ఆత్మ స్వరూపం

0
15

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఆత్మ స్వరూపం’ అనే రచనని అందిస్తున్నాము.]

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః॥
(భగవద్గీత, 2వ అధ్యాయం – సాంఖ్య యోగంలో 23వ శ్లోకం)

ఈ ఆత్మను, ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు. నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు అని భగవానుడు పై శ్లోకం ద్వారా ఆత్మ యొక్క స్వరూపం గురించి వివరిస్తున్నాడు.

శ్లో:
అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమ్ అక్లేద్యోఽశోష్య ఏవ చ।
నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః॥
(భగవద్గీత, 2వ అధ్యాయం – సాంఖ్య యోగంలో 24వ శ్లోకం)

ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది. దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పులేనిది, పరివర్తనలేనిది, మరియు సనాతనమైనది. దానికి ఒక భౌతిక స్వరూపం లేదు కాని పరమాత్మలో ఒక భాగమైన ఈ ఆత్మ మానవుల జీవితాలకు మూలమై వున్నది.

ఆత్మ యొక్క ప్రాశస్త్యము తెలిపే అద్భుతమైన శ్లోకాలుగా పండితులు వీటిని వర్ణిస్తున్నారు.

అసలు ఆత్మ అంటే ఎవరికీ తెలియదనే చెప్పాలి. దీనిని వారి హృదయాలలో కఠోర సాధన ద్వారా సాక్షాత్కరించుకున్న వాళ్ళకు మాత్రమే దాని తత్వము ఏమిటో అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుస్తుంది, తప్ప పలు మత గ్రంథాలలోని సూక్ష్మమైన రహస్యాలను సైతం బోధించే పండితులకు సైతం దాని స్వరూపం ఏమిటో తెలియదు.

ఆత్మ స్వరూపం గురించి భగవాన్ శ్రీ సత్యసాయి ఒక సందర్భంలో అద్భుతంగా తెలియజేసారు:

“ఆత్మ గాలి లాంటిది. గాలి ప్రతిదానిని వ్యాపింపజేస్తుంది. ఇది అతి చిన్న విస్తీర్ణం నుండి పెద్ద క్షేత్రాలలో ఉంది. గాలి అన్నింటినీ వ్యాపిస్తుంది. అంతా గాలిలో ఉంది; గాలి ప్రతిదానిలో ఉంది. అది ఆత్మ స్వరూపం. కుండను పగలగొడితే కుండలోపలి గాలి, కుండ బయట గాలి ఒక్కటి అవుతాయి. మీరు కుండను మూసివేస్తే, మీరు గాలిని ‘కుండలో గాలి’ మరియు ‘బయట గాలి’ అని నిర్వచించవచ్చు. తనకు తానుగా ఉన్న ఈ అనుబంధం మరియు కేవలం శరీరం మాత్రమే అని విశ్వసించడం ఈ తేడాలన్నింటినీ తెస్తుంది. మీరు ఈ అనుబంధాన్ని వదులుకుంటే, ప్రతిదీ ఒకటిగా కనిపిస్తుంది. శరీర బంధం తొలగిపోయిన క్షణంలో, జీవాత్మ మరియు పరమాత్మ ఒక్కటే అవుతారు మరియు ఉన్నది ఒక్కటే. ఈ వ్యత్యాసాన్ని సృష్టించేది మనమే”

నిరంతరం మనల్ని నడిపించే నేను.. నేను అనేది ఈ శరీరం కాదని, ఆత్మ అని తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యం. మనుషులంతా ఆత్మ స్వరూపులని వేదం ప్రభోదిస్తోంది. శరీరంతో ఆత్మ తాదాత్మ్యం చెందినప్పుడు మనిషిలో ‘నేనే అన్నింటికీ కర్తను, అనుభవించే భోక్తను’ అన్న అహంకారం కలుగుతుంది. ఈ భావనలే మానవ జీవిత వినాశనానికి దారితీస్తున్నాయి. ఈ భావనలను సాధ్యమైనంత త్వరగా వదిలించుకునేందుకు మానవులంతా కృషి చేయాలి.

నీవు, నేను, క్రూరమృగాలు, క్రిమి, కీటకాదులనే బేధం లేకుండా భగవంతుడి ప్రతి స్వరూపం ప్రతి ఒక్కరిలోనూ నిండిఉందని ఆత్మ తత్వం బోధిస్తోంది. ఆత్మ, పరమాత్మ అంటే వేరుకాదు. ఉదాహరణకు అద్దంలో చూచుకొనే మనిషి అసలు స్వరూపమైతే, అద్దంలో కనబడేది ప్రతిబింబ స్వరూపం. ఎప్పుడైతే మానవుడు అద్దం ముందు నిలబడతాడో ప్రతిబింబం రూపంలో అతడే అద్దంలో కనబడతాడు. ఎప్పుడైతే మానవుడు అద్దం ముందు నుండి తొలగుతాడో, అప్పుడు అతడి ప్రతిబింబం తొలగిపోతుంది. అంటే అతని ప్రతిబింబం క్షణికమైనదని అర్థం. అదేవిధంగా జీవి అసలు స్వరూపం భగవంతుడు అయినట్లయితే ఆయన ప్రతిరూపమే ఆత్మ. ఎప్పుడైతే దేహమనే అద్దం నుండి ఆత్మ అనే భగవంతుడి ప్రతిబింబం తొలగిపోతుందో.. అప్పుడే జీవికి మరణం సంభవిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here