అవధానం ఆంధ్రుల సొత్తు-19

0
11

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

రాయలసీమ అవధాన రత్నాలు:

[dropcap]అ[/dropcap]వధాన విద్య రాయలసీమలో ఇతర ప్రాంతాలతో సమానంగా 20వ శతాబ్దిలో పరిఢవిల్లింది. పలువురు ప్రముఖ రచయితలు అవధాన విద్యా ప్రదర్శనల గూర్చి లోగడ ముచ్చటించాను. 20వ శతాబ్ది ఉత్తరార్ధంలో రాయలసీమకు చెందిన అవధానుల జీవన రేఖలను సూక్ష్మంగా ఒక్కొక్కటి ప్రస్తావిస్తాను. వారితో నాకు అత్యంత సన్నిహిత పరిచయాలుండటం విశేషం.

డా. మేడసాని మోహన్ (19 ఏప్రిల్ 1955):

చిత్తూరు జిల్లా నడింపల్లి గ్రామం (చంద్రగిరి మండలం)లో అయ్యన్న నాయుడు, లక్ష్మమ్మ దంపతుల పుత్రుడు మోహన్. 8వ ఏటనే పద్య విద్యపై మక్కువ పెంచుకొన్నారు. తెలుగు, సంస్కృత భాషాభినివేశం కలిగింది. 15వ ఏట అవధాన ప్రదర్శన చేసి పండిత ప్రశంసలందుకొన్నారు. విద్యార్థిగా యోగాభ్యాసం ద్వారా ధారణాశక్తి నలవరుకొన్నారు. లక్షన్నర పద్యాలు ధారణ చేసిన ధారణ బ్రహ్మ. శివానంద మౌని ద్వారా దీక్ష పొందారు. 1978లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. తెలుగు చేశారు. అన్నమాచార్య కీర్తనలలో భాషపై మదరాసు విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. పొందారు.

డా. మేడసాని మోహన్

జీవితంలో మలుపు:

1981లో తిరుపతిలో ఆఫీసర్స్ క్లబ్‍లో ఓ కుర్రాడు అవధానం చేస్తున్నాడు. ఆనాటి సభకు ముఖ్య అతిథి తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్. సభ ప్రారంభంలో నాలుగు మాటలు మాట్లాడి ఆయన వేరే మీటింగ్‌కి వెళ్ళాలి. అయినా కార్యకర్తల కోరిక మేరకు అవధాన ప్రారంభంలో 10 నిముషాలు కూర్చున్నారు. అవధానం సభారంజకంగా వుంది. ప్రసాద్ గారు అలానే గంటన్నర కూచుండిపోయారు. ధారణాపటిమకు ఆశ్చర్యపోయారు. వెంటనే మైక్ ముందుకెళ్ళారు.

“అవధాని ధారణాశక్తి అత్యద్భుతం. ఈయనకు దేవస్థానంలో కోరినప్పుడు ఉద్యోగావకాశం ఇస్తాను” అన్నారు ప్రసాద్.

ఆనాటి అవధానియే మేడసాని మోహన్. అప్పుడే తెలుగు ఎం.ఎ. పూర్తి చేశారు. వెంటనే అన్నమయ్య భాషపై పరిశోధనకు మదరాసు విశ్వవిద్యాలయంలో అభ్యర్థిగా చేరారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు రీసెర్చ్ డైరక్టరుగా నియమితులై మూడు దశాబ్దాలు స్వామి సేవలో పునీతులై 2015లో రిటైరయ్యారు. ఆపైన శ్రీనినాస వాఙ్మయ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా నాలుగేళ్ళు వ్యవహరించారు.

అవధాన అరంగేట్రం:

10వ తరగతి పూర్తి కాగానే మిత్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో పనబాకం హైస్కూలులో మేడసాని మోహన్ తొలి అవధానం చేశారు. 1969లో మొదలై నేటి వరకు అనేకానేక అవధాన ప్రదర్శనలు దేశ, విదేశాలలో ఇచ్చారు. 1996లో తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర రసజ్ఞ సమాఖ్య ఆధ్వర్యంలో సహస్రావధానం చేశారు. 18 రోజుల పాటు జరిగిన ఆ సదస్సులో 1200 మంది పృచ్ఛకులు పాల్గొన్నారు. ఆచార్య జి. వి. సుబ్రమణ్యం సభా సంచాలకులు. 900 పద్యాలను చివరలో ధారణ చేయడం విశేషం.

భువన విజయం

పంచ సహస్రావధానం:

హైదరాబాదు లలిత కళా తోరణంలో 2007లో ‘పంచసహస్రావధానం’ – ‘రసమయి’  రాము ఆధ్వర్యంలో 30 రోజులు మోహన్ ఘనంగా ప్రదర్శించారు. డా. సి. నారాయణ రెడ్డి అవధానానంతరం – ‘అపూర్వ పంచసహస్రావధాన సార్వభౌమ’ బిరుదు ప్రకటించి సత్కరించారు. నియం ధ్యాన యోగం ద్వారా నిశ్చలత్వం, సంప్రదాయ సాహిత్యాధ్యయనం వారి ధారకు, ధారణకు బలాన్ని ఇచ్చాయి.

డల్లాస్ పుర వీధుల్లో అశ్వారోహాణం:

‘తానా’ ఆధ్వర్యంలో 2007లో తోటకూర ప్రసాద్ నిర్వహణలో అమెరికా లోని డల్లాస్ నగర పుర వీధులలో మోహన్‍ను అశ్వారోహణ గావించి ఊరేగించారు. అనంతరం ఆడిటోరియంలో అవధానం జరిగింది.

విశేష దత్తపది:

మేడసాని మోహన్ పూరించిన ఒక విశేష దత్తపది.

సినీ నాయికల పేర్లతో – సమంత, తమన్నా, ఇలియానా, ప్రియాంక – పదాలతో సరస్వతీ స్తుతి.

భారతీ హాసమంతయు ప్రబలునెడల

అంతమన్నాడ అజ్ఞానమనెడి అరికి

పూల దోయిలియా నాదు బుద్ధి యనగా

అమ్మ! నీకర్పణమ్ము వాక్ ప్రియాంక చరితా !

వారు పూరించిన సమస్యలు రెండు:

 – సిగరెట్టింపనె వెంకటేశుడు సురల్ సేవింప తద్వాసనల్

పూరణలో వాసిగ – రెట్టింపనె – అని సమన్వయం.

-కల్లును వెంకటేశునకు కానుక లిత్తురు భక్త బృందముల్

పూరణలో – వడ్డి లెక్కల్లును వెంకటేశునకు – అని సమర్థన.

అన్నమయ్య – అవధానం:

మేడసాని మోహన్ అనగానే అన్నమాచార్య ప్రాజెక్టు గుర్తుకు వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వాహణాధికారి శ్రీ. పి.వి.ఆర్.కె. ప్రసాద్ హయాములో ఈ ప్రాజెక్టు ప్రారంభమయింది. దేవస్థానం ఆర్ట్స్ కళాశాల తెలుగు అధ్యాపకులు కామిశెట్టి శ్రీనివాసులు తొలి డైరక్టరు. వారి తర్వాత అక్కడే రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మోహన్ డైరక్టర్‍గా నియమితులై పదవీ విరమణ వరకు బాధ్యతలు నిర్వహించారు.

పి.వి.ఆర్.కె. ప్రసాద్ క్రాంతదర్శి. శ్రీ వేంకటేశునిపై 32వేల కీర్తనలు రచించిన తాళ్లపాక అన్నమయ్య సాహిత్యాన్ని ప్రచారం చేయడానికి ఆయన కృషి చేశారు. మేడసాని మోహన్ అప్పట్లో 1978-80ల మధ్య మదరాసు విశ్వవిద్యాలయంలో అన్నమయ్య భాషా విశ్లేషణపై డా. యస్. అక్కిరెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నారు. పరిశోధన పూర్తి కావచ్చిన తరుణంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా మోహన్ దేవస్థానంలో అడుగుపెట్టారు. తర్వాతి కాలంలో 1435 పుటల సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి పి.హెచ్.డి. సంపాదించారు.

అన్నమాచార్య ప్రాజెక్టుతో బాటు దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, పురాణ వాఙ్మయ ప్రాజెక్టు, శ్రీనివాస వాఙ్మయ ప్రాజెక్టు, వెంగమాంబ ప్రాజెక్టు, దృశ్య శ్రవణ ప్రాజెక్టు మొదలైన ప్రాజెక్టులు తి.తి.దే. ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.

మేడసాని మోహన్, రచయిత – తిరుపతిలో ఓ ప్రదర్శనలో

నిఘంటు ధారణ:

అన్నమయ్యపై పరిశోధనా సమయంలో మేడసాని అనేక నిఘంటువులను పరిశీలించి పద బంధాలను ధారణ చేశారు. వీటికి తోడు నానా కావ్య పరిచయము వారికి బలం చేకూర్చింది. ఆముక్త మాల్యద లోని నారికేళపాక పద్యాలను మొత్తం కంఠస్థం చేశారు. భాషపై పట్టు, ఆశు ధార, అనితర సాధ్యమైన ధారణ ఆయన ప్రత్యేకత. ఇతర అవధానుల వలె పద్యం రాగయుక్తంగా పలకరు.

అన్నమయ్య ప్రాజెక్టు డైరక్టర్ బాధ్యతలతో పాటు యావత్ భారతదేశంలోనూ, అమెరికా ఇత్యాది విదేశాలలోనూ అవధానాలు చేశారు. ఇటీవల సేవ యూ-ట్యూబ్ ఛానెల్ వారు అవధాన సప్తాహం ఏప్రిల్ 1 నుంచి 7 వరకు నిర్వహించారు. ఆ సందర్భంగా నేను (పద్మనాభరావు) మేడసాని వారిని ఇంటర్వ్యూ చేసాను. ఆ పరిచయ కార్యక్రమంలో వారు అనేక విషయాలు వెల్లడించారు. ఒంగోలులో 1996లో జరిగిన చతుర్గుణిత అష్టావధానం సభకు నేను అధ్యక్షత వహించిన విషయాన్ని విశేషంగా ప్రస్తావించారు.

2021లో అంతర్జాల దృశ్యమాధ్యమం ద్వారా అమెరికాలోని పలు సంస్థలు మేడసాని మోహన్ అవధానం ఏర్పాటు చేశారు. ఆ సభకు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథి. సభ జయప్రదంగా జరిగింది. నేను కూడా పృచ్ఛకుడిగా ఆశువును కోరాను. తిరుమలేశుని వైభవాన్ని పద్యంగా పలికారు. అసాధారణ ధారణాశక్తి 67 మేడసానికి భగవంతుడిచ్చిన వరం. వినయశీలత వారి సద్గుణ సంపత్తి. అవధానిగా, దేవస్థాన అధికారిగా, సహృదయుడైన వ్యక్తిగా ఆంధ్రులకు పరిచితుడు మేడసాని మోహన్.

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here