అవధానం ఆంధ్రుల సొత్తు-16

0
8

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

అవధాన సామ్రాజ్యాధినేతలు:

[dropcap]తి[/dropcap]రుపతి వెంకట కవులు జంట కవులుగా, అవధాన జైత్రయాత్రలు సలిపిన పండితులుగా సుప్రతిష్ఠులు. దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919), చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (1870-1950) ఆధునికాంధ్ర యుగకర్తలు. అవధానాల ద్వారా, ఆశుకవితల ద్వారా కవితా ప్రచారంలో ప్రజల నాకర్షించిన దార్శనికులు. హేమాహేమీలు వారి శిష్యులైనారు. అడవిలో ఉసిరికాయ, సముద్రపు ఉప్పు కలిసిన రీతిలో వారిద్దరు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద కడెద్ద గ్రామంలో వ్యాకరణం చదివారు. గురువు గారి ప్రోత్సాహంతో ఇద్దరు కలిసి కాకినాడలో జంటగా మొదటి అవధానం చేశారు. ఆ తర్వాత 1891 అక్టోబరులో శతావధానం చేశారు.

కాశీయాత్ర:

కాశీయాత్రకు వెళ్ళడానికి డబ్బు సంపాదించడానికి వెంకటశాస్త్రి నిడమర్రు, గుండుగొలనులలో అష్టావధానం చేశారు. కాశీ నుండి తిరిగి వచ్చి గంగా సంతర్పణ కోసం ముమ్మిడివరం, అయినవిల్లిలో అష్టావధానాలు చేశారు. తిరుపతి వేంకట కవుల అష్టావధానంలో అంశాలు:

(1) ఆకాశ పురాణం (2) కవిత్వం (3) పుష్పగణనం (4) వ్యస్తాక్షరి (5) అప్రస్తుత ప్రసంగం (6) కావ్య పాఠం (7) శాస్త్ర చర్చ (8) చతురంగం.

ఆశువు చెప్పడంలో వారు దిట్టలు. నూజివీడు సంపూర్ణ శతావధానంలో బైస్కిల్‍పై శార్దూల వృత్తంలో ఒక పద్యం చెప్పమన్నారు. విశ్వామిత్రుడు గుర్రానికి ప్రతిసృష్టిగా సైకిల్ సృష్టించాడని ఊహ చేయడంలోనే వారి ప్రతిభ కనబడుతుంది.  మామూలుగా అయితే సైకిలుకు రెండు చక్రాలు, బెల్ వంటి మాటలు ప్రయోగిస్తారు. వారి పాండితీ ప్రకర్షలో వెలువడిన పద్యం:

నీరుం గోరదు గడ్డి నడ్గదొక కొన్నే ఉల్వలన్ వేడ దే

వారే నెక్కిన క్రింద త్రోయ దొకడున్ పజ్జన్ భటుండుంట చే

కూరంగా వల దెందు బై స్కిలునకున్ కోపం బొకింతేని లే

దౌరా! వాజికి సాటియైనయిది విశ్రామిత్ర సృష్టంబొకో!

వాజి అంటే గుర్రం.

నవీన కవిత్వానికి నాంది, ప్రాచీన కవిత్వానికి భరతవాక్యం – పలికిన తిరుపతి కవులు తమ జైతయాత్రను నానారాజ సందర్శనము – అనే గ్రంథంలో ప్రకటించారు. ఆత్మకూరులో జరిగిన అవధాన ప్రదర్శనలో –

“ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స

న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార మె

వ్వానిని లెక్కపెట్ట కనివారణ దిగ్విజయం బొనర్చి ప్ర

జ్ఞా నిధులంచు బేరు గనినారము నీ వలనన్ సరస్వతీ!”

ఇందులో దర్పంతో బాటు వినయము ఉంది.

అమలాపురం శతావధానంలో ఇచ్చిన సమస్యకు పూరణ:

ఓ నవనీత చోర! కృప యుంచి పటమ్ముల నిచ్చి వేగ మా

మానము గావుమన్న వజ్రమానిని పల్కుల కెంతొ వింత న

వ్వాసన సీమ దోప కమలాక్షుడు తానిటు పల్కె మానినీ

మానవతీ లలామ కభిమానమె చాలును చీరయేటికిన్

తిరుపతి వెంకట కవులు జంటగా అవధానాలు ప్రదర్శించారు. ‘ఒక చరణం బతండు మరియొక్కటి నేను, మరొక్కటాతడున్’ – అనే రీతిలో చెరొక పాదం చెప్పేవారు. వారి అవధాన పద్యాలు నిలకడగా ఇంటి వద్ద కలము, కాగితము పట్టుకుని వ్రాసిన పద్యాల వలె అద్భుతంగా సాగాయి. వేలూరి, వేటూరి, పింగళి-కాటూరి, విశ్వనాథ వంటి హేమాహేమీలు వారి శిష్యులు. ‘అల నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదా భోగము… నా వంటి శిష్యుడున్నాడన్నట్టిది’ అని విశ్వనాథ దర్పంగా పలికారు.

తిరుపతి కవుల ఖ్యాతి కేవలం అవధానాల వలననే గాక పాండవోద్యోగ విజయాలు – నాటకం ప్రధానం. అందులోని పద్యాలు ‘బావా! ఎప్పుడు వచ్చితీవు?’, ‘అదుగో ద్వారక, ఆలమంద లవిగో!’, ‘అయినన్ పోయి రావలయు హస్తినకున్’ – వంటి పద్యాలు ప్రజల నోట అలవోకగా వినబడుతున్నాయి. సంస్కృతాంధ్రాలలో పలు గ్రంథాలు రచించారు. దేవీ భాగవతం, శివలీలలు, శ్రీనివాస విలాసము, బాల రామాయణము, ముద్రారాక్షసము,  మృచ్ఛకటికము, హర్ష చరిత్రము అనువాదాలు. శాశ్వతంగా నిలిచిపోయే గ్రంథాలు కూడా వ్రాసి అజరామర కీర్తి సంపాదించారు.

ఐదుగురు అవధానులు – శ్రీయుతులు గాడేపల్లి కుక్కుటేశ్వరరావు, పేరాల భరతశర్మ, ప్రసాదరాయ కులపతి, ధారా రామనాథశాస్త్రి, అనంత పద్మనాభరావు గార్లు

జంటకవులు:

అవధాన విద్యా ప్రదర్శన చేసిన జంటకవులలో శతావధానులైన వేంకటరామకృష్ణ కవులు ప్రసిద్ధులు.  ఓలేటి వేంకటరామశాస్త్రి (1883-1939), వేదుల రామకృష్ణశాస్త్రి (1889-1918) – అనే ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రులో చర్ల నారాయణ శాస్త్రి వద్ద విద్యాభ్యాసం గావించారు. పిఠాపురం రాజా వీరికి ‘అత్యద్భుత శతావధానులు’ అని బిరుద సత్కారం చేశారు. యానాంలో మన్యం మహాలక్ష్మి సంస్థానంలో ప్రథమ శతావధానం జరిగింది. పిఠాపురం సంస్థానంలో జంటగా రెండు అష్టావధానాలు చేశారు.  క్షేమేంద్రుని ఔచిత్య విచార చర్చ, వెంకటాధ్వరి విశ్వగుణాదర్శ గ్రంథాలను తెలిగించారు. ఆంధ్ర కథా సరిత్సాగరం స్వతంత్ర రచన.

కొప్పరపు సోదర కవులు:

కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి (1885 – 1932), కొప్పరపు వేంకటరమణ శర్మ (1887 – 1942) – వీరు సోదర కవులు. వీరిది నరసరావుపేట సమీపంలోని కొప్పరం గ్రామం. వీరి దౌహిత్రుడు ప్రముఖ మాశర్మ కొప్పరపు సోదరుల పేర కళాపీఠం నిర్వహించి అవధానులను ఏటా సత్కరిస్తున్నారు. వీరు 11 శతావధానాలు –  విశదల (1911), గుంటూరు (1911), బాపట్ల (1911), చీరాల (1911), పంగిడిగూడెం (1920, 1921), మద్రాసు (1910), హైదరాబాదులలో నిర్వహించి సత్కృతు లందుకొన్నారు. కృష్ణకరుణా ప్రభావము, దైవ సంకల్పము అనే కావ్యాలు; సుబ్బరాయ శతకము, కుశలవ అనే నాటకము రచించారు. వీరి విగ్రహాలను మాశర్మ నరసరావుపేటలో ఆవిష్కరింపజేశారు.

గడ్డిపోచ మీద ఆశువుగా చెప్పిన పద్యం రసరమ్యం:

“తెలియక గడ్డి పోచ యని తేలికగా పలుకంగ వచ్చునే

ఇలపయి నట్టి గడ్డి తినియే గద ఆవులు పాలొసంగు బ

ర్రెలు మరి గొర్రెలున్ బ్రతికి ప్రీతి నొసంగెడు, ఇండ్ల గప్పనే

కలిమిన్ దాననైన ఉపకారము లిన్నియు ఇట్టు లుండగాన్.”

కొప్పరపు సోదరకవుల గూర్చి కుర్తాళం పీఠాధిపతి ఇలా ప్రస్తుతించారు. “ఊహాతీతమైన వేగంతో సభాసదులు సంచకితులయ్యేటట్లుగా మేఘ గంభీర కంఠధ్వనితో లలిత లలిత కవితా విలాస విజృంభణము వారు చేస్తుంటే ఆనాడు ఆంధ్రభూమి వారికి నీరాజనాలెత్తింది.”

కొప్పరపు కవుల అసాధారణమైన అవధాన విధానానికి, అసమానమైన ఆశుకవితా ధారకు అచ్చెరువందని నాటి సమకాలీన మహాకవిపండితులు లేరు. 1912లో నిడుదవోలులో రెండు మహాసభలు జరిగాయి. సభలు ముగిసిన పిదప కొప్పరపు కవుల ఆశుకవిత్వ ప్రదర్శనకు చిలకమర్తి లక్ష్మీనరసింహం అధ్యక్షులు. శకుంతలోపాఖ్యానం – ఆశువుగా చెప్పకని చిలకమర్తి కోరారు. మూడు గంటల వ్యవధిలో 400 పద్యాలతో ఆ కావ్యం పలికారు. పురవర్ణనలు, వనవర్ణనలు ప్రబంధశైలిలో సాగాయి. ఆ సభలో కొమర్రాజు లక్ష్మణరావు వంటి పండితులున్నారు. చిలకమర్తి వారి ఆత్మకథలో ఈ వివరాలున్నాయి. అప్పుడు సోదరుల వయస్సు 26, 24 సంవత్సరాలే. కొప్పరపు కళాపీఠం యూట్యూబ్ ఛానెల్ 2016లో స్థాపించి నడుపుతున్నారు మాశర్మ దిగ్విజయంగా.

శ్రీ ధారా రామనాథశాస్త్రి గారితో అనంత పద్మనాభరావు గారు

పల్నాటి సోదరకవులు:

కన్నెకంటి ప్రభులింగాచార్యులు (1900-1946), కన్నెకంటి చినలింగాచార్యులు (1903-1968), కన్నెకంటి వీరభధ్రాచార్యులు (1912-1974) అనే ముగ్గురు సోదరులు అనేక శతావధానాలు, అష్టావధానాలు, యాభై ఏళ్ళ పాటు దిగ్విజయంగా ప్రదర్శించారు. గుంటూరు జిల్లాలోనే గాక, ఆంధ్రదేశమంతటా, ఆపైన మదరాసులోనూ ప్రదర్శనలిచ్చారు. చిట్టిప్రోలు సుబ్బరావు ఈ సోదరత్రయ జీవితం గ్రంథస్థం చేశారు.

రాజశేఖర వేంకటశేష కవులు:

దుర్భాక రాజశేఖర శతావధాని (1888-1957), గడియారం వేంకట శేషశాస్త్రి (1901-1981) జంటకవులుగా రాయలసీమ రత్నాలుగా ప్రసిద్ధికెక్కారు. వారిద్దరూ జమ్మలమడుగు, నెల్లూరులో ద్విగుణిత అష్టావధానాలు చేసి వన్నెకెక్కారు. వీరు విడిగా – రాణా ప్రతాపసింహ చరిత్ర (దుర్భాక), శివభారతం (గడియారం), చారిత్రక మహాకావ్యాలు రచించారు. జంటగా శతావధానాలు నిర్వహించారు.

ప్రొద్దుటూరు శతావధానంలో వర్ణన పద్యమిది:

చెరకు – భారతం – చంద్రుడు. మూడింటిపై సరస భావన.

కం.

చెరకును, భారత కథయును

సరసిజ రిపుబింబ మొక్క చందమ యగుని

ద్ధరలో ప్రతి పర్వ రస

స్ఫురణంబును మూడు పొంది పొసగుట కతనన్.

కుర్తాళంలో పీఠాధిపతి సమక్షంలో శ్రీ మేడసాని మోహన్, అనంత పద్మనాభరావు గార్లు

ఇలా మరికొందరు జంట కవులు సాహితీ నందనోద్యానవనంలో వికసించారు.

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here