అత్తగారు.. అమెరికా యాత్ర 16

0
12

కౌన్సిలింగ్

[dropcap]నె[/dropcap]మ్మదిగా ఇక్కడ వాతావరణం నచ్చేయడంతో పాటుగా, చుట్టు పక్కల వారి పరిచయాలు కూడా అయిపోయాయి మా అత్తయ్యగారికి.

ఇక్కడ మా కమ్యూనిటీలోనే ఉంటారు తెలుగు వాళ్ళే.. విజయగారు. ఆవిడ కూతురికి పురుడు పోయడానికి వచ్చారు. వాకింగ్‌లో అత్తయ్య గారికి పరిచయమయారు. వాళ్ళమ్మాయికి డెలివరీ టైమ్‌లో పథ్యానికి సరిపోయే బీరకాయ, పొట్లకాయ కూరలూ, వెల్లుల్లి కారప్పొడి చేసి ఇచ్చేవారు అత్తయ్య. అప్పుడప్పుడు వాళ్ళింటికి కూడా వెడుతూండేవారు. ఓసారి ఆవిడేదో మాటల్లో.. ఇక్కడికి పిల్లలు తమ తల్లిదండ్రులని చాకిరీ చేయించుకుందుకి పిలిపించుకుంటారు అని అన్నారు.. ఇక అంతే..

“చూడండి విజయగారు! ఇదే మీ అమ్మాయి ఇండియాలో ఉండుంటే మీరు మీ ఇంటికి తీసుకొచ్చి పురుడు పోస్తారా? లేదా? అక్కడ చేయాల్సినది ఇక్కడ చేస్తున్నారు అంతే. ఏం? వాళ్ళకి అమెరికా సంబంధాలు కుదిర్చినపుడు అనుకోలేదా? అప్పుడేమో అమెరికా అల్లుడు వచ్చాడంటే అదో స్టేటస్ సింబల్, గొప్పానా? వాళ్ళు అంతంత ఖర్చు పెట్టుకుని మిమ్మల్ని ఇక్కడకి తీసుకువచ్చి, బోలెడు కొనిపెట్టి, అటూఇటూ తిప్పడం లేదా? మళ్లీ ఇండియాకి వచ్చినపుడు ఊరికే రారుగా! గిఫ్ట్‌లు తెస్తూనే ఉంటారు. అప్పుడు మాత్రం వాళ్ళకి అడుగులకు మడుగులు వత్తుతారేం.. అయినా ఎవరికి చేస్తున్నారు చాకిరీ? మీ పిల్లలకేగా? మీ మనవలకేగా? ఏదో ఆరునెలలు ఉండి చేయడానికి ఇంతలా ఫీలవుతున్నారేంటీ?” ఛడామడా ఆవిడని కడిగిపారేసారు అత్తయ్య. ఆవిడ మళ్లీ నోరెత్తితే ఒట్టు.

ఇలాంటి వాతలు చాలా మందికే పెడుతూండేవాడు.

“ఊరుకోండత్తయ్యగారూ! మధ్యలో మనకెందుకు?” అని నేనంటూంటే,

“ఎలా ఊరుకోమంటావే సుమిత్రా! కూతుళ్ళ దగ్గర చాకిరీ అన్నందుకు కాదు, ఇలాంటివాళ్ళు కొడుకులను, కోడళ్ళనీ కూడా అంటూనే ఉంటారు. అప్పుడేమో.. నువ్వు అమెరికాలోనే చదవాలి. అమెరికా లోనే ఉద్యోగం వెలగబెట్టాలి. మనవాళ్ళ పిల్లలందరూ అక్కడే ఉన్నారు, నువ్వు అక్కడే ఉండాలి అంటూ పిల్లల్ని అమెరికా విమానాలు ఎక్కించడం, తర్వాత రెక్కలొచ్చి ఎగిరిపోయారూ, డాలర్ల వెనకాల పరిగెడుతున్నారూ.. అంటూ నిందలు వేయడం ఈ తల్లితండ్రులకి అలవాటైపోయింది కదా. పంపే ముందే అన్నీ ఆలోచించుకోవాలి. ఆ తర్వాత వాళ్లు, వాళ్ల ఉద్యోగాలూ, కెరీర్లూ, కాపురాలూ, పిల్లలూ ఇలా మునిగిపోతారు. తిరిగి రాలేకపోవచ్చు. అంతమాత్రాన వాళ్ళని తప్పు పడితే ఎలా? పిల్లల్ని అనే ముందు తల్లితండ్రులు తాము తమ అమ్మానాన్నలని ఎంతవరకూ చూసుకున్నారో.. ఒకసారి ఆలోచించాలి. తాము మాత్రం వాళ్ళని పల్లెటూళ్ళలో వదిలేసి బస్తీల్లో ఉద్యోగాలకు రాలేదా? అలాగే ఈ తరం దేశాలు దాటిపోతున్నారు. అంతే. అందరూ అలా ఉండకపోయినా అధిక శాతం మంది మాత్రం అంతే. ఓపిక ఉండి చేసుకోగలిగితే వాళ్ళకి వాళ్లు ఉండాలి. లేకపోతే పిల్లల దగ్గరకి వచ్చి ఉండాలి. పిల్లలు లోటు చేస్తూ, పట్టించుకోకపోతే పిల్లలదే తప్పు. కాదనను. కొందరు తల్లితండ్రులని అస్సలు పట్టించుకోని కృతఘ్నులు ఉన్నారు. తల్లితండ్రుల రెక్కల కష్టంతో పైకొచ్చి.. ఆ తర్వాత వారిని నడిబజారులో వదిలేసే పిల్లల్ని క్షమించకూడదు.

కానీ, తమ తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నప్పటికీ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అన్ని వసతులు చూసే పిల్లలు ఉన్నారు. తరచూ వాళ్లు వచ్చి చూడడమో, లేదా అమ్మానాన్నలనే తమ దగ్గరకి పిలిపించుకోవడమో చేసే పిల్లల్ని కూడా ఇలాంటి పేరెంట్స్ అంటూనే ఉంటారు. రిటైరయిపోయి వేరే కాలక్షేపాలు లేక, ఊరికే ఉండలేక, ‘తల్లితండ్రులని పట్టించుకోని అమెరికా కొడుకులు’, ‘ముసలి తల్లిని వృద్ధాశ్రమంలో వదిలేసిన ఎన్నారై కొడుకు’ ఇలాంటి వార్తలు వాట్సప్‌లో ఒకరికొకరు పంచుకోవడం, తమని ఆ వార్తలతో పోల్చుకోవడం పరిపాటైపోయింది. అంత ఖాళీగా ఉంటే ఏదో ఒక వ్యాపకం చూసుకోవాలి. బుర్రని దయ్యాల గూడులాగా చేసుకోకూడదు.

నా వరకూ నేను ఓపికున్నంత వరకూ, నాకు చేతనైన సహాయాలు చేస్తూనే, పుస్తకాలు చదువుకుంటూనో.. నా మనసుకి నచ్చినట్టు, ఎలాగోలా కాలక్షేపం చేసుకుంటూ, మనూళ్ళోనే ఉంటాను. కుదరకపోతే  మీ దగ్గరకి వచ్చేస్తాను. అంతేకాని నిన్ను, అచ్చిగాడినీ తప్పు పట్టను” అన్నారు.

అత్తయ్యగారి మాటలతో నాకు ఆవిడ వ్యక్తిత్వం పూర్తిగా అవగాహన అయింది. ఆవిడ ఔన్నత్యం ఆకాశం అంత ఎత్తున కనిపించింది.

అత్తగారంటే ఆరళ్ళు పెడతారు, చాదస్తంతో చంపేస్తారు, ప్రతీదాంట్లో తలదూర్చి విసిగిస్తారు అనుకునేవారికి పూర్తి వ్యతిరేకం ఈవిడ. నా అదృష్టమే ఇంత మంచి అత్తగారు దొరకడం అనుకున్నాను.

ఇండియాలో ఆవిడ దగ్గర నేను ఉండలేకపోయినప్పటికి.. ఆవిడ ఒప్పుకుంటే. ఇక్కడికి తీసుకువచ్చి.. ఆవిడ ఆలనా పాలనా చూసుకుంటూ ఇక్కడే ఉంచేసుకుందామనే నిర్ణయానికి వచ్చేసాను. ఇక ఆవిడ ఇష్టం మరి.. ఏమంటారో? *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here