బాల సాహిత్యం – ఒక పరిశీలన

2
5

[dropcap]బా[/dropcap]ల సాహిత్యం అనగానే మనకి వెంటనే స్ఫురించేవి పిల్లల పత్రికలు. బాలల కోసం సాహిత్యం మొదట్లో ప్రత్యేకంగా లేదు. రామాయణ, భారత, భాగవతాలల్లోని చిన్న కథలను పిల్లలకు అవసరమయిన రీతిలో మలచి పెద్దలు వినిపించేవారు.

ఇలా చూస్తే బాల సాహిత్యం మొదటినుండి పిల్లల కోసం ప్రత్యేకంగా లేనప్పటికి అప్పటి సాహిత్యంలో ఏదో చోట కథాపరంగా పిల్లలకు అవసరమయిన నీతి కథలు ఉండేవి.

శ్రీకృష్ణుని బాల్యమంతా పిల్లల కోసం కథలుగా చెప్పుకోవచ్చు. అన్నమయ్య రచించిన ‘చందమామ రావే జాబిల్లి రావే’, ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’ మెదలైన పాటలు ఇప్పటికీ మనం పిల్లల కోసం మనం వినిపిస్తున్న బాలల పాటలే. బాల సాహిత్యం ముఖ్యంగా ఎక్కువ శాతం మౌఖికంగానే ఇప్పటికీ సాగుతుంది. ముద్రణకి నోచని ఎన్నో కథలు, గేయాలు జానపదాలు ఎన్నో ఇప్పటికీ, ఇంకా ముద్రణ కాకుండా పిల్లలకు తరతరాలుగా చెప్పకుంటూనే వున్నాం. పెదరాశి పెద్దమ్మ కథలు, ఈసప్ కథలు మొదలయినవి యీ కోవకి చెందినవే.

బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో మనం బాల సాహిత్యాన్ని ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది.

ఆ స్ఫూర్తితోనే బాల సాహిత్యం ప్రత్యేకంగా స్ఫుజింపబడింది. రవీంద్రనాథ్ ఠాగూర్, చాలా వరకూ గేయాలు, కథలు, బాలసాహిత్యం కోవలో వ్రాసారు. అలాగే గురజాడ అప్పారావు గారు బాలల కోసం కొన్ని గేయాలు వ్రాసారు. ‘ఏనుగెక్కి మనం ఏ ఊరు వెళదాం…’ మొదలైనవి.

చలం సమకాలీనుడైన చింతా దీక్షితులు ‘లక్క పిడతలు’ అనే పేరుతో గేయాలను పిల్లల కోసం సంపుటిగా తెచ్చారు. “లీలా సుందరి” కథ, అలాగే చింతా దీక్షితులు గారి కధల్లో కనిపించే సూరి, సితి, వెంకి పాత్రలు మనకి పరిచయ పాత్రలే. వందేళ్ళకు క్రిందటే గిడుగు సీతాపతి గారు బాలల కోసం గేయాలు వ్రాసారు. బాలల కోసం ప్రత్యేకంగా తెలుగులో మొదటగా గేయాలు వ్రాసింది గిడుగు సీతాపతి గారే. ఆ తరువాత 1940 ప్రాంతంలో కొద్దికాలం ‘భారతి’ పత్రికకు సంపాదకులుగా వున్నారు. ఆ సమయంలోనే బాలల కోసం ప్రత్యేకంగా కొన్ని పేజీలను కేటాయించి బాలసాహిత్యాన్ని ప్రోత్సహించారు.

‘చందమామ’ మాస పత్రికలో సంపాదకులుగా కొడవటిగంటి కుటుంబరావు గారు, వున్నంత కాలం పిల్లల కోసం ఉద్దేశించిన శైలిలోనే రచనలు ఉండే విధంగా చూసేవారు. రచయితల నుండి అలాంటి శైలి లేని కధలు వస్తే వాటిని రచయితే ఆశ్చర్య పోయే విధంగా ఎడిట్ చేసి ప్రచురించే వారు. దీనిని బట్టి పిల్లలపై కొడవటిగంటి కుటుంబరావు గారికి వున్న శ్రద్ధ అర్థం అవుతుంది. బాలలకు ఒ ఆలోచనా పరిధి వుంటుంది. బాల సాహిత్య రచయిత పిల్లల ఆలోచనా పరిధిలోకి ప్రవేశించి ఆ పరిధి విస్తరించే విధంగా రచనలు చేయడం వలన ఆ రచనలు సఫలం అవుతాయి. కానీ అలాంటి రచయితలు ప్రస్తుతం కనిపించడం లేదు.

దాసరి సుబ్రహ్మణ్యం గారు అనేక కాల్పనిక పాత్రలను సృష్టించి బాలలను ఊహాలోకంలో తేలియాడించేవారు. దాసరి సుబ్రహ్మణ్యం బాల సాహిత్యానికి చేసిన సేవలు మరువలేనివి. ఇటీవలే రచన మాస పత్రిక దాసరి సుబ్రహ్మణ్యం ప్రత్యేక స్మారక సంచికను వెలువరించింది. బాల సాహిత్య కథకులలో పాయల సత్యనారాయణ గారు గత నలభై సంవత్సరాలుగా బాలల కోసం కథలు, గేయాలు రచించారు. ఇటీవలే వారు కాలం చేసారు. మిరియాల రామకృష్ణ, డి.సుజాతాదేవి, శారదా అశోకవర్ధన్ బాలసాహిత్యంలో పలు రచనలు చేశారు. పాలంకి వెంకట రామచంద్ర మూర్తి, నాళం క్రిష్ణారావు, నార్ల చిరంజీవి, సమతారావు, బాలల కోసం ఎన్నో రచనలు చేసారు. అవన్నీ పిల్లలకు ఎంతో స్ఫూర్తిగా ఉండేవి.

ఈ ప్రాంతంలో ఎన్.వి.ఆర్.సత్యనారాయణ మూర్తి, శివ్వాం ప్రభాకర రావు గారు, బెలగం భీమేశ్వరరావు, బెహరా ఉమామహేశ్వరరావు, బి.వి. పట్నాయక్, పాలకొల్లు రామలింగస్వామి, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, కిలపర్తి దాలినాయుడు మొదలయిన వారు బాలల కోసం మాత్రమే ప్రత్యేకంగా వీరు రచనలు చేస్తున్నారు. ఇంకా మన రాష్ట్రంలో వెలగా వెంకటప్పయ్య, రెడ్డి రాఘవయ్య, దాసరి వెంకటరమణ, భూపాల్, చొక్కాపు మొదలయిన వారు రచనలు చేశారు, చేస్తున్నారు.

గురజాడ, శ్రీశ్రీలు తప్ప పేరున్న తెలుగు రచయితలు ఎవరూ బాలల సాహిత్యాన్ని వ్రాసినట్టు లేదు.

శ్రీశ్రీ పిల్లలను ఉద్దేశించి ‘ఆరేడేళ్ళ పాపల్లారా’ అంటూ కవిత వ్రాసారు కానీ, పిల్లలు చదువుకోవడానికి వేళ్ళమీద లెక్కించతగిన గేయాలు మాత్రమే వ్రాసారు గురజాడ. కొన్ని కవితలు, గేయాలు బాలల కోసం వ్రాసారు. ఏనుగెక్కి మనం ఏ వూరు వెళ్దాం, ఇంకా అరటి కాయబజ్జి, మినపసున్ని సుజ్జి మొదలయిన కవితలు, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, కన్యక గేయాలు బాల సాహిత్యం కోవలోకే వస్తాయి.

కానీ యితర భాషలలో పెద్ద రచయితలు సైతం బాలల సాహిత్యం రచించారు. ముల్క్ రాజ్ ఆనంద్, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్‌చంద్ మొదలయిన వారు పిల్లల కోసం ఎన్నో రచనలు చేసారు. మార్క్ ట్వైన్ రచనలు టామ్ సాయర్, హకిల్‌బెర్ ఫిన్, రాజు-పేద, విచిత్ర వ్యక్తి మొదలగు రచనలు ఇప్పటికీ పిల్లలకు ఎంతో హాయి గొలిపే నవలలు. వీటిని నండూరి రామ్మోహనరావు గారు తెలుగులో అనువదించారు. ఇటీవల వచ్చిన హరీ పోర్టర్ నవల యావత్ ప్రపంచ బాలలను తన వైపు తిప్పుకుంది.

బాలల భాషలోనే రచన సాగించిన ముళ్ళపూడి వారి బుడుగు బాల సాహిత్యంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

ఒకప్పుడు బాలల కోసం పత్రికలు క్రమం తప్పకుండా వచ్చేవి. అలాంటి వాటిలో బాలజ్యోతి, కలువ బాల, బాల మొదలైనవి. కాని ప్రస్తుతం బాలల కోసం ప్రతినెలా పత్రికలు కూడా తగినన్ని రావడం లేదు. ఇందుకు కారణం ముఖ్యంగా పత్రికలను సరిగా ప్రోత్సహించక పోవడమే.

పిల్లల కోసం ఇరవై రూపాయలు పెట్టి చాక్లెట్ కొంటారు కానీ ఓ పిల్లల పత్రిక కొనరు. అది దండగమారి వ్యవహారంగా ఆలోచించేవారు అధికంగా వున్నారు. బాల సాహిత్యాన్ని ప్రోత్సహించే ఆలోచనతో కేంద్ర సాహిత్య అకాడమీ వారు అన్ని భారతీయ భాషలలోనూ బాల సాహిత్య రచయితలకు అవార్డులు ఇస్తున్నారు. మొదటి అవార్డు తెలుగులో కలువకొలను సదానంద గారిని వరించింది. 2011 సంవత్సరముకు భూపాల్, ఉగ్గుపాలుకి లభించింది, ఇది ఓ గొప్ప పరిణామం. కాగా విజయనగరం నుండి వెలువడుతున్న ‘నాని’ పిల్లల మాస పత్రికలో ప్రతినెలా ప్రచురితమౌతున్న చాగంటి తులసి అనువాదంలో వచ్చిన ఒరియా కథకురాలు పుణ్యప్రభాదేవి గారు ఒరియా బాల సాహిత్యానికి అవార్డు వరించింది.

బాల సాహిత్యాన్ని రేడియో బాగానే ప్రోత్సహించింది. సాహిత్య అకాడమీ వారు నేషనల్ బుక్ ట్రస్ట్ వారు, బాలసాహిత్యాన్ని విరివిగా ప్రచురించి ప్రచారం చేస్తున్నారు. తెలుగులోకి అనువదింపబడుతున్న గిజూభాయి బాల సాహిత్యం పిల్లలను అంతగా అలరించలేకపోతుంది. న్యాపతి రాఘవరావు, న్యాపతి కామేశ్వరి వీరు రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యగా ప్రసిద్ధులు. వీరు యిరువురూ విజయనగరం వారే. అంతేకాకుండా విజయనగరం మహరాజా కళాశాల పూర్వ విద్యార్థులు కూడాను. ప్రత్యేకత ఏంటంటే, న్యాపతి కామేశ్వరి విజయనగరం మహరాజా కళాశాలలో చేరిన మొదటి విద్యార్థిని. అప్పటిలో స్త్రీలను కళాశాలలకు చదవటానికి పంపేవారు కాదు.

బాలానందం పేరుతోనూ బొమ్మరిల్లు పేరుతోను ప్రసారమయ్యే రేడియో కార్యక్రమాలు పిల్లలను, పెద్దలను అలరించేవి. సినిమా మాధ్యమం ద్వారా కూడా బాలలకు విజ్ఞానం అందించాలన్న ఆలోచనతో కె.ఎస్.ప్రకాశరావు ‘బూరెలమూకుడు’ చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత చెప్పుకోతగినన్ని బాలల సినిమాలు రాలేదు. బాలల చలన చిత్ర ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అధికంగా నామినేషన్ చేయబడుచున్న చిత్రాలు విదేశీ చిత్రాలు మాత్రమే. చిన్నారి చేతన అనే “3డి” చిత్రం యావత్ భారత బాలలను అలరించింది. ఆ తదుపరి అలాంటి భారతీయ చిత్రాలు రాలేదు. ఇటీవల నార్నియా, పోలార్ ఎక్స్‌ప్రెస్, లైఫ్ ఆఫ్ ఫై మొదలగు చిత్రాలు పిల్లలను బాగానే ఆకట్టుకున్నాయి. బుల్లితెర విషయానికి వచ్చినట్లయితే ప్రత్యేకంగా బాలల ప్రోగ్రాములు లేవు. కార్టూన్ నెట్‌వర్క్, టామ్ అండ్ జెర్రీ, పోగో, మొదలయిన ఆంగ్ల కామిక్స్ పిల్లల కోసం వస్తుండగా ఇటీవల భీముడు, ఆంజనేయుడు, కృష్ణుడు కథలను ఏనిమేషన్‍లో చూపిస్తున్నారు. తెనాలి రామలింగడు కూడా ఏమీ ఆకట్టుకోలేకపోతున్నాడు.

చిత్ర రంగం, లాభసాటి కాకపోవడంతో పిల్లల చిత్రాలు రావడం లేదు. అయితే బాల సాహిత్యాన్ని మళ్ళీ ప్రచురణ రంగంలో చూసినట్లయితే రష్యన్ ప్రచురణలు, అనువాదాలతో బాగా బాల సాహిత్యాన్ని ప్రోత్సహించాయి.

కొడవటిగంటి కుటుంబరావు గారు అన్నట్లు “బాల సాహిత్యం తక్కువ ధరకు అందించాలి, ప్రచురణలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. పుస్తకం ఆకర్షణీయంగా ఉండాలి”.

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో బాలల కోసం వివిధ పుస్తకాలను కొనుగోలు చేస్తున్నప్పటికి, పాఠశాలల్లో అవి పిల్లలకు అందుబాటులో ఉండటం లేదు. పిల్లలు చేత బాల సాహిత్యాన్ని చదివించే ఓపికా ఉపాధ్యాయుల్లో లేదు.

బాల సాహిత్యాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రోత్సహించి, బాల సాహిత్యాన్ని బాలలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. అన్ని స్థాయిల్లోనూ, బాలలకు బాల సాహిత్యంతో నిరంతర పరిచయం వుండే విధంగా పోటీలు నిర్వహించాలి. దీని వలన బాలల మనో వికాసం అభివృద్ధి చెందుతుంది. తద్వారా మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా రేపటి తరం భారత పౌరులు వికసిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here