అవధానం ఆంధ్రుల సొత్తు-5

0
6

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

అవధాన సభారంభం:

[dropcap]అ[/dropcap]వధాన సభకు అధ్యక్షులు మాట్లాడిన తరువాత అవధానం ప్రారంభం చేద్దామని ప్రకటిస్తారు. అవధాని భగవత్ ధ్యాన సంబంధమైన పద్యంతో ప్రారంభిస్తాడు. అది పూర్వమే తయారు చేసుకున్నది కావచ్చు, లేదా అప్పటికప్పుడు అక్కడి ప్రసిద్ధ దైవ సంబంధం కావచ్చు. విజయవాడలో సభ అయితే కనకదుర్గా స్తుతి చేస్తారు. శ్రీకాళహస్తిలో శివ సంబంధ స్తోత్రం. ఆ తరువాత తల్లిదండ్రులు/గురు ప్రశంస. సహస్రావధాని గరికపాటి నరసింహారావు మాతృమూర్తిపై ఆర్ద్రంగా కవిత చెబుతారు. ఆపైన అవధాని సభాధ్యక్షులు/సంస్థ కార్యదర్శి లేదా అధ్యక్షుల ప్రస్తావన పద్యంలో చేస్తాడు. ప్రారంభ శ్లోకం/పద్యం రాగయుక్తంగా చదవగానే సభ మంత్రముగ్ధమవుతుంది. పృచ్ఛకులకు నమస్కార బాణం వేసి అవధానం మొదలుపెడదామని సూచిస్తారు.

సమన్వయ కర్త:

ఈమధ్య కాలంలో అవధాన సభా సమన్వయకర్తను ఏర్పాటు చేసుకొంటున్నారు. ఆయన పృచ్ఛకులకు, సభాసదులకు, అవధానికి మధ్య మధ్యవర్తి లేదా అంబుడ్స్‌మెన్ వంటివాడు. ఏవైనా సాంకేతికపరంగా శబ్ద ప్రయోగం గూర్చి లేదా యతిస్థానం గూర్చి, సమాసకల్పన గూర్చి భేదాభిప్రాయం తటస్థించినపుడు ఈయన పెద్దమనిషిగా ప్రవర్తిస్తాడు. సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ హైదరాబాదు లలితాకళాతోరణంలో అవధాన కార్యక్రమాలు చేసినపుడు, ఇతరత్రా సమయాలలో సుప్రసిద్ధ పండితులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం సమన్వయకర్తగా సభను రక్తి కట్టించారు. 2020 నవంబరులో హైదరాబాదులో జరిగిన ప్రణవ పీఠాధిపతి వద్దిపర్తి పద్మాకర్ మూడు రోజుల శతావధాన సభకు ధూళిపాళ మహాదేవమణి సమన్వయకర్తగా వ్యవహరించారు. అవధానికి గాని, పృచ్ఛకులకు గాని చిన్నపాటి సందేహాలను ఈ పాత్రధారి తీర్చి సభను సకాలంగా పూర్తి చేసే బాధ్యత స్వీకరించాలి.

పద్మనాభరావు దంపతులతో సహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ

ప్రారంభ పద్యాలు:

సభను సమ్మోహనపరిచి, సభ్యులను సారస్వతనందనోద్యానవనంలో విహరించేందుకు ఉన్ముఖులను చేయడానికి ఈ ఘట్టం ఉపకరిస్తుంది. కొందరు రెండు మూడు పద్యాలు చెప్పి కదనరంగంలోకి ముందుకురుకుతారు. మరి కొందరు వ్యాఖ్యానప్రాయంగా పద్యము, అభిప్రాయాలు, పూర్వ సంఘటనలు ప్రారంభదశలో వివరిస్తారు. సాహితీప్రియులకది విందు. శని, ఆది వారాలలోనో, సాయంవేళలలోనో, పర్వదినాలలోనో ఈ అవధాన సభలు నిర్వహిస్తారు. అందువల్ల ప్రేక్షకులు గడియారం వైపు చూసే ప్రసక్తి ఉండదు.

సరస్వతీ ప్రార్థన:

సహజంగా అవధాని తొలి పద్యం సరస్వతీస్తుతిగా వుంటుంది. ఆ చదువుల తల్లి కరుణా కటాక్ష వీక్షణాల వల్ల సభ రక్తి కట్టాలి. తిరుపతి కవులు అవధానాన్ని ‘ప్రతి ప్రసవ కష్ట’మని వ్యాఖ్యానించారు. వంద అవధానాలు చేసినా, 101వ అవధానం చేయడం కష్టమై, క్లిష్టమై, సుఖ ప్రసవం గాక, సిజేరియన్ కాగల అవకాశాలున్నాయి. ‘అష్టావధాన కష్టావలంబనమన్న నల్లేరుపై బండి నడక మాకు’ అని తిరుపతి కవులు ఘోషించారు.

నెల్లూరు వి. ఆర్. కళాశాలలో 1970 మార్చి 15న నేను చేసిన అష్టావధాన సభకు ఒక విశిష్టత ఉంది. 1962-65 మధ్య అక్కడ నేను బి.ఎ. స్పెషల్ తెలుగు చదివాను. మా గురువుల సమక్షంలో 22 ఏళ్ళ కుర్రవాడిగా నేను చేస్తున్న అవధానం. దిగ్దంతులైన కవి పండితుల గోష్ఠిలో ఆనందించిన మాన్యులు, వదాన్యులు తిక్కవరపు రామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నన్ను సన్మానించిన సభ అది. మా కళాశాల ప్రిన్సిపాల్ రేబాల సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన విశిష్ట సభ. కళాశాల అధ్యాపకులు వి. నారాయణ రెడ్డి (నిషిద్ధాక్షరి), టి. సుబ్బారెడ్డి (సమస్య), రాధాకృష్ణమూర్తి (దత్తపది), గోసుకొండ వెంకట సుబ్బయ్య (పురాణపఠనం), యం. వేణుగోపాలయ్య (వ్యస్తాక్షరి), యస్. వి. కృష్ణారెడ్డి (ఆశువు) పృచ్ఛకులుగా వ్యవహరించిన సభ అది. ఇతర చోట్ల అవధానం చేయడం ఒక ఎత్తు, గురువుల పాదాల ముందు పదాలు, పద్యాలు దొర్లించడం ఒక ఎత్తు. ఆ సభకు మరో విశేషం మా మాతాపితరులు – శారదాంబ, లక్ష్మీకాంతరావు స్వయంగా విచ్చేసి ఆశీర్వదించడం. ఇన్ని విశేషాలు గల సభలో నా ప్రార్థనా పద్యమిది:

సరస్వతీస్తుతి:

కాంచన పద్మమందు చిలుకల్ మదికింపుగ పాడుచుండ, నీ
వంచిత వేడ్కతోడ చతురానను నంకము చేరబోవ, చే
లాంచితమంటి పద్మభవు డంగజ భృత్యుడు గాగ, నీ కటా
క్షాంచల వీక్షణమ్ముల సమాదరముంచుము తల్లి! భారతీ!

ఆ పద్యంతో ఆగలేదు.

వీణాపాణిని! శారదాంబ! కృపనన్ వీక్షింప రావేల, నిన్
రాణుల్ రాజులు గొల్తురమ్మ, చదువుల్ రావమ్మ నిన్ గొల్వకన్
వీణానాదము లుప్పతిల్ల, కరుణా వీక్షావలోకమ్మునన్
శ్రేణుల్ నిల్వగ జూచి, నీ దయను నన్ శ్రీమంతునిన్ జేయుమా!

ఇక్కడ శ్రీమంతుడు అనే పద ప్రయోగానికి భావం ధీశక్తి అనే లక్ష్మిని ఆమె ప్రసాదించాలి. ఆ పద్యం తరువాత మా గురువుగారైన పోలూరి హనుమజ్జానకీ రామశర్మ గారికి నమస్కార బాణం వేస్తూ ఒక పద్యం చెప్పాను. ‘జానకీరామశర్మ వల్ల నాకు తెలుగు భాష అబ్బింది’ అని మాన్యులు ముప్పవరపు వెంకయ్యనాయుడు (ఉపరాష్ట్రపతి) సభలలో ప్రస్తావించటం గమనార్హం. గురువుగారి పేర వెంకయ్యనాయుడు తెలంగాణా సారస్వత పరిషత్ 5 లక్షల విరాళంతో ఏటా ఒక పండితునికి 25 వేలు పురస్కారం అందించే ఏర్పాటు చేశారు సహృదయతతో. 2021 అక్టోబరు 13న గురువు గారి జయంతి రోజు సుప్రసిద్ధ పండితులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యకు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆ పురస్కారం అందించబడింది.

శ్రీయుతులు రాపాక ఏకాంబరాచార్యులు, శిఖామణులతో రచయిత

గురువందన:

ఆనాటి అవధానంలో నేను వినయపూర్వకంగా చెప్పిన పద్యం నా హృదయపీఠంపై నిలిచిపోయింది.

“గురువుల దర్శనమ్ము మరి గోరియు, ఈ అవధాన విద్యకున్
గురుతర పాండితీపటిమ గూర్చిన మాన్యులు వారు నౌట, నా
సరళిని దిద్ది తీర్చెదరు సౌహృదమూర్తులు, సాధుశీలు రీ
కరణిని నే ప్రతి ప్రసవ కష్టమె యయ్యును కాంక్ష సేసితిన్.”

అప్పటికి 20కి పైగా అవధానాలు చేసినా, వినయ వినమిత గాత్రుడయ్యాను.

అవధాన వైశిష్ట్యం:

సాహితీ ప్రియులకు అవధానం ఒక సారస్వత వినోదం. సర్కస్ ఫీట్లలో మాస్టరు అవధాని. సాము గారడీలలో ఆరితేరిన మల్ల యోధుడు. ప్రసన్న వదనంతో, చిరు దరహాసంతో, గంభీర వాక్కుతో, రసరమ్య పదావళితో, చమత్కార భరిత అప్రస్తుత ప్రసంగంతో, విశేష ధారణా పటిమతో, విశిష్ట ధారా ప్రవాహం గల ఆశు పద్య రచనతో ముందుకు సాగే విశ్వామిత్రుని వెంట నడిచే బాలరాముడు అవధాని.

అవధానంలో కష్టనష్టాలను గుదిగ్రుచ్చి చెబుతూ నేను విజయవాడ శాతవాహన కళాశాలలో చెప్పిన పద్యం మచ్చుతునక (1973 జూన్ 15). అవధానం విజయవంతంగా కొనసాగిన తర్వాత కళాశాల ప్రిన్సిపాల్, మాన్యులు శ్రీ ప్రజాపతిరావు వేదికపై నాకు సాష్టాంగ నమస్కారం చేయడం నా జీవితంలో చిరస్మరణీయం. 25 ఏళ్ళ కుర్రవానికి చేసిన అభివాదం కాదది. అవధాన కళామతల్లికి పాదాభివందనం. ఆ సభలో అవధాన విశిష్టతను ఇలా ఆశువుగా చెప్పాను:

“వ్యవధానం బిసుమంత లేని కవితా వ్యాసంగముల్ తెల్గులో
అవధానంబని, ఆశుధారయని అభ్యాసంబు గావింతు రం
దవధుల్ ధారణ ధోరణీ సహిత సద్యః స్ఫూర్తు లీనాటి మా
అవధాన ప్రతిభా ప్రదర్శనము రమ్యంబౌత వాగ్దేవిరో!”

నిజానికది గట్టి పరీక్ష. పృచ్ఛకులుగా సర్వశ్రీ వింజమూరి శివరామారావు (నిషిద్ధాక్షరి, 70 ఏళ్ళ వృద్ధులు), శిష్ట్లా ఆంజనేయశాస్త్రి (సమస్య), దేవరకొండ చిన్ని కృష్ణయ్య (దత్తపది), నాగాంజనేయులు (వ్యస్తాక్షరి), యస్.సి.హెచ్. కృష్ణమాచార్యులు (పురాణ పఠనం, ఆకాశవాణి కళాకారులు), జంధ్యాల మహతీ శంకర్ (అప్రస్తుత ప్రసంగం) వ్యవహరించారు. కనకదుర్గాదేవి కరుణాకటాక్ష వీక్షణ ప్రభావంతో అవధాన సభ దిగ్విజయమైంది. యువత హర్షించారు. పండితులు ప్రశంసావర్షం కురిపించారు. అంతకంటే కావలసింది ఏముంది?

అవధాన ప్రాచీనత:

అవధానం ఒక అపురూప విజ్ఞాన సమ్మేళనం. క్రీ.శ. 11వ శతాబ్దంలో నన్నయ్య మిత్రుడు నారాయణ భట్టు ఈ అవధాన ప్రక్రియ చేపట్టినట్టు శాసనం తెలుపుతోంది. 1872 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీనాడు ఆగిరిపల్లి (కృష్ణా జిల్లా)లో మాడభూషి వెంకటాచార్యులు తొలిసారిగా అవధాన కళకు రూపకల్పన చేశారు. తిరుపతి కవులు, కొప్పరపు సోదర కవులు ఆ తరువాత బహుళ ప్రచారంలోకి తెచ్చారు.

ఖ్యాతి గడించిన అవధానులు:

పాత తరంలో ఆదిభట్ల నారాయణదాసు, తాడేపల్లి వీరరాఘవ నారయణ శాస్త్రి, దుర్భాక రాజశేఖర శతావధాని, దూపాటి సంపత్కుమారాచార్య, దేవులపల్లి సోదర కవులు, కాశీ కృష్ణాచార్యులు, వేలూరి శివరామశాస్త్రి, గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి, అనుముల వెంకట శేషకవి ప్రభృతులు అవధాన కళకు వన్నె తెచ్చారు.

ఆధునికులలో డా. ప్రసాదరాయ కులపతి, సి.వి. సుబ్బన్న శతావధాని, నరాల రామారెడ్డి, బేతవోలు రామబ్రహ్మం, మేడసాని మోహన్, మాడుగుల నాగఫణిశర్మ, గరికపాటి నరసింహారావు, కడిమెళ్ళ వరప్రసాద్, వద్దిపర్తి పద్మాకర్, పాలపర్తి శ్యామలానందప్రసాద్, డా. రేవూరి అనంతపద్మనాభరావు, ఆశావాది ప్రకాశరావు (పద్మశ్రీ), రాళ్లబండి కవితాప్రసాద్, కోట లక్ష్మీనరసింహం, మరుమామిళ్ళ దత్తాత్రేయశర్మ, ఆముదాల మురళి, రాంభట్ల పార్వతీశ్వర శర్మ ప్రభృతులు గత నాలుగు దశాబ్దులుగా అవధాన సరస్వతిని అర్చిస్తున్నారు. అవధాన కళాపీఠాన్ని హైదరాబాదులో డా. మాడుగుల నాగఫణిశర్మ వ్యవస్థీకరించి సరస్వతీ సమార్చనం చేస్తున్నారు.

అవధానికి పద్మశ్రీ:

దేశ చరిత్రలోనే తొలిసారిగా అవధానానికి అపూర్వ గౌరవం లభించింది. 2021 రిపబ్లిక్ దినోత్సవం నాడు అనంతపురానికి చెందిన మిత్రులు ఆశావాది ప్రకాశరావుకి పద్మశ్రీ బిరుదు ప్రకటించడం ఆనందదాయకం.

ఆశావాదికి పద్మశ్రీ ప్రదానం

ఆశావాది సాహితీ వరివస్య:

ఆశావాది ప్రకాశరావు 1944 ఆగస్టు 2న అనంతపురం జిల్లా పెరవలిలో జన్మించారు. అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎ. చదివే రోజుల్లో (1962-65) అక్కడి తెలుగు శాఖాధ్యక్షులులు డా. నండూరి రామకృష్ణమాచార్యులు ఆశావాదికి కవిత్వస్ఫూర్తి పెంపొందించారు. గాడేపల్లి కుక్కుటేశ్వరరావు, సి.వి. సుబ్బన్న శతావధాని అవధాన రంగంలోకి ఆశావాదిని ప్రోత్సహించారు. ఆ ముగ్గురి ప్రభావం ఆయనపై గాఢంగా పడింది. డిగ్రీ రెండో సంవత్సరంలో 1963 అక్టోబరులో అనంతపురం కేశవ విద్యానికేతన్‍లో తొలి అవధానం చేశారు. 1999 ఉగాది నాడు నారాయణఖేడ్‍లో చివరిసారిగా ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా 170 అవధానాలు ప్రదర్శించారు.

1993లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నిర్వహించిన ఉపగ్రహ అనుసంధాన అవధాన కార్యక్రమంలో ఆశావాది, బేతవోలు, కడిమెళ్ళ మూడు కేంద్రాల నుంచి పాల్గొన్నారు. డా. రేవూరి అనంతపద్మనాభరావు కడప కేంద్రం నుండి రూపకల్పన చేశారు. ఆచార్య జివి. సుబ్రహ్మణ్యం అనుసంధానకర్త.

సాహిత్య సేవ:

ఆశావాది అనంతపురంలో రాయల కళాగోష్ఠి సంస్థ స్థాపించారు. ఆ తరువాత ఆశావాది సాహితీ కుంటుంబ ప్రారంభించారు. వృత్తిరీత్యా ఆయన ప్రభుత్వ కళాశాల తెలుగు అధ్యాపకులు. పెనుగొండ కళాశాల ప్రిన్సిపాల్‍గా పదవీ విరమణ చేసి అక్కడే స్థిరపడ్డారు. 60కి పైగా గ్రంథాలు ప్రచురించారు. వచన కవితల సంపుటి ‘అంతరంగ తరంగాలు’. పద్య కవులను ఎందరితో తీర్చిదిద్దారు. సాహితీ వ్యాసాలు, పరిశోధనలు, భాగవత సౌరభాలు వీరి రచనలు. ప్రహ్లాద చరిత్ర – ఎర్రన- పోతనలపై పరిశోథనాత్మక గ్రంథం ప్రచురించారు. శ్రీశైలంలో 1962 సెప్టెంబరులో అప్పటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌చే సకృతులందుకోవటంతో ప్రారంభమై 2021లో రామనాథ్ కోవింద్ ద్వారా పద్మశ్రీ అందుకోవడం విశేషం. వీరి రచనలపై మంకాల రామచంద్రుడు పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందారు.

పద్మశ్రీ గరికపాటి:

సహస్రావధానిగా, వక్తగా, ధార్మిక ప్రచవనకారుడిగా తెలుగునాట విశేష ప్రచారం పొందిన గరికపాటి నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. వరుసగా రెండో సంవత్సరం మరో అవధానికి పద్మశ్రీ లభించడం సాహిత్యానికి దక్కిన గౌరవం. ఆయన అష్టావధాన, శతావధన, ద్విశతావధాన, సహస్రావధానాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో 1958 సెప్టెంబరు 14న జన్మించారు. తెలుగు ఎం.ఎ. చేసి కాకినాడలో కళాశాల అధ్యాపకులుగా పని చేశారు. ఎం.ఫిల్, పి.హెచ్.డి.లు సాధిచారు. ఛానల్స్‌లో తనదైన శైలిలో ప్రవచనాలు చేస్తూ, హైదరాబాదులో దశాబ్దికి పైగా స్థిరపడ్డారు. 275 అష్టావధానాలు నిర్వహించారు. 1996లో కాకినాడలో 21 రోజుల పాటు సహస్రావధానం చేశారు. బేతవోలు రామబ్రహ్మం గరికపాటి జ్ఞాపకశక్తిని మెచ్చుకుంటూ ధారణా బ్రహ్మరాక్షసుడనే బిరుదునిచ్చారు.

ఫోటో సౌజన్యం – ఇంటర్‍నెట్

ఎనిమిది అర్థ శతావధానాలు, శతావధానం, ద్విశత అవధానం, మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించారు. తొలి అవధానం 1992 విజయదశమి నాడు ప్రదర్శించారు. మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువైట్, అబుదాభి, దుబాయి, కతార్ తదితర దేశాలలో ప్రదర్శనలిచ్చారు.

సాగరఘోష, మనభారతం, బాష్పగుచ్ఛం, మౌఖిక సాహిత్యం (పరిశోధన) వీరి రచనలు. అనేక టీవి ఛానళ్ళలో కార్యక్రమాలు నడిపారు. ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం, భక్తి టి.వి.లో ఆంధ్ర మహాభారతం (1818 ఎపిసోడ్లు) తదితరాలు ప్రసిద్ధాలు. భీమవరం (1997), వెదురుపాక విజయదుర్గా పీఠం ( 2004) లలో కనకాభిషేకాలు జరిగాయి. 2011లో కొప్పరపు కవుల పురస్కారం, 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న పురస్కారం లభించాయి.

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here