బాధ్యత

0
7

[dropcap]మా[/dropcap] స్నేహితుడు పాండురంగ అంటూనే ఉండేవాడు – “ఒరేయ్ రామనాధం! మనం రిటైర్మెంట్ అవసరం ఉన్నంతవరకే రా! మనకు మర్యాద, మన్ననలుంటాయి. ఆ తర్వాత ఖాళీయే కదా! మనల్ని ఊపిరితీయనీయకుండా పనులు చెప్పి ఉక్కిరిబిక్కిరి చేస్తారనుకో.”

నేను నవ్వేవాడిని వాడి మాటలు విని!

“నవ్వకురా! రేప్పొద్దున నీ గతీ అంతే… ఇంకెంతకాలం మరో రెండేళ్ళలో నువ్వూ రిటైరయిపోతావు కదా ముందుంది ముసళ్ళ పండగ” అనేవాడు.

వాడంటూంటే తేలిగ్గా తీసుకుని నవ్వేవాడిని కానీ ఇది నవ్వే విషయం కాదని ఇప్పుడనిపిస్తోంది. పాండురంగ ఓ నెలక్రితం కాలధర్మం చెందాడు. నా బాధ పంచుకోవడానికి కూడా సాటి మనిషి లేడాయే!

నా ధర్మపత్ని సావిత్రి నేను రిటైర్ అవ్వకముందే తను శాశ్వత విరమణ తీసుకుంది. అబ్బాయి శేఖరం ప్రభుత్వ ఉద్యొగంలో కొలువుదీరడం ఇంట్లో దీపం పెట్టే కోడలు దీప నా ఇంట్లోకి రావడం అంతా బాగానే జరిగింది.

ఏమాటకామాటే దీప నన్ను కూతురిలా చూసుకునేది. ఉదయం కాఫీ కలపడం దగ్గరనుంచి… రాత్రి పడుకోబోయే ముందు నాకు రాగి చెంబుతో నీళ్ళివ్వడం వరకూ నేనడక్కుండానే అన్ని పనులు చేసిపెట్టేది. కాని ఏం లాభం? ఈ వైభోగమంతా నేను పదవీ విరమణ పొందకమునుపే! రిటైర్ అయి నెలరోజులైనా కాకుండానే నా పరిస్థితి పనిమనిషి కన్నా కనికష్టం అయిపోయింది. మొన్న నేను ఖాళీగా పడక్కుర్చీలో అలా నడుంవాల్చానో లేదో “మామయ్యగారు కాఫీపొడి లేదు పక్క వీధి కిరణా షాపుకు వెళ్ళి తెచ్చిపెట్టరూ” అంది. మొహమాటంకొద్దీ నేను వెళ్ళడం నా మొదటి తప్పయింది. కూరలో తాలింపుకు శనగపప్పు లేదనీ, పెరుగు లేదనీ అలా తనకు గుర్తొచ్చినప్పుడల్లా నాకు చెప్పి తెప్పించుకుంటోంది. ఇప్పుడు కూడ పెరుగు కోసం బయటకు పంపించింది.

చేతివాచీ చూసుకున్నాను. బయలుదేరి గంట కావస్తోంది. ఆలోచనలతో అడుగు ముందుకు వేయబుద్దికావడం లేదు. ఈ రోజు నుంచి పనులు చెప్పవద్దని చెప్పాలనుకుని తిరిగి ఇంటికి దారితీశాను. గుమ్మంలో అడుగుపెడుతూనే “ఇంటి యజమాని, పెద్దమనిషి అని చూడకుండా పనిమనిషికి చెప్పినట్లు పనులు చెబుతున్నారు. కోడలుపిల్లా! కిరాణా సరుకులు ఆఫీసునుండి ఇంటికొచ్చాక కొడుకు చేత తెప్పించుకో. నేను చేయనుగాక చేయను” కరాఖండీగా చెప్పేశాను.

నా కోపం, నేను చెప్పిన మాటలు గ్రహించిన కోడలు భయంగా మొహంపెట్టి దీనంగా తలొంచుకొని లోపలకు వెళ్ళిపోయింది. నేను పడక్కుర్చీలో కూర్చున్నాను.

ఆవేశపడ్డానా? కోడలు అందులోనూ ఆడవాళ్ళపై ఆవేశం నన్ను నేను తర్కించుకుంటూ… అనవసరంగా అన్నానేమో. నా అభిప్రాయం శేఖర్ తో చెప్పాల్సింది. వేయి ఆలోచనలతో సతమతమవుతూ మౌనంగా ఉండిపోయాను. సాయంత్రం నాలుగ్గంటలయింది. “మామయ్యగారు! కాఫీ.” దీప ఎప్పటిలాగే కాఫీకప్పు ముందుంచుతూ “నన్ను మన్నించండి” అంటూ లోపలికి వెళ్ళిపోయింది. దీపకు దిగులుగా ఉందేమో! కాఫీ తాగాను. శేఖరం వచ్చాడు. నేనేమీ మాట్లాడలేక మనస్కరించక అలాగే కుర్చీలో కూర్చుండిపోయాను. దీప కూడా రోజులా అన్నిపనులు చేసుకుంది.

మరునాడు శేఖరం ఆఫీసుకెడుతూ నాన్నగారు అంటూ నా చేతిలో చీటీ పెట్టి ”ఇంట్లోకి కిరణా సరుకులు తేవాలిట. వివరాలు చీటీలో ఉన్నాయి. ఆ! ఆన్నట్టు చీటీ చూసి ఇంకా ఏమైనా కావాలా అని దీపను మళ్ళీ అడిగి వెళ్ళండి. నేను అఫీసుకెడతా”అని చెప్పి వాడెళ్ళిపోయాడు.

నా పరిస్థితి మారలేదు. దీపకు బదులు వీడు పని చెప్పాడంతే! బాధగా బయలుదేరుతూ చీటీ ఓపెన్ చేశాను.

”నాన్నగారు! నేరుగా మీకు చెప్పలేక చీటీలో రాశాను. మొన్న పాండురంగం అంకుల్ హార్ట్ ఎటాక్‌తో పోయారని ఆయన అబ్బాయి మూర్తిగారిని పరామర్శగా కలిస్తే మూర్తిగారు ఏమన్నారో తెలుసా నాన్నా! ‘శేఖరం మా నాన్న రిటైర్ అయ్యాక్ ఖాళీగా కూర్చుని వళ్ళు పెంచారు. ఆయన వ్యాయామం మేం చిన్నచిన్న పనులు చెబితే మొదట్లో బాగానే చేసినా… అ తరువాత విసుక్కుని వ్యాయామానికి పూర్తిగా దూరమయినారు. బాధ్యత లేకపోతే మనిషి బరువెక్కుతారు. ఆ బరువు కొవ్వుగా మారి మరణానికి దారితీస్తుంది. అందుకే నాన్న పోయారు. రామనాధం అంకుల్ బాధ్యత నీదే, వ్యాయామం చేయించు’. అప్పటినుండి దీప వద్దన్న బాధపడినా మీకు చిన్నచిన్న పనులు చెప్పమన్నాను. నేను చేయలేక కాదు. మీతో వ్యాయామం చేయించాలని. కానీ మీ బాధ దీప చెప్పింది. అమ్మ లేని నాకు నాన్నకూడా దూరమయితే తట్టుకోలేను. తప్పయితే క్షమించండి. నా అంతరంగం అర్థమయితే దీపను ఏమైనా కావాలా అని అడగండి.”

నా కళ్ళు తడిబారాయి. వాడికి నా పట్ల గల బాధ్యత ఏమిటో అర్థమయింది.

“కోడలు పిల్లా! సరుకులు ఏమైనా తేవాలా?” అడిగాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here