అత్తగారు.. అమెరికా యాత్ర 17

0
11

[dropcap]ఆ[/dropcap] విజయ గారికే కాదు.. ఎవరికైనా సరే వాళ్ళు మాట్లాడే మాటలు సమంజసమని అనిపించకపోతే వాళ్ళకి క్లాసు పీకడంలో ముందుండేవారు మా అత్తయ్య గారు.

ఓసారి  నా స్నేహితురాలు రమ్య మా ఇంటికి వచ్చింది. మరో నెల రోజుల్లో ఇండియా ప్రయాణం వుందని చెప్పింది. మామూలుగా మాట వరసకి అడిగాను, ‘ఇండియాలో మీ వాళ్ళకి ఇవ్వడానికి ఏవేం షాపింగ్ చేసావు?’ అని.

“మా తమ్ముడికి లాప్‌టాప్, వాచ్, మా చెల్లికి గోల్డ్ కాయిన్, ఇంకా బోలెడు బ్రాండెడ్ బట్టలు, మా నాన్నగారికి ఐ ఫోను తీసుకున్నాను. మా అమ్మకి మంచి హేండ్ బేగ్ కొన్నాను.” అంది.

వెంటనే అందుకున్నారు మా అత్తగారు. నేను ఓ పక్క నుంచి సైగ చేస్తున్నా పట్టించుకోవడం లేదు ఆవిడ.

“మీ వాళ్ళకి కొన్నావు బావుంది.. మరి మీ అత్తగారింట్లో ఇవ్వడానికి ఏం తీసుకున్నావు?” అడిగేసారు.

“వాళ్ళకి నేను ఎప్పుడూ ఏదీ తీసుకోనండీ! అయినా ఇక్కడ కొన్నవి వాడుకోవడం కూడా వాళ్ళకి చేతకాదు. ఇక్కడ మేము ఎంత కష్టపడి సంపాదించినది అందరికీ పంచిపెట్టడానికి కాదుగా! అసలు ముందు మా అమ్మావాళ్ళింట్లోనే దిగేసి, సూట్కేసులు అక్కడే వుంచేసి పదిరోజుల తర్వాత మా అత్తగారి ఊరు వెడతాము. అక్కడ పిల్లలకి ఏంతోచదు. అందుకే రెండు మూడు రోజులు వుండి మళ్లీ మా అమ్మా వాళ్ళింటికి వెళ్లి పోతాము”  గోళ్ళకి వున్న నెయిల్ పాలిష్ చూసుకుంటూ చెప్పింది రమ్య.

“ఏమిటీ? మొత్తం మూడు నెలల ట్రిప్పులో రెండు మూడు రోజులు అత్తగారింట్లో వుంటావా? ఏం ? వాళ్ళకి నీకూ పడదా? నిన్ను ఏమైనా ఇబ్బంది పెడతారా?” ఆరా తీయడం మొదలెట్టారు.

“అదేం లేదండీ! నన్ను ఏమీ అనరు. నేను వెళ్ళినపుడు నన్ను బానే చూసుకుంటారు.” అంది రమ్య.

దాంతో అసలు విషయం పట్టేసారు అత్తయ్య గారు.

“ఓహో! అయితే నీకే వాళ్ళు పడరన్నమాట. పుట్టింటి మీదే అన్నమాట నీకు ప్రేమ. నువ్వు సరే, నీతో పాటు మీ ఆయన్ని కూడా మార్చేసావా? నీకు నీ తల్లితండ్రులు ఎంతో అతనికి వాళ్ళ అమ్మానాన్నలు ముఖ్యమే కదా! రాకరాక కొడుకు కోడలు వస్తున్నారు అని వాళ్ళు ఎదురు చూస్తూంటారు. బహుమతులు కోసం కాకపోయినా, మీతోనూ, మనవలతోనూ వాళ్ళకీ గడపాలని అనుకుంటారు కదా? నువ్వు చేసేది తప్పే అమ్మాయీ!” అనేసరికి ముఖం గంటుగా పెట్టుకుంది రమ్య. ముళ్ళమీద కూర్చున్నట్లు కాసేపు కూర్చొని, ‘ఇక వెడతాను. పని వుంది’ అంటూ వెళ్ళిపోయింది.

తను వెళ్ళాక, “అదేంటి అత్తయ్యా! అలా అనేసారు?” అన్నాను.

“అలాగే అనాలి సుమిత్రా! చక్కగా చూసుకునే అత్తగారిని అలా దూరం పెడుతుందా? ఈ పిల్ల ఇలా వున్నా, ఆ అబ్బాయైనా చెప్పొద్దూ? మా అమ్మా నాన్న లకి కూడా బహుమతులు కొందామనీ, వాళ్ళ దగ్గర సగం రోజులు వుందామనీ చెప్పాలి కదా? మరీ భార్య విధేయుడిలా వున్నాడు. పోనీ ఆ అత్తగారు గయ్యాళి అయితే ఇలా వుంటే ఒక అర్థం. చాలా చోట్ల కోడళ్ళు ఇలాంటి వారే కనపడుతున్నారు.” అనేసరికి ,

“అత్తయ్యా! అందరినీ ఒకటే గాటన కట్టేయకండి. నేనూ కోడలినే కదా!” అన్నాను.

“నిన్ను కాదే సుమిత్రా! ఆ రమ్య లాంటి వారిని చూస్తేనే అలా అనబుద్ధి అవుతుంది. తల్లిని ఒకలా, అత్తని ఒకలా చూస్తారు. మన ఊళ్ళో వైదేహి ఇలాగే బాధ పడేది. తన కోడలు అమెరికా లోనేగా వుండేది. ఏడాదికోసారైనా తన తల్లితండ్రులని పిలిపించుకుని అన్నీ చూపించడం,కొని పెట్టడం చేసేదట. తన డెలివరీ టైముకి మాత్రం తల్లిని పిలిపించుకోకుండా, అప్పుడు అత్తగారి మీద ప్రేమ కారిపోతున్నట్లు రమ్మని పిలిస్తే,  పుట్టబోయే మనవడిని చూసుకుని మురిసిపోవాలని,పోన్లే పాపం అని వెళ్ళిందట వైదేహి. తీరా అక్కడికి వెళ్ళాక తనని పట్టించుకునేదే కాదట. ఫ్రెండ్స్ వచ్చినా పరిచయం చేసేది కాదట. కొడుకు కూడా తల్లిని అవసరానికి పిలిపించుకున్నట్లే వుండేవాడట. డెలివరీ వరకూ అత్తగారి సహాయం తీసుకుని, తర్వాత వాళ్ళమ్మని పిలిపించుకుని వైదేహిని తిరిగి పంపేసారట. తర్వాత తెలిసింది.. ఆ కోడలి డెలివరీ టైమ్‌లో అక్కడ సీజన్ విపరీతంగా చలిగా వుంటుందని, ఆ వాతావరణం తన తల్లికి పడదని, వైదేహిని పిలిపించారనీ, పైగా డెలివరీ టైమ్‌లో చాకిరీ కూడా తన తల్లికి తప్పించాలనీ ప్లాన్ చేసి మరీ అత్తగారిని పిలిపించుకుంది ఆ తెలివైన కోడలు. పాపం! ఈ వెర్రి ముఖం  వైదేహి, కొడుకు కోడలు ప్రేమతో పిలిచారనుకుని వెళ్లి, చాకిరీ కి చాకిరీ చేసింది. చలి వాతావరణంలో అక్కడ వుండేసరికి, అక్కడా, తిరిగి వచ్చాకా బాగా ఇబ్బంది పడింది. ఆయాసం, నెమ్ముతో చాలా రోజులు బాధ పడేది. ఇలా వుంటారు కొందరు కోడళ్ళు. వాళ్ళు కూడా అత్తగార్లయితే  కానీ తమ తప్పులు తెలుసుకోలేరు.” అన్నారు అత్తయ్య గారు.

అదీ నిజమే కదా అనిపించింది. ఎక్కడో కొన్ని ఇళ్లలో మాత్రమే.. తన అత్తగారిలాంటి అత్తలు, తన వంటి లాంటి కోడళ్ళు వుంటారు అనుకున్నాను.

అత్తయ్య గారు ఇలా రకరకాల మనస్తత్వాలు వున్నవారిని ఇక్కడ కలుసుకోవడం, వాళ్ళ మీద తన అభిప్రాయాలు వెలిబుచ్చడం  చూస్తుంటే ఈవిడ చేసే విశ్లేషణ కరెక్టే అనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here