ఆటోడ్రైవర్ వితరణ

0
9

[dropcap]గో[/dropcap]పాలరావు మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. అయినా అతను అతి పిసినారి.

ఒకరోజు గోపాలరావు రైతుబజారుకు వెళ్ళి కూరగాయలు కొంటూ అడిగి అడిగి కొసరు వేయించుకుంటున్నాడు. అమ్మేవాడు ఏమరుపాటుగా ఎటైనా చూస్తే ఒక వంకాయో, టమేటానో గబుక్కున తన సంచీలో వేసుకుంటున్నాడు. అలా వేసుకుంటుండగానే తనకు తెలిసిన ఆటోడ్రైవర్ శేఖర్ కూరలు కొనడానికి వచ్చాడు. శేఖర్ కొసరు అడగటంలేదు. బేరం చేయకుండా కూరలు కొనసాగాడు. గోపాలరావును ఆత్మీయంగా పలకరించి,

“రండి సార్, ఇంటి దగ్గర నా ఆటోలో వదులుతాను” అన్నాడు.

“ఐదు రూపాయలు ఇస్తాను” అన్నాడు.

శేఖర్ నవ్వుతూ “ఏమీ వద్దు సార్.. ఎప్పుడోకదా మీరు ఆటో ఎక్కుతారు.. అదిగాక మా ఇంటిదగ్గరే కదా మీ ఇల్లు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు”  చెప్పాడు శేఖర్.

“సరే” అంటూ గోపాలరావు ఆటో ఎక్కబోయాడు.

“కూర్చోండి సార్, ఒక్క నిముషంలో వస్తాను” అని మరలా రైతు బజారులోకి వెళ్ళాడు.

శేఖర్ మరలా ఎందుకు రైతు బజారులోకి వెళ్ళాడో చూడాలనిపించి, అతన్ని వెనకే అనుసరించాడు గోపాలరావు.

శేఖర్ తనుకొన్న కూరగాయల్లో నుండి ఒక వంకాయ, టమేటో, కొన్ని చిక్కుళ్ళు తీసి అక్కడే ఉన్న పెట్టెలో వేసాడు! ఆ పెట్టె మీద ఒక బోర్డు ఉంది.. “అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు వితరణ.. మీకు వీలైతే కూరగాయలు వేయండి” అని దాని మీద వ్రాసి ఉంది.

శేఖర్ వితరణ చూసి గోపాలరావు ఆశ్చర్యపోయాడు. తనకు నెలకు ఏభైవేల జీతం వస్తున్నా ఎవరికీ దానం కానీ సహాయం కానీ చెయ్యడు. మరి శేఖర్ బీదవాడైనా కూరలు కొసరు అడగలేదు, తనను ఉచితంగా ఇంట్లో దింపుతానన్నాడు! అది గాక కూరగాయలు ఖరీదైనా ఆ ధర్మ డబ్బాలో కూరలు వేసి తన వితరణ చాటుకున్నాడు.

శేఖర్ వితరణ గుణం గమనించిన గోపాలరావు గుండెల్లో కలుక్కుమంది. తను కూడా మారాలనుకున్నాడు. అప్పటినుండి గోపాలరావు అవసరం ఉన్నవారికి తన పరిధిలో సహాయం చేయసాగాడు. అలా సహాయం చేసినందువలన గోపాలరావు ఒక ఆనందం పొందసాగాడు!

సహాయం చేయడంలోనే దైవత్వం, ఆనందం దాగి ఉన్నాయి కదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here