అవధానం ఆంధ్రుల సొత్తు-18

0
9

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

సంగీతగేయధార:

[dropcap]సా[/dropcap]హిత్యపరమైన అవధానాలతో పాటు నాట్యావధానం, నేత్రావధానం, గణితావధానం తదితరాలు ప్రచారంలోకి వచ్చాయి. అలాగే సంగీతగేయధార పేర ఒక విశిష్ట ప్రక్రియను డా. వెలుగోటి సాయికృష్ణ యాచేంద్ర మూడు దశాబ్ధాలుగా ప్రదర్శిస్తున్నారు. ఇందులో మూడు ప్రధానం – గీత రచన, స్వరరచన, గానం. పృచ్ఛకులు అడిగిన అంశానికి సందర్భోచితంగా గీతాన్ని మనసులోనే సృష్టించుకోవాలి. దానిని రాగ యుక్తంగా పాడటానికి అనుకూలంగా స్వర రచన చేయాలి. ఆపై స్వయంగా మృదు మధరగానం చేయాలి. వేదిక పై అప్పటికప్పుడు సంగీత సాహిత్యాలను మేళవించి ప్రదర్శించడానికి తగిన ప్రతిభా పాండిత్యాలుండాలి.

సాయికృష్ణ యాచేంద్ర నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజవంశీకులు. మదరాసు విశ్వవిద్యాలయం నుండి ‘మహాభారతంలో శ్రీకృష్ణ పాత్రానుశీలనం’ – అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి పొందారు. వారి తల్లిగారు సంగీతజ్ఞురాలు. ఈ జమీందారీ వంశం ఎందరో కవి పండితులను పోషించింది. గోపినాధుని వెంకటకవి వీరి ఆస్థానంలో వుండి గోపీనాధ రామాయణం ప్రాశారు. ఈ కుటుంబానికి పుట్టపర్తి సత్యసాయిబాబాతో విశిష్ట సంబంధాలున్నాయి. అట్టి వంశంలో 1952 జనవరి 28న జన్మించిన సాయికృష్ణ సంగీతగేయధారను 1993 ప్రారంభించి ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు వాద్య బృందం కూడా సంచరిస్తుంది. వాద్య సహకారం అందిస్తుంది. స్థానికంగా పృచ్ఛకులు ప్రశ్నలు సంధిస్తారు. వీరు అనంతరం, ఢిల్లీలో ప్రదర్శన లిచ్చినపుడు నేను ముఖ్య అతిథిని. ఈ ప్రక్రియను మరెవ్వరూ అభ్యాసం చేయలేదు. నాట్యావధాన ప్రక్రియ ధారా రామనాధ శాస్త్రితో అంతరించిపోయినట్లే వీరి తదనంతరం ఈ విశిష్ట ప్రక్రియ మరుగున పడే రోజులు వస్తాయి. వీరికి ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు, గాయనీమణి పి. సుశీల, డా. సి. నారాయణ రెడ్డి తొలి దశలో సంగీత పరమైన మెళకువలు నేర్పారు. సాయికృష్ణ 1985-89 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు (తెలుగుదేశం – వెంకటగిరి నియోజకవర్గం).

గ్రంథ రచన:

సాయికృష్ణ 200 భక్తి గీతాలతో కూడిన ‘గీతారాధన’ భక్తి గ్రంథాన్ని 1988లో ప్రచురించారు. ఆంధ్రావనిలోనే గాక అఖిల భారతస్థాయిలో 360 ప్రదర్శనలిచ్చారు. ఇప్పటి వరకు ధ్వని ముద్రణ కానట్టి ఎన్నో అపురూపమైన అన్నమయ్య కీర్తనలను ఎంచుకొని సి.డి.లుగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర రికార్డింగు ప్రాజెక్టు ద్వారా విడుదల చేశారు. నిరాదరణకు గురియైన తరిగొండ వెంగమాంబ సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చి ఆడియో సి.డి.లు చేయించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వాటిని ప్రచారం చేస్తున్నారు. పాటల పూలతోట వెంగమాంబ జీవిత సంహిత – చెలువ రామస్వామి స్వామి కీర్తనలు, అన్నమాచార్య కీర్తనల గ్రంథాలు ప్రచురించారు.

బిరుదులు/ పురస్కారాలు:

2021లో సాయికృష్ణ యాచేంద్రను శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించారు.

  • డా. బెజవాడ గోపాలరెడ్డిచే సంగీత సాహిత్య సరస్వతి బిరుదు
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం – 2001
  • కొసరాజు ప్రతిభా పురస్కారం – హైదరాబాదు -2012
  • ద్రవిడ విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం- 2011

ప్రవాసాంధ్ర ప్రపంచ తెలుగు మహా సభలలో సంగీతగేయధార తొలి కార్యక్రమంగా నిర్వహించారు. ఆయన సంగీతాన్ని ఏ గురువు వద్ద నేర్చుకోలేదు. వినికిడి సంగీత మంటారు.

అష్టావధానంలో అప్రస్తుత ప్రసంగమన్నట్లే ఇందులో మంచి ముచ్చట్లు అంశం ప్రవేశ పెట్టారు (పదరాగిణి సంస్థను నెలకొల్పారు). అవధానంలో దత్తపది వలె ‘ఇష్టపది’ అంశం ప్రధానం.

సంగీతగేయధారలో అంశాలు:

  1. వస్తునిర్దేశం – పృచ్ఛకుడు ఒక వస్తువును సూచించి, కోరిన రాగంలో, కోరిన తాళంలో ఒక గీతాన్ని అప్పటికప్పుడు సృష్టించి, స్వరపరచి ఆశువుగా గానం చేస్తారు. వస్తునిర్దేశకుడిచ్చిన అంశానికి రాగనిర్దేశకుడు రాగము, తాళము నిర్దేశిస్తాడు.
  2. మంచి ముచ్చట్లు – అష్టావధనంలో అప్రస్తుత ప్రసంగం వలె ఇందులో ఈ పృచ్ఛకుడు అవధాని ఏకాగ్రతకు భంగం కలిగిస్తాడు.
  3. పల్లవి పూరణ – పృచ్ఛకుడు ఇచ్చిన పల్లవికి అవధాని చరణాలు పూరిస్తాడు.
  4. పదనిషేదం – అవధానంలో నిషిద్ధాక్షరి వంటిది. ఇందులో పర్యాయ పదం లేని గేయం పూర్తి చేయాలి.

ఈ నాలుగు విదాలైన అంశాలతో గేయధారను రసరమ్యంగా సాయికృష్ణ యాచేంద్ర 400 పర్యాయాలు ప్రదర్శించారు. 1976లో తొలిసారిగా ‘మంచికి మరో పేరు’ అనే సినిమాకు ‘విరిసిన ఊహల’ అనే యుగళగీతం రచించారు. 1977లో భగవాన్ సత్యసాయిబాబాపై నాలుగు పాటలతో ఆడియో రికార్డుగా విడుదల చేశారు.

శ్రీ పద్మనాభరావుని సత్కరిస్తున్న శ్రీ స్వరూపానంద స్వామి

అవధాన సోమయాజులు:

విదేశాలలో ఈ దశాబ్ధంలో తెలుగు, సంస్కృతాలలో అవధానులు చేయగల సమర్థులున్నారు. అట్లాంటాలోని వల్లూరి రమేష్ వివిధ భారతదేశ ప్రాంతాలలో వీరి చేత త్రిగళావధానాలు నిర్వహించారు. తిరుపతి, వారణాసి, భద్రాచలంలో ఈ ప్రదర్శనలు ఘనంగా జరిగాయి. తెలుగు, సంస్కృత, అచ్చ తెనుగు అవధానాలు దాదాపు 12 గంటలు నిర్వహించారు.

సంగీత సాహిత్యాలకు నెలవైన విజయనగరంలో 1970లో జన్మించిన నేమాని లక్ష్మీనరసింహ సోమయాజులు ఒరిస్సాలోని సునాబెడాలో 12వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఆపైన విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరుగా పట్టభద్రులయ్యారు. వీరి సతీమణి మధూలిక ఉత్తర దేశీయురాలు కావడంతో హిందీ భాష కూడా అభ్యసించారు. ఛందో బద్ధ హిందీ కవిత్వం వ్రాశారు.

ఉద్యోగ ప్రస్థానం:

సోమయాజులు తొలుత ముంబైలో టాటా యూనిసెస్, మరియు హెచ్.సి.యల్ సంస్థలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేశారు. ఆ సమయంలో విదేశీ పర్యటనలు జరిగాయి. 1998లో అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. 2003లో కంప్యూటర్ సైన్స్‌లో యం.యస్. చేసి గత 20 సంవత్సరాలుగా అట్లాంటా నగరంలో సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు.

ప్రవృత్తి:

వృత్తి వేరు – ప్రవృత్తి వేరు. ఆంధ్ర భాషామతల్లి సేవలో దృఢమైన భాషాభిమానం పెంచుకొన్నారు. చిన్నతనం నుండి పద్యవిద్య పై పట్టు సాధించగలిగారు.

వీరి గ్రంథ రచనలు –

  • సౌందర్యలహరికి పద్యానువాదం.
  • రాధాస్వామి పద్యకుసుమాంజలి
  • రాధాస్వామి ప్రేమాంబుధి
  • సోమయాజి నీతిసుధ
  • సుద్గురుత్తమ శతకం
  • భారతవీర శతకం

ఆ విధంగా సాహితీ పరంగా, భాషాపరంగా కృషిని రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తూ అమెరికాలోను, ఆంధ్రదేశంలోను అవధాన ప్రదర్శనలిచ్చారు.

ఇప్పటి వరకు దాదాపు 20 అవధాన ప్రదర్శనలు జరిగాయి.

శ్రీ నేమాని సోమయాజులు గారిచే ఆస్టిన్‌లో అవధానం

బిరుదావళి:

వివిధ సంస్థలవారు సోమయాజులు గారిని ఇలా సత్కరించారు.

  • పాశ్చాత్య అవధాన ప్రభాకర, అవధాన వేదాంత, అవధాన వతంస, అవధాన సుధాకర, అవధాన ద్రోణ – ఇత్యాదులు.

విస్తృతంగా వీరు నిర్వహించిన అవధానాలలో పద్య రచన పాండితీస్ఫోరకం.

2017లో సికిందరాబాదు ప్యాట్నీ సెంటర్ లోని ఒక కళాశాలలో వీరి అవధానంలో నేను అప్రస్తుత ప్రసంగం నిర్వహించాను. నేనిలా ప్రశ్నించాను.

“అవధానిగారూ! నేను కార్లో ఈ సభకు వస్తుంటే ప్యాట్నీ సెంటర్ లోని ఒక వస్త్రాలషాపు వద్ద ‘లలితా శారీషాప్, పత్నీ సెంటర్’ అనే బోర్డు వుంది. అక్కడ చాలా మంది యువకులు ద్వారం వద్ద గుంపుగా ఉన్నారు. కారణం ఏమిటో?”

అవధాని చమత్కారంగా “పత్నీ సెంటర్ అనేది matrimonial center గా భావించి వుంటారు” అని సమాధానమిచ్చారు.

వీరి అవధాన పూరణలు:

కాశికా త్రిగణవధానంలో మన్మథ దహన వర్ణన

చం.

హిమనగ తల్పమందున మహేశుడు చేయుచునుండ దీక్షతో

శమమున ఘోరమౌ తపము, సర్వనిలింపులు వేడి నంతన్

సుమశరుడేగుదెంచి కడు చోద్యముగా వెసవేయ బాణమున్

ప్రమథ గణాధినేత సుమబాణుని కాల్చెను కోపగించుచున్.

నిహిద్ధారములు- శ,,,మ (అన్నపూర్ణదేవిపై)

కం.

వ్యాసుడు భిక్ష లభింపక, దాసులతో గూడి పొందెతగ క్షుద్బాధల్

తీసి జలంబుం బల్కగ, వాసిగ భుజియింప జేసె బహు భోజ్యంబుల్.

సమస్యాపూరణం:

స్తవనీయుండగు కేశవుండు మదిలో సంతోషమొప్పారగా

భువిపై స్వర్గముగా చెలంగు పురిలో భూతేశుగా వచ్చెనే

శివుడే కేశవుడున్ రమేశుడె కదా శ్రీకంఠుడున్ చూడగా

శివుడున్ తాండవమాడి యాడి అలసెన్ శ్రీదేవితో కాశిలో

దత్తపది:

జయము, నయము, భయము, ప్రియము – కాశీ విశ్వేశ్వరుడు

చం.

జయముల సంచయమ్ములను చక్కగ నిచ్చెడి కాశికాపతిన్

రమమున భక్త వర్యులను రక్షణజేయు నయమ్ముగా, యమున్

భయమును ద్రంచు దైవమును భక్త వంశకడునిన్ శిద్రన్

ప్రియముగ మోక్షమిమ్మనుచు వేడెద భక్తిగ నెమ్మనమ్మునన్

ఆశువు: కాశీలో బిస్మిల్లాఖాన్ గానం.

వింటివా సోదరా! బిస్మిల్లాఖానునే

జుంటి తేనెల్ వలెన్ స్తూయమానమ్ముగా

ఇంటిలో పాడెగా నెంతయో చక్కగా

మింటినే తాకెగా మేటి రాగమ్ములున్.

ఆ విధంగా వైవిధ్యభరిత పూరణలు సోమయాజులు ప్రతిభతో ప్రదర్శించారు.

అమెరికా అవధానులు:

అమెరికా దేశానికి వెళ్లి ఆంధ్రదేశంలో అవధానులు పలుచోట్ల జైత్రయాత్లలు చేశారు. ఆ స్పూర్తితో ఆ దేశంలో నలుగురు అవధానులు బయలుదేరారు. వారు

  1. శ్రీ శ్రీచరణ్ పాలడుగు
  2. శ్రీ నేమాని సోమయాజులు
  3. శ్రీ లలితాదిత్య గన్నవరం
  4. శ్రీ సాయికృష్ణ మైలవరపు

ఆస్ట్రేలియా దేశంలో శ్రీ కల్యాణ చక్రవర్తి తటవర్తి అవధాని. ఇలా అవధాన ప్రక్రియ ఆంధ్రుల సొత్తుగా రాణిస్తూ ప్రపంచవ్యాప్తం కావడం ముదావహం.

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here