“బదలా”: ఉత్కంఠ భరితం

0
9

[box type=’note’ fontsize=’16’] “సస్పెన్స్ చిత్రాలను ఇష్టపడే వాళ్ళను ఇది నిరాశ పరచదు” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘బదలా’ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]”ఝం[/dropcap]కార్ బీట్స్” తో సినెమా రంగంలో ప్రవేశించిన సుజోయ్ ఘోష్ ఇదివరకు “కహాని” రెండు భాగాలూ బాగా వచ్చాయి, అలాగే ప్రజాదరణ కూడా పొందాయి. అవి రెండూ సస్పెన్స్ చిత్రాలు. ఇప్పుడొచ్చిన “బదలా” (అంటే ప్రతీకారం) కూడా సస్పెన్స్ చిత్రమే. కాబట్టి వొక్క నిముషం పాటు కూడా కళ్ళు తెరనుంచి పక్కకు తప్పుకోనివ్వం, హాలు కూడా నిశ్శబ్దంగా వుంది. ఇది స్పానిష్ చిత్రం “ది ఇన్విజిబల్ గెస్ట్” ఆధారంగా తీసినది. అది నేను చూడలేదు కానీ, బదలా మాత్రం చాలా చక్కగా తీసిన చిత్రమని చెప్పగలను.

నైనా సేఠి (తాపసీ పన్ను) వొక వ్యాపారవేత్త. భర్త, కూతురు ఆమె కుటుంబం. అయితే ఆమెకు మరొక పెళ్ళైన వాడితో అర్జున్ (టోనీ లూక్) తో రహస్య సంబంధాలుంటాయి. తన కుటుంబాన్ని వదులుకోవడం ఇష్టముండదు. అతనితో రహస్య సంబంధాలు కూడా నెరపడం కత్తి మీద సాములా వుంటుంది. తన కుటుంబానికి, వ్యాపార రంగంలో పరువుకీ నష్టం రాకూడదు. ఇలాంటి వొక సందర్భంలో గ్లాస్గో లోని వొక హోటెల్ గదిలో అర్జున్ శవం, చెల్లా చెదురుగా డబ్బు, గాయపడి స్పృహలో లేని నైనా, బయట తలుపు దబదబా బాదుతున్న పోలీసు. ఆ గొడవకి స్పృహ వచ్చి తలుపు తీసిన నైనాను ఆ హత్య చేసిన నేరం మీద అరెస్టు చేస్తారు. ఇప్పుడు తను నిరపరాధినని ఆమె నిరూపించుకోవాల్సి వుంది. లాయర్ మిత్రుడు సలహా మీద రిటైర్మెంట్ కు దగ్గరలో వున్న పేరున్న లాయర్ బాదల్ గుప్తా (అమితాబ్ బచ్చన్) ను తన కేసు తీసుకోమని చెబుతుంది. నలభై యేళ్ళ తన అనుభవంలో ఒక్కసారి కూడా ఓటమిని చవిచూడని బాదల్ కి ఇది చివరి కేసు. ఇందులో కూడా తను ఓడిపోడు అన్న నమ్మకం. గంటకింత అని పెద్ద మొత్తంలో ఫీస్ వసూలు చేసే బాదల్ నిర్ణీత సమయానికంటే ముందే నైనా తలుపు తడతాడు. ఆమెను రక్షించాలంటే పూస గుచ్చినట్టుగా జరిగింది చెప్పాలి, అదీ నూరు శాతం నిజాలే చెప్పాలి అని మొదటే షరతు పెడతాడు. ఇక మిగతా చిత్రమంతా వాళ్ళిద్దరి సంభాషణ, దానికి తగ్గట్టుగా ఆయా సందర్భాలలో చిత్రీకరణను మన ముందు పెడుతుంది ఈ చిత్రం. సస్పెన్స్ చిత్రం కాబట్టి నేను యెక్కువ చర్చించను. కథ రకరకాల మలుపులు తిరిగి చివర్న పండు వలిచి మన చేతిలో పెడుతుంది. ఆమెపై అభియోగం వున్నట్టుగా నైనా హంతకురాలా? లేదా ఇంకొకరో హత్య చేసి ఆమెపై నేరం వెళ్ళేలా వల పన్నారా? ఇవన్నీ తెర మీదే చూడాలి.

మనకు ఇలాంటి కథలు అగాథా క్రిస్టీ, ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ తదితర రచయితల పుస్తకాలు, తెలుగులో కొమ్మూరి సాంబశివరావు లాంటి వారి పుస్తకాలు గుర్తుకొస్తాయి. అవి వొకసారి మొదలు పెడితే పూర్తి అయ్యేదాకా లేవం. ఆ తర్వాత కథలను మరిచిపోయినా మరచి పోవచ్చు, కాని అవి చదువుతున్నప్పుడు మనం గురైన ఉద్వేగం మాత్రం మనతోనే వుండిపోతుంది జ్ఞాపకంగా. ఇదీ అలాంటిదే. మరైతే మళ్ళీ మళ్ళీ అలాంటి పుస్తకాలు యెందుకు చదువుతున్నాము? ఆ రచయితలు అలాంటి నమ్మబలికే పాత్రలను సృష్టించి, మాటలతో మనముందు ముగ్గులు (అవును ఆ వలలోకి పాఠకులనే కదా లాగాలి) వేసి, ఆ కాసేపు మన మెదడుకు పూర్తి పనిచ్చి మరీ వదులుతాయి కాబట్టి. మరి ఈ సినెమాలో నాకు నచ్చింది కూడా అలాంటి పనే, అయితే తెర మీద.

కహానీ లో వున్నంత లోతు లేకపోయినా సినెమేటిక్ గా ఇది నాకు నచ్చింది. సగం సినెమా వొక గదిలో అమితాబ్, తాపసీలు యెదురెదురు కూర్చుని మాట్లాడుకోవడం వుంటుంది. తప్పని సరి అయినప్పుడు కథా చిత్రణకోసం కెమెరా ఆయా సంఘటనలకోసం బయటకు వెళ్తుంది. మామూలుగానైతే అన్ని సంభాషణలు, ఇద్దరు పాత్రలూ, వొకే గది అంటే విసుగు పుట్టే ప్రమాదం వుంది. కాని ఇందులో మనకు ఉత్కంఠ తప్ప మరొకటి వుండదు. సినెమాని ఆ విధంగా తీయడానికి వున్న ఆంతర్యం కూడా చివరికి తెలుస్తుంది. అమితాబ్ బాగా నటించాడు అని ఇప్పుడు వెయ్యినొక్క సారి చెప్పాలా? అయితే చాలా తెలివిగా అతని పాత్రలోని వివిధ షేడ్స్ అతను వేసే యెత్తులప్పుడు చూసి మెచ్చుకోకుండా వుండలేము. తాపసీ చాలా చక్కగా చేసింది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అమృతా సింఘ్ నటన. ఆమె ఈ మధ్య తక్కువ సినెమాలే చేస్తున్నా గుర్తుండిపోయే సినెమాలే చేస్తున్నది, “కల్‌యుగ్”, “టూ స్టేట్స్” లాంటివి.

ఆవిక్ ముఖోపాధ్యాయ చాయాగ్రహణం చాలా బాగుంది. ఇతని ఈ మధ్య వచ్చిన అక్టోబర్ గాని, పింక్ గాని చూసినవారికి కొత్తగా చెప్పనక్కరలేదు. అందులో గ్లాస్గో లోని అందాలు చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇక వొకానొక కథ: కారులో పొద్దువాలే సమయానికి హోటెల్ నుంచి బయలు దేరిన నైనా, అర్జున్లు ఆ అడవుదారులంట వెళ్ళటం, ప్రమాదం జరగడం నుంచి “ఆ” ఘటన వరకూ గమనిస్తే సహజమైన లైటింగులో సరిగ్గా ఆ సమయానికి సరిపోయేలా చిత్రించాడు, క్రమంగా చీకటి పడటం వరకూ. దర్శకుడు, డీఓపి ఇద్దరూ శ్రధ్ధపెట్టి చేసిన సీక్వెన్సది. ఇక నేపథ్య సంగీతానికి వస్తే మనకు వొకరకమైన లౌడ్, భయపెట్టే నేపథ్య సంగీతం మనకు ఇలాంటి చిత్రాలలో అలవాటు. దాన్ని పూర్తిగా పక్కకు పెట్టి మనం దృశ్యంలో చాలా సహజంగా ప్రవేశించేలా వుంది అమాల్ మలిక్, అనుపం రాయ్, క్లింటన్ క్రెజో ల సంగీతం. మనకు బోనస్ గా అమితాబ్ పాడిన వో రాప్ కూడా వుంది. ఈ వయసులో అమితాబ్ ఇన్నిన్ని పనులు కొత్తగా చేయడం మెచ్చుకోవాల్సిందే. సస్పెన్స్ చిత్రాలను ఇష్టపడే వాళ్ళను ఇది నిరాశ పరచదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here