అత్తగారు అమెరికా యాత్ర..10

0
14

అత్తగారు  అబ్జర్వేషన్లు..

[dropcap]అ[/dropcap]మెరికాలో రోడ్ల మీద నడిచేవాళ్ళు, టూ వీలర్సూ ఎక్కువగా కనపడకపోవడం ఆవిడకి చాలా వింతనిపించింది. ఎక్కడ చూసినా కార్లే కార్లు. పొద్దున్నే లేచిన మొదలు ఎవరో తరుముకుని వస్తున్నట్లు ఈ కార్లన్నీ ఎక్కడకబ్బా పోతున్నాయి అనేవారు.

“ఏమిటీ కార్లు? చీమల బార్లులా సాగిపోతూనే ఉన్నాయి.. ప్రపంచంలో కార్లన్నీ అమెరికాలోనే ఉన్నట్టున్నాయి” అంటూ ఒక్కొక్క కారు గురించీ అడగడం.. వాటి వివరాలు, ఖరీదులూ విని ఆశ్చర్యపోయారు.

ఒకొక్క ఇంట్లోనూ రెండు కార్లకి తక్కువ కాకుండా వున్నాయే మరి. ఎదిగిన కాలేజీ పిల్లలు వుంటే మళ్లీ వాళ్ళకి ప్రత్యేకంగా మరో కారు. ఎంత దూరాలయినా కార్లమీదే వెళ్ళి పోతుంటారు అంటే “ఔనా! ఔనులే.. ఇక్కడ రోడ్లు, ఎంచక్కా సాఫీగా వున్నాయి మరి.” అన్నారు.

కారు గరాజ్ లోకి చేరుతూండగా.. కారులో వున్న బటన్ నొక్కగానే గరాజు డోరు పైకి తెరుచుకోవడం చూసి, “ఇదేదో బావుందే.. మనం కారు దిగకుండానే డోరు పైకి దానంతట అదే  వెళ్ళిపోవడం.. ఏంటో.. ఇక్కడ అన్నీ వింతలూ, విడ్డూరాలే” అన్నారు.

ఇక్కడ ఆవిడ చూసినవాటిలో బాగా నచ్చి మెచ్చుకున్నదేంటంటే.. స్కూల్ బస్సులకీ, అంబులెన్స్ వాహనాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం చూసి ఈ విషయం చాలా గొప్పది అన్నారు. మన దేశంలో అంబులెన్స్ హారన్లు మోగించుకుంటూ వస్తున్నప్పటికీ.. మనవాళ్లు దానికి దారి ఇద్దామని ఎంత ప్రయత్నించినా.. అభిమన్యుడి పద్మవ్యూహంలా వుండే మన ట్రాఫిక్‌లో అవి ఇరుక్కుపోతూ వుంటాయని తలుచుకుని బాధ పడ్డారు.

స్కూల్ బస్ ఆగివున్నపుడు, ముందు వైపు నుంచి మరో వాహనం రాకుండా బస్సుకు ముందు ఒక పొడుగు రాడ్ బయటకి వచ్చి అడ్డుగా వుంటుంది. పిల్లలు అందరూ ఎక్కాక, తలుపు మూసుకున్నాక ఆ రాడ్ మూసుకుపోతుంది. బస్సు తిరిగి కదిలేదాకా.. వెనక వచ్చే కార్లన్నీ ఆగిపోవడం.. తిరిగి ఆ బస్సు కదిలాకే బయలుదేరడం తెగ నచ్చేసింది. “ఔను, మరి చిన్న పిల్లలు బస్సు దిగి ఇంటిదారి పెట్టేటప్పుడు, తెలీదు కదా! రోడ్డు మీద అటూఇటూ పరిగెత్తారు. స్పీడ్‌గా వచ్చే కార్లు తప్పించుకోవడానికి కష్టం కదా.. అందుకే బస్సు వెళ్ళే దాకా కార్లు ఆపడం బాగుంది. స్కూల్ వున్న ప్రాంతంలో కూడా మిగతా వాహనాలు అన్నింటికీ వేగం బాగా తగ్గించాలని రాసి వున్న బోర్డులను చూసారు ఆవిడ. అలా రాసినవి ఇక్కడ ప్రతి ఒక్కరూ పాటించడం తెగ మెచ్చుకున్నారు.

మనలాగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇక్కడ ఎక్కడా కనిపించకపోవడం వింతగా అనిపించింది. ఎవరూ లేకపోయినా, ఆ ట్రాఫిక్ లైట్లను బట్టే అందరూ క్రమశిక్షణ పాటిస్తూ వెళ్ళడం గమనించారు. రూల్ ప్రకారమే రోడ్ల మీద రద్దీ వున్నా, లేకపోయినా కూడా, ఏ సమయంలో అయినా కార్లు నడుపుతూంటే చక్కని పద్ధతి అన్నారు.

అలాగే రోడ్డు క్రాస్ చేయాలన్నా. అక్కడ ఉన్న స్తంభానికి అమర్చిన స్విచ్చి నొక్కితే కాసేపట్లో ట్రాఫిక్ ఆగడం.. అప్పుడు నడిచేవాళ్ళు రోడ్డు దాటడం చాలా బాగుంది. మన దేశంలో అయితే వెళ్ళే వెహికల్స్ వెడుతూనే ఉంటాయి.. రోడ్డు దాటేవాళ్ళు దాటేస్తూనే ఉంటారు. మనకి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆపినప్పుడూ, రెడ్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే పాదచారులు రోడ్డు దాటాలనేది రూల్ వున్నప్పటికీ పాటించేది ఏ కొద్ది మందే కదూ?

రోడ్డుకి అయిమూలగా కూడా పరుగులు తీస్తూ వుంటారు. అదెంత ప్రమాదమో కదూ! ఇక్కడ ఎంత పద్ధతిగా పెడుతున్నారో! అంటూ తను చూసిన కాసేపట్లోనే ఆవిడకి నచ్చేసినవన్నీ మెచ్చేసుకున్నారు. అదీ నిజమే కదా అనిపించింది నాకు.

ఇక్కడ మా కమ్యూనిటీలో సాయంకాలం పూట వాకింగ్ వెళ్ళడం కూడా నెమ్మదిగా అలవాటు చేసుకున్నారు అత్తయ్య గారు. రెండు మూడు రోజులు నేనూ సాయం వెళ్ళేదాన్ని. తర్వాత ఆవిడ ఒకరే వెళ్ళేవారు. మెయిన్ రోడ్ ఎక్కితే మళ్లీ ఇంటిదారి మర్చిపోతానేమో అంటూ.. కమ్యూనిటీ లోపలే తిరిగేవారు.

కమ్యూనిటీ ఎంట్రీకి కొంచెం ఎడంగా సిటీ బస్ స్టాప్ వుంది. ఆవిడని అప్పుడప్పుడు సరదాగా బస్సు ఎక్కించి.. నాలుగు స్టాపుల తర్వాత వుండే ఇండియన్ సూపర్ మార్కెట్ లోకి తీసుకువెళ్ళేదాన్ని. అప్పుడు కూడా ఆవిడ ప్రతీదీ పరికించేవారు.

ఇక్కడ బస్సులలోవీల్ ఛైర్లలో వెళ్ళేవారికీ, పసిపిల్లలని కూర్చోపెట్టి లాక్కుని వెళ్ళే స్ట్రోలర్‌లు బస్సులోకి డైరక్ట్‌గా వెళ్ళిపోవడానికి బస్సులోకి ఎక్కే తలుపు దగ్గర.. డ్రైవర్ స్విచ్చి నొక్కగానే.. రోడ్డుతో సమానంగా కిందకి ఏటవాలుగా వచ్చేస్తుంది.. వాటి మీదుగా, తిన్నగా బస్సులోకి.. ఎక్కే వీలు వుండడం చూసారు అత్తయ్య గారు.

“ఈ పద్ధతి ఎంత బావుందో? నడవలేని ముసలివాళ్ళు తమ కుర్చీలతోనూ, ఇలా పిల్లల తోపుడు బళ్ళనీ  వచ్చే అమ్మలకీ ఇబ్బంది పడకుండా ఎంచక్కా బస్సు ఎక్కుతున్నారు. పైగా బస్సు కుదుపులకి ఆ వీల్ చైర్ ఊగి కదిలిపోకుండా కిందన స్టాండు లాగా వుండడం చూసి సేఫ్టీ కోసం ఇంతలా ఏర్పాట్లు వున్నాయన్న మాట” అన్నారు.

రోడ్డు క్రాస్ చేస్తూ మనుషులు వెడుతోంటే వెళ్ళే కారు ఆగి.. నడిచి  వెళ్ళే వారికి దారి ఇవ్వడం చూసి మెచ్చుకున్నారు.

ఆవిడకి ఇక్కడ మరీ నచ్చేసిన విషయం ఏంటంటే.. పెద్ద వయసులో వున్న ఆడ, మగ వారు కూడా, ఎవరి సహాయం లేకుండానే ఒక్కరే కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఎంత దూరమైనా వెళ్ళడం, షాపింగ్‌లు చేసుకోవడం, ఆశ్చర్యం కలిగించింది. ఎంత ధైర్యంగా పెడుతున్నారో.. అదే మనవాళ్ళు వయసు మీద పడితే చాలు ఒంటరిగా వెళ్ళలేరు.. పైగా పిల్లలు కూడా.. పెద్దవారైపోయారు, ఒంటరిగా ప్రయాణం చేయొద్దు, అంటూ ఆంక్షలు పెడుతూ వుంటారు. ఇక్కడ ఎంత స్వేచ్ఛగా వున్నారో అంటూ మెచ్చుకున్నారు. ఒకరి మీద ఆధారపడకుండా ఇలాగే వుండాలి అన్నారు.

అలాగే.. ఒకవేళ నడవలేని స్థితిలో వున్నవారు కూడా.. వీల్ ఛైర్లలో వాళ్ళకి వాళ్ళే ఒక్కరూ.. వెళ్ళడం గమనించారు. “వీళ్ళు ఎంతటి ఆత్మవిశ్వాసంతో ఎవరి సహాయం లేకుండా వెళ్ళిపోతున్నారు.. పక్కవారికి ఇబ్బంది పెట్టకుండా, ఒకరిమీద ఆధారపడకుండా చక్కగా పెడుతున్నారు.ఇది చాలా గొప్ప విషయం”  అనుకున్నారు.

ఇలా ఆవిడ గమనించినది ప్రతీదీ.. పరిశీలిస్తూ తనదైన పద్ధతిలో నెమరువేసుకుంటూ వుండేవారు. ఇంటికి వచ్చాక.. ఊరికి ఫోను చేసి అక్కడ అందరికీ కథలు కథలుగా చెప్పేవారు.

ఈ వారం.. మా అత్తగారు చేసిన  అబ్జర్వేషన్లు ఇవి.. మళ్లీ వచ్చే వారం ఇంకేం చెబుతారో.. చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here