[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘అవిశ్రాంత పోరు బాటనే..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అం[/dropcap]తరాల జీవన గమనంలో
అధునాతన స్వప్నాల గాలాలకు చిక్కి
అతలాకుతలమవుతున్న అవస్థలతో
అవాంతరాల మధ్యన విలవిల్లాడుతున్న
తీరుతో యోధునిలా యోచిస్తున్నామిప్పుడు..!
విప్పుకుంటున్న అంతరంగంలోకి
పదునైన కత్తులు జోరబడుతున్నాయి
సలుపుతున్న వెతల గాయాలు
రక్తసిక్తమై జాలువారుతున్నాయి
తప్పిదాలను నమోదు చేయడానికి
అనువైన వస్తు సామాగ్రినే కావాలిప్పుడు
సరసమైన ధరలతో సక్రమంగానే ఉన్నాయని
సంబురపడతావేమో జర జాగ్రత్త
కనిపించని ఊబిలో కూరుకుపోతున్నావు..!
ఊపిరాడని కాలుష్యంలో
చలనం లేని బందీలమయ్యామిప్పుడు
గ్లోబలీకరణ పరిణామాల్లో
మానవీయత చిరునామా జాడలేదిప్పుడు
ఆగని అణచివేతల దుఃఖాన్ని
పలు రకాలుగా వ్యక్తమైతున్నప్పటికీ
రక్షకుడెవడు దరికి రావడం లేదిప్పుడు..!
వస్తు వినిమయమైన సంస్కృతి
అన్ని వేళల్లో సమ్మోన పరుస్తూనే వుంది
ప్రత్యామ్నాయాలైన వ్యూహాలతో
కఠిన దారుల్లో సుసాధ్యమనే సాధన
ఆరని జ్వాలలా రగులుతూనే వుంది
ఆగిపోవద్దు మిత్రమా
ఉబికి వస్తున్న కొంగ్రొత్త ఆలోచనలతో
అవిశ్రాంత పోరు బాటనే
కాలం ఆహ్వానిస్తున్నదిప్పుడు..!