అత్తగారు.. అమెరికా యాత్ర 15

0
10

[dropcap]అ[/dropcap]త్తయ్యగారు వచ్చిన సందర్భంగా.. ఇన్ని రోజులకి బాగా పరిచయం వున్న ఓ పది మంది ఫ్రెండ్స్ కుటుంబాలని ఓ ఆదివారం నాడు భోజనాలకి పిలిచాము. పిల్లా పీచూ మొత్తం కలిపి సుమారుగా ముప్ఫై మంది అయారు. స్టారర్సూ, స్వీటూ, ఇలా కొన్ని బయట ఆర్డర్ ఇద్దామవి అన్నాను. ఆ మాటకి అత్తయ్య గారు, “ఇంతోటి ముప్ఫై మందికి బయట ఎందుకు నేను చేసేయగలను” అనేసరికి ఇక ఒప్పుకోక తప్పలేదు.

మర్నాడు మేము ముగ్గురం కలిసి మెనూ రెడీ చేసుకున్నాము. “అమ్మా! కూరలూ, కావలిసిన సామానూ లిస్ట్ రాసి ఇస్తే తీసుకువస్తాను” అన్నారు.

అత్తయ్య గారు, గాలిలో ఏవో లెక్కలు వేసుకుని, వంకాయలు పది కేజీలు, బెండకాయలు పది కేజిలు, దోసకాయలు ఐదు కేజీలు.. ఇలా కేజీల మీద కేజీలు చెప్పేసరికి, నాకు గుండె ఢాం అంది. “అత్తయ్య గారూ! మీరు చెప్పే లిస్ట్ ముప్ఫై మందికీ” ఇంకా నేను పూర్తి చేయకుండానే, “సరిపోవంటావా? అయితే మరో రెండేసి కేజీలు ఎక్కువే పుచ్చుకోరా అచ్చీ!” అనేసరికి, ఈయనకి అచ్చిగా అన్నందుకు కోపం వచ్చిందో, ఆంజనేయుడి తోకలా వున్న లిస్ట్ చదివేసరికి కోపం వచ్చిందో కానీ, ఇంతెత్తున ఎగిరారు.

“వీడొకడు, మధ్య మధ్యలో ఇలా ఎగురూతూంటాడు.” అన్నారు అత్తయ్య గారు.

“అది కాదత్తయ్యగారూ! మీరు చెప్పిన లిస్ట్ ప్రకారం వండితే ముప్ఫై మందికి కాదు, నూట ముప్పై మందికి వస్తుంది. అంతంత వండక్కర్లేదు. రెండు కేజీల వంకాయ కూర ఎక్కీ దిక్కీ అందరికీ సరిపోతుంది. ఇదిగో ఈ గిన్నెకి సాంబారు పెడితే చాలు. అన్నం ఈ పెద్ద రైసు కుక్కరుకి సరిపోతుంది.” నేను చెపుతూంటే అత్తయ్య గారు ముక్కున వేలేసుకున్నారు.

“ఏంటీ! బొమ్మలాటకి వండినట్లు వండితే ముప్ఫై మందికి సరిపోతుందా? అసలు వడ్డిస్తారా? లేకపోతే నైవేద్యం చూపించినట్లు చూపిస్తారా?” అన్నారు.

“సరిపోతుంది అత్తయ్య గారూ! మీరేం అపనమ్మకం పెట్టుకోకండి ఇక్కడ మాకు ఇలా వండడం అలవాటే. ఎవరికీ వడ్డించే పని లేదు. ఎవరికి వారే వడ్డించుకుని తింటారు. ఇంకా వీటిలోనే కాస్తా కూస్తా మిగిలిపోతాయి కూడా” అన్నాను.

అత్తయ్య గారికి నా మాటల మీద ఏమాత్రం నమ్మకం కుదరడం లేదు. ఇంతకొంచెం చేస్తే, అంతమందికి ఎలా సరిపోతుందని ఒకటే వాదన.

చివరకి ఆవిడే నెగ్గారు. ఆవిడ చెప్పినంత క్వాంటిటీలో చేసేంత పెద్ద పెద్ద గిన్నెలు నా దగ్గర లేకపోవడంతో, స్నేహితులనడిగి తీసుకువచ్చాను. అవి కూడా ఆవిడ కంటికి ఆనలేదు. మొత్తానికి ఆవిడ అనుకున్న లెక్క ప్రకారం, నా సహాయంతో గబగబా అన్నీ చేసేసారు. కొత్తిమీర కారం పెట్టి వంకాయ కూర, కేబేజీ పచ్చి కొబ్బరి వేసిన కూర, ముద్ద పప్పు, దప్పళం, దోసకాయ ముక్కల పచ్చడి, గోంగూర పచ్చడి, ఆవ పెట్టిన పులిహోర, పూర్ణం బూరెలు, చక్కెర పొంగలి, అప్పడాలు, గుమ్మడి వడియాలు.. ఏవీ బయట నుంచి ఆర్డర్ ఇవ్వొద్దని ఖరాఖండిగా చెప్పి తనే చేసారు. వాటినన్నిటినీ నేను సర్వింగ్ డిష్ ల్లోకి సర్ది.. డైనింగ్ టేబుల్ మీద అమర్చాను.

నెమ్మదిగా ఒకొక్కరు రావడం మొదలయింది. కాసేపటికి భోజనాలకి సంసిద్ధం అయి ఎవరికి వారే వడ్డించుకోవడం మొదలెట్టారు. ఎంత తిన్నా కూడా అత్తయ్య గారు వండినవి తరగకుండా, అక్షయపాత్రలో లాగా కనపడసాగాయి. అలా అని వాళ్ళందరూ తినడం లేదా అంటే, అలా కూడా కాదు. అత్తయ్య గారు చేసిన వంటలన్నీ, బ్రహ్మాండంగా వున్నాయంటూ, రుచులని ఆస్వాదిస్తూ, లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. రైస్ కుక్కర్‌లో అన్నం సగం కూడా అవలేదు. అందరూ తినగా కూడా బోలెడు మిగిలిపోయేసరికి, అత్తయ్య గారు బిక్క మొహం పెట్టారు.

“ఫర్వాలేదు అత్తయ్యా! మిగిలిపోయాయనీ, వేస్ట్ అయిపోతాయనీ అనుకుంటున్నారేమో.. ఇక్కడ అలాంటి సమస్య వుండదు. అందరూ కూడా ఎవరికి కావలిసినవి వారు ఇంటికి పట్టుకెడతారు. మొహమాటం పడరు.” అంటూ చెప్పేసరికి ఆవిడ మొహం విప్పారింది.

“ఔనా! పోనీలే.. అలా పట్టుకెడితే నయమే. మన వూళ్ళో అలా అంటే కొందరు తప్పు పడతారు. మీ ఇంట్లో మిగిలిపోయినవి ఇస్తారా? అంటారు. ఇక్కడే నయం. ఎంచక్కా అడిగి మరీ తీసుకెడుతున్నారు. పక్కనే జిప్ లాక్ కవర్లు, ప్లాస్టిక్ డబ్బాలు పెట్టి వుంచితే, అందరూ వాటిలో సర్దుకుంటున్నారు. మనకి వృథా అవకుండా వుంటుంది, వారికీ ఉపయోగపడుతుంది. బావుంది ఈ పద్ధతి.” అంటూ మెచ్చుకున్నారు.

వెళ్ళిపోయేటపుడు అందరూ కూడా అత్తయ్య గారి దగ్గరకు వచ్చి, వంటలు బావున్నాయని, ఎలా చేయాలో తమకి కూడా నేర్పించమనీ చెపుతూంటే అత్తయ్య గారు పొంగిపోయారు. కష్టపడి చేసిన శ్రమవి అంతా మర్చిపోయి, అందరికీ సరే, సరే అని సమాధానం చెప్పారు.

ఈ పార్టీలో అత్తయ్య గారికి నచ్చిన మరో విషయం ఏంటంటే, వచ్చినవారు తినేసి వెళ్ళిపోవడమే కాకుండా, వారు పేకింగ్ చేసుకున్నవి తమ బేగ్ లలో పెట్టుకుని, మిగిలిన వంటకాలు అన్నీ మా కోసం చిన్న గిన్నెలు, డిష్ లలోకి సర్దేసి, అంట్ల గిన్నెలు, తిన్న ప్లేట్లు మొత్తం డిష్ వాషర్‌లో సర్దేసారు. ఇల్లు, టేబుల్ కూడా ఎవరికివారే నీట్‌గా సర్దేసారు. చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఆడుకున్న బొమ్మలు అన్నీ, ‘క్లీనప్ క్లీనప్ ఎవిరిబడీ క్లీనప్’ అంటూ పాట పాడుతూ మొత్తం వాటి వాటి స్ధానంలో సర్దేయడం చూసి అత్తయ్య గారు తెగ ముచ్చట పడిపోయారు. ప్రతి ఒక్కరూ కూడా ఇది మా ఇల్లు కాదు, మేమెందుకు చేయాలీ, అనుకోకుండా.. ఎంచక్కా సర్ది పెట్టడం చూసి మెచ్చుకున్నారు. అంతమంది వచ్చి వెళ్ళినా.. తర్వాత ఇల్లు నీట్‌గా అయిపోయింది.

ఇదే మాట.. తర్వాత మేము ముగ్గురం కూర్చున్నపుడు కూడా పదే పదే తలుచుకుంటూంటే, ఈయన, “అమ్మా! ఇలా ఒకరికొకరుం సాయం చేసుకోకపోతే ఇక్కడ చాలా కష్టం అవుతుందమ్మా! అందుకే సహాయం చేయడంలో ముందుంటారు. ఇలా మన ఇళ్ళల్లోనే కాదు, మనం ఏవైనా పార్టీలు, బయట పార్కులలోనూ, కమ్యూనిటీ హాల్లోనూ చేసుకున్నా.. వాళ్ళు మనకి ఆ హాలు ఎంత నీట్‌గా ఇస్తారో తిరిగి అంతే శుభ్రంగా వాళ్ళకి అప్పచెప్పాలి. ఎక్కడ వున్న వస్తువులు వాటి స్థానంలో నుంచి కదపకూడదు. వెళ్ళి పోయేటప్పుడు ఎక్కడా కూడా చెత్తా చెదారం, తినేసిన ప్లేట్లు, గ్లాసులు పడేయకుండా నీట్‌గా అప్పచెప్పాలి.” అన్నారు.

“ఔనా! ఎంత మంచి పద్ధతి కదా ఇది. అదే మన ఫంక్షన్ హాళ్ళలోనూ, కళ్యాణ మండపాల్లోనూ మన ఫంక్షన్ అయిపోయాక చూస్తే ఎంత చెత్తగా చేసి వెడతారో కదా? మనవారిలో కూడా పరిసరాలు పరిశుభ్రంగా వుంచి తీరాలి, లేకపోతే జరిమానా వేస్తామనే రూల్ రావాలి. అప్పుడే మార్పు వస్తుంది. ఇక్కడ పిల్లల దగ్గర నుంచి కూడా డస్ట్ బిన్ వాడకం, పరిశుభ్రత పాటించడం నాకు చాలా బాగా నచ్చింది సుమీ!” అన్నారు అత్తయ్య గారు.

ఇక ఆపకపోతే ఇలా ఏదో ఒకటి చెరుతూనే వుంటారని,

“ఇక రెస్ట్ తీసుకోండి అత్తయ్యా! ఈ రోజు వంట ఎక్కువ అయేసరికి అలిసిపోయారు” అనేసరికి.. సరే నంటూ బెడ్ రూం లోకి వెళ్ళారు.

మరి వచ్చే వారం ఏం కబుర్లు చెపుతారో చూద్దాం మరి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here