అవధానం ఆంధ్రుల సొత్తు-12

0
12

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

అవధాన సభా సంరంభం:

[dropcap]అ[/dropcap]వధాన ప్రదర్శనను జీవితంలో ఒక్కసారి కూడా చూడని వారి కోసం వివరంగా ప్రాథమిక విషయాలే అయినా ప్రస్తావిస్తాను. సభావేదిక మీద అవధానికి ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ’ అన్నట్లు నలుగురు, నలుగురేసి కూచుని వుంటారు. అవధాని పక్కనే సభా సంచాలకులు/అధ్యక్షులు ఆసీనులవుతారు. అధ్యక్షోపన్యాసం తర్వాత అష్టావధాని ప్రార్థనా పద్యాలు నాలుగైదు ఆశువుగా చెప్పి సభను మంత్రముగ్ధుల్ని చేస్తారు. అష్టావధానంలో ఎనిమిది అంశాలను ఒక్కొక్కరు వారి ధోరణిలో ఎంచుకొంటారు. తప్పనిసరిగా నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, ఆశువు అనే నాలుగు అంశాలతో పాటు అప్రస్తుత ప్రసంగమూ చోటు చేసుకొంటుంది. ఇంకా మూడు ఐచ్ఛికాంశాలలో – పురాణ పఠనం, ఘంటా గణనం, వ్యస్తాక్షరి, చదరగం, వర్ణన, వారగణనం తదితరాలలో మూడింటిని అవధాని ఎంచుకొంటాడు. తొలుత ఒక వరుస పూర్తి చేసి, తర్వాత రెండో వరుస, మూడో వరుస పద్యపాదాలు చెబుతూ వెళతారు. చివరగా నాలుగో పాదం పూర్తి చేస్తారు. ఇది అవధాన ధోరణి. తర్వాత అవధాన పద్యధారణ. ఇది కేవలం అవధాని ఏకాగ్రతపై ఆధారపడి వుంటుంది. అక్షరం పొల్లు పోకుండా గత రెండు గంటలలో తాను చెప్పిన పాదాలు అనర్గళంగా అప్పగించటం మేధావిత్వం. సభా సంచాలకులు క్రీడలలో ‘రిఫరీ’ వలె పృచ్ఛకులకు, అవధానికీ మధ్య అభిప్రాయ భేదం కలిగినప్పుడు తన పాండితీ గరిమతో పరిష్కరిస్తాడు. 90 నిమిషాల నుండి రెండు గంటల లోపు అవధానం పూర్తి అవుతుంది. శతావధానంలో నూరుమంది పృచ్ఛక వరేణ్యులుంటారు. అందులో నిషిద్ధాక్షరి వుండదు. అవధానిని ఒక పట్టు పట్టాలని తాలింఖానాలో మల్లయోధుడిలా నిషిద్ధాక్షరి పృచ్ఛకుడు తొడలు చరిచి కూచొంటాడు.

నిషిద్ధాక్షరి:

అవధానంలో క్లిష్టమైన అంశమిది. పృచ్ఛకుడు సాధారణంగా దేవతాస్తుతి చేయమని కోరుతాడు. ఛందస్సు కందమే ఎన్నుకొంటారు. ప్రతి అక్షరం నిషేధిస్తూ సాగే ఈ సాహితీ క్రీడ పండితులకు వినోదంగా వుంటుంది. సామాన్య ప్రేక్షకుడు విసుగు చెందకుండా అప్రప్రస్తుత ప్రసంగకర్త మధ్య మధ్యలో ఛలోక్తులు విసిరి అవధాని ఏకాగ్రతకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తాడు. అవధాని కూనిరాగం తీస్తుంటాడు.

1970 మార్చి 15న నేను డిగ్రీ చదివిన వెంకటగిరి రాజా కళాశాల, నెల్లూరులో మా గురువులు పృచ్ఛకులుగా చేసిన అవధానంలో నేను పూరించినట్టి నిషిద్ధాక్షరిని సవినయంగా ఉదహరిస్తున్నాను.

పృచ్ఛకులు – శ్రీ వి. నారాయణ రెడ్డి, తెలుగు లెక్చరర్.

అంశం – విష్ణు స్తుతి. పద్యం కందం.

పూరణ ఇది:

శ్రీల నొరులు వేడరు మా
లోల! ఇదేలన? ఇట తమలోపల కథకున్
కాలము గలియుట లేదని
లోలోపల బాధపడెడి లోలత కనగా!

ఇందులో నాలుగో పాదం నిషిద్ధం చేయరు. స్వేచ్ఛగా చెప్పిన పాదం. ప్రాస స్థానంలో, యతి స్థానంలో నిషేధం వుండదు. ఒక అక్షరం చెప్పే ముందు దానికి ప్రత్యామ్నాయంగా మరో అక్షరం మనసులో పెట్టుకొని అవధాని ముందుకు నడుస్తాడు. ఉదాహరణకు ఈ పద్యంలో ‘శ్రీ’ అనగానే పృచ్ఛకుడు ‘శ’ నిషిద్ధం అంటాడు. అవధాని ‘ద’ అనవచ్చు. అదొక పరీక్షా సమయం. కొద్దిగా సమయం పట్టే అంశం.

సమస్య:

ఇది ఆకాశవాణి సమస్యా పూరణం కార్యక్రమం ద్వారా బాగా ప్రచారంలోకి వచ్చిన అంశం. నేను కూడా 1962లో బి.ఎ. డిగ్రీ విద్యార్థిగా విజయవాడ కేంద్రానికి పూరణలు పంపి, అవి ప్రసారం కాగా సంతోషించాను. 1970 ఫిబ్రవరిలో పొదిలిలో నాకిచ్చిన సమస్య – ‘కలలో గర్భము దాల్చి కన్య ఇలలో కన్యాత్వమున్ బాసెగా!

పూరణ:

వెలయాలై జనియింపలేదు, మదిలోవేర్భావమున్ పూన దా
కలికీ రత్నము ప్రేమ సంగతులలో కాల్జారినన్ తల్లి లో
పలె యాంతర్యము దాచె, దాగవవి; ఆ ప్రాంతాన పూరి పా
కలలో గర్భము దాల్చి కన్య ఇలలో కన్యాత్వమున్ బాసేగా!

కలలో అనే పదానికి ఒక అక్షరం ముందు చేర్చి పాకలలో అనడంతో అందులోని విరోధం తొలగిపోయింది. సంయుక్తాక్షరాలతో కూడిన ప్రాస గల సమస్య ఇచ్చి అవధానిని తికమక పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అవధాని తన శబ్ద చమత్కారంతో దానిని అవలీలగా తరిస్తాడు. ప్రేక్షకులను ఎక్కువగా ఈ అంశం ఆకట్టుకొంటుంది.

దత్తపది:

నాలుగు పదాల నిచ్చి ఫలానా విషయంపై పద్యం చెప్పమంటారు. 1973 జూన్‌లో విజయవాడ శాతవాహన కళాశాలలో నేను అష్టావధానం చేసినప్పుడు మాంటిస్సోరి కళాశాల అధ్యాపకులు శ్రీ దేవరకొండ చిన్నిక్రిష్ణయ్య ఇచ్చిన పదాలు హేమ, భీమ, సోమ, రామ – భారతార్థంలో పద్యం అడిగారు.

నా పూరణ ఇది:

హే! మకుటంబు లేని మనుజేశ్వర! దాయల భాగమిమ్ము! ఆ
భీమన శత్రునాశకుడు, భేదము కల్గిన ఆజిలోన మీ
సోమకులాన్వయంబునకు శోకము తప్పదు, కొప్పువట్టి ఆ
రామకు చేటు చేసితిరి, రాజ్యము నిచ్చెదొ? ఆజి చేసెదో?

ఇక్కడ రామ శబ్దానికి ద్రౌపది అని అర్థం. పదాలు సామన్యంగా ప్రాసతో సరిపోయే విధంగా ఇస్తారు. లేదా విడివిడి పదాలు కూడా ఇస్తారు. ఇంగ్లీషు, హిందీ పదాలు, సినిమా తారల పేర్లు, వంటకాల పేర్లు – ఏమైనా అడగవచ్చు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.

వ్యస్తాక్షరి:

పృచ్ఛకుడు నాలుగు అక్షరాలను నాలుగు పాదాలలో నిర్దేశిస్తాడు. విషయం నిర్దేశిస్తాడు. 1970 ఫిబ్రవరిలో కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రముఖ శతావధానులు కోట సోదర కవులలో ఒకరైన సుబ్రమణ్య శాస్త్రి గారిచ్చినది.

చంద్రోదయం – గీత పద్యం.

మొదటి పాదం – 3వ అక్షరం – ‘ల’. 9వ అక్షరం – ‘రా’

రెండో పాదం – 2వ అక్షరం – ‘న’. 5వ అక్షరం – ‘స’

మూడో పాదం – 6వ అక్షరం – ‘గ’. నాలుగో పాదం 4వ అక్షరం – ‘క’.

నా పూరణ భగవదనుగ్రహంతో ఇలా పూర్తి చేశాను:

కథ కల్పించి దినరాజు కదలుచుండ
దికరాస్తమయమును తెలిసి తెలిసి
బాలభానుడు నుపట్టి పంక్తిలోన
మహితరముల వెల్గుల మసలుచుండ

ఇలాగాక వ్యస్తాక్షరిలో అవధాని పృచ్ఛకుడడిగిన విషయంపై పద్యం మనసులో బావించి అడిగిన ఒక్కొక్క అక్షరం పృచ్ఛకుడికి చెబుతారు. లేదా పృచ్ఛకుడే ఒక పద్యపాదం ఎంచుకుని – 12వ అక్షరం ‘మ’; 6వ అక్షరం ‘క’ – ఇలా అవధానికి చీటీపై వ్రాసి చూపుతాడు.

అప్రస్తుత ప్రసంగం:

సభారంజకత్వానికి ఇదొక్కటే ప్రశస్తం. కొందరు జగజ్జెట్టీలు ఈ విద్యలో ఆరితేరిన వారున్నారు. విసుగు లేకుండా జనాలను ఆకర్షించే అంశమిది. ఆకాశవాణి అంటే ఏమిటి అని అడిగారు నన్ను. నలుగురికీ అవకాశమిస్తుంది గాన అది అవకాశవాణి అని చమత్కరించాను. పద్మమును నాభియందు గలవారా మీరు? అన్నాడు ఒక పృచ్ఛకుడు. ‘తామర’ నాకు లేదు అన్నాను. ఇలా ఛలోక్తి విసరడం సరదాగా వుంటుంది.

ఆశువు:

పద్యం ధారగా, వేగంగా చెప్పగలిగిన అంశం. అవధాని ప్రతిభకు నిదర్శనం. పలువురు అవధానులు ప్రతిభా పాండిత్యాలతో వన్నెకెక్కారు.

వర్ణన:

ఏదైన అంశం ఇచ్చి ఫలానా ఛందస్సులో వర్ణించమంటారు. నెల్లూరు నగరాన్ని వర్ణించమన్నారు పృచ్ఛకులు. నా పూరణ ఇది:

కళల కిచ్చట నిరతము కాపురంబు
నిరతము వదాన్య శేఖరుల నెలవు
సింహపుర మను ఖ్యాతి జెందెగాన
ప్రోన్నతశ్రీల మనుత నెల్లూరు నగరు!

పురాణపఠనం:

పృచ్ఛకుడు ఏదో ఒక కావ్యం/పురాణం మధ్యలో ఒక పద్యం చదివి దాని సందర్భం చెప్పమంటాడు. నానా పురాణ పరిచయం దీని కవసరం. రామాయణ, భారత, భాగవత పద్యాల భాగాలు కాకుండా, క్లిష్టమైన సందర్భాలు ఎంచుకొంటారు. అవధాని పురాణ ధోరణిలో ‘శుక్లాంబర ధరం విష్ణుం’ అని ప్రార్థనా శ్లోకం చెప్పి, ఆ సందర్భం పూర్వపరాలు వివరించి – స్వస్తి – అని ముగిస్తాడు.

ఘంటా గణనం:

పృచ్ఛకుడు కొట్టిన గంటలు మధ్య మధ్యలో లెక్కబెట్టి చెప్పాలి. పుష్పతాడనం – పువ్వు విసరడం కూడా కొందరు ఎంచుకొంటారు. 24-12-1946 ఏ వారం? అని అడిగితే, అవధాని లెక్క వేసి చెబుతాడు. ఇలా ఎనిమిది మందిని తృప్తి పరచాలి.

ధారణ:

చిట్టచివరగా తన మెదడు పొరలలో ఎనిమిది భాగాలలో దాచి వుంచిన పద్యపాదాలను తు.చ. తప్పకుండా చెప్పడం కత్తి మీద సాము. అవధానులందరూ ఈ కళలో ఉపాసనా బలంతో ఆరితేరినవారే. నాలుగో వరుస స్వేచ్ఛగా చెప్పి పూరణ పూర్తి చేసి సభాసదుల కరతాళధ్వనుల మధ్య సత్కారం పొందడం అవధాని జీవితంలో మరపురాని సంఘటన. ప్రతి ప్రసవ కష్టం – అవధానమని తిరుపతి కవు లనడం గమనార్హం!

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here