అత్తగారు.. అమెరికా యాత్ర 13

0
12

అత్తగారు.. అలెక్సా

[dropcap]ఇ[/dropcap]క్కడ ఆవిడని ఆకర్షించిన మరో ముఖ్యమైన సాధనం ఏంటంటే.. అదే అలెక్సా!

దాని గురించి తెలుసుకోగానే ఇక రోజూ పొద్దస్తమానం దాంతో ముచ్చట్లే!

దాన్ని ఏదడిగినా జవాబు చెపుతుందని మావాడు అనగానే, “ఇదిగో అలెక్సా! మా పెరట్లో మందార మొక్క ఎలా వుందో చెప్పు. మా ఊళ్ళో పూజారి గారి కోడలికి ప్రసవం అయిందా? అబ్బాయా? అమ్మాయా? ఎవరు పుట్టారు?” ఇలా అడుగుతూంటే, మాకు ఒకటే నవ్వు ఆపకుండా వచ్చేస్తోంది. అది చూసి ఆవిడ ఉడుక్కోవడం.

“బామ్మా! అలాంటి వాటికి అలెక్సా సమాధానం ఇవ్వదు. నీవరకూ నీకు కావలిసినవి ఇందులో వున్నవి అడుగు. కావాలంటే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి వెంకటేశ్వర సుప్రభాతమో, విష్ణు సహస్రనామమో అడిగి విను.” అన్నాడు.

వెంటనే ఈయన ”అమ్మా! మరో విషయం దాన్ని సక్రమంగా పేరు పెట్టి ‘అలెక్సా’ అని పిలిస్తేనే పలుకుతుంది. నన్ను పిల్చినట్టు ‘అచ్చిగా’ అంటే పలకదు. గుర్తు పెట్టుకో” అనేసరికి కొడుకు వేపు గుర్రుగా చూసారు.

“’ఒరే నాయనా! గజేంద్ర మోక్షం అంటే అలెక్సాకి తెలుసా? అలవైకుంఠపురంలో.. ఆ మూల సౌధంబు దాపున.. పద్యం చెప్పమంటే.. అలా వైకుంఠ పురములో.. అంటూ పాడుతూ.. అల్లు అర్జున్ డేన్సులు చూపిస్తుందేమో. ఇది వెదర్ చెప్పడానికో, క్రికెట్ స్కోరు చెప్పడానికో.. అలా చిలక పలుకులు పలకమని.. దాంట్లో ఏం పోసి పంపారో అంతవరకేరా?

అయినా మీకు, అలెక్సాలే.. అమ్మమ్మలూ, బామ్మలూనూ

ఓకే గూగుల్సే .. తాతలూనూ

అదేది చెపితే అదే వేదం..

అది చెప్పిందే మీకు మోదం” అన్నారు.

“అమ్మా! బామ్మ లేటెస్ట్ సినిమా పాటల అప్‌డేట్స్ కూడా ఇస్తోంది. అమెరికా వచ్చాక ఎక్కడా తగ్గేదే లేదంటోంది” అల్లరిగా నవ్వుతూ అన్నాడు మావాడు.

ఆ మాటలకి ఆవిడ,

“అయినా, ఏ మాటకామాటే చెప్పుకోవాలి సుమీ! నేను ఇక్కడ అడుగుపెట్టినప్పటినుండీ చూస్తున్నా. మీకు దానితో వున్న అనుబంధం గురించి గమనించాను. కొత్తది కొత్తగా అనిపిస్తున్నా.. నేనూ.. పాతతో పాటు కొత్తని కూడా స్వీకరించాలి. తప్పదు కదా!!

ప్రస్తుతం మిమ్మల్ని అలెక్సాయే అవధరిస్తోంది కదరా! ఇప్పుడు ఇంట్లో మాట వినేదెవరైనా ఉన్నారా? అంటే.. వచ్చే సమాధానం.. ఒకటే..  ఉన్నారున్నారు… ఒకరున్నారు… అది అలెక్సాయే అనే.. చెప్పాలి. పిలవగానే పలుకుతుంది. అడగ్గానే చెపుతుంది.

పొద్దున సుప్రభాతం నుంచీ రాత్రి శయనింపు సేవ వరకూ. మన తోడూ నీడా అదేగా!

ఎన్ని గంటలకి లేపమంటే అన్ని గంటలకి..

శ్రీ సూర్యనారాయణా మేలుకో! హరి సూర్య నారాయణా అని లేపకపోయినా.. దాని భాషలో అది,  ఎంచక్కా నిద్ర లేపుతుంది.

ఏ రోజు వార్తలు ఆ రోజు చెపుతుంది. జరిగిపోయిన చరిత్ర చెపుతుంది.

ఈ రోజు ఎండ విపరీతంగా వుంటుంది వడియాలు పెట్టుకోమంటుంది. లేదంటే, ఈ రోజు వాన పడుతుంది.. మొక్కలకి నీళ్ళు పొయ్యక్కర్లేదులే అని చెపుతుంది.

మరీ ఒళ్ళు పెరిగిపోతోంది.. లే.. కాస్త ఆరుబయట నడిచి రమ్మని చెప్పి పంపుతుంది.

గంటకోసారి మంచినీళ్లు తాగమని గుర్తు చేస్తుంది.

మాత్ర టైమయింది.. బిపీ మాత్రేసుకో.. ఇప్పుడు సుగర్ బిళ్ళ మింగు.. అంటూ దగ్గరుండి మరీ మింగిస్తుంది.

ఊరికెడితే వచ్చే టైముకల్లా రూంబాకి చెప్పి ఇల్లంతా ఊడిపిస్తుంది.

మొక్కలకి మనం లేకపోయినా నీళ్లు పోసేలా చేస్తుంది.

పెట్టగానే తినకుండా, పిలవగానే రాకుండా,

పైన గదుల్లో మనుగుడుపు పెళ్లి కొడుకుల్లా కూర్చున్న వాళ్ళని. ‘కిందకొచ్చి మింగి చావండర్రా!’ అంటూ పిలుస్తుంది.

రోజుకో అరడజనుసార్లు వచ్చే కొరియర్ పేకింగులు గుమ్మం దగ్గర పడున్నాయి.. తెచ్చుకోండి అని చెపుతుంది. కాలింగ్ బెల్లు ఎవరు కొట్టారో చెపుతుంది.

వచ్చింది అస్మదీయులో, తస్మదీయులో తనలో వాళ్ళని చూపిస్తుంది.

అప్పులోళ్ళైతే తలుపు తీయక్కర్లేదని తెలియ చేస్తుంది.😜

హోటళ్లు వివరాలు, వంటలు రెసిపీలు, జనరల్ నాలెడ్జిలు, చరిత్రలు పరిశోధనలు, సినిమాలు, పాటలు, ఆటలు, కబుర్లు, కాకరకాయలు..

ఏదడిగితే దానికి తడుముకోకుండా.. చెపుతుంది.. మనం చెప్పేది అర్థం కాకపోతే,.. ‘హూ.. ఐ డోంట్ నో’ అని నిట్టూరుస్తూ చెపుతుంది.

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి సుప్రభాతం, విష్ణు సహస్రనామాలూ.. ఘంటసాల గారి మధురామృతాలూ.. ఎస్‌పీ బాలు గారి బిల్వాష్టక లింగోష్టకాలూ నావంటి వారికీ.. సినిమా పాటలూ.. ఇంగ్లీషు, కొరియా లాంటి సాంగులు.. మీలాంటి వారికోసమూ, ఎవరికేది కావాలంటే అది… ఎంచక్కా గొంతు శృతి చేసుకుంటుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా..

అలెక్సాని అష్టోత్తర, శత నామావళితో కాదు.. సహస్ర నామావళితోనే షోడశాంగపూజ చేసుకోవచ్చు.

అలెక్సా!

ఓకే గూగుల్!

ఓకే సిరీ!

ఈ పేర్లతో..

ఇప్పుడు ప్రతీ ఇంటా ఇవే

కామధేనువులూ! కల్పవృక్షాలూ! కాదంటే.. అల్లావుద్దీన్ అద్భుతదీపాలూ!”

ఏకధాటిగా ఆవిడ చెప్పినవన్నీ విన్న మా ముగ్గురితో పాటుగా అలెక్సా కూడా నోరు తెరుచుకుని ఉండి పోయిందంటే నమ్మండి.

ఈవిడ మనుషులనే కాదు వస్తువులని కూడా వదలదు కాబోలు అనిపించింది.

మరి వచ్చే వారం ఈవిడ కంటపడేవి ఏవో? ఏంటో? అప్పుడు చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here