బహుమతి పొందిన కథల విశ్లేషణ-1

0
12

[వివిధ పత్రికలు/సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి పొందిన కథలను సంక్షిప్తంగా విశ్లేషిస్తున్నారు వసుంధర.]

[dropcap]క[/dropcap]థలంటే ఉపేక్ష ఉన్నవారికి కూడా బహుమతి కథలంటే ఆపేక్ష ఉండడంవల్లనేమో – చదివిన వెంటనే అభిప్రాయమడిగితే నిరాశతో కూడిన నిట్టూర్పు సాధారణం. నోటిమాటకు అక్షరరూప మిచ్చినప్పుడే విమర్శకు సార్థకమూ, విలువా. ఐతే ఇక్కడ వెలిబుచ్చే అభిప్రాయాలు మా అభిరుచికి మాత్రమే పరిమితమనీ, ఆయా కథలపై తీర్పు కాదనీ పాఠకులకు మనవి.

~

సాహితీకిరణం మాసపత్రిక మార్చి 2018

దిద్దుబాటు – జన్నాభట్ల నరసింహప్రసాద్

కలవారి కాలనీలో ఉంటున్న మంజుల కారు డ్రైవరు భార్య. భర్త ఊళ్లో లేనప్పుడు కొడుక్కి జబ్బు చేస్తే ఇరుగు పొరుగుల్లో ఎవరూ ఆదుకోలేదు. ఆటో డ్రైవరు రజాక్ ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లడమే కాక దగ్గర్లో ఉన్న తనింట్లో ఆశ్రయమిచ్చాడు. భర్త తిరిగొచ్చేక పేదలుండే రజాక్ కాలనీకి మారిపోదామంటుంది మంజుల. ముట్టూరి కమలమ్మ స్మారక దీపావళి కథల పోటీ-2017లో బహుమతి పొందిన ఈ కథ ఆరంభంలో రచయిత భావుకతని సూచించగలదు. కథాంశం కొత్తది కాకపోయినా, కథనంతో కొత్తదనాన్ని ఆపాదించే ప్రయత్నం చేసి ఉండాలనిపించింది.

రంగుల కల – కావేరిపాకం రవిశేఖర్

సినీరంగంలో డాన్స్ మాస్టరుగా ఓ వెలుగు వెలిగిన రహీం, తర్వాత మక్కా వెళ్లడానికి డబ్బు అడుక్కునే స్థితికి దిగజారిపోయాడు. ఎలాగో ప్రయాణం సానుకూలమైతే – వెళ్లేలోగానే కన్ను మూయడం కథాంశం. విడదల నీహారిక ఫౌండేషన్ కథల పోటీ-2018లో మూడవ బహుమతి పొందిన ఈ కథలో సినీ ప్రపంచపు తీరుతెన్నులతోపాటు, కొన్ని ఛలోక్తులు ఉన్నా, అవి రచయిత ప్రతిభకి సూచనలే తప్ప – కథను విశిష్టం చెయ్యలేవు.

ఏది పుణ్యం? – తిరుమలశ్రీ

పాలని రుద్రాభిషేకంవంటి దైవకార్యాలకి కాక, అవసరంలో ఉన్న పేదవారికిచ్చి ఆదుకోమన్న ప్రబోధం కథాంశం. వి.బి. రాజు ఫౌండేషన్ ‘బాలకథామంజరి’ బాలల కథల పోటీలో ప్రథమ బహుమతి నందుకున్న ఈ కథలోని సందేశం పాతదైనా గొప్పది. కథకి తగిన చమత్కారం. కొత్తదనం సమకూడితే బాగుండేది.

ఉపాధ్యాయ – ఫిబ్రవరి 2018

అగ్నిస్వరాలు – సి.వి.ఎన్. ప్రసాద్

ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ దారుణానికి ఒక రచయిత ఎలా స్పందించాలో, ఎంత ఆవేశపడాలో – అంత స్పందననూ, ఆవేశాన్నీ వెలిగ్రక్కిన ‘అగ్నిస్వరాలు’ ఈ విశిష్ట కథ. 2017 ఉపాధ్యాయ కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన ఈ కథలో – ఆడవాళ్లకి అరిటాకు-ముల్లు సామెత చెప్పడానికి ఉత్సాహపడేవారిని – ‘ముల్లు మృదువుగా మారొచ్చుగా’ అని ఈసడించే చాతుర్యం కథనమంతా ఇమడ్చడం అరుదైన ప్రతిభ. ముగింపు వాక్యంలోనూ అలాంటి విసురుంటే ఇంకా బాగుండేదేమో!

ఉపాధ్యాయ – ఏప్రిల్ 2018

కూలుతున్న గుట్టలు – సి.హెచ్.వి. బృందావనరావు

ఒకప్పుడు కులవృత్తులు రాణిస్తుండగా, సుభిక్షంగా ఉండే పల్లెలు నేడు మ్రోడువోవడం కథాంశం. పల్లె వాతావరణం, కుందలు చేసే విధానం చక్కగా వివరించిన ఈ కథ 2017 ఉపాధ్యాయ కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందింది. ముగింపుతో కదిలించిన కథనంలో – ఆసక్తికరమైన కొత్త సన్నివేశాలుంటే ఇంకా బాగుండేది.

ఈ తరం – నాయని  సుజనాదేవి

చదువులో పిల్లల ప్రతిభను పరస్పరం పోల్చి చిన్నబుచ్చే నేటి సంస్కృతికి నిరసన కథాంశం. 2017 ఉపాధ్యాయ కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన ఈకథలో సందేశం పాతదే ఐనా అవసరమైనది. కథగా మలిచినప్పుడు సన్నివేశాలు కొత్తవి ఉంటే బాగుండేది.

ఉపాధ్యాయ – ఏప్రిల్ 2019

కెజి టు పిజి అను ప్రయివేటు భాగోతం – యం. యాదగిరిరెడ్డి

ప్రభుత్వపు బడులలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టకుండా, ప్రయివేటు బడులు రాజకీయం చేసిన రాజకీయం కథాంశం. 2018 ఉపాధ్యాయ కథల పోటీల్లో మూడవ బహుమతి పొందిన ఈ కథలో ప్రభుత్వ బదులకు ప్రోత్సాహం లభించాలన్న సందేశం అవశ్యం. ఎటొచ్చీ జరుగుతున్న విశేషాల్ని వార్తలా వినిపించిన కథనం, మాతృభాషలో బోధన అంశాన్ని ప్రస్తావించకపోవడం చదువరికి కొంత అసంతృప్తిని కలిగిస్తాయి.

ఉపాధ్యాయ – మార్చి 2019

రెడ్ ఫైల్ – కుంతి

విద్యార్థుల్లో క్రమశిక్షణా రాహిత్యాన్ని అవగాహనతో సరి చేయాలన్న ఆదర్శాన్ని ప్రబోధించిన ఈ రచన 2018 ఉపాధ్యాయ కథల పోటీల్లో రెండవ బహుమతి పొందింది. సన్నివేశాలు ఊహల్లోనే సాధ్యం అనిపించినా దృక్పథం అభినందనీయం. కథకి సంబంధించి రెడ్ ఫైల్ అన్న పేరొక్కటే కొంచెం చమత్కారాన్ని అందించింది.

రమ్యభారతి – నవంబర్ 2017- జనవరి 2018

10వ సోమేపల్లి పురస్కార కథల పోటీ

ప్రథమ పురస్కారం పొందిన ‘నిమజ్జనం’ – విగ్రహాల నిమజ్జనమే జీవనాధారం చేసుకున్న బొట్టియ్య కథ. కథాంశం, వాతావరణం కొత్తగా ఉన్నాయి. ముగింపు నాటకీయంగా ఉన్నా కంట తడి పెట్టిస్తుంది. రచయిత వడలి రాధాకృష్ణ.

ఈ పోటీలో ద్వితీయ పురస్కారం పొందిన ‘బిచ్చగాడు’ (రచన: జి.ఎస్.కె. సాయిబాబా) రచనలో సెంటిమెంటుకి లభించిన ప్రాధాన్యం కథను పక్కకు నెట్టేసింది. హృద్యమైన ఒకటి రెండు సన్నివేశాలు రచయిత కథన ప్రతిభకు సూచికలు

తృతీయ పురస్కారం పొందిన వార్డెన్ (రచన: శింగరాజు శ్రీనివాసరావు)– పిల్లలపై చదువుల భారాన్ని విశ్లేషిస్తూ, ఒక ఆదర్శ వార్డెన్ పాత్రని పరిచయం చేస్తుంది. సందేశం పాతదే కానీ, అవశ్యం. ఆదర్శం కూడా పాతదే కానీ కొందరికైనా ప్రేరణ కావచ్చు. సందేశం, ఆదర్శాల మాటున ఉండిపోవడంవల్ల – ఈ రచనలో కథ కనిపించదు.

ప్రోత్సాహక పురస్కారం పొందిన ‘సమీనా’ (రచన: జి. అనసూయ)- ట్రిపుల్ తలాక్ బాధితురాలి కథ. ఉద్వేగం మనసుల్ని కదిలించినా- అదే కథ కాకుండా ఉంటే బాగుండేది. మాండలీకం ఈ రచన్కు కొంత సొగసునివ్వడం గమనార్హం.

రమ్యభారతి – ఫిబ్రవరి-ఏప్రిల్ 018

10వ సోమేపల్లి పురస్కార కథల పోటీ

ప్రోత్సాహక పురస్కారం పొందిన మరో 4 కథలు.

ఒకరికొకరు తెలియకుండా మాదక ద్రవ్యాల వ్యాపారం చేసి పట్టుబడ్డ తండ్రీ కొడుకుల కథ ‘చీకటి దారిలో..’ (రచన: తాటికోల పద్మావతి). విదేశాల్లో ఉండొచ్చి మన దేశంలో సంస్కారానికీ, సామరస్య భావానికీ అబ్బురపడ్డ నేటి తరం కథ ‘జననీ జన్మభూమి’ (రచన: శివానీ). మధ్యతరగతి కుటుంబాల్లో వ్యక్తుల విభిన్న మనస్తత్వాల్ని ప్రదర్శించే ప్రయత్నం చేసిన ‘దేవుడు వరమిచ్చినా..’ (కోపూరి పుష్పాదేవి). తరానికీ తరానికీ మధ్య వారధి అవసరమన్న ‘వారధి’ (సి. యమున). కథాంశాలు పాతవైనా గొప్పవి. మొదటి మూడింటిలో సన్నివేశ సృజనకు ప్రయత్నం జరుగక కథలు పేలవమైతే, చివరి కథలో సన్నివేశ సృజన ఉన్నా – కథాంశానికి తగిన కథనం లేక పేలవమైంది.

రమ్యభారతి – ఆగస్ట్-అక్టోబర్ 2018

ఇందులో చలపాక వీరాచారి స్మారక పోస్ట్ కార్డ్ కథల పోటీలో వివిధ బహుమతులు పొందిన 11 కథలున్నాయి. మా ఉద్దేశ్యంలో కార్డు కథలంటే – అల్పాక్షరాల్లో అనల్పార్థాల్ని ఇముడ్చుకుని కొత్తగా, వింతగా, చమత్కారంగా, మనసుకి హత్తుకుని వెంటాడేలా ఉండాయి. ఇందులో కథలన్నీ – ప్రముఖుల ఉపన్యాసాల్లో రొటీన్‌గా చెప్పేవో, సీదా సాదా పిచ్చాపాటీలో రొటీన్‌గా దొర్లేవో అంశాలు – అదే స్థాయిలో ఉన్నాయి. నిర్వాహకులిచ్చిన ప్రోత్సాహం వారిలోని కథన ప్రతిభను మున్ముందు వెలికి తీసుకురాగలదని ఆశిద్దాం.

రమ్యభారతి – ఫిబ్రవరి-ఏప్రిల్ 2019

11వ సోమేపల్లి పురస్కార కథల పోటీ

ప్రథమ పురస్కారం

ప్లాస్టిక్ వాడకాన్ని నిరసిస్తూ, ప్లాస్టిక్ వాడకంపట్ల అవగాహన కలిగించే ఈ ‘సార్థకత’ కథ చెప్పింది ఓ ప్లాస్టిక్ కవరు. ఆ ప్లాస్టిక్ని నిరసించే ఓ మనిషిని ఆరాధిస్తూ, ఆ మనిషి ప్రాణాలు కాపాడ్డంలో తన ఉనికి సార్థకమైందని ఆ కవరు బావించడం కథాంశం. కొత్తదనం, కథనంలో నేర్పు – కథా రచయితగా కాయిలాడ రామ్మోహనరావుకి భవిష్యత్తుని ఆశాజనకం చేస్తాయి.

ద్వితీయ పురస్కారం

ఎన్నికల సమయంలో ఓటర్లనే కాక, ప్రచారానికి ఉపయోగించుకున్న సామాన్యుల్నీ తప్పుడు వాగ్దానాలతో దోపిడి చేసే నాయకుల తీరుని పాతసీసాలో పాతసారాగా ప్రదర్శించింది ‘పండగొచ్చింది’.

తృతీయ పురస్కారం

పరీక్షలో మార్కులకోసం దేవుడికి మొక్కడాన్ని నిరసించిన ‘దేవుడి మార్కులు’ కథ కావడానికి సందేశ ప్రధానమైనా –కథనంతో కథకూ కొంత న్యాయం చేకూరింది. వాస్తవదృక్పథం అలవడడానికి ముఖ్యంగా నేటి తరం విద్యార్థులు ఇలాంటి కథలు చదవడం అవసరం.

స్వాతి జనవరి 2019

వేయి పున్నములు (రచన: వెంకటమణి ఈశ్వర్)

తన నలుగురు కొడుకుల ఎదుగుదలకోసం ఎంతో చేసిన వెంకటప్పయ్యకు జీవితంలో ఒక్కటే కోరిక – వేయిపున్నముల పండుగ జరుపుకోవాలని. తలిదండ్రుల్ని ఆదరించడంలో వంతులు వేసుకోవడానికి అలవాటు పడ్డ ఆ నలుగురు కొడుకులూ – వెయ్యవ పున్నమినాడు కన్ను మూసిన తండ్రికి – అంత్యక్రియలు చెయ్యడానికి మాత్రం ఏ వంతులూ లేకుండా కలుస్తారు. కథాంశాన్ని వినూత్నంగా మలచి, కథనంతో హృద్యం చేసిన ఈ కథ – చదివేక పాఠకుల్ని వెన్నాడుతూంటుంది. రచయితకి అభివందనాలు.

నవ్య వీక్లీ- బి.వి. రమణరావు సంక్రాంతి పోటీలో బహుమతి పొందిన కథలు

విశాల (కన్నెగంటి అనసూయ) (నవ్య వీక్లీ ఫిబ్రవరి 7, 2018)

సుబ్బరామయ్య మనవరాలు ఏడు నెల్ల కడుపుతో ఉండి బుడమ అటుకులు తినాలని మనసు పడింది. తనింట్లో అంత శ్రమ పడి అటుకులు చేసేవారు లేక, మేనకోడలు విశాల ఇంటికెళ్లిన సుబ్బరామయ్య అడగడానికి మొహమాటపడి వెనక్కి వెళ్లిపోయాడు. తర్వాత విశాల ఆ అటుకుల్ని మూట కట్టి పట్నం పోయే బస్సు ద్వారా కూతురికి పంపమని భర్త రాఘవకిచ్చింది.  దారిలో మిత్రుడు చంద్రం ద్వారా సుబ్బరామయ్య అవసరం తెలుసుకుని అటుకుల మూటని వాళ్లకిచ్చేశాడు రాఘవ. తర్వాత ఆలోచిస్తే,  ‘వడ్లు నానబెట్టి, ఒకటికి రెండుసార్లు నీళ్లు పోసి కడిగి, ఎండలో ఆరబోసి, పొయ్యిమీద మంగళంలో వేయించి, రోట్లో పోసి దంచిన అటుకుల్ని జల్లించి, పొట్టంతా చేటతో చెరిగి తీసేసి, మరీ ఎండలో ఎండే దాకా ఉంచి చేసిన బుడమ అటుకులవి. ఆ కష్టమంతా కూతురి కోసం పడింది. ఆ కష్టమంతా ఎవరికో ఇచ్చేస్తే, ఎంత మంచి భార్యయినా ఏమనుకుంటుంది?’ అని మథనపడ్డాడు. కానీ, ‘ఇంటిదాకా వచ్చినోడు సల్లకొచ్చి ముంత దాచడమెందుకూ- పోన్లెండి, ఇచ్చి మంచి పని చేశారు. మళ్లీ నానబోస్తాను. ఎంతలో నానతాయి’  అన్న ఆమె స్పందన – ‘అప్పుడే పితికిన తెల్లని పాలతో చేసిన బుడం అటుకుల పాయసం తిన్నంత రుచిగా’ అనిపించింది రాఘవకి. ఈ కథలో – పాత్రచిత్రణ, పల్లె వాతావరణం, పల్లె పడికట్టు పదాలు, సన్నివేశాలు, సంభాషణలు, కల్మషం లేని మనసులు  – వేటికవే ప్రత్యేకం. కథాంశం, కథనం అద్భుతం. ఆ తరం మేటి రచనలకి సాటి కాగల ఈ తరం మేటి కథ ఇది. రచయిత్రికి అభివందనాలు.

మాంద్యం (తటవర్తి నాగేశ్వరి) (నవ్య వీక్లీ ఫిబ్రవరి 7, 2018)

అశ్వత్థామ, ఆదినారాయణ విలువలకి ప్రాధాన్యమిచ్చే మధ్యతరగతి మనుషులు. విలువల్ని పట్టించుకోకుండా ఆర్థికంగా మహోన్నత స్థాయికి చేరుకున్న బాపిరాజు వారికి బాల్యమిత్రుడు. ఈ మూడు పాత్రలతో ఆదర్శాల్ని ప్రబోధించే రొటీన్ కథ ఇది. కథనం బాగున్నా, సన్నివేశాల్లో సృజన లోపించడంవల్ల ఆసక్తికరంగా అనిపించదు.

అవ్యక్తానుబంధం (డా. యండమూరి సత్యకమలేంద్రనాథ్) (నవ్య వీక్లీ ఫిబ్రవరి 14, 2018)

తన కొడుకుని ఉత్తమంగా తీర్చి దిద్దలేకపోయిన ఉదయవర్లు అనే ఆదర్శ ఉపాధ్యాయుడికి – తన ప్రగతికి గురువే కారణమని నమ్మిన శిష్యుడు అంత్యక్రియలు జరపడం కథాంశం. పాఠకులకు ఏం చెప్పదల్చుకున్నారన్న సందేహాన్ని తీర్చకపోయినా, కొన్ని ఉన్నత వ్యక్తిత్వాల్ని సమర్థంగా ప్రదర్శించిన కథనం అభినందనీయం.

ఒక నది… రెండు తీరాలు (రామా చంద్రమౌళి) (నవ్య వీక్లీ ఫిబ్రవరి 14, 2018)

1948లో నిజాం పాలనపై – తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన ‘సంగం’ సంస్థలో సభ్యుడన్న అనుమానంతో మల్లన్న అనే సామాన్యుణ్ణి అధికారబలం నడివీధిలో క్రూరంగా హింసించి చంపడాన్ని ఒడలు జలదరించేలా వివరించింది మొదటి భాగం. 2017లో మల్లన్న మనవరాలు రేవతి – జన సంక్షేమమే లక్ష్యంగా, విభిన్న ఉత్పత్తులతో విజయపథంలో దూసుకుపోతున్న ‘సమూహ’ సంస్థకు సిఈఓగా ఎదగడాన్ని ఇది నిజమైతే ఎంత బాగుణ్ణు అనిపించేలా వివరించింది రెండవ భాగం. ఈ రెండు భాగాల్నీ కథా శీర్శిక సూచించినా కథనం సమన్వయించినట్లు అనిపించదు. కథలో ఇచ్చిన తేదీల ప్రకారం మే 16, 1999కే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి పేరిట న్యూస్ చానెల్ ఉన్నట్లు అనిపిస్తుంది. మాకు తెలిసి ఈ చానెల్ 2009 అక్టోబర్లో మొదలైంది. కథని చరిత్ర అనలేం కానీ, సమకాలీన అంశాల్ని ప్రస్తావించేటప్పుడు ఇలాంటి అంశాల్ని విస్మరించకూడదని స్వాభిప్రాయం.

నమ్మకం కూడా కలిగింది మాకు (మానస) (నవ్య వీక్లీ ఫిబ్రవరి 14, 2018)

అపార్టుమెంట్ కాంప్లెక్సులో వాచ్‌మన్‌గా పని చేసే సోమూ – తమ కుటుంబాల్లో అనుబంధాలకిచ్చే ప్రాముఖ్యతను గమనించేక – అతదికి ఉద్యోగమిచ్చిన కాంప్లెక్స్ సెక్రటరీకి – నేడు మధ్యతరగతిలో అనుబంధాలు మూలబడి జీవితాలు యాంత్రికమౌతున్నాయని స్ఫురించడం కథాంశం. ఇతివృత్తం కొత్తది కాకపోయినా ఆలోచనాత్మకం. అనుబంధాలకు సంబంధించిన విశ్లేషణ అతిగానూ, చర్వితచర్వణంగానూ అనిపించినా- సెక్రటరీ ఔదార్యం ఊహలోనే సాధ్యమని తోచినా – కథకంటే వ్యాస లక్షణాలే ఎక్కువగా కనిపించినా – చెప్పిన తీరు మాత్రం మెచ్చుకోతగ్గది.

మరణ (గంగా శ్రీనివాస్) (నవ్య వీక్లీ ఫిబ్రవరి 21, 2018)

నిరుద్యోగ సమస్య, అవినీతుల సమ్మేళనాన్ని – కొత్త సీసాలో పాతసారాగా అందించిన కథాంశం. పాత్రలు, సన్నివేశాలు గుర్తుండిపోయేలా నడిపించిన ఆసక్తికరమైన కథనానికి ఆహ్లాదకరం, సందేశాత్మకమైన ముగింపు.

ఆహ్వానం (జియోలక్ష్మణ్) (నవ్య వీక్లీ ఫిబ్రవరి 28, 2018)

పుత్రప్రేమతో పదేపదే మోసపోయిన ఓ తండ్రి బ్రతికుండగానే తనకు తాను కర్మ చేసుకుని, మరణానంతరం తన శరీరాన్ని ఆస్పత్రికి ఇచ్చేస్తున్నట్లు కాగితం వ్రాస్తాడు. రొటీన్ సన్నివేశాల్ని రొటీన్ కాని కథనంతో ప్రదర్శించిన ఈ విలక్షణ కథను ముగింపు విశిష్టం చేసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here