బహుళ పంచమి జ్యోత్స్న

13
5

[dropcap]డా[/dropcap]మిట్.. వీడెప్పుడూ ఇంతే…! ఒక్క రోజు సెలవు అడిగితే చాలు, వాడి జీవితంలోంచి ఓరోజు మనకోసం ఖర్చు పెట్టేస్తున్నట్టుగా ముఖం పెడతాడు. వాడి తాతగారి ముల్లెదో తరిగిపోతున్నట్టు మెలికలు తిరిగి పోతాడు. పినాసి పీనుగ..! – అని గొణుక్కుంటూ తన సీటు దగ్గర్నుంచి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ చర చర.. బయటకు నడిచి వెళ్ళిపోయాడు సుందరం.

ఆ వెళ్లడం వెళ్లడం ‘చిన్ని’ బడ్డీ కొట్టు దగ్గరకు వెళ్ళాడు. యథావిధిగా చేయి చాచాడు, సిగరెట్టొకటి చేతికి అందింది. బడ్డీ కొట్టు పక్కన, వేలాడదీయబడిన కాలుతున్న కొబ్బరి తాడుతో సిగరెట్ ముట్టించాడు. గట్టిగ దమ్మొకటి లాగి పొగ బయటికి విడిచాడు. బుర్ర ఆలోచనల్లో తలమునకలయింది.

ఆ ఆఫీసులో పనిచేసే అందరికీ ‘చిన్ని’ కొట్టు, ఒక పెద్ద చర్చా వేదిక. ఈ వేతన సంఘం ఎంత లాభసాటిగా ఉంటుందో! ఈసారైనా ప్రభుత్వం పార్లమెంటులో ఆడవాళ్ళ ముప్పైమూడు శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెడుతుందో లేదో..!? పెట్రోలు ధరలు – ఇంకా ఎంత అందకుండా పోతాయో.. పప్పు, ఉప్పు, ధరలు ఇప్పటికే చుక్కలు చూపిస్తున్నాయి, చుట్టూరా అపార్టుమెంట్లు కుక్క గొడుగుల్లా పెరిగి పోతున్నాయి. సామాన్యుడి జీవితం కష్టమే భవిష్యత్తులో… ఇలా, పల్లె రాజకీయాల నుంచి పట్టణ, ప్రపంచ రాజకీయాలన్నీ చర్చకు వస్తాయక్కడ.

‘చిన్ని’ బడ్డీ కొట్టుకు ఎదురుగా వున్న ఊడల మర్రి, వాళ్లకు చల్లని నీడను ఇస్తుంది. చెట్టు కింద వున్న వాహనాలు అక్కడికి వచ్చినవారు కూర్చోడానికి చక్కని వసతి కల్పిస్తాయి. చిన్ని సిగరెట్లను, ఆరగా… ఆరగా.. టీ-నీళ్లను అందిస్తూ అప్పుడప్పుడు చర్చలో కూడా మాట సాయం చేస్తుంటుంది! సిగరెట్టును రెండు వేళ్ళ మధ్యన బంధించి, అదే పనిగా సిగరెట్ దమ్ము లాగుతూ ఆలోచనలలో మునిగితేలుతున్న సుందరం వైపు ఓ సారి నఖ, శిఖ పర్యంతం చూసి –

“అవున్రా సుందర వదన.. ఇంతకీ ఈ చిందులు, శివాలు, ఎవరిమీదనో.. చెప్పనే లేదు..” అన్నాడు తన వెంట ఆఫీసు నుంచి బయటికి వచ్చిన సుందరం సహోద్యోగి గోపాలం.

”ఇంకెవడూ.. వాడే, ఆ బట్టనెత్తి వెధవ. మనం ఒక్క రోజు సెలవు అడిగితే చాలు ఏదో ప్రపంచం తలకిందులైపోతున్నట్టు గిజ గిజ తన్నుకుంటాడు. మరి.. వాడో..! పెళ్ళానికి తలనొప్పి వస్తే చాలు… సెలవు, పిల్లాడి ముక్కునుంచి కాసిన్ని నీళ్లు కారితే సెలవు, వాడికున్న అవసరాలు మనకుండవా..!? మన అవసరాలు వాడి అవసరాల్లాంటివి కాదా! శాడిస్టు వెధవ. వాడి సెలవులు వాడిని వాడుకొమ్మను, వాడి సెలవులు మన కోసమేమైనా అడిగామా ఎప్పుడైనా?మన సెలవులు మన కివ్వడానికి ఎందుకంత బాధ, నీలుగుడూను!” ఆఫీసులో కూర్చున్న ఆఫీసర్‌కు వినిపిస్తదా.. అన్నంత బిగ్గరగా, ఆవేశంగా అన్నాడు సుందరం.

“నాయనా.. సుందర వదనా – సుందరం, వారు ఈ ఆఫీసుకు అధికారి, మనం, వారికింద పనిచేసే సేవకులం. వారు మనల్ని ప్రశ్నించనూ వచ్చు, మనం వారికి సమాధానం చెప్పనూ వచ్చు. ఇది మనకేమైనా కొత్తా … చెప్పు! పద.. పద.. మనం ఇంకా కొంచెంసేపు ఇక్కడే.. ఇలాగే ఉంటే, ‘ఆఫీసరు గారు, మిమ్మల్ని పిలుస్తున్నారు సార్..’ అని దీర్ఘాలు తీస్తూ, ఎడం కాలు ఎగరేసుకుంటూ వస్తాడు అటెండర్ కనకారావు” అని సుందరాన్ని బయలుదేరదీస్తూ, ఆఫీసు వైపు దారి తీసాడు గోపాలం.

అందరి అవసరం ఒక్కటే! సెలవు మనది, మన ఇష్టం వచ్చినట్టు మనం అనుభవిస్తాం. ఆఫీసరైనంత మాత్రాన మన హక్కుల్ని హరించే అధికారం వాడికెవడిచ్చాడంట… అని లోపల్లోపల గొణుక్కుంటూ గోపాలాన్ని అనుసరించాడు సుందరం.

సుందరం ఒట్టి భోళా మనిషి. అతని కోపం వట్టి తాటాకుల మంట లాంటిది. ఒక్కసారి రివ్వున పైకి లేచి, అంత వేగంగానూ చతికిలబడిపోతుంది. ‘నువ్ వేసుకున్న చొక్కా నీకు ఎంతో బాగా నప్పిందోయ్ సుందరం’ అంటే చాలు, పట్టరాని ఆనందంతో పల్టీలు కొట్టేస్తాడు. అంతెందుకు “ఒరేయ్ సుందరం నీ పదహారో ప్రేమ ప్రహసనం మాటేమిటి!?” అంటే చాలు తారా జువ్వలాతాడెత్తు పైకి లేచిపోతాడు. క్షణంలో తలో కప్పు కాఫీ చేతిలోకి వచ్చేస్తుంది

అసహనంగానే ఆఫీసుఫైళ్లు తిప్పుతున్న సుందరానికి “మీకు ఉత్తరం సార్..” అని, ఒక గావుకేకలాంటి పలకరింపుతో ఉత్తరం టేబుల్ మీదకు విసిరేసి వెళ్ళిపోయాడు, అటెండర్ కనకారావు. కవరు మీద అక్షరాలు గుండ్రంగా, అందంగా, ముత్యాల్లా, ముచ్చటగా ముద్దు గొలుపుతున్నాయి. అయితే, పూర్తిగా అపరిచితమైన దస్తూరి! తొందరగా కవరు తెరవలేక, గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. కవరును ఎడా.. పెడా, తిరగేసి పరీక్షగా చూసి టేబుల్ మీద వున్న కత్తెరతో, ఒక కొసను జాగ్రత్తగా కత్తిరించి, కవరు తెరిచాడు. క్రింద పడితే దోసిట ఎత్తుకునే ముత్యాల్లా, ఎంతో పొందికగా, ముచ్చటగా వున్నాయి అందులోని అక్షరాల కూర్పు! పరిశీలనగా, ఉత్తరం మీద దృష్టి సారించాడు సుందరం.

‘నమస్కారం,

నేను ఎవర్నో ఈపాటికి పూర్తిగా మరచిపోయి వుంటారు మీరు! నా రూపం ఎటూ లీలగానైనా మీకు గుర్తుంటుందనే నమ్మకం నాకైతే లేదు. నేనలా వూహించడమూ లేదు! అయితే, మా నాన్న మాత్రం, మీ  గురించి, మీ దగ్గర నుంచి వచ్చే ఉత్తరం గురించి, అనుక్షణం ఎదురు తెన్నులు చూస్తూనే వున్నాడు. కనీసం ఒక్క ఉత్తరానికైనా, బదులు రాకుండా ఉంటుందా… అని కాయలు కాసినకళ్ళతో అనుక్షణం నిరీక్షిస్తూనే వున్నారు.

పిచ్చి నాన్న..! పోస్ట్‌మాన్‌ను రోజు విసిగిస్తూనే వున్నారు. నాన్న కనపడగానే, అతను – ‘మీకీ రోజు ఉత్తరాలేమీ రాలేదు’ అని, ఒక పిచ్చి నవ్వు విసిరేసి, కళ్ళతోనే అవసరమైన దానికంటే ఎక్కువ సమాచారాన్ని అందజేయడానికి అలవాటు పడిపోయాడు. ఇప్పటికైనా, నేనెవరో మీకు గుర్తొచ్చి ఉంటుందని ఊహించవచ్చా!?

నా పేరు జ్యోత్స్న. సరిగ్గా ఒక నెలరోజుల క్రితం పెళ్లిచూపుల తతంగంలో, మీరు నన్ను చూసారు.”

…ఉత్తరం చదువుతున్న సుందరానికి గుండె గొంతు దగ్గరైంది. శరీరం లోని నెత్తురు శరవేగంతో ఎగబాకడం మొదలైంది. కొత్త ఊపిరి.. కొత్త ఉత్సాహం శరీరంలోని ఆణువణువూ పరవళ్లు తొక్కింది. ఏదో తెలీని ఆనందం అతడ్ని ఉన్మత్తుడ్ని చేసి ఊగించసాగింది. తెలియని భయాందోళనలతో కాళ్ళు వణకడం మొదలు పెట్టాయి. తన కలల పంటను ఎవరో తన్నుకు పోతున్నట్టు, జేజిక్కిన స్వర్గం చేజారి పోతున్నట్టు మనసు కలవర పడపడసాగింది. కళ్ళు బైర్లు కమ్మడం మొదలెట్టాయి. ఉత్తరం చదవడం ఆపి, మడిచి జేబులో పెట్టుకున్నాడు.

ఒక్కసారి తలెత్తి ఆఫీసరు వైపు చూసాడు. తలవంచుకుని ఆఫీసు ఫైళ్లలో మునిగి తేలుతున్నాడాయన. నూనె రాసిన ఆయన నున్నటి గుండు ట్యూబ్ లైట్ కాంతిలో తళ తళ మెరుస్తోంది. ఎదుగు బొదుగూ లేని ఉద్యోగం చెయ్యలేక, ఒక పట్టాన వదలలేక, తన్ను తానే తిట్టుకుంటూ పని చేసుకుపోయే ప్రభుత్వోద్యోగిలా, కీళ్లు సడలి, నరాలు పట్టు తప్పి, కండరాలు వదులై, కరకర శబ్దం చేస్తూ, ఊగిసలాడుడూ, తన చుట్టూ తానే తిరుగుతూ తన నీడను తానే ఆఫీసరు నెత్తిన చూకుంటూ, తిరుగుతోంది సీలింగ్ ఫ్యాన్. తన్ను తాను తగలేసుకుంటూ పొగలు, సెగలు కక్కుతోంది ఆఫీసరు చేతివేళ్ల మధ్య ఇరుక్కుపోయిన సిగరెట్టు. ఆఫీసరు సీటు వెనక గోడపైన మేకుకు ఉరేసుకుని వ్రేలాడుతోంది ‘నో స్మోకింగ్’ బోర్డు!

ఆఫీస్ అంతా ఒక్కసారి కలయజూశాడు సుందరం. టైపు మిషన్‌లో కాగితాలు ఎక్కించి ‘ఇప్పటికిది ముగించడం ఆవశ్యం…!’ అన్నంత సీరియస్‌గా, పత్రిక చదివేస్తోంది టైపిస్టు సుశీల. ఏవో కాగితాలు తెచ్చి సుశీల దగ్గర సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు కనకారావు..

సుందరం కళ్ళలో నిండుగా నిలబడింది జ్యోత్స్న. ఆమెను చూసి అప్పుడే నెలరోజులు అయిపొయింది.

అందాల భరిణె, సన్నగ, నాజుగ్గ, సాదా సీదాగా వుండి, తీర్చిదిద్దినట్టు కొనదేలిన ముక్కు, అప్పుడే విచ్చుకుంటున్న మందారంలా గుండ్రటి బుల్లిమూతి, నవ్వినప్పుడు బుగ్గలమీద దోగాడే చిన్నసుడి, దిగంతాలను వెలిగించబోయే, బాలభానుడిలా నుదుట తీర్చి దిద్దిన కుంకుమ బొట్టు, గంజి పెట్టి ఇస్త్రీ చేసిన కాటన్ చీరలో నిజంగా, జ్యోత్స్న – బహుళ పంచమి జ్యోత్స్ననే !

పెళ్ళిచూపుల తతంగం ముగిశాక – “ఏ విషయం మా వాడిని కనుక్కుని త్వరలోనే మీకు ఉత్తరం వ్రాస్తాము. మాకైతే అమ్మాయి సలక్షణంగా వుంది, మాకు నచ్చింది. అయితే, నచ్చాల్సింది మాకు కాదు కదా! ఏ పొరపొచ్చాలూ లేకుండా, పది కాలాల పాటు కలసి మెలసి కాపురం చేయాలిసింది వాళ్ళిద్దరూనూ.

అలాగే, మీ అమ్మాయికి మా వాడు నచ్చాడో లేదో ఈ లోపు మీరు నెమ్మదిగా అమ్మాయిని కూడా కనుక్కోండి. మా వాడి అభిప్రాయం తెలుసుకుని త్వరలోనే మీకు ఏ సంగతీ తెలియ జేస్తాము.” అంటూ చెప్పుల్లో కాళ్ళు పెట్టేసారు యథాప్రకారంగానే, సుందరం తల్లిదండ్రులు.

సుందరానికి జ్యోత్స్న ఎంతగానో నచ్చింది. కానీ – ‘నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది నాన్నా, నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను…’ అని చెప్పే ధైర్యం మాత్రం సుందరంలో మచ్చుకైనా కనపడదు. ఒకవేళ ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని నోరు విప్పి ఆ ముక్క అన్నా – “ఏడ్చావు లేవోయ్, పెళ్లి కూతురు నచ్చాలిసింది మాకు, నీకు కాదు! ఎర్రగా బుర్రగా ఉంటే, ఎంచక్కా వెంటేసుకు తిరగొచ్చు.. అనుకుంటున్నావేమో, ఆ పప్పులేమీ ఉడకవు. అందుకనే, వెర్రి నాగన్నా – బుద్దిగా మేము చెప్పిన మాట విను., బాగుపడతావు. మేము సరేనన్న అమ్మాయి మెడలో ఆ మూడు ముళ్ళూ వెయ్యి. అంతేగానీ, వెర్రి మొర్రి ఆలోచనలు మాత్రం పెటుకోమాకు. తేరగా… ఎవరు బడితే వాళ్ళ చేతిలో పెట్టడానికేనా నిన్నింత గారాబంగా పెంచి, పెద్ద చేసి, పెద్ద చదువులు చదివించింది! పిల్ల అందంగా ఉంటే చాలదు సుమా, పిల్ల అరచేతిలో ధన రేఖ కొట్టొచ్చినట్టుగా కనపడాలి. అందుకని, పిచ్చికన్నా – అనవసరంగా కలల్లో తేలిపోకు. నీకెలాంటి భార్య కావాలో మాకు తెలుసు! చెప్పిన మాట బుద్దిగా విను.’ అంటూ ఓ చిన్న క్లాసు పీకడం, రాముడు మంచి బాలుడు అన్నట్టు తల దించుకుని, గంగిరెద్దులా తలాడించడం -సుందరం గత చరిత్రలో మరచిపోలేని ఘట్టాలు ఎన్నెన్నో… వాటి లాంటిదే ఇదీనూ! అసలింత వరకు పెళ్లికూతురు తండ్రి దగ్గర్నుంచి వచ్చిన ఉత్తరాల బోగట్టనే తెలీదు నిజానికి – సుందరం, పేరంత సుందరంగా లేకపోయినా, కాకి పిల్ల కాకికి ముద్దు కదా! అందుచేత, తల్లిదండ్రుల దృష్టిలో తానో నవ మన్మథుడు! పైగా తాను చేస్తున్నది ప్రభుత్వోద్యోగం కూడా! ఉద్యోగం ఏదైనా కావచ్చు, అది వేరే విషయం! మగవాడి జీతం గురించి అడక్కూడదు కదా! ఈ దేశంలో ఆడపిల్లలకు కొదవేముంది గనక. చదువు – సంస్కారం వున్నా లేకపోయినా, బోల్డంత కట్నం పోసి కూతురికి మొగుణ్ణి కొనుక్కోవడానికి ఎందరో.. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడూ బారులు తీరే వుంటారు.

సుందరానికి తెలుసు, జ్యోత్స్న తనకు కాకి ముక్కుకు దొండ పండేనని. అన్ని అర్హతలు వున్న జ్యోత్స్నని తనకు జీవిత భాగస్వామిగా వూహించుకోడం, తనకెంతో ఆనందాన్నిచ్చింది. పెళ్లి చూపులలో ఆమె చూపిన ధైర్యానికి, చొరవకు ఎంతగానో సంతోషించాడు సుందరం. ఎంతమంది ఆడపిల్లలు అలా తెగువ చూపగలరు! పెళ్లి పేరుతో డబ్బులు గుంజే మగాళ్ళంటే తనకు అసహ్యం అంది. అలాంటి వాళ్ళను మనసు చంపుకుని ససేమిరా పెళ్లి చేసుకోనని కరాఖండీగా చెప్పేసింది. పెళ్లికొడుకుతో వంటరిగా మాట్లాడాలన్నప్పుడు తన తల్లిదండ్రుల ముఖారవిందాల్లో మిస్సైన జీవకళను మరీ మరీ గుర్తు చేసుకున్నాడు సుందరం.

జ్యోత్స తనకంటే ఎన్నో రెట్లు మేలని మనసులో పదే పదే అనుకున్నాడు సుందరం. తన ఆశలు అడియాశలు కాకూడదని గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చి, మళ్ళీ ఆ… ఉత్తరం తీసి చదవడం మొదలు పెట్టాడు సుందరం.

“…. నాకు తెలుసు, పెళ్లి కూతురు నచ్చినా, పేదరికాన్ని మెచ్చలేరని! మా నాన్న-పాపం… ఆడపిల్లను కన్న పాపానికి ఈ సారైనా తన కూతురు ఒక ఇంటిదవుతుందని ఆశగా అనుక్షణం మీ సమాధానం కోసం ఎదురు చూస్తూనే వున్నారు. నిజం చెప్పాలంటే – అసలు వాళ్ళ తృప్తి కోసమే నాకు ఇష్టం వున్నా లేకున్నా, మనసు చంపుకుని ప్రతిసారీ పెళ్లి కూతురు వేషం వేసుకుని నలుగురి ముందు కూర్చోవడం.

చూడండీ… ప్రతి మనిషికి తనవైనకొన్ని విలువలంటూ ఉండాలి. కేవలం డబ్బు తోనే జీవితం పెనవేసుకు ఉండాలనుకోవడం అన్యాయం! ఏమిటీ.. ఈ అమ్మాయి, ఇలా నిలదీస్తుంది… అనుకుంటున్నారా..!? చాలీ చాలని కట్నంతో, అత్తింటిలో అడుగు పెట్టి, అత్తమామల ఆరళ్లకు, ఆడపడుచులు దెప్పుళ్ళకు, తల దించుకుపోయే సాహసం నాకు లేదు. నెత్తినింత కిరోసిన్ పోసుకుని నన్ను నేను తగలేసుకునేంత ధైర్యమూ నాకు లేదు!

నా మీద ఎక్కుపెట్టిన ప్రతి బాణానికీ అంతకంటే ఎక్కువ ధాటిగా, సమాధానం, ఇవ్వగల ధైర్యం అయితే నాకుంది. ఎందుకైనా మంచిది ఉభయ తారకంగా ఉండేలా.. ‘..మీ సంబంధం మాకు నచ్చలేద’ని, ఓ ఉత్తరం ముక్క రాసిపడేయండి. మాకైతే ఇది కొత్తేమీ కాదు! బాధగా ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ మామూలైపోతారు మా వాళ్ళు…”

ఇక ఉత్తరం పూర్తి చెయ్యడం తనవల్ల కాలేదు సుందరానికి. నెత్తిన పిడుగు పడ్డట్టింది అతనికి. ఉత్తరం మడిచి జేబులో పెట్టుకున్నాడు. తక్షణం టేబుల్ సొరుగు తెరిచాడు. ఒక తెల్ల కాగితం తీసి, బర బర.. నాలుగు అక్షరాలు గీకి లేచి నిల్చున్నాడు. చర.. చర.. ముందుకు సాగి ఆ కాగితం ఆఫీసరు బల్లమీద ఉంచాడు. ఆఫీసరు సన్నాయి నొక్కుల కోసం ఎదురు చూడకుండా గబ గబ అడుగులేసుకుంటూ బయటకు నడిచాడు సుందరం. చిన్ని బట్టీ కొట్టు ముందున్న మర్రి చెట్టుకింద స్వారీకి సిద్ధంగా వున్న గుర్రంలా ఎదురు చూస్తుందతని బండి.

క్షణం జంకు, క్షణం వెరపు, మనసులో ఏదో తర్జన భర్జన. అవునూ – ఇంతకీ, జ్యోత్స్న అంటే తనెందుకంత ఇష్టపడుతున్నాడు.. కట్నం ఇచ్చి మొగున్ని కొనుక్కోలేని ఆడ కూతురని జాలా..! హక్కులు, బాధ్యతలు తెలిసిన స్త్రీ అని అభిమానమా..! సమాజంలో జరుగుతున్న అరాచకాలను కడిగి ఆరేసే ధైర్యం గల ఆడపిల్లని ప్రేమా..! వీటన్నింటికీ మించి అందంగా ఉంటుందని వ్యామోహమా..! .. ఉహు.. అదేదీ కానే కాదు.

ధీటైన ఆమె వ్యక్తిత్వం. అచంచలమైన మనఃస్తత్వం. ఆమెలో కొలువై వున్న సహనశీలత, సహృదయత. అన్నింటికీ మించి పది కాలాల పాటు కలిసి నడవగల స్నేహభావం.

అందుకే – జ్యోత్స అంటే తనకి అంత ఇష్టం. అందుకే ఆమంటే తగని ప్రేమ తనకు. అందుకే, ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనే తపన. సుందరం ఆలోచనలకు ఆనకట్ట పడింది, బండి క్లచ్ మీద కాలు పడింది, అంతే… ‘రయ్’.. మని శబ్దం చేస్తూ, తన మార్గాన్ని నిర్దేశించుకుంటూ పరుగు లంకించుకుంది అందమైన సుందరం – ‘ఇండ్ సుజుకీ’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here