ఆసక్తిగా చదివించే కథాసంపుటి ‘ఔరా అగ్గిరవ్వా’

0
11

[శ్రీ షేక్ మస్తాన్ వలి రచించిన ‘ఔరా అగ్గిరవ్వా’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]రి[/dropcap]టైర్డ్ ఇంజనీర్ శ్రీ షేక్ మస్తాన్ వలి గారు వెలువరించిన రెండవ కథాసంపుటి ‘ఔరా అగ్గిరవ్వా’. ప్రవృత్తి రీత్యా కవి, కథకులు అయిన షేక్ మస్తాన్ వలి గారు వ్రాసిన 15 కథలున్నాయి ఈ సంపుటిలో. ఈ 15 కథల్లో 9 సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవటం విశేషం.

“ఈ కథా సంపుటి లోని కథలు హాస్యాన్ని పండిస్తూనే.. అనుబంధాల గొప్పదనాన్ని, బాధ్యతల విలువని, మానవత్వం ప్రేమల ప్రాధాన్యాన్ని వివరించాయి. పాత్రోచిత మరియు సందర్భోచిత సంభాషణలు వీరి కథల విశిష్టతగా చెప్పవచ్చు.” అని వ్యాఖ్యానించారు డా. మైలవరపు లలితకుమారి తమ ముందుమాటలో.

“హాస్యరసాన్ని ఆస్వాదించలేకపోతే, మనిషిలో మిగిలేది కేవలం నీరసమేనని నా భావన. అందుకే నా కథలలో ఎక్కువగా సందేశ మిళితమైన హాస్యాన్ని ప్రతిబింబించాను” అన్నారు రచయిత ‘నా మాట’లో.

~

దరిశి నుంచి వచ్చి బొద్దికూరపాడులో వ్యవసాయ పనులు చూసుకుని, వరసకి చెల్లెల్లయ్యే దూరపు బంధువు మంగమ్మ ఇంటికి వెళ్తాడు పున్నయ్య. రాకరాక వచ్చిన పున్నయ్యని మంగమ్మ, రంగయ్యలు ఆప్యాయంగా పలకరిస్తారు. ఆ రాత్రికి తమ ఇంట్లోనే ఉండి పొద్దున్న వెళ్ళమని మరీ మరీ కోరిన మీదట పున్నయ్య ఉండిపోతాడు. మంగమ్మ కొడుకు వెంకయ్య – వచ్చినదెవరని అమ్మని అడిగి, తనకి మామ వరస అవుతాడని తెలుసుకుంటాడు. అతని ప్రవర్తన పున్నయ్యకి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఆ రాత్రి భోజనాలయ్యాకా, మంగమ్మ అన్నని ఓ కోరిక కోరుతుంది. కొడుకు వెంకయ్యని దరిశిలో ఉంటున్న తన కూతురు సునీత ఇంట్లో దిగబెట్టమని అడుగుతుంది. సరేనంటాడు. మరునాడు బస్ స్టాండులో, బస్సులో, దరిశిలో బస్సు దిగి సునీత ఇంటికి రిక్షాలో వెళ్తున్నప్పుడు వెంకయ్య చేసిన అల్లరిని భరిస్తూ, అతని చేష్టలకు నవ్వుకుని ‘ఔరా అగ్గిరవ్వా’ అనుకుంటాడు పున్నయ్య.

ఒక భ్రమ కారణంగా – దైవం మీద అతి భక్తి ఉన్న నాగన్న జనాల హేళనలకీ, తిట్లకీ గురవుతాడు ‘పొరపాటు’ కథలో. అతి భక్తి ఒక్కోసారి వాస్తవాలను గుర్తించనీయకుండా చేస్తుందని ఈ చిన్న కథ సూచిస్తుంది.

కల్పన చివరి రోజుల్లో ఉండి, తన చిన్ననాటి స్నేహితురాలైన కవితని చూడాలని ఉందని ఆమెకు ఫోన్ చేస్తుంది. కవితకి మరునాడు లా డిగ్రీ పరీక్ష ఉంటుంది. వెంటనే వెళ్ళలేని పరిస్థితి. డిగ్రీ పరీక్షని వదులుకోలేక, పరీక్ష రాసి ఆ సాయంత్రమే బయల్దేరిపోతుంది. కానీ చెన్నై చేరి వాళ్ళింటికి వెళ్ళేసరికి కల్పన దక్కదు. ‘విధి బలీయం’ అనిపిస్తుంది. పాఠకుల మనసుల్లో విషాదాన్ని నింపే ఈ కథలో చిన్నారుల కల్మషం లేని స్నేహాన్ని కళ్ళకు కడుతుంది.

ఆదాయం ఉన్నవారికి ఒకలా, లేని వారిని ఒకలా చూస్తుంది సమాజం, అది సహజం, లోకరీతి. బజ్జీల కొట్టు నడిపే బంగారయ్య ఇందుకు మినహాయింపేమీ కాదు. నాణ్యమైన బజ్జీలు తయారు చేస్తూ, ఊరి వారి అభిమానాన్ని పొందిన బంగారయ్య కుటుంబం – కస్టమర్ల ఉద్యోగాలను బట్టి వారికి ఖాతా పెడుతుంది. ఓ రోజున కొందరు తిని, కొందరు ప్యాక్ చేయించి పట్టుకెళ్తున్న సమయంలో ఒకతను రెండు బజ్జీలను తీసుకోబోతే – బంగారయ్య అతని చేతిని పట్టుకుని ఆపి – దొంగతనం చేస్తున్నందుకు నాలుగు తగిలించబోతాడు. అప్పుడతను ముందు తాను చెప్పేది వినమంటాడు. అక్కడ ఉన్నవాళ్ళు కూడా అతనేం చెప్తాడో వినమని అనటంతో సరే చెప్పమంటాడు. అప్పుడా వ్యక్తి ఏం చెప్పాడో, అందుకు బంగారయ్య ఎందుకు బిత్తరపోయాడో తెలియాలంటే ‘నాటకం’ కథ చదవాలి.

దిగ్భ్రమ’ కథా కాలం దాదాపు వందేళ్ళ క్రితం నాటిది. గుంటూరు లోని నగరం పాలెం నుండి పొత్తూరుపేటలో జరిగే పెద్ద జమాత్‍కు బయల్దేరిన జాన్ బీ, అమీనా, ఫాతిమాలకు దారిలో ఎదురయిన అనుభవాలు వారికే కాకుండా చదివే వారికి ఒళ్ళు గగుర్పుడిచేలా చేస్తాయి. వారికి తారసపడింది జిన్నాతో లేక మనిషో గ్రహించలేక.. బెదిరిపోయి జ్వరాలు తెచ్చుకున్న జాన్ బీ, అమీనాలకు సేవలు చేస్తూ – తార్కికంగా ఆలోచిస్తూ – ఆ వచ్చింది మనిషేననీ, అంతటి చీకట్లో కాళ్ళు కనబడకపోవడం సహజమేనని అనుకుంటుంది ఫాతిమా.

భర్త లేని స్త్రీని బంధువులెలా శాసిస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఆమెకేదో మేలు చేస్తున్నామంటూ, వాళ్ళ అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నిస్తారు. ‘నేటి ధర్మం’ కథలో శాంత తల్లి ఇలాంటి పెద్దలనే ఎదుర్కుంటుంది. చేతకాని వ్యక్తిని శాంతకి మొగుడిగా అంటగట్టి, తన జీవితాన్ని నాశనం చేస్తారు బంధువులు. ఇద్దరు పిల్లలు పుట్టాకా, భర్త తరిమేస్తే తల్లి దగ్గరకొచ్చి టైలరింగ్ నేర్చుకుని ఉపాధి కల్పించుకుని కష్టపడి జీవితంలో కుదురుకుంటుంది శాంత. చాలా ఏళ్ళ తర్వాత ఆ బంధువులు మొగుడిని తీసుకొచ్చి – అతను జబ్బు పడ్డాడని, ఉంచుకున్నామె వదిలేసిందనీ, మొగుడు కనుక నీకు తప్పదంటూ, నెలకు మూడు వేలు ఇమ్మని అడిగితే, వాళ్ళందరికీ బుద్ధొచ్చేలా చేస్తుంది శాంత. అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కుని జీవితంలో రాటుదేలిన వ్యక్తి ఆ మాత్రం తెగింపు చూపడం సమంజసమే!

ప్రతీదీ టైమ్‍కి చేయాలనుకునే వ్యక్తి కథ ‘అదా.. సంగతి’. ఈ కథ కాలం – సెల్‍ఫోన్‍లు రాక మునుపటి కాలం. ప్రతీ పని టైమ్‍కి చేయాలనీ, సమయం విలువ తెలుసుకోవాలని – అందర్నీ ఊదరగొట్టే ఆనందరావుకి ఎదురైన సంఘటనలతో అల్లిన కథ ఇది. అర్జీలు పెట్టుకున్న వారి పొలాలను స్వయంగా పరిశీలించి, వారికి ఋణాలు మంజూరు చేయించే బాధ్యత బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‍గా పనిచేసే ఆనందరావుది. ఓ రోజు చేతి గడియారం పెట్టుకోవడం మరిచిపోయి వెళ్ళిన ఆనందరావు ఫీల్డులో సమయం తెలియక, చాలా చిరాకు పడతాడు. టైమ్ అనేది అతని ఊతపదం. అలాగే మరో ఊరికి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా రిస్ట్ వాచ్ పెట్టుకునే వెళ్తాడు కానీ, అక్కడ మరో ఘటన ఎదురవుతుంది. అలారం పీస్ ఉండడం ఎంత అవసరమో ఆ గ్రామ సర్పంచ్‍కి వివరిస్తాడు. అతని కూతురు పెళ్ళి జరిగితే వచ్చిన కానుకలన్నీ చిన్నా పెద్ద గడియారాలే! అతను, బంధువులు విస్తుపోతే, అందుకు కారణం ఏమై ఉంటుందో ఆనందరావు భార్య ఊహించి చెప్తుంది. అదే నిజమని పాఠకులకు అర్థమైపోతుంది.

తిండిని బట్టో, కొన్ని చేతల్ని బట్టో ఓ మనిషి వ్యవహార దక్షతని నిర్ధారించడం తప్పని చెబుతుంది ‘టంకం’ కథ. హాస్యం కోసం లింగయ్య పాత్రధారిని తక్కువ చేసినట్టు అనిపించినా కథకి అతడే నాయకుడవుతాడు. ఇలాంటి మధ్యవర్తులు – అన్నీ విషయాలలోనూ అంగీకారం కుదిరి – ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గర – నిల్చిపోయిన ఎన్ని సంబంధాలను కలిపి ఉంటారో? చక్కని కథ.

పుట్ట బద్దలయింది’ కథ ఆసక్తిగా చదివింపజేస్తుంది. మనిషికి భక్తితో పాటు ఇంగితం ఉండాలని సూచిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో జరిగే ఘటనలతో కొత్త దంపతులకు ముడి పెట్టి కథని నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.

గీత, బంగారయ్య అనే అన్నా చెల్లెళ్ళు తమ పిల్లలు ప్రేమించుకున్నారని తెలిసి వాళ్ళకి పెళ్ళి చేసి వియ్యంకులవుదామని సంబంధం కలుపుకుంటారు. నిశ్చయ తాంబూలాల కోసం ఓ రోజు ముందే వస్తారు. ఆ రాత్రి ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు, జరగబోయిన దొంగతనంతో హాడావిడి చెలరేగుతుంది. తాంబూలాల కార్యక్రమానికి వచ్చిన ఓ పెద్దమనిషి ఇదంతా విని – పిల్లల ప్రేమాయణంలో పెద్దల ‘పితలాటకం’ బావుందని తాను నవ్వుకుని అందరినీ నవ్విస్తాడు.

చెప్పుడు మాటలు విని కాపురాన్ని నాశనం చేసుకోబోయిన ఓ భార్య – నిజాన్ని గ్రహించి – భర్తలో మార్పు వచ్చిందని తెలుసుకుని – అరమరికలు లేకుండా అతని కలిసిపోయి జీవితాన్ని పండించుకుంటుంది ‘ఒంటరి పోరాటం’ కథలో. తప్పు చేసిన మనిషికి దిద్దుకునే అవకాశమివ్వాలనీ, అలాగే ఆ తప్పుని ఇకపై చేయనని నిర్ణయిచుకుని ఆ నిర్ణయంపై గట్టిగా నిలబడితే జీవితాలు ప్రశాంతగా సాగుతాయనీ ఈ కథ చెబుతుంది.

హాస్టల్‍లో చేర్చిన తన మిత్రుడి కొడుకుకి ధైర్యం చెప్పి, అక్కడ చదువుకునేలా చేయాలనుకున్న ఓ వ్యక్తి చేసిన పనుల వల్ల ఆ అబ్బాయికి హాస్టల్‍లోనే ఉండకుండా, ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ‘ప్రభావం’ కథలో. రెసిడెన్షియల్ స్కూల్ లైఫ్‍కి అలనాటు పడేలా ఆ బాబుని మోటివేట్ చేయాలనుకున్న ఆయన ప్రయత్నాలు ఎలా బూమరాంగ్ అయ్యాయో ఈ కథ చెబుతుంది. ఇంటికీ, తల్లిదండ్రులకూ దూరంగా హాస్టల్స్‌లో ఉండే పిల్లలను మోటివేట్ చేయాల్సిన పద్ధతులు ఇవి కావని ఈ కథ చెబుతుంది.

ఎదుటి వారి కష్టాన్ని మనం తీర్చలేకపోయినా, వారి బాధని ఓపికగా వింటే, వారికెంత సాంత్వన లభిస్తుందో ‘ఓదార్పు’ కథ చెబుతుంది. ఆధునిక సమాజంలో లోపిస్తున్న ఈ లక్షణాన్ని మళ్ళీ జనాలకి అలవర్చేలా చేస్తాయి ఇలాంటి కథలు.

గుంటూరు నుండి దోనకుండ వెళ్ళే ప్యాసెంజరు రైల్లో జరిగిన సంఘటనలతో అల్లిన కథ ‘ఆవేదన’. నిజానికి రైలు ప్రయాణాల్లోంచి చాలా కథలు పుడతాయి, ప్రయాణీకులను జాగ్రత్తగా గమనించగలిగితే! ఉన్నదంతా పెళ్ళయిన అక్కకి పెట్టేస్తున్నారని ఆవేశపడిన తమ్ముడు, తమ్ముడిపై తిరగబడిన అక్క. కూతురికి వత్తాసు పలికిన తండ్రి – ఎవరికీ సర్ది చెప్పలేని తల్లి! చాలా సేపు బోగీలో గందరగోళం సృష్టించిన ఈ పేద కుటుంబం లాంటి ఎన్నో కుటుంబాలు మన సమాజంలో ఉన్నాయి. ఒప్పుకుని తీరాల్సిన ఓ కఠిన వాస్తవాన్ని ఈ కథ చివర్లో చెప్తారు రచయిత.

ఒకరిపట్ల ఒకరికి ఆప్యాయాతానురాగాలు ఉన్న కుటుంబం డబ్బు లేకపోయినా సంపన్నమైనదనీ, తల్లిదండ్రులను గౌరవిస్తూ వృద్ధాప్యంలో వాళ్ళని ఆదరంగా చూసుకునే కొడుకు ఉన్న తండ్రి అసలైన ఆస్తిపరుడని ‘ధనికుడు’ కథ చెబుతుంది.

~

“కథలు ఎక్కడి నుంచో పుట్టవు, సాటివారి జీవితాల్లోంచే పుడతాయన్న సత్యం వీరి కథల్లో స్పష్టమౌతుంది. దాదాపు అన్ని కథలు నీతిబోధకంగా, సందేశాత్మకంగా, మనోధైర్యానికి ఊతమిచ్చేవిగా ఉండడం ఎంతైనా ప్రశంసనీయం.” అన్న డా. మైలవరపు లలితకుమారి అభిప్రాయంతో పాఠకులు ఏకీభవిస్తారు ఈ పుస్తకం చదివాకా.

***

ఔరా అగ్గిరవ్వా (కథాసంపుటి)
రచన: షేక్ మస్తాన్ వలి
ప్రచురణ: అస్మత్ పబ్లికేషన్స్, సికిందరాబాద్
పేజీలు: 120
వెల: ₹ 100/-
ప్రతులకు:
షేక్ మస్తాన్ వలి
ప్లాట్ నెం. 46, అశోక్ కాలనీ,
విజయా హైస్కూల్ వెనుక, కాప్రా,
ఇసిఐల్ పోస్ట్, సికిందరాబాద్ 500062
ఫోన్: 9440712591

 

~

షేక్ మస్తాన్ వలి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-shaik-mastan-vali/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here