కాజాల్లాంటి బాజాలు-34: ఆత్మజ్ఞానం

6
9

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఇ[/dropcap]వాళ తీరుబడిగా కూర్చుని నాలోకి నేను తొంగి చూసుకున్నాను.

ఏవిటి.. వాక్యం మరీ గంభీరంగా వుంది కదా.. అవును మరి..ఇంత వయసొచ్చికూడా యింకా కథలూ, కబుర్లూ, చీరలూ, నగలూ, జోకులూ అంటూంటే అందరికీ అలుసైపోయనేమోనని చిన్న డౌటనుమానం లాంటిది వచ్చేసింది. అందుకే నాలోకి నేను తొంగి చూసుకున్నాను.

మన పెద్దవాళ్ళు చెప్పారు కదా.. అసలు తత్వమంతా మన మనసులోనే, మన లోపలే వుంటుందనీ. అందుకే అసలు తత్వజ్ఞానాన్ని తెలుసుకుందామని నాలోకి నేను తొంగి చూసుకున్నాను.

ఏవిటీ.. ఇదేమాట యిన్నిసార్లంటున్నానేమిటనుకుంటున్నారా.. ఆ సంగతీ మన పెద్దలే చెప్పారు.. ఒకటికి నాలుగుసార్లు చేస్తే యే పనైనా అదే అలవాటవుతుందీ అని. అందుకే నాలోకి నేను తొంగి చూడడం అలవాటు చేసుకుంటున్నానన్న మాట.

అందుకే పొద్దున్నే స్థిమితంగా సుఖాసీనంలో కూర్చుని, కళ్ళు మూసుకుని, శ్వాసను నియమబధ్ధం చేస్తూ,  నాలోకి నేను తొంగి చూసుకుంటుంటే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ యేం చెయ్యాలీ అన్న పేద్ద ప్రశ్న కళ్ళముందు కొచ్చింది.. అంతే.. ఆలోచనలన్నీ అటు మళ్ళాయి.  ఇడ్లీ అయితే వీజీగానే అయిపోతుంది కానీ మళ్ళీ దానికి అనుపానం పచ్చడో, సాంబారో చెయ్యాలి కదా.. మూల విరాట్టుల కన్న ఉత్సవ విగ్రహాలకి అలంకారా లెక్కువన్నట్టు వీటికి మళ్ళీ బోల్డు పని..

పోనీ.. ఉప్మా కలయబెట్టేస్తేనో.. అనిపించింది. కానీ  ఉప్మా కూడా పచ్చిబఠానీ, కారెట్, బీన్స్, ఉల్లిపాయలు లాంటివి లేకుండా వట్టి రవ్వతో యేం బాగుంటూందీ.. పైగా వాటిని పెసరబద్దల్లా తరగడానికే బోల్డు టైమవుతుంది, అసలు పెళ్ళికూతురి అలంకరణ కన్న తోడపెళ్ళికూతురి అలంకారాలకి యెక్కువయినట్టు..

మరేం చెయ్యాలా అనుకుంటున్న నేను గబుక్కున నన్ను నేను జాగృతపరుచుకున్నాను.. ఛి ఛీ.. నాలో నేను తొంగి చూడడమంటే తిండి గురించి ఆలోచించడం కాదు.. తత్వజ్ఞానాన్ని గురించి ఆలోచించాలనీ.. అవును కదా..

మళ్ళీ కళ్ళు గట్టిగా మూసుకుని నాలోకి  తొంగిచూడడం మొదలుపెట్టాను. ఈసారి దృష్టి రాబోయే దసరా పండగ మీదకి పోయింది. అవునూ.. అసలు ఈ నవరాత్రుల వైశిష్ట్యమేవిటో! ఈ సారైనా పెద్దలనడిగి ఆ దుర్గమ్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మొదటిరోజు బాలగా అవతరిస్తుందిట. ఒక్కొక్కరోజు ఒక్కక్క వైభవంతో మనలను కాపాడుతుందిట. ఇప్పటికైనా ఈ విషయాలు తెలుసుకోకపోతే రేప్పొద్దున్న భావి తరాలకి యేమని చెప్పగలను. అందుకే ఈ పండగ గురించి పూర్తిగా తెలుసుకోదల్చుకున్నాను.

అలా దసరా విశేషాలు తెలుసుకోవాలనుకుంటుంటే హఠాత్తుగా అసలు  ఇంతకీ నేను దసరా పండక్కికొత్త చీర కొనుక్కున్నానా లేదా అనే అనుమానం వచ్చింది. ఏదో కొన్నాను కానీ అంతకన్న మంచిది మొన్న రమ కట్టుకున్నలాంటిది కొనుక్కుంటే.. అవును. మహా తిప్పుకుంటూ తిరిగింది.. యింతోటి చీర తనే కొనుకున్నట్టు.. అయినా ఆ చీర రంగుకి ఆ బోర్డరు యేం నప్పిందనీ.. పమిటకొంగు మటుకు తేలిపోలేదూ.. బట్ట కూడా నాసిరకందే.. దానికసలు చీరల సెలెక్షను తెలిస్తే కదా!

ఛి ఛీ.. నా తెలివి పాడుగానూ.. యెంతసేపూ తిండీ, చీరలేనా.., మరింక జీవితంలో యేమీ లేవా? నన్ను నేను సంబాళించుకుని మళ్ళీ నాలోకి తొంగి చూడడం మొదలెట్టేను..

ఈసారి ఇంకా గట్టిగా కళ్ళు మూసుకున్నాను. దృష్టిని శ్వాస మీద పెట్టేను. దీర్ఘంగా శ్వాస తీసి వదులుతున్నాను. అంతలో ఆ ఊపిరిలోకి వచ్చేడు మా మహీగాడు. ఇప్పటికి ఐదేళ్ళనించి చూస్తున్నాడు అమ్మాయిలని పెళ్ళిచేసుకుందుకు. వెధవకి. ఇప్పటికీ కుదరలేదు. ఎలా కుదుర్తుందీ! మొదటి రెండేళ్ళూ వాళ్ళమ్మా నాన్నా జాతకాలు కుదరలేదంటూ చాలా సంబంధాలు వదిలేసేరు. మిగిలినవాటిల్లో ఇద్దరి మధ్యా పెట్టుపోతలు కుదరలేదు. మూడో యేడు వాడే కొన్ని ఆదర్శాలంటూ పెట్టుకుని, వాటినే అనుసరిస్తూ సంబంధాలు చూసుకున్నాడు. వాడి ఆదర్శాలు ఆడపిల్లల తల్లితండ్రులకి నచ్చక పెళ్ళి కుదరలేదు. క్రితం యేడాదంతా ఆన్‌లైన్‌లో ఉన్న సంబంధాలన్నీ కాంటాక్ట్ చేసేడు. కానీ ఏ అమ్మాయీ వీడికి సరైన సమాధాన మివ్వలేదు. ఇంకిప్పుడు ఎవరైనా సరే, అసలంటూ ఒప్పుకుంటే చాలు ఎలాంటి అమ్మాయి నైనా చేసేసుకుంటాను అనే స్థితికి వచ్చేడు. ఇప్పుడైనా వాడికి సంబంధం కుదిరితే బాగుండును. చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని ఉట్టినే అన్నారా!

అయ్యయ్యో.. నా లోపలికి నేను చూసుకోవాలనుకుంటుంటే ఈ మహీగాడొచ్చేడేవిటీ బుర్రలోకి.. తలని ఒకసారి విదిలించుకున్నాను. ఇహ ఇలా కాదు. దైవ నామస్మరణ  చేస్తే దృష్టి అటూ ఇటూ పోదు అనుకుంటూ మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. మనసులో “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే..” అనుకుంటున్నాను.

అన్నట్టు పెద్దత్తకి మనవడు పుట్టేడు కదా, మనవడికి శ్రీరాముడి పేరు పెట్టుకోవాలనుందని ఆ మధ్య అంది. మరిప్పుడు ఆవిడ మనవడికి ఆ పేరు పెట్టేరో లేదో.. అయినా ఆవిడ పిచ్చి కాపోతే ఈ రోజుల్లో ఎవరు మాత్రం రాముడూ, కృష్ణుడూ అని పేర్లు పెడుతున్నారూ.. ఏదో హితో, అహితో పెడ్తారేమో..పాపం పెద్దత్త.. ఎంత బాధపడుతుందో..

ఛి.. ఛీ.. ఇదేంటీ.. నాలోకి నేను తొంగి చూసుకోవడవంటే ఇలాకాదు కదా! మరి ఎంత కంట్రోల్ చేసినా ఈ బుర్ర అఖ్ఖర్లేని విషయాలే ఆలోచిస్తోందేం! ఇప్పుడు నేనేం చెయ్యాలి. నా ఆలోచనలని నేను నియంత్రించుకోవాలంటే ఏం చెయ్యాలి.. మళ్ళీ నాలోకి నేను తొంగిచూద్దామనుకునేంతలో వినపడింది, “అమ్మగారూ..” అంటూ మా పనిమనిషి పిలుపు. అంతే. ఈ తొంగిచూసుకోవడం రేపు చూసుకోవచ్చు. పనిమనిషి వెళ్ళిపోతే ఇంకేవైనా ఉందా అనుకుంటూ ఒక్క ఉదుటన లేచేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here