్నో విధాల వేడుకున్నా కానీ ఆమె మనసు కరగలా. ఎక్స్‌పరిమెంటు ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ కొన్ని పారామితులు మార్చి యత్నించినట్టు శతథా ట్రై చేసాను. ప్చ్… ఇక ఈ జీవితం అనవసరమనిపించింది… ముగించేద్దామనుకున్నా. ఆ శనివారం సాయంత్రం నా పిల్లలతో గడిపి… వెళ్ళిపోదాం అని నిర్ణయించేసుకున్నా. ఎందుకంటే తర్వాతి రోజు ఆదివారం ప్రపంచమంతటికీ సెలవు. కాలేజీ ఉండదు. నీలాటి శిష్యులు మీ మీ కుటుంబాలతో గడపడానికి వెళతారు. నేను మాత్రం ఒక్కడినే….”
“మీ మదర్ ఉన్నారు కదా సార్!”
“ఆ ఆలోచన రాలేదు వికాస్. పిల్లల్ని చివరిసారి అమ్మకు చూపించాలని కూడా నాకు తోచలేదు. ఎందుకంటే నాకు వాళ్ళను తీసుకెళ్లే ఉద్దేశం లేదు”
“యెస్… నాకు తెల్సు సార్… మీరు అలా చెయ్యరు. మరి ఏం జరిగింది. ఎవరు చేశారు ?”
“నేనే వికాస్… నేనే. నా చేతులతో…”
“ఇప్పుడే ఆ ఉద్దేశం లేదన్నారు కాదా?”
“ముందు లేదు. కానీ అప్పటికప్పుడు పుట్టింది.”
మౌనం కాసేపు మా మధ్య తల దూర్చింది.
“ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు మాట్లాడించావు?” ఆయనే ప్రశ్నించాడు.
“మీరంటే గౌరవం కాబట్టి. మీ మీది ఈ అపప్రద చెరిపివెయ్యాలని” నిజంగానే చెప్పాను నేను.
“అదే.. అదే…. గౌరవమో, ఇష్టమో ఉంటే ఆ వస్తువో, మనిషో దూరం అయితే బాధ కలుగుతుందని అప్పుడే తెల్సుకున్నా. అందుకే అలా చేశా…” అర్ధం కాలేదు నాకు.
మాస్టారు మాత్రం కొనసాగించారు, “ఒక వారం ఎంట్రన్సు పేపర్ సెట్ చెయ్యడానికి వెళ్ళాను. ఒక వారం అయినవాళ్ల పెళ్ళికి వేరే ఊరెళ్ళాను. నాకు ఉన్నది వారాంతంలో రెండు గంటలే కదా! మధ్యలో వీలు లేదు (వత్తి పలికారు). ఫోన్ చేస్తే ఆవిడ ట్యూషన్ అనో, ఆడుకుంటున్నారనో చెప్పేది. అలా మూడు వారాల తరవాత నేను నా పిల్లల్ని కలిసాను. మీ మేడం మళ్ళీ రెండు గంటల్లో తీసుకొచ్చేయ్యాలని గుర్తు చేసి మరీ నాతో పంపింది” పళ్ళు కొరుకుతూ చేతిని గోడకు కొట్టారు.
“అప్పుడు కూడా మళ్ళీ నా దగ్గరకొచ్చేయ్యమని బ్రతిమాలాను కానీ ఆ రాతి గుండె కరగలేదు. కారు ఎక్కిన వెంటనే మా చిన్నాడు ఐస్‌క్రీం అడిగాడు. నీకు తెల్సు కదా వాడికి ఐస్‌క్రీం అంటే ఎంతిష్టమో. వెంటనే కొన్నా. అమ్మాయి బిర్యాని కావాలన్నది. పారడైస్ బిర్యాని తనకు బాగా ఇష్టమైనది. వెళ్లి తీసుకున్నాం. పూర్తిగా వెజిటేరియన్‌గా మారిపోయిన అనిత (మా మేడం) పిల్లకి అసలు మాంసం వాసన కూడా చూపించడంలేదట. ముక్కు ఎప్పుడూ కారుతుందని స్కూల్ టీచర్ చెప్పిందని చిన్నాడికి ఐస్‌క్రీం దూరం చేసింది. వాళ్ళకి ఇష్టమైనవి దొరకక వాళ్ళు పడే బాధ నాకు వాళ్ళు మమ్మీ మీద చెప్పిన చాడీలలో కనపడింది. ఆ క్షణం నాకు అనిపించింది, ఆ బాధ చిన్న పిల్లలకేనా…? ఇష్టం అయిన వాళ్ళు దూరం అయితే పెద్దాళ్ళకి మాత్రం ఉండదా?… అంతే నేను నిశ్చయించేసుకున్నా. మళ్ళీ ఐస్‌క్రీం కొన్నా. సిటీ సరిహద్దులలోకి కారు పోనిచ్చా. అప్పటికే నాకోసం సిద్ధం చేసుకున్నా విషాన్ని ముందు బిర్యానీలో కలిపా. నా కూతురు అడిగింది వికాస్, ‘డాడీ అదేంటని’ టెస్టు కోసం కలిపే ప్లేవర్ అని చెప్పా. ఆబగా రెండు ముద్దలు తిని…. తల వాల్చేసింది. ఇదేమీ పట్టించు కోకుండా ఐస్‌క్రీం తింటున్నా చిన్నాడికి ‘నీకూ ఫ్లేవర్ కలుపుతా’ అని కోన్‍లో కొంచెం పోసా. రుచి చూసి ‘ఏం బాలేదని’ బయటకి విసిరేసాడు. కానీ వాడి నాలుక్కి తగిలిన విషం వెంటనే నాడీ వ్యవస్థని స్తంభింప చేసింది.
అప్పుడు నేనూ కొంచెం బిర్యానీ తినీ….. నాకు ఇష్టమైన కుటుంబం దూరం అయితే నాకు బాధ వేసింది. వాళ్లకు నచ్చినవి దొరక్కపోతే పిల్లలు బాధ పడ్డారు. తన పిల్లలు దూరం అయితే అనితకు బాధ కలుగదా? అప్పుడైనా తను నా బాధ అర్ధం చేసుకుంటదని” ఆయన్ని పూర్తిచెయ్యనివ్వకుండానే నేను అందుకున్నా, “ఎంతో చదువుకున్నారు. ఎంతో జీవితాన్ని చూశారు. కానీ క్షణికమైన క్రోధావేశాల్ని మాత్రం అదుపుచేసుకోలేపోయారు. ఇప్పటికీ నా రూంలో మీ ఫోటో ఉంది. కాలేజీ కమిటీతో మాట్లాడి మీ నిలువెత్తు విగ్రహం మన డిపార్ట్‌మెంట్ బిల్డింగు ముందు పెట్టిద్దామని నిర్ణయించాము. కానీ రేపు ‘ఈ మేధావి జీవితం ఎలా అంతమయ్యిందని?’ ఏ విద్యార్థి అయినా అడిగితే, మీ ఫోటో చూసిన వెంటనే మీ పిల్లలు నాకు గుర్తొస్తే – మాకు మీ పట్ల ఎటువంటి గౌరవం కలగదు సార్. మీరు పోయిన రోజు మేడం మీ అమ్మ గారిని, ‘నువ్వు పాముని కన్నావే, అందుకే వాడు తన పిల్లల్ని తానే మింగేశాడు’ అని నిందిస్తుంటే, ఆమె ఏమనలేక తల దించుకుంది సార్. షార్ నుంచి వచ్చిన ప్రత్యేక పుష్పగుచ్చాన్ని చూపి ఆ రోజు మీ గొప్పతనం చాటాను. కానీ ఇక పై మీ మీద నాకు ఏ గురుభావం ఉండదు. అరిషడ్వార్గాలని అదుపు చేసుకోలేని మీరు మాలాటి వారికి ఎన్నటికీ ఆదర్శం కాలేరు. చరిత్ర సృష్టించే సత్తా ఉన్నా చేతులారా చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోయారు మీరు. వెళ్లిపోండి, వెళ్లి ఆ చీకటిలోనే కలిసిపొండి” అంటూ అరిచాను నేను.
“ఒరేయ్ వికాస్… లెగూ. ఏంటా కలవరింతలూ? హనుమాన్ చాలీసా తలగడ కింద పెట్టుకోలేదా? వెదవ తిరుగుళ్ళు తిరగడం, లేని పోనివి నెత్తినేసుకోవడం” అమ్మ నన్ను తట్టి లేపుతుంది.
కళ్ళు తెరిచి చూసిన నాకు వెలుగు రథంపై చీకట్లను చీల్చుకుంటూ వస్తున్న ప్రభాత సూర్యుడు కనిపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here