పెరుగుతున్న పాఠకాదరణ- పెరుగుతున్న బాధ్యత

0
5

[dropcap]సం[/dropcap]చిక వెబ్ పత్రికకు విశేషంగా లభిస్తున్న పాఠకాదరణ ఆనందంగా వున్నా ఒకింత భయాన్నీ కలుగజేస్తోంది. ఎంతగా పాఠకాదరణ లభిస్తే అంతగా మా బాధ్యత పెరుగుతుంది. పాఠకులు మా నుంచి ఊహిస్తున్న స్థాయికి తగ్గకుండా రచనలను అందించటమే కాకుండా అంచెలంచెలుగా రచనల స్థాయిని పెంచుకుంటూ పోతూ, మరిన్ని ఉత్తమమయిన విశిష్టమయిన విభిన్నమయిన రచనలను అందించాల్సిన బాధ్యత సంచికపై పాఠకులు వుంచుతున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పాఠకులను ఉత్తమ స్థాయి, అభిరుచి కల రచనలతో ఆకర్షించటంలో భాగంగా ఈ నెల నుంచీ ఒక నవల, రెండు సరికొత్త శీర్షికలను ఆరంభిస్తున్నాము.

గంటి భానుమతి ప్రఖ్యాతి చెందిన నవలా, కథ రచయిత్రి. ఆవిడ రాస్తే బహుమతి రావటం తథ్యం. అంతగా నాణ్యమయిన రచనలకు ఆవిడ పెట్టింది పేరు. ఆమె రచించిన “తమసోమా జ్యోతిర్గమయ” అన్న సీరియల్ ఈ నెల నుంచీ ప్రారంభమవుతోంది. అలాగే, జొన్నలగడ్డ శ్యామల గారు సీనియర్ జర్నలిస్టే కాదు, చక్కని రచయిత్రి కూడా. శ్యామల గారి మానస విహార సంజనిత సృజనాత్మకపుటాలోచనల ఫలితమే సరికొత్త శీర్షిక “మానస సంచరరే“. ఈ శీర్షిక కూడా పాఠకులను అలరిస్తుందన్నది మా విశ్వాసం. ఎన్.వి. హనుమంతరావు గారు దూరదర్శన్‌లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన చక్కని సృజనశీలి. తన సృజనాత్మకతతో దూరదర్శన్‌లో అత్యంత విభిన్నము, విశిష్టమయిన కార్యక్రమాలను రూపొందించి దూరదర్శన్‌ను ప్రేక్షకులకు ప్రీతిపాత్రం చేయటంలో తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. వారు ఉద్యోగ రీత్యా అండమాన్‌లో కొన్నాళ్ళు ఉండాల్సి వచ్చినప్పుడు, అక్కడి అనుభవాలను రాసుకున్నారు. అంటే ఇది ఒక వారం పాటు పర్యాటకుడిలా తిరిగి రాసిన పర్యాటక విశేషాల రచన కాదు. అండమాన్ నివాసిగా, అండమాన్‌ను దర్శించి అనుభవించి రచించిన రచన “అండమాన్ అనుభూతులు“. ఈ శీర్షిక కూడా పాఠకులకు అండమాన్‌ను నూతన దృక్కోణంలో పరిచయం చేసి అలరిస్తుంది.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ‘తాను సూర్యుడికన్నా పూర్వం వాడిని’ అని చెప్పినప్పుడు అర్జునుడు వెంటనే “నువ్వు నాకు సమకాలికుడివి, సూర్యుడికన్నా ముందరివాడివి ఎలా అవుతావు?” అని ప్రశ్నిస్తాడు… అంటే ఈ మానవ ప్రపంచంలో, ఏదయినా అంశం మన బుద్ధికి విరుద్ధంగా తోస్తే, ప్రశ్నించి తీరాలన్నమాట.. “అమ్మా… వీడు నన్నే ప్రశ్నిస్తాడా?” అన్న దురహంకారం చూపకుండా, ప్రశ్నించిన వాడి సందేహం తీర్చటంలోనే అసలు వ్యక్తిత్వం తెలుస్తుంది. కానీ, తెలుగు సాహిత్య ప్రపంచంలో కొందరిని ఒక పీఠంపై ఉంచి వారిని ప్రశ్నించటమే నేరమన్నట్టు ప్రవర్తించటం ఒక ఆనవాయితీగా మారుతోంది. ఇది శోచనీయమయిన ధోరణి. ఎవరినయినా, దేన్నయినా ప్రశ్నించటంలో తప్పులేదు. ఒకవేళ ఈ ప్రశ్న సాహిత్య సంబంధి అయితే, దానికి సమాధానం సాహిత్యం ద్వారానే ఇవ్వాల్సివుంటుంది. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రచిస్తే, రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం రచించింది. ప్రతిగా, తెన్నేటి హేమలత రామాయణ విషవృక్ష ఖండన రచించింది. ఇదీ సాహిత్య ప్రపంచంలో విమర్శ, ప్రతి విమర్శ, ప్రశ్న, సమాధానాల పద్ధతి. అలాంటి సంస్కారయుతమైన, ఆరోగ్యకరమయిన వాతావరణం సాహిత్య ప్రపంచంలో నెలకొల్పాలన్నది సంచిక లక్ష్యం. ఒక రచనను విమర్శించగానే, అందులో విమర్శకుడు చూపిన దోషాలకు సమాధానం ఇచ్చి, విమర్శకుడి దృష్టిలోపాన్ని ఎత్తి చూపించే బదులు, విమర్శకుడిని వ్యక్తిగతంగా కించపరచటం సాహిత్య సాంప్రదాయం కాదు, సంస్కారమూ కాదు. సాహిత్య ప్రపంచంలో స్పర్ధలు, విమర్శలు, వాదోపవాదాలు సాహిత్యానికే పరిమితం కావాలే తప్ప వ్యక్తిగత స్థాయికి దిగజారకూదదు.

త్వరలో సంచికలో శ్రీపాద స్వాతి కన్నడం నుంచి అనువదించిన నవల, యువ రచయిత ఆనంద్ వేటూరి రచించిన నవలలు ఆరంభమవుతాయి. వీటితో పాటు ప్రఖ్యాత రచయిత స్వర్గీయ ఘండికోట బ్రహ్మాజీరావుగారు, రచించిన చివరి నవల, అముద్రిత రచన అయిన శ్రీపర్వతమనే చారిత్రక నవల కూడా సంచికలో ధారావాహికగా ఆరంభమవుతుంది.

ఈ నెల సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలివి

సంపాదకీయం:

పెరుగుతున్న పాఠకాదరణ – పెరుగుతున్న బాధ్యత  – సంచిక టీమ్

కాలమ్స్:

రంగుల హేల -5: ముందుమాటలూ – మొట్టి కాయలూ – అల్లూరి గౌరీలక్ష్మి

మనసులోని మనసా 2 – మన్నెం శారద

మానస సంచరరే 1 – జె. శ్యామల

ధారావాహికలు:

తమసోమా జ్యోతిర్గమయ 1 – గంటి భానుమతి

నీలమత పురాణం 2 – కస్తూరి మురళీకృష్ణ

కథలు:

నేను నా బుడిగి -5 – వాసవి పైడి

గుంటూరు టు హైదరాబాదు – చావా శివకోటి

నిర్ణయం – డా. చిత్తర్వు మధు

నేను మా ఆవిడ ఓ అమ్మాయి – వావిలికొలను రాజ్యలక్ష్మి

ఆవిడ – ఆయన – గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు

కవితలు:

వనితా ఏమైంది నీ మమత? – సింగిడి రామారావు

నిరీక్షణ – డా. విజయ్ కోగంటి

మాటల ముద్రలు – శ్రీధర్ చౌడారపు

సంస్కృత శ్లోకం తెలుగు పద్యం 4 – పుప్పాల జగన్మోహన రావు

అరణ్యరోదన – శంకర ప్రసాద్

బాలసంచిక:

నేటి సిద్ధార్థుడు 5 – సమ్మెట ఉమాదేవి

పందెం – శాఖమూరి శ్రీనివాస్

ముద్గలుడు – బెల్లంకొండ నాగేశ్వర రావు

చీమలు – డి. చాముండేశ్వరి

ప్రత్యేక వ్యాసం:

శ్రీతిరువేంగళ నాధుడికి శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన కానుకల వివరాలు – వేద ప్రభాస్

వ్యాసాలు:

కథ – సంవిధానం – బుసిరాజు లక్ష్మీ దేశాయి

కన్నడ సాహిత్య చందనశాఖి కువెంపు – సిహెచ్.లక్ష్మణ చక్రవర్తి

విశ్వనాథ రచనలలో కారుణ్య రస మూలాలు – కోవెల సుప్రసన్నాచార్య

శిశిరానికి చిగురులనిచ్చే ‘గీత్ వసంత్’ మహాకవి నీరజ్ – డా. టి. సి. వసంత

ప్రయాణం:

అండమాన్ అనుభూతులు 1– ఎన్.వి.హనుమంత రావు

భక్తి:

సంధ్యావన్దనము – డా. వి.ఎ. కుమారస్వామి

గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 3: శ్రీ మూలాంకురేశ్వరీ దేవి, అమీనాబాద్ – పి.యస్.యమ్. లక్ష్మి

పుస్తక పరిచయం:

కాశీపట్నం చూడర బాబూ – సంచిక టీం

రెండు కళ్ళు – సంచిక టీం

ప్రకటన:

కవితలు, కథల పోటీ 2018 – సంచిక టీం

కార్టూన్లు

కెవిఎస్ -3

సుధాకర్-3

సలహాలు సూచనల ద్వారా సంచికను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేంకు సాహిత్యాభిమానులంతా తోడ్పడాలని విన్నపం…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here