బాల్యపు భావాలు

0
7

[dropcap]దో[/dropcap]సిట్లోంచి ఇసుకలా జారిపోయే బాల్యపు రేణువులను
అణువణువునా హత్తుకొని అరచేతిలో పట్టేసి
ప్రియంగా చేసిన పిట్ట గూటిలో పదిలంగా పొదువుకున్నా

తీరిక లేని జీ(వి)తపు ఆటలో నుంచి
తీర్పాటం చేసుకొని తరచూ తనివితీరా తడుముతుంటా
బాల్యపు ఆనవాళ్లు ఇంకా బతికేవున్నాయనిపిస్తుంది

గోటీలాటలో గిల్లికజ్జాలు
పాలబువ్వ గోరు ముద్దలు
అచ్ఛాల ముచ్ఛాలు
తెల్ల గాగితంలా మనసు
మల్లెపూల నవ్వులు
ఇంకా ఎన్నో మరెన్నో…
ఇప్పటికీ బాల్యపు భావాలు భద్రంగా వున్నాయి

నేటి మనిషితనంలోని
తీరికలు
ఎప్పుడో తీరాలు దాటిపోయాయి
ఏ అమావాస్యకో పున్నానికో…
అంతర్జాలంలో ఆర్జీ పెట్టుకుంటే కానీ కానరారు

గుండెగూటిలోని గుప్పెడు పసి ఊసుల్ని
పిట్ట గూటిలో పొందుపరిచాను/
తట్టెడు తీపి మాటల పన్నీరు జల్లుకుందాం
వీలుచేసుకొని వాలుతారు కదూ…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here