బాధ్యత

0
10

[dropcap]”ఏ[/dropcap]మ్మా! హిమబిందూ! మా రెండోవాడు, అదే నీ తమ్ముడు ప్రొద్దున్నే హైద్రాబాద్ నుంచి వచ్చాడు. మీ నాన్నకు వాడంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు వాడిచేతే మీ నాన్నకు తలకొరివి పెట్టిద్దాం. మీ అమ్మకూ ఓ మాట చెప్పాను. సరేనన్నది.”

“తమ్ముడంటే నాన్నకు ఇష్టమే. కాని ఆ తలకొరివి సంగతి మేం చూసుకుంటాంలే బాబాయ్!”

“నీ భర్త చేత ఆ పని చేయిద్దామనా నీ ఉద్దేశం? నీ ఇష్టాన్ని నేను కాదనను. కాని, మనం, మనం ఒక గోత్రీకులం. రక్తసంబంధమున్నవాళ్ళం” అంటూ వదినగారి దగ్గరికెళ్ళాడు మూర్తి.

“వదినా! అన్నయ్య తలకొరివి సంగతి హిమబిందు తను చూసుకుంటానన్నది. ఆ తర్వాత నువ్వు నన్నేమీ అనుకోకూడదు” అన్నాడు లో గొంతుకతో.

“ఇప్పుడు నేనేం మాట్లాడే పరిస్థితిలో లేను. మీ అన్నయ్య ఇంత ఆకస్మాత్తుగా పోతారని, నేను కలలో కూడా అనుకోలేదు. దహనసంస్కారాల సంగతి ఏనాడూ మాటవరుసక్కూడా మేం ఆలోచించలేదు” అన్నది భారతి కళ్ళు తుడుచుకుంటూ.

హిమబింధు భర్తకు చూచాయగా విషయం అర్థమవుతున్నది గాని తను ఏం కలుగజేసుకోలేదు. ఎందుకంటే ఎవరేం చెప్పినా హిమబిందు తన ఆలోచనలను మార్చుకునే మనిషి కాదు, తమ పెళ్ళి అయిన తర్వాత కూడా వి. హిమబిందు అనే వ్రాసేది. “ఇప్పుడు నువ్వు జి. హిమబిందు అని వ్రాయి” అన్నాడు సరదాగా.

”చూడండి. మీతో పెళ్ళయింది కదా ఇన్నేళ్ళనుంచీ వ్రాసుకునే నా ఇంటిపేరు మార్చేసుకోవాలా? నీ సర్టిఫికెట్లలో, ఆధార్ కార్డులో వి. హిమబిందు అనే ఉంటుంది. జి. హిమబిందు పేరుతో మరో బ్యాంక్ ఎకౌంట్ మాత్రం తెరవటానికి వీలవుతుంది. మార్చి వ్రాసుకునే ఉద్దేశమూ నాకు లేదు”

“లేడీ డాక్టర్లను చూడు. పెళ్ళి కాగానే భర్త ఇంటిపేరుతోనే వ్రాసుకుంటారు”

“ప్రాక్టీసు పెట్టుకోవటానికి బోర్డు తగిలించాలి. ఒకే బోర్డులో వేర్వేరు ఇంటి పేర్లు బాగుండవు. అంతకుమించి మరే మార్పూ జరగదు. పాన్‍కార్డుతో సహా పుట్టింటి పేరే వుంటుంది.”

హిమబిందు తత్వం నెమ్మదిగా అర్థమయింది. స్వతంత్రమైన అభిప్రాయాలు గలిగిన మనిషి అని తనూ గ్రహించి అటువంటి ప్రస్తావనలు తెచ్చేవాడు గాదు.

ప్రసాదరావు శవాన్ని చూడటానికి వచ్చినవాళ్ళంతా అక్కడున్న కుర్చీలలో కూర్చుని వీళ్ళ సంగతులే మాట్లాడుకోసాగారు. “అల్లుడే తలకొరివి పెడతాడు. హిమబిందు ఆడపిల్ల కదా?”

“అసలు భారతి ఆంటీ, ప్రసాదరావు అంకుల్ ఇద్దరూ ఎంత సరదా మనుషులు? వాళ్ళిద్దరిలో కోపతాపాలు ఎప్పుడూ చూడలేదు. మీ అంకుల్ రిటైరయ్యాక నా కంటికి కనబడుతున్నారమ్మా. అంతకు ముందంతా నల్లపూసే. ఎక్కడా అని వెతుక్కోవాల్సి వచ్చేది అనేది ఆంటీ. మీ ఆంటీ మనసునిండా నేనే వుంటాగా. ఇంకేంటి బాధ అనేవాళ్ళు అంకుల్”

“ఇంటి వరండాలో చెరో కుర్చీ వేసుకుని కూర్చునేవాళ్ళు. ఆంటీ చేతిలో బియ్యపు చేటో, తరగటం కోసం పడేసిన ఆకుకూరల వడపోతల బుట్టో వుండేది. ఒకళ్ళు ఆకుకూరలు తరుగుతుంటే రెండవవాళ్ళు అందించేవాళ్ళు. ప్రొద్దున్నే ఆంటీ వాకిలి చిమ్మితే అంకుల్ పైపుతో తడిపేసే వాళ్ళు. ఆంటీ అందమైన ముగ్గులు పెట్టేది. పనిమనిషి వచ్చేదాకా ఆగేవాళ్ళు కాదు. మధ్యాహ్నం పూట ఏ అరగంటా, గంటా పడుకునేవాళ్ళు. మూడవుతూనే వరండాలోకి చేరేవాళ్ళు. టీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు. మొక్కల్లో కలుపుతీయటమో, పెరిగిపోయిన కొమ్మల్ని నరకటమో అంకుల్ చేస్తే, అవన్నీ ఎత్తి ఆంటీ శుభ్రం చేసేది. ఎన్నెన్ని మొక్కలు పెంచారు? ఎక్కడెక్కడి నుంచో తెచ్చి బతికించేవాళ్ళు. వీళ్ళింట్లో తప్పించి కదంబ వృక్షాన్ని ఇంతకు ముందెప్పుడూ నేను చూడలేదు”

“అవును రాజ్యం. ఎప్పుడో బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ కదంబ చెట్లను చూశారంట. ఒక రకం కూడా కాదు. రెండు రకాల కదంబాలు. ఒక చెట్టేమో బంతుల్లాగా గుండ్రని పూలు పూసే చెట్టు. అది పురుష కదంబమట. రెండవది గెలలు గెలలుగా ఎర్రని పూలు పూస్తూ వేలాడబడేది. అది స్త్రీ కదంబమట. బృందావనంలో కృష్ణుడు ఈ కదంబ వృక్షం మీద కాని, క్రింద కూర్చుని గాని వేణువు నూదేవాడుట. ఈ కదంబం కృష్ణుని ప్రేమకు గుర్తుగా మిగిలిపోయిందట. స్త్రీ కదంబవృక్షం రాధకు కృష్ణుని పట్ల వున్న ఆరాధనకు సంకేతమట. ఇలా ఈ జంట కదంబాలు రాధాకృష్ణుల పవిత్రబంధాన్ని తెలియజేస్తాయని అక్కడివారు చెప్పారట. దాంతో వీళ్ళు ముచ్చటపడి రెండు చిన్న మొక్కల్ని కొని కుండీలలో పెట్టించుకుని జాగ్రత్తగా రైల్లో మోసుకుంటా ఇంతదూరం తెచ్చి బతికించారు. ఇవ్వాళ చూడు. ఆ కదంబమాలనే అంకుల్ మెడలో వేసుకుని అచ్చం నిద్రపోతున్నట్లే వున్నారు”

“ఎప్పుడన్నో ఓ రోజో, రెండురోజులో వీళ్ళు ఊరికెళితే వీధి అరుగులే కాదు ఆ వీధంతా, బోసిపోయినట్లే వుండేది. రేపట్నుంచి ఈ ఇల్లూ, ఈ వీధి ఎంత చిన్నబోతాయో? వేసవికాలం వస్తే ముందుగానే మల్లెపొదల ఆకులన్నీ దూసిపోసేవాళ్ళు. చిగురూ, మొగ్గలూ తొడిగి నవనవలాడుతూ చెట్లనిండా జడమొగ్గలు పెరిగేవి. వీధిలో వాళ్ళకు రోజుకొకరి చొప్పున పూలు ఇచ్చేవారు. ఆదివారమొస్తే చాలు పూలజడ అంటే ఇష్టమున్న ఆడపిల్లల్ని కూచోబెట్టేవాళ్ళు. పద్మాలజడ, వంకీలజడ, కూర్పజడ అంటూ, ముందుగానే తన మెడలు పోయేటట్లుగా అరటిపట్టమీద పూలజడను తయారుచేసేవాళ్ళు. అంకుల్ మొగ్గలందిస్తుంటే ఆంటీ సూదీ దారంతో కుట్టేవాళ్ళు. ఆ తర్వాత ఆ అరటిపట్టి జడను, వీళ్ల జడమీద పెట్టి టాకా కుట్లు వేసేవాళ్ళు. అరటిపట్టా, కనకాంబరాలు, మరువం అన్నీ వాళ్ళ ఇంట్లోవే. ఈ కాలం పిల్లలు ఎక్కువసేపు కూర్చోలేరని తనే అరటిపట్టి మీద జడను తయారు చేసుకునేవాళ్ళు. గుళ్ళో అమ్మవార్లకు కూడా ఇలాగే తయారుచేసి పంపేవాళ్ళు. ఆ తర్వాత అంకుల్‍కి నడుంనొప్పీ, ఆంటీకి మెడనొప్పీ పట్టుకునేవి. నడుంబెల్టూ, మెడకి పట్టీ పెట్టుకుని తిరిగేవాళ్ళుకాని చేసేపన్లు మాత్రం మానుకునే వాళ్ళు కాదు”

“పూలజడలేనా? పెరట్లో ఎన్ని రకాల కూరగాయల్ని కాయించేవారు? వీధి వీధంతా పంచేవాళ్ళు. చక్రవర్తి తోటకూరంటూ ఆంటీ వాళ్ళ పెరట్లోనే వుండేది. గులాబీరంగు చిగుళ్ళు వేసి ఆ తర్వాత ఆకుపచ్చగా బిళ్ళగన్నేరు ఆకులంత వుండి మెత్తని, తెల్లని పొడి అంటించుకున్న చక్రవర్తి తోటకూర చెట్లు దూరానికి ‘చిల్ల’ మొక్కల్లాగా వుండేవి. ఆ ఆకులతో చేసిన పప్పు కూరకు ఎంత రుచో? అందుకే దానికి చక్రవర్తి తోటకూర అనే పేరు వచ్చిందేమో? ఆ చెట్టు ఆకులైతే ఆంటీ, అంకుల్ మనస్సుల్లాగే చాలా మృదువుగా వుండేవి. జానెడు పొడుగున్న గోరుచిక్కుళ్ళు, బారెడు పొడుగున్న బీన్స్,  కూర అరటి, హైబ్రిడ్ మునగ ఒకటేమిటి? అన్నిరకాలూ అందరికీ ఇచ్చి తృప్తిపడే మంచి మనస్సులు వాళ్ళవి. అంతకుమించి మనసున్న మనిషి కాబట్టే ఇంత సునాయాసంగా నిద్రలోనే కన్నుమూశారు. రేపట్నుండీ ఆంటీ ఒంటరిగా ఎలా వుండగలరో ఏమో!”

“రోడ్డుపక్కన పిచ్చిమొక్కో, రాతిమొక్కో కనిపించినా తీసేసి శుభ్రం చేసే మనిషి మా అన్నయ్య. చేతిలో ఎప్పుడూ కొడవలో, గునపమో కనపడేది. ఉన్న ఒక్క కూతుర్ని బాగా చదివించాడు. యోగ్యుడికిచ్చి పెళ్ళి చేశాడు. ఇద్దరు మనవళ్ళు ఉన్నారు. వాళ్ళ తెలివితేటలూ, చురుకుదనము చూచుకొని మా అన్నయ్య ఎంత మురుసుకునేవాడో? ఇంకా కొన్నాళ్ళు బతికుంటే వాళ్ళ ముద్దుమురిపాలు చూచుకొనేవాడు. మా చుట్టాలలో ఎవరికేం ఇబ్బంది వచ్చినా మీ అన్నయ్యా, వదినా రెక్కలు కట్టుకుని వాలేవాళ్ళు. వాళ్ళక్కావ్లల్సిన సాయం అందించి మరీ ఇవతలకొచ్చేవాళ్ళు. నా ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు మా అన్నావదినల చేతుల మీదనే జరిగాయి. మేనమామ అంటే ఇలా ఉండాలి అన్నారు అందరూ” అంటూ ముక్కు చీదుకుంది ప్రసాదరావు గారి చెల్లెలు.

అక్కడ చేరిన ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు అలాగే మాట్లాడసాగారు.

“భార్యాభర్తలిద్దరూ చెప్పుకోదగ్గ మనుషులండీ, ఒకరికి చేయి అందించటమే కాని, ఎవరినీ ఏమీ సహాయం చేయమని అడిగిన దాఖలేమీ కనపడవు. మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు ప్రసాదరావు అంకుల్, భారతీ ఆంటీ కలవరిస్తూ వుంటారు. మనం బజారుకెళుతుంటే మన ఇంట్లోకి కావలసిన వస్తువులు తెచ్చుకుని వూరుకుంటాం. కాని ప్రసాదరావు గారు అలా కాదు. వీధిలో ఎవరైనా ఎదురుపడితే చాలు, ‘అమ్మా ఏమన్నా తేనా? బజారుకెడుతున్నాన’నే వాళ్ళు. మోసుకురావడం ఇబ్బంది అని గానీ, వాళ్ల బరువులు నేను మోసేది ఏంటి అని గాని, అనుకున్న పాపాన పోయే మనిషి కాదు. ఇప్పుడాయన తలకింద వున్న గొంగళిని చూడండి. దాన్నొక గొర్రెలకాపరి ఇచ్చాడు. ఆ రోజు గొర్రెలకాపరి ఆ గొంగళి ఇస్తూ అన్నమాటలు నాకింకా గుర్తున్నాయి. ‘అయ్యగారి పాదాన్ని మించింది అమ్మగారి హస్తం. ఏమిస్తే వాళ్ళ రుణం తీర్చుకోగలం’ అని.”

“గొర్రెల కాపర్లు ఎందుకిచ్చారు ఆ గొంగళి?”

“ఒకసారి నలుగురు గొర్రెల కాపర్లు పెద్ద గొర్రెల మందను తోలుకొని వాటిని మేపుకుంటూ శీతాకాలం రాగానే మా వీధిలోకొచ్చారు. గొర్రెల అరుపులూ, వాటి విసర్జకాలతో చిరాకూ, చీదరా పుట్టినాయి. ‘ఇక్కడేంటి నువ్వు మేపేది! అటెటన్నా వెళ్ళు’ అంటూ మేం విసుక్కున్నాం. వాళ్ళ అదృష్టం బాగుండి ప్రసాదరావు గారు వీధిలో కొచ్చారు. విషయం తెలుసుకున్నారు. ‘మా వీధి చివర పెద్ద ఖాళీ చోటుంది. మీ గొర్రెల్ని అక్కడికి తోలుకెళ్ళండి. మేపుకోండి’ అని వాళ్ళకు కావల్సిన చోటు చూపించారు. అది చాలా పెద్ద స్థలం. ఏ రెండువేల గజాలో ఉంటుంది. ఈ మధ్యవరకూ కురిసిన వర్షాల వలన బాగా పచ్చిక, పిచ్చిమొక్కలు పెరిగాయి. గొర్రెలు కడుపు నిండా మేశాయి. వాళ్ల ఇంటిపక్కనే ఆ ఖాళీ స్థలమున్నది. ఆ స్థలంలో ఒక పెద్ద రాతి గాబు వున్నది. తనింట్లో నుండి పైపు వేసి ఆ రాతి గాబు నిండా నీళ్ళు పట్టుకోమనేవాళ్ళు. దప్పికగొన్న గొర్రెలు తాగుతాయని వారి ఉద్దేశం. ఆ గొర్రెలకాపర్లు అన్నం మాత్రం వండుకునేవారు. వీధిలోనే రాళ్ళపొయ్యి పెట్టారు. కావాల్సిన కట్టెల్ని ప్రసాదరావుగారే ఇచ్చేవాళ్ళు. కూరా, పచ్చడీ, మజ్జిగా అన్నీ భారతిగారే నాలుగురోజుల పాటు ఇచ్చారు. గొర్రెల కాపర్లు ఆనందంగా తిన్నారు. స్నానాలు, బట్టలుతుక్కోవటం అన్నీ చేసుకునే వీలు కలిగింది. రోజుల గొర్రెపిల్లలు ప్రసాదరావు గారి డాబా మెట్లకింద పడుకుని నానా ఖంగాళీ చేసేవి. పరాసికంపతో కట్టిన పొలిగట్టె ఇచ్చి మెట్లకింద ఊడ్చి, కడగమనేవాళ్ళు కాని వాటిని బయటకు తోలలేదు. వాటి అరుపుల్నీ, విసర్జకాల దుర్వాసననూ అన్నిటినీ భరించారు. వాళ్లకేమవసరమైతే అది సమకూర్చారు. వాళ్లెవరో తెలియదు. ఎక్కడనుంచి వచ్చారో తెలియదు. అంత మానవత్వంతో ప్రవర్తించారు.”

గొర్రెలకాపర్లు అక్కడనుంచి వెళ్తూ, వెళ్తూ ఎన్ని దండాలు పెట్టారో లెక్కలేదు.

“మేమే ఊరు వెళ్ళినా ఎక్కడో ఏ పొలంలోనో, ఊరి వెలుపలో కాస్త ఉడకేసుకుని, ఉప్పేసుకున్న గంజి అన్నం, దాంట్లోకి మేం తెచ్చుకున్న కొరివికారమో నంజుకుని తినేవాళ్ళం. మహా వుంటే మా దగ్గర ఉల్లిగడ్డలుండేవి. అలాంటిది ఈసారి మీ కూరలు, పచ్చళ్ళూ, మజ్జిగా అన్నీ ఇచ్చారు. ఇంత అపిమానంగా మిమ్మల్నెవరో, ఏ ఊర్లోనూ ఆదుకోలేదు. తోటి మడుసుల్లాగా చూశారు. మీకు మేం ఏమియ్యగలమయ్యా?” అంటూ ఒక గొంగళిని బయటకు తీశారు. “ఇది మా గొర్రెల బొచ్చుతో నేసిందేనయ్యా. కొత్తదేనయ్యా. అమ్ముకుందామని తెచ్చుకున్నాం. కప్పుకుంటే ఎచ్చగా వుండి సలిపుట్టనీయదు. దీన్ని మీకిస్తాం. కాదనకుండా తీసుకోవాలి. కొంతైనా మా రుణం తీర్చుకోనియ్యండి” అంటూ బలవంతాన ప్రసాదరావు గారి చేతుల్లో పెట్టారు. ఆయన దాన్ని తీసుకుని ఐదొందలు ఇచ్చి పంపారు. వాళ్ళు తీసుకోవటానికి ఒప్పుకోలేదు.

“దీని రేటు ఇంకా ఎక్కువే వుంటుంది. ఏదో నా తృప్తికోసం నేను ఐదొందలిస్తున్నాను. ఈ రోజుల్లో ఐదొందలకేం వస్తాయి? కాదనకుండా తీసుకోండి” అంటూ ఇంట్లో నుంచి ఓ రెండు దుప్పట్లు తెప్పించి వాళ్ళకిచ్చి పంపారు. అలాంటి మనిషి ప్రసాదరావు గారు” అంటుండగానే ప్రసాదరావు గారు పనిచేసిన ఆఫీస్ సిబ్బంది అంతా వచ్చారు. వాళ్ళు పూలదండలు వేసి, నమస్కరించి నివాళులు అర్పించారు.

‘ఆఫీసులో పనిచేసినన్నాళ్ళు ఎంతో నిబద్ధతగా పనిచేశారు. ఆఫీసులో అందరికీ జవాన్లతో సహా తలలో నాలుకలాగా వుండేవారు. మేనేజరుగారికి అనుకూలంగానూ, తన జూనియర్స్‌కు ఆదర్శంగానూ తన బ్యాచ్ వాళ్ళతో స్నేహంగాను మెలిగేవార’ని, వారంతా గుర్తు చేసుకున్నారు. “రిటైర్మెంట్ వయసు దగ్గర పడినా కూడా ఎంతో హుషారుగానూ, ఉల్లాసంగానూ వుండేవారు. ఓర్పు కావాలబ్బాయ్, పనిమీద బాగా శ్రద్ద ఉండాలని జూనియర్స్ కెప్పుడూ సలహాలు చెప్పేవాళ్ళు. ఇన్‌స్పెక్షన్ వచ్చినా, లేక ఏదైనా ఫంక్షను చేయాల్సి వచ్చినా తాను ముందుండి, ఆఫీసువాళ్ళను నడిపించేవార”ని మరీ మరీ గుర్తు చేసుకున్నారు.

“ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా నన్ను ఆదుకునేవారు. నా కూతురి పెళ్ళికి ఎంత సాయం చేశారు? చివరకు దాని పురుడయిన తర్వాత కూడా ‘యాదయ్యా! పిల్లకు కొత్త బియ్యపు అన్నం పెట్టకండి. మా ఇంటికొచ్చి పాతబియ్యం పట్టుకెళ్ళు’ అంటూ ఇచ్చిన ధర్మదాత అండీ” అంటూ యాదయ్య కళ్ళు తుడుచుకుంటూ భారతి దగ్గరికెళ్ళి “ఆయనగారు పుణ్యాత్ములమ్మా. పున్నమి చంద్రుడిలాగా ఎలిగారు. అంతలోకే చాటుకెల్లారమ్మా. ఇక్కడ చేసినట్టే చచ్చి స్వర్గానికెళ్ళి అక్కడా అందరికీ సాయం చేత్తొ గడిపేత్తారమ్మా” అన్నాడు.

ఆ మాటల్తో భారతికి దుఃఖం తన్నుకొచ్చింది. అందరూ తన దగ్గరకొచ్చి ఏవేవో చెప్తున్నారు. తన మనసు బండబారి పోయింది. మెదడు చైతన్యం కోల్పోయినట్లుగా అయిపోయింది. అసలు ఇదంతా నిజమా? లేక పీడకల ఏమైనా చూస్తున్నానా అనుకున్నది.

ఇలా దాదాపు అందరు ఆడవాళ్ళూ, మగవాళ్ళు కూడా ప్రసాదరావు గారిని గురించి చాలా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడసాగారు.

“హిమా! నీ మాటల్తో మీ బాబాయి కష్టపెట్టుకున్నారనుకుంటాను. మరోసారి ఆలోచించరాదూ?”

“నేనేం చేసినా బాగానే ఆలోచించి చేస్తానని మీకు బాగా తెలుసు. బాబాయి తాత్కాలికంగా కష్టపెట్టుకున్నా తనే నిదానంగా అర్థం చేసుకుంటాడు. నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇంటల్లుడిగా, నా భర్తగా మీరు నా నిర్ణయాలకు సపోర్ట్ ఇవ్వండి చాలు. అయినా మా నాన్న శవాన్ని ఎదురుగా పెట్టుకుని ఇలా తర్జన భర్జనలు పడటం నాకిష్టం లేదు”

“నీకు సపోర్ట్ ఇవ్వమంటున్నావు. దేనికి సపోర్ట్ కావాలో ముందు నాకు తెలియాలిగా. ఇంతకీ, నీ ఉద్దేశం ఏమిటి? మన బాబిగాడి చేత మీ నాన్న కర్మకాండలు చేయిస్తావా?”

“బాబాయితో మేం చూసుకుంటాంలే అన్నానని, బాబిగాడి చేత కర్మకాండలు చేయిస్తానని మీరు అనుకుంటున్నారా? చిన్నవయసులో ఉన్న బాబిగాడి చేత ఇలాంటి పనులు చేయించటమెందుకండీ? మన భారతీయ సంస్కృతిలో, వేదవాఙ్మయంలో కూడా స్త్రీ, పురుషులిద్దరూ సమానులే. ఏ పని అయినా స్త్రీ గాని, పురుషుడు గాని చెయ్యవచ్చని చెప్పారు. స్త్రీలనెక్కడా చిన్నచూపు చూడలేదు. చెట్లనే తీసుకోండి. వేపచెట్టు పురుషత్వానికీ, రావిచెట్టు స్త్రీత్వానికి ప్రతీక అని చెప్తారు. అలాగే ఉసిరి, తులసి కూడా. ఇక్కడ అమ్మవాళ్ళు నాటిన కదంబవృక్షాలను చూడండీ. ఇలా వృక్షసంపద మొదలుకుని ప్రకృతిలో అంతా స్త్రీ, పురుష సమానత్వమే చెప్పబడింది” అని హిమబిందు భర్తతో అంటుండగానే ఆమె, బాబాయి కూతుళ్ళు ఇద్దరూ హిమ దగ్గరగా వచ్చారు. ముందుగా భారతినీ, ఆ తర్వాత హిమబిందునూ పరామర్శించారు.

‘పెదనాన్న కర్మ ఎవరు చేస్తున్నారు? హిమబిందు భర్తా? లేక తమ తమ్ముడేనా?’ అన్న ప్రశ్న వాళ్ళ మనసుల్లోనూ వచ్చింది. తమ తమ్ముడు చేస్తే అది ధర్మ కర్మే అవుతాది. ధర్మ కర్మ ఊరికినే చేయించుకోకూడదంటారు. భారతి పెద్దమ్మ చేయించుకుని మెదలకుండా వుండిపోయే మనిషి కాదు. ఎంతో కొంత ఆస్తిని అమ్మి తమ్ముడికైతే ఇవ్వటం ఖాయం. హిమబిందో వాళ్లాయనో అర్థం చేసుకుంటారు. కర్మ చేయబోయే తమ తమ్ముడు ఎక్కడా కనబడలేదు. కనుపించిన తండ్రేమో సీరియస్‍గా వున్నాడు. అమ్మయితే ఏ భావాన్నీ ముఖంలో కనబడనీయటం లేదు. ఇక వుండబట్టలేక ఇద్దరిలో పెద్దామె అడగనే అడిగింది.

“పెదనాన్నకు తలకొరివి ఎవరు పెడుతున్నారు హిమా?”

“నేనింతవరకూ మన ఇంటిపేరుతోనే చెలామణి అవుతున్నాను. నాన్నకు మగపిల్లలు లేరు. కూతురినైనా, కొడుకునైనా నేనే. అమ్మానాన్నల తర్వాత కూడా వాళ్ల ఇంటిపేరు వినపడాలి. కూతురినైన కారణంగా, వాళ్ళ తర్వాత అలా ఇంటిపేరు కనుమరుగు అయిపోతుందంటే నాకు చాలా బాధ కలిగింది. నాది చాదస్తమనుకోండి. మూర్ఖత్వమనుకోండి. నాకేం బాధలేదు. నేను చేసే పని కరెక్టేనని నా మనసుకు తెలుసు. అందుకు నా భర్త సహకారం ఎప్పుడూ నాకుంటుంది. దాంతో మా పెద్దవాడు బాబీని ఈ ఇంటి పిల్లవాడుగా వుంచాను. ఇప్పుడు బాబీ ఇంటిపేరు, నాన్న ఇంటిపేరే. ఈ పేరుమీదే వాడి రికార్డు అంతా వ్రాసి వున్నది. వాడు ఈ ఇంటి బిడ్డగానే చెలామణి అవుతాడు”

“ఇప్పుడు నీ పెద్దకొడుకు పెద్దనాన్నకు దత్తపుత్రుడన్నమాట. ఇప్పుడు కర్మ మావాడే చెయ్యాలిగా?”

“బాబీ ఈ ఇంటివాడుగానే చెలామణి అవుతాడు. వాడు కాస్త పెద్దవగానే వచ్చేసి మా అమ్మ దగ్గరే వుండిపోతాడు. నాకు కొడుకు లేకుండా కూతురు వున్నా ఇదే పని చేసి వుండేదాన్ని. నా ఉద్దేశమల్లా అమ్మానాన్నల తర్వాత కూడా ఈ ఇల్లు నిలబడాలి. నేను ఈ ఇంటి బిడ్డను. అలాగే బాబీ కూడా ఈ ఇంటి బిడ్డే అవుతాడు. నాన్నకో కొడుకుంటే ఎలా ఈ ఇంట్లో, ఈ ఊళ్ళో తిరిగేవాడో, ఎలాంటి హక్కును పొందేవాడో అలాంటిదాన్నే నేనూ, బాబీ పొందుతాం”

“ఇంతకీ కర్మ బాబీ చేస్తాడన్నమాట”

“బాబీకి అభం, శుభం తెలియని వయస్సు. వాడి చేత ఎందుకు ఈ పన్లు చేయించటం?”

“హిమా! నీ మాటల్తో చంపుతున్నావు. ఇంతకీ అసలు విషయం చెప్పు. ఎలాగూ ఈ విషయాన్ని మేమే లేవనెత్తాం. విందామని కుతూహలంగా వున్నది. మేమంతా మీ ఆయనే గదా కర్మ చెయ్యబోయేది అనుకున్నాం. నువ్వేమో కాసేపు కూతుర్నైనా, కొడుకునైనా నేనే అంటున్నావు. మరోపక్క ఈ ఇంటి వారసుడు బాబీ అంటున్నావు. మాకేం అర్థమయి చావడం లేదు”

“మగపిల్లలు పుట్టినట్లే ఆడపిల్లలూ రక్తం పంచుకుని పుట్టినవాళ్ళే. మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆస్తిహక్కు పొందుతున్నారు”

“అబ్బబ్బ హిమా! ఈ రోజు నీకేమయింది? ఇక్కడున్నది మీ నాన్న శవం. నువ్వేంటి? ఈ టైమ్‍లో ఉపన్యాసాలు చెప్తున్నావు! నిన్ను కదిలించడం మాదే బుద్ది తక్కువ” అంటూ లేచి పెద్దమ్మ భారతి దగ్గరకెళ్ళారు.

హిమబిందు కూడా వచ్చి తల్లి పక్కన కూర్చున్నది.

“అన్నీ ముందుగానే ఆలోచించి పెట్టుకునే నాన్న తనకు మృత్యువు ముంచుకొస్తుందని ఆలోచించలేక పోయారు. నాకు తెలిసినంతవరకు నాన్నకు ఈ ఆలోచన వుండి వుంటే తన శరీరాన్ని తప్పకుండా ఏ మెడికల్ కాలేజీకో డొనేట్ చేసి వుండేవారమ్మా”

“హిమా! అలా అనకు. మీ నాన్నకు పద్ధతి ప్రకారం కర్మకాండలు జరిపించండి” అన్నది భారతి ఏడుపును ఆపుకుంటూ.

“నిజం పెద్దమ్మా! పెదనాన్న ఎంత మంచి చావుతో పోయారు? నిద్రలోనే గదా? మా అత్తగారికి ఇప్పుడు ఎనభై ఏళ్ళు దాటాయి. ఆవిడ రోజూ దణ్ణం పెట్టుకుంటుంది ‘సునాయాస మరణం ఇవ్వు దేముడా! ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా నన్ను దాటిపోనివ్వు’ అని. ఎంతమందికి వుంటుంది అంత అదృష్టం? మేమెప్పుడు ఇక్కడికొచ్చినా వీధి గేటు తీస్తే చాలు లోపలి నుండి చూసి మీరిద్దరూ గబగబా వీధి గేటు దగ్గరకొచ్చి లోపలికి తీసుకెళ్ళేవాళ్ళు. మళ్ళా వెళ్ళేటప్పుడు వీధి చివరి దాకా వచ్చి సాగనంపేవారు. ఒకరోజయిన పూర్తిగా మీ దగ్గర వుండకపోతే ఒప్పుకునేవాళ్ళు గారు కదా? మేం ఎలా మర్చిపోతాం?”

“ఇంటి ఆడపిల్లలని అభిమానంగా ఉండేవాళ్ళం. ఇంక మీరొచ్చినపుడు ఎవరొస్తారమ్మా ఎదురు? మిమ్మల్ని సాగనంపే వారెవరు?” అంటూ భారతి కళ్ళు తుడుచుకుంటూనే “రోజూ మీ పెదనాన్న బజారుకెడుతూ వుంటే నేనే గేటువరకూ వచ్చి సాగనంపేదాన్ని. మరలా తిరిగి రాగానే చేతి లోని సంచీ అందుకునేదాన్ని. వరండాలో కూర్చోమని ఫేన్ వేసేదాన్ని. ఒక గ్లాసుతో మంచినీళ్ళు, మరో గ్లాసుతో మజ్జిగ ఇచ్చేదాన్ని. ఎండనపడి వచ్చారని బాధపడేదాన్ని. కాస్త ఎండలో వస్తే ఇంతగా తల్లడిల్లిపోతావు. మరీ ఎక్కువ గారం చేస్తున్నావు అనేవాళ్ళు. మనవళ్ళు ఎట్లాగూ దగ్గర లేరు. మీరు కాక ఇంకెవరున్నారు గారం చేయటానికి అనేదాన్ని. రేపట్నుంచి ఎవరిని సాగనంపేది? ఎవరికి మజ్జిగా, మంచినీళ్ళు అందించేది” అంటూ భారతి చీరచెంగుతో కళ్ళొత్తుకున్నది.

హిమబిందు పెద్దకొడుకు బాబీ అమ్మమ్మ పక్కనే కూర్చుని వున్నాడు. తొమ్మిదేళ్ళు వుంటాయి. అమ్మమ్మ ఏడ్చినప్పుడల్లా అమ్మమ్మ చేయిపట్టుకుని “వద్దు అమ్మమ్మా! నీకు ఆరోగ్యం పాడవుతుంది. ఇంకా ఏడవకు” అంటున్నాడు.

ప్రసాదరావు గారికి వేసిన పూలదండలు ఎక్కువైనప్పుడల్లా తనే తీసి వాటిని పక్కనున్న రెయిలింగ్ మీద వేస్తున్నాడు. తాతగారి ముఖం బాగా కన్పడేటట్లుగా మార్చురీ బాక్సుమీద పడ్డ పూలరేకులన్నింటినీ పక్కకు నెట్టేసి సరిచేస్తున్నాడు.

“బాగా వివరమున్న పిల్లవాడు లాగున్నాడు. హిమబిందు పిల్లల్ని బాగా పెంచింది” అనుకుంటున్నారు చూచినవాళ్లు.

అదంతా చూసిన భారతి “నాన్నా! బాబీ! తమ్ముడేడిరా? మీ ముద్దు మురిపాలు, మీ తెలివితేటలూ అన్నీ చూడకుండానే తాతగారు వెళ్ళిపోయారు! శెలవులివ్వగానే వచ్చి మీరింకెవరితో ఆడుకుంటారు? మిమ్మల్ని తీసుకెళ్ళి అన్నీ ఎవరు కొనిబెడతారు?” అంటూ మళ్ళీ గొల్లుమన్నది.

బాబీ అమ్మమ్మ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు.

బాబీ తమ్ముడు అమ్మమ్మ ఏడుపు చూసి బిక్కమొగం వేశాడు. బెంగగా వాళ్ళ నాన్న చేయిపట్టుకుని గుప్పెడ గట్టిగా బిగించాడు.

ఈలోగా హిమబిందు లోపలి నుండి స్నానం చేసి వచ్చింది. ఆమె భర్త మామగారి అంతిమయాత్రకు కావలసిన ఏర్పాట్లును చూస్తున్నాడు.

‘ఇదేంటి? పిల్లవాడు గదా స్నానం చేయాల్సింది? హిమబిందు చేసిందేమిటా?’ అని ఆశ్చర్యం కలిగింది. ఒక పెద్దామె పిలిచి అడగనే అడిగింది. అక్కడున్న మగవాళ్ళు కూడా ఒకరివంక మరొకరు సాలోచనగా చూసుకోసాగారు.

వాళ్ళ ముఖకవళికలను బట్టి తననేదో అడగాలనీ, తెలుసుకోవాలనీ అనుకుంటున్నారని హిమబిందు కర్థమయింది. అడిగిన పెద్దామెకు చెప్తున్నట్లుగా మొదలుపెట్టింది.

“చూడు అత్తయ్యా! నువ్వు బాగా తెలివిగలదానివి. ఏ విషయమైనా త్వరగా అర్థం చేసుకుంటావు. తల్లిదండ్రులకు ఆడపిల్లలూ, మగపిల్లలూ సమానమేగా. ఇద్దరికీ సమాన ప్రేమను పంచుతున్నారు. ఆస్తిపాస్తుల్నీ సమానంగానే అప్పగిస్తున్నారు. అలాంటప్పుడు బాధ్యతలు మాత్రం సమానంగా వుండవా? కొడుకులు లేకపోతే కూతురు వుంటే ఏమీ వుపయోగం ఉండదా? తల్లిదండ్రులకు కర్మకాండలు చెయ్యగూడదా? తండ్రి వంశాన్ని అంతటితో అంతరింపచేసుకోవాలా? ఇదెక్కడి న్యాయం అత్తయ్యా? ఆలోచించి చెప్పండి.”

“నువ్వన్నట్లు ఇద్దరూ సమానమే. ఇద్దరూ రెండు కళ్ళలాంటి వారే. కాని పుత్రుడే పున్నామ నరకం నుండి రక్షిస్తాడని మన పెద్దవాళ్ళు శాస్త్రాల్లో చెప్పారు కదమ్మా”

“అదంతా మనం అనుకోవటంలో వుంది. కొడుకులు లేకపోతే సగోత్రీకులైన బంధువులు పనికివస్తారు కాని కూతురు కర్మ చెయ్యటానికి పనికిరాదనటం ఏం బాగుంది అత్తయ్యా. ధర్మ కర్మ అంటూ వేరే ఎవరి చేతో చేయించుకోవచ్చు కాని కడుపున పుట్టిన కూతురు పనికిరాదనటం నాకు ఏం నచ్చలేదత్తయ్యా. మన స్త్రీ జాతిని మనమే అవమానించుకున్నట్లుగా వున్నది” అన్నది బాధా, ఆవేశం కలగలసిన గొంతుతో.

అంత బాధలోనూ ఆ మాటల్ని భారతి శ్రద్దగా విన్నది. చకచకా ఆలోచించింది.

“మరిదిగారు వచ్చి తన కొడుకు చేత కర్మ చేయిస్తానంటే సరే అన్నాను. నిన్ను ఒక్కమాటా అడగలేదు హిమా. బాబిగాడికి మా ఇంటిపేరు వ్రాయించావని తెలుసు. వాడు మరీ పసివాడని ఆలోచించాను. నేనే నీ మనసును తెలుసుకోలేకపోయాను. నువ్వెంతో తెలివిగలదానివి. నేనే పొరపాటు పడి నిన్నూ, అల్లుడిగారినీ ఒక్కమాటా అడగలేదు. నువ్వు కర్మ చేస్తేనే మీ నాన్న గారి ఆత్మ శాంతిస్తుంది తల్లీ. అలాగే కానివ్వు” అంది తన పక్కనే వున్న బాబిగాడి తల ఆప్యాయంగా నిమురుతూ.

“నాన్నగారికి కర్మకాండలు చెయ్యటం నా బాధ్యతే. దీన్ని ఇంకెవరికీ అప్పగించను” అన్న దృడ నిశ్చయంతో హిమబిందు ముందుకు నడిచింది. ఆ నడకలో తండ్రి ఇంటిపేరు నిలబడాలన్న పట్టుదలా వున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here