అత్తగారు.. అమెరికా యాత్ర 12

0
10

డాలర్లు.. ఢమాల్

[dropcap]“క[/dropcap]రివేపాకు ఇలా ఇంత కొంచెం కవర్లో పెట్టి ఇలా అమ్ముతారా? అయ్యబాబోయ్ ఇదేం అన్యాయం? పట్టుమని పది రెబ్బలు కూడా లేదు. దీని మీద డాలర్ అనుంది. అంటే ఈ కరివేపాకు డెభ్భై రూపాయల పైనే కదూ! ఇదేంటే ఇంత అన్యాయం? అదే మన ఊళ్ళో అయితే చాలా మంది ఇళ్ళలో పెరట్లో చెట్లు ఉంటాయి. అదీ కాకుండా కూరలు కొన్నపుడు కొసరుగా డజను కరివేపాకు మండలు విరిచి మరీ ఇస్తారు. ఈ కూరలన్నీ ఇలాగే డాలర్లు మండిపోతున్నాయా? ఈ లెక్కన మొత్తం బిల్లు ఏ ఐదువేలైనా అవుతుందేమో” నోరు నొక్కున్నారు.

“అలా మన రూపాయల్లోకి మార్చి చూసుకోకూడదు అత్తయ్యా! అలా అయితే ఏదీ కొనలేము. మొదట్లో మాకూ అలాగే అనిపించేది. కానీ ఇప్పుడు డాలర్ల లెక్క అలవాటైపోయింది కదా. తప్పదు మరి” అన్నాను.

“ఔనులే! అదీ నిజమే! రోమ్‌లో వుంటే రోమన్‌లా వుండాలి. అలాగా ఎక్కడికక్కడ అలా ఉండాలి మరి.” అంటూ.. కరివేపాకుని తలుచుకుంటూ అప్పటికప్పుడు ఆశువుగా పాటు కూడా పాడేసారు. మా అత్తయ్య గారిలో ఈ కోణం కూడా వుందా అనుకున్నాను.

‘అపురూపమైనదమ్మ.. ఈ కరివేపాకూ..
ప్రియాతిప్రియమైన.. ప్రియమైన ఆకూ
చారులోన వేసినా.. పులుసులోన వేసినా..
చూసి చూసి.. వేయాలమ్మ కరివేపాకూ..
దూసి దూసి.. వేయించాలమ్మ పోపులోనా..
మనిషికొక్కటి చొప్పున లెక్క చూసి వాడూ..
పిల్లకాయలకైతే.. సగం ఆకు చాలూ..
ఆరు రెబ్బలొచ్చూనూ.. ఇచ్చు డాలర్ డబ్బుకూ
అపురూపమైనదమ్మ.. ఈ కరివేపాకూ!’

“అక్కడైతే ఇష్టం వచ్చినట్లు గుప్పెడు ఆకులు పోపులో పోసేదాన్ని.. ఇక్కడైతే చూపులకే కష్టం అయిపోయింది ఈ ఆకు.. ఇదివరకు మన ఇళ్ళలో.. పోపుకి రెడీ చేసుకుని.. వంటింటి కిటికీ లోనుండి చెయ్యి చాపి, తాజాగా ఆకు దూసి.. పోపులో వేసేవాళ్ళం. బజార్లో కూడా రూపాయి పెడితే, బోలెడు ఇచ్చేవారు. కూరలతో కొసరుగా కరివేపాకు ఇచ్చేది వాడుకగా వచ్చే కూరలమ్మి. అలా విరివిగా వాడడం అలవాటైన చేయి.. అదే.. వాడుకగా ఇక్కడ కూడా వాడదామంటే.. అమ్మో.. డాలర్‌కి ఆరురెబ్బలట.. దెబ్బకి ఢాం.. చూస్తూ చూస్తూ వాడలేను.. వాడకుండా వుండలేను.. కూరలో కరివేపాకులా వాడిపారేసారు అంటారు కానీ, ఆ కరివేపాకు వేయనిదే కూరా లేదు, చారూ లేదు.. చివరాఖరులో.. ఆ పోపు ఘుమఘుమలలో..

ఆ ఆకు పడనిదే.. అందమేదీ..

అందమైన ఆడపిల్ల ముస్తాబు చివరలో మెరుగులు దిద్దినట్లు.. చారుకీ.. పులుసుకీ.. కూరకీ.. ఉప్మాకీ.. పులిహోరకీ.. చివరగా షోకులు చేసేది ఈ కరివేపాకుతోనేగా..

ఆ చారులో.. వయ్యారంగా పైన తేలి ఆడుతూ వుండే కరివేపాకులని చూస్తోంటే.. లాహిరి.. లాహిరిలో.. ఓహో జగమే ఊగెనుగా.. అనిపించేది”.

కరివేపాకుని చూస్తూ దిగులుగా తనలో తనే మాట్లాడుకోవడం మొదలెట్టారు.

ఇక ఈవిడ కలల్లోకి కూడా కరివేపాకే వస్తుంది కాబోలనుకున్నాను. ప్రతీ వస్తువు ఎన్ని డాలర్లు అని అడగడం.. దానికి ఇంటూ డెబ్భై రూపాయలు అంటూ లెక్క చూసుకుని, అమ్మో, అమ్మో అంటూ దవడలు నొక్కుకోవడం. ఇదే సరిపోయేది.

మా వాడు.. “ఇలా ఒకొక్క దానికీ బుగ్గలునొక్కుకోకు బామ్మా! నొప్పి పుడతాయి. ఇంతటితో ఏమైందీ? వినాయకచవితి నాడు బుల్లి కవర్లో పెట్టి పత్రి అమ్ముతారు, అందులో ఒక మామిడాకునే పది ముక్కలు చేసి పెడతారు. మరో నాలుగు గరికపరికలు పెట్టి, తొమ్మిది డాలర్లకు అమ్మితే తెచ్చుకుని పూజ చేసుకుంటాం” అని చెప్పగానే, మరోసారి ఢమాల్ అన్నారు.

గుమ్మానికి కట్టడానికి ఆరు మామిడాకులు ఒక డాలర్.. ఢమాల్

తాంబూలంలో పెట్టడానికి, ఐదు తమలపాకులు ఒక డాలర్.. మళ్లీ ఢమాల్

ఉగాది పండక్కి, వేపాకు, వేప్పూత గుప్పెడు కూడా లేవు.. మూడు డాలర్లు.. మరో ఢమాల్.

“అయ్యబాబోయ్! ఇక ఆ డాలర్ల గురించి నాకు చెప్పకండి.. ఏది ఎంత రేటన్నదీ ఇక చచ్చినా అడగను. వింటుంటే ‘హార్ట్ ఎటాక్’ వచ్చేలా వుంది” అన్నారు.

మర్నాడు.. ఇండియా నుండి మా అత్తగారు మరదలు ఫోన్ చేసినప్పుడు ఆవిడకి ఇవన్నీ చెప్పి వాపోయారు. “ఇక్కడ ఏది పట్టుకున్నా డాలర్లు డాలర్లే.. ఏం కొనాలన్నా భయమేస్తోంది.” అన్నారు.

అటువైపు నుంచి ఆవిడేమన్నారో కానీ, “అక్కడ నుంచి మీకేం అమెరికా సంపాదన అంటారు కానీ.. ఇక్కడ వున్నవాళ్ళకి తెలుస్తాయి ఆ ఖర్చులూ, ఖరీదులూ.” దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నారు..

ఈవారం ఇలా కరివేపాకు ఖరీదుకి హడలెత్తిపోయిన మా అత్తయ్య గారు వచ్చే వారం ఏమంటారో.. వేచి చూద్దాం మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here