బహుమతి పొందిన కథల విశ్లేషణ-3

0
6

[వివిధ పత్రికలు/సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి పొందిన కథలను సంక్షిప్తంగా విశ్లేషిస్తున్నారు వసుంధర.]

కథలంటే ఉపేక్ష ఉన్నవారికి కూడా బహుమతి కథలంటే ఆపేక్ష ఉండడంవల్లనేమో – చదివిన వెంటనే అభిప్రాయమడిగితే నిరాశతో కూడిన నిట్టూర్పు సాధారణం. నోటిమాటకు అక్షరరూప మిచ్చినప్పుడే విమర్శకు సార్థకమూ, విలువా. ఐతే ఇక్కడ వెలిబుచ్చే అభిప్రాయాలు మా అభిరుచికి మాత్రమే పరిమితమనీ, ఆయా కథలపై తీర్పు కాదనీ పాఠకులకు మనవి.

~

మానస (మే 22, 2019)

రూపాంతరాలు: సుజాత పనిమనిషి లక్ష్మి కోసం, ఆమె మొగుడి కోసం ఆట్టే వాడని ఖరీదైన దుస్తులు ఇస్తూంటుంది. లక్ష్మి వాటిని స్వంతానికి వాడుకోదు. బయట అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో వాడకానికి చౌక దుస్తులు, వస్తువులు కొంటూంటుంది. అది తెలిసిన సుజాత భర్త దగ్గర వాపోతుంది. భర్త ఆమెకు చిన్నప్పుడు సిగరెట్ల పెట్టెలతో తను బచ్చాలాడి, వేణ్ణీళ్లకి చన్నీళ్లుగా ఎలా డబ్బు సంపాదించేవాడో చెప్పి ఆమెని సమాధానపర్చడం కథకి ముగింపు. ఇందులో పేదవారి అవసరాలకు సంబంధించి గొప్ప పరిశీలన ఉంది. పాతకాలం నాటి బచ్చా ఆటల వివరాలు సందర్భోచితంగా ఉన్నాయి. రెండు విశేషాల్నీ పోల్చడం బాగున్నా – వాటిని కథగా సమన్వయించే శిల్పం కథనంలో లోపించింది. ఐనా నవ్యత, పరిశీలన, అంతర్లీన సందేశం ఈ కథను విశిష్టం చేశాయి.

విరించి (మే 29, 2019)

మృత్యుర్నాస్తి: రామనాథం ఉద్యోగంలో పై సంపాదన వైపు మొగ్గు చూపని నిజాయితీపరుడు. ఎలాగో కష్టపడి కొడుకుని ఇంజనీరింగు చదివిస్తే, అతడు అమెరికాకి వెళ్లిపోయి ఇష్టమైన పిల్లను పెళ్లి చేసుకుని ఇటు చూడ్డం మానేశాడు. కూతురు సుజాతకి కలిగిన సంబంధమే చేస్తే, ఆమె మొగుడు వ్యసనపరుడు కావడంతో విడాకులు తీసుకుని ముప్పై లక్షల మనోవర్తి తీసుకుని ఇంటికొచ్చింది. భార్య పద్మావతికి ఒకసారి గుండెపోటు వచ్చి బ్రతికింది. రిటైర్మెంటుకి ముందు రామనాథానికి కాన్సర్ నాల్గవ స్టేజికి వచ్చింది. ఆయన వైద్యానికి డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంటే పద్మావతి తట్టుకోలేక పోయింది. ఆయన ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తోంది. ఆయనకింకా మూణ్ణెల్ల సర్వీసుంది కాబట్టి ఆయన ఉద్యోగం కూతురికి వస్తుందేమోనని అడుగుతుంటే – అటు ఆఫీసులోనూ, ఇటు ఇంటిదగ్గర కూతురూ ఆమెని అసహ్యించుకుంటున్నారు. పండుటాకులమైన తామెలాగూ రాలిపోక తప్పదనీ, ఇంకా ఎంతో జీవితమున్న కూతురికో దారి చూపాలనీ ఆమె తాపత్రయం. అది ఎదుటివారికి గయ్యాళితనంలా, భర్తపట్ల కృతఘ్నతలా కనిపిస్తోందని తెలిసినా ఆమె చిన్నబుచ్చుకోదు. మనోవ్యథతో ఆమె భర్తకంటే ముందే చనిపోవడం – కథకి ముగింపు. ఈ కథలో పాత్రలు సజీవాలు. సన్నివేశాలు వాస్తవాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ కోరుకోనిదైనా, ఇలాంటి ముగింపే సాధారణం కావడం ఎన్నో మధ్యతరగతి కుటుంబాల్లో చూస్తున్నాం. వాస్తవాన్ని యథాతథంగా చిత్రీకరించి, ముగింపుతో మనసు కలుక్కుమనిపించిన ఈ కథ విశిష్టమైనది. ఆ విశిష్టత కథలకే పరిమితం కావాలని కోరుకునే స్థాయికి మన వ్యవస్థ ఎదగాలని కోరుకుందాం.

నాయుని సుజనాదేవి (జూన్ 5, 2019)

అనుబంధం: అమెరికాలో ఉంటున్న రవితేజ – తండ్రికి అనారోగ్యంగా ఉన్నట్లు తెలిసి వెంటనే సకుటుంబంగా తన ఊరికి బయల్దేరి వెళ్లాడు. ప్రయాణంలో తండ్రితో, ఊరితో గతానుబంధాల జ్ఞాపకాలు. ఇంటికెళ్లేక తండ్రి చనిపోయినట్లు తెలిసింది. ఆ ఇంటికి మంచి ధర పలికింది. ఆ ఇంటికీ, తనకీ, తలిదండ్రులకీ ఉన్న అనుబంధం అతడినా ఇంటిని అమ్మనివ్వదు. తండ్రి కోరిక ప్రకారం ఇంటుముందున్న విశాల ప్రదేశంలో గుడి, గ్రంథాలయం, కళావేదిక నిర్మించాలనుకుంటాడు. తల్లి ఎప్పటిలాగే నుదుట సింధూరం, రంగు చీరలు, పూలు ధరించాలనడం కథలి ముగింపు. కథగా తీసుకుంటే సందేశం మినహా మరేం కనిపించదు. కథనంలో స్పృశించిన వివిధ అనుబంధాలు, గ్రామాల రూపురేఖల్లో వస్తున్న మార్పులు – హృద్యం. అవి మనసుని కదిలిస్తాయి. అవి కథనానికి పుష్టినిచ్చి కథని విశిష్టం చేశాయి. చివరిలో రవితేజ తల్లి రంగు చీరలు వగైరాలు ఎప్పటిలాగే కొనసాగాలనడం – హడావుడిగా కథలో ఇమిడ్చినట్లుంది. ఆ అంశాన్ని కూడా ఇతర అంశాలకు లాగే కథనం మధ్యలో ప్రస్తావిస్తే బాగుండేది.

పసుపులేటి సత్యశ్రీనివాస్ (జూన్ 12, 2019)

ఉత్తమార్థం: దీపికకి దేశమంటే ప్రేమ. దేశాన్ని కాపాడే సైనికుడని అర్జున్‍ని కోరి పెళ్లాడింది. అతడు యుద్ధంలో గాయపడి ఓ పాదంపోగొట్టుకుని, సైన్యంలో ఉండే అర్హతని పోగొట్టుకుని ఇంటికొచ్చాడు. తన స్థానంలో తన తమ్ముడు సైన్యంలో చేరాలని అర్జున్ ఆశించాడు కానీ, అందుకు తలిదండ్రులూ, తమ్ముడూ కూడా ఒప్పుకోలేదు. దీపిక మాత్రం తమకు పుట్టబోయే బిడ్డని సైన్యంలో చేర్పిద్దామని తన నిర్ణయం చెబితే అర్జున్ ఎంతో ఆనందించడం కథకి ముగింపు. సైనికుడి ఔన్నత్యాన్ని వివరించడానికి ఎన్నుకున్న కథాంశం అభినందనీయం. కానీ సన్నివేశాలు పాతవి. కథనంలో ఆసక్తికరమైన అంశాలు లేవు. అందువల్ల సందేశం గొప్పదే ఐనా – అదీ పాతదనే అనిపిస్తుంది.

గొర్లి శ్రీనివాసరావు (జూన్ 19, 2019)

ప్రేమ-శిక్ష: మతాంతర వివాహం, లవ్ జిహాద్ పేరిట సంఘవిద్రోహ శక్తులు సృష్టిస్తున్న అల్లకల్లోలం – ఈ అంశాలపై కథ వ్రాయమని విద్యార్థులకు పోటీ పెడితే – ఏయే సన్నివేశాలు ఎన్నుకుంటారనిపిస్తుందో అవే సన్నివేశాలతో రొటీన్‍గా కొనసాగి, నాటకీయంగా ముగిసిన సందేశాత్మక కథ.

కట్టా రాంబాబు (జూన్ 26, 2019)

ఆవేదన: కన్నవారిని నిర్లక్ష్యం చేసి, విదేశంలో సంపాదనతో కోట్లు కూడబెట్టాడు శివరావు. తన పిల్లలిద్దరూ విదేశీ సంస్కృతిలో పూర్తిగా చెడిపోవడమే కాక, సర్వనాశనం కావడంతో – ఆయనా, భార్యా ఆత్మహత్య చేసుకోవడం కథకి ముగింపు. ఇప్పుడు ఎన్నో కుటుంబాలు నిజంగా ఎదుర్కుంటున్న ఈ వాస్తవాల్ని రచయిత రెండు భాగాలుగా ప్రదర్శించారు. మొదటిది – అంతుపట్టని ఓ ఆత్మహత్యల కేసుకు సంబంధించిన పరిశోధన. రచయిత కథన ప్రతిభను నిరూపించే ఈ భాగాన్ని అలాగే కొనసాగించి ఉంటే – పరిశోధనలో ఒకటొక్కటిగా విషయాలు బయటపడుతూ – ఈ రచనను చక్కని నవలగా మలిచేవి. కానీ అన్ని విశేషాల్ని ఓ ఉత్తరం ద్వారా హడావుడిగా వార్తా కథనంలా వినిపించిన రెండవభాగం ఈ రచనను పేలవం చేసింది.

స్వాతి వారపత్రిక విర్వహించిన సరసమైన కథల పోటీ (2018) బహుమతి కథలుః

ముసునూరి సుబ్బయ్యచౌదరి (మార్చి 16, 2018)

భయం: భార్యని పూర్తిగా అదుపులో ఉంచాలని చిన్నప్పుడు మేనమామ సరదాగా అంటే అదే నిజమనుకుని అలా చేసాడు నిఖిల్. అందువల్ల సుకన్యకు సంసార జీవితం నిస్సారమయింది. అది తెలిసిన మేనమామ, తను సరదాకి అన్న మాటల్ని పట్టించుకోకూడదనీ, భార్యను చక్కగా చూసుకోవాలనీ కొత్త సలహా ఇస్తాడు. నిఖిల్లో మార్పొస్తుంది. సుకన్య సంతోషంగా ఉంటుంది. చక్కని ఈ సందేశమే సరిపోతుందనేమో – సన్నివేశాల్లో మలుపులకు ప్రత్నించలేదు. రవంత శృంగారం అద్దిన కథనం – మనోవిశ్లేషణకీ, తర్కానికీ ప్రాధాన్యమివ్వలేదు.

పినిశెట్టి శ్రీనివాసరావు (మార్చి 23, 2018)

టచ్ మి టచ్ మి టచ్ మి: భర్త గెడ్డం, మీసాలు పెంచడాన్ని ఇష్టపడక – అలిగి పుట్టింటికి వెళ్లిపోతుంది శాన్వి. అక్కడ సద్దుబాటు గురించి ఇష్టసఖి జాను మాటలు కొంతా, తనిలా పుట్టింటికి రావడం తలిదండ్రులకు మనస్తాపం కలిగించిందని తెలియడంవల్ల కొంతా – ఆమెలో మార్పుని తేగా – మళ్లీ భర్త దగ్గరికి వెళ్లిపోయి హాయిగా కాపురం చేసుకుంటుంది. అప్పుడు భర్త ఆమెకు గెడ్డం, మీసాలు పెంచడానికి కారణం చెబితే – ఆమె అయ్యో, పాపం అనుకుంటుంది. పాఠకుడికి మాత్రం – భర్త ఆ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదూ అనే అనిపిస్తుంది. చక్కని మలుపులకి అవకాశమున్న అంశాన్ని, కేవలం శృంగారపు చెళుకులతో నింపడానికి మాత్రమే ప్రయత్నించింది కథనం.

గొర్లి శ్రీనివాసరావు (మార్చి 30, 2018)

తెర తీయగ రాదా: దంపతులకు చాటుమాటు కలయికలో ఉండే మాధుర్యం చక్కని కథాంశం. నవ దంపతులకు ఆషాఢమాసంలో విధించబడ్డ విరహమూ, తత్సంబంధమైన ఇతర సన్నివేశాలకూ బదులు – కథనం అసలు కథాంశానికే ప్రాధాన్యమిస్తే ఎక్కువ బాగుండేది.

డా. దుగ్గరాజు శ్రీనివాసరావు (ఏప్రిల్ 6, 2018)

అత్త ఫలం: శేఖర్, జయంతి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అత్తా కోడళ్లకు పడకపోతే అది సహజం. కానీ జయంతి తనకి ఓ కొడుకు తర్వాత పాప పుట్టినప్పుడు – ఆమెకు అత్తగారి పేరే పెట్టమనడంలో ఉన్న ఆంతర్యం, అవసరం – పాఠకులకు గిలిగింతలు పెట్టే ఊహ. కథనంతో మరింత రక్తి కట్టించవచ్చు ననిపించిన ఈ కథలో ముగింపు వాక్యం కూడా సరదాగా బాగుంది.

గంటి రమాదేవి (ఏప్రిల్ 13, 2018)

నిత్య రహస్య నోము: పెళ్లికి సుముఖం కాని ఓ వాసంతి – తెలుగు మేస్టారు హల్ధర్ ఆకర్షణలో పడి పెల్లికి సిద్ధపడ్డం కథాంశం. సన్నివేశాలు కృతకం. కథనం అనాసక్తం.

గంగుల నరసింహారెడ్డి (ఏప్రిల్ 20, 2018)

వెన్నెల సాక్షిగా: వృద్ధ దంపతుల్లో ఉన్న అన్యోన్యత, నవ దంపతుల్లో లేకపోవడం కథాంశం. మనోవిశ్లేషణ, సన్నివేశాలు అపరిపక్వం. కాముని పున్నమి నాడు శోభనం సన్నివేశాలు – వాస్తవదూరం అనిపిస్తాయి.

కె. వాసవదత్త రమణ (ఏప్రిల్ 27, 2018)

అద్భుతమైన వరం: అనిల్‍కి ఇంటి బాధ్యతలు అంతగా పట్టవు. తనూ ఉద్యోగం చేస్తూ అతడితో సమంగా సంపాదిస్తున్న స్నిగ్ధకి భర్త తీరు నచ్చక – ఆఫీసులో కొలీగ్ రిషి దగ్గర తన దుగ్ధ చెప్పుకుంటూంటుంది. రిషి ఆ దంపతులిద్దరికీ మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితులు కల్పిస్తాడు. మారుతున్న సమాజంలో పురుషుడు మారాల్సిన అగత్యాన్ని నొక్కి చెప్పే ఈ కథలో, మానసికంగా అమ్మతనాన్ని ‘అద్భుతమైన వరం’గా పొందిన స్త్రీ – పురుషుణ్ణి సహనంతో భరించాలన్న సందేశంతో కథ ముగుస్తుంది. సన్నివేశాలు అసహజంగానూ, పాత్రలు అవాస్తవంగానూ ఉన్నప్పటికీ, సమస్య సమకాలీనంగా ప్రధానం; సందేశం అవశ్యం.

బలభద్రపాత్రుని ఉదయశంకర్ (మే 4, 2018)

స్వర్ణమంజీరాలు: కొన్ని శృంగార సన్నివేశాల్ని – కావ్యానుగుణంగా, రసాత్మకంగా ప్రదర్శించడానికి కొంత పాండిత్యాన్నీ ఆలంబన చేసుకున్న కథనం. నిర్మలమైన ప్రేమ ఉంటే – పెళ్లికిముందే శారీరక సంబంధం ఉండడం క్షమార్హమన్నది కథాంశం. తగిన సన్నివేశాలుంటే, ఈ శృంగార విశేషం కథగానూ విశిష్టమయ్యేది.

ఎమ్.వి.ఎల్.ఎస్. సరస్వతి (మే 11, 2018)

నలగని మల్లెలు: వయసులో ఉన్న కొత్త దంపతులు ఉద్యోగరీత్యా ఒకరికొకరు దూరంగా ఉంటున్నప్పుడు, మనసులో దుమారం రేపే కాంక్షలు – కథాంశం. శృంగార భావనలు అక్కడక్కడ శ్రుతి మించినా, సరస కథలకు గ్రాహ్యంబులు అని సరిపెట్టుకోవచ్చు. సన్నివేశాలు కృతకమా అనుకునేటంతలో, ముగింపుతో ముసిముసిగా నవ్వించగల కథన ప్రతిభకు, తగిన బొమ్మని అందించిన చిత్రకారుడి ప్రతిభ తోడయింది. సమకాలీన సమస్యను సరసంగా ప్రదర్శించిన మంచి కథ.

శ్రీ ఉదయిని (మే 18, 2018)

థాంక్యూ బేజోరెక్సియా: మాలిక్యులార్ బయాలజీలో పిహెచ్డి చేసిన సుప్రియ – ఆ రంగంలో నోబెల్ బహుమతి గెల్చుకున్న జర్మన్ ప్రొఫెసర్ షూల్జ్ని కలుసుకుందుకు వేరే ఊరు వెళ్లాలి. అందుకు ఓ వారమైనా భర్త సందీప్తో విరహం తప్పదని ఆమెకు బెంగ. ఆ బెంగని భర్త ఎలా పోగొట్టాడూ అన్నది కథాంశం. శృంగారాత్మకమైన కొన్ని సాంకేతిక పదప్రయోగాలతో పాఠకుల్ని అలరించడమే ప్రధానమైన ఈ రచనకు నిర్దుష్టమైన కథ ఉంటే – కథనప్రతిభ మరింత రాణించేది.

స్వాతి వారపత్రిక నిర్వహించిన గ్రహాల కథల పోటీలో బహుమతి పొందిన కథలుః

పి.వి.ఆర్. శివకుమార్ (మే 11, 2018)

కిరణం: ప్రకృతికి దూరమై అసహజ వాతావరణంలో జీవిస్తూ, పిన్నవయసులోనే అనారోగ్యం పాలౌతున్న నేటి తరానికి –మార్గనిర్దేశం చేసే గొప్ప సందేశం. సందేశం కొత్తదీ కాదు, సందేశాన్ని మించి కథా లేదు. ఐనా గ్రహపరంగా చేసిన అన్వయం మంచి ప్రయత్నం.

లోగిశ లక్ష్మీతులసి (మే 18, 2018)

చంద్రోదయం: ఎందుకూ పనికిరాడనుకున్న అప్పారావుకి జీవితమివ్వడానికి తనకి చెడ్డ పేరొచ్చినా వెనుకాడ లేదతడు. అప్పారావు కొడుకు పెళ్లి చేస్తూ, ఊరందర్నీ పిలిచి అతణ్ణి మాత్రం పిలువలేదు. ఆ కృతఘ్నత వెనుకనున్న కృతజ్ఞతను బయటపెట్టిన ముగింపు ఈ కథని అర్థవంతం చేసింది. అయినవాళ్లకి సాయం చెయ్యడం కోసం, పుట్టిన తేదీల్ని మార్చడాన్ని తప్పు పట్టకపోవడం చిరులోపం అనతగ్గ ఈ కథలో -. కృతఘ్నులపట్ల స్పందనలో మనోవిశ్లేషణ బాగుంది. సన్నివేశకల్పనలో మరింత శ్రద్ధ తీసుకుని ఉండాలనిపించినా, గ్రహపరంగా చేసిన ప్రయత్నానికి కథనమూ కొంత సహకరించింది.

ప్రతాప రవిశంకర్ (మే 25, 2018)

గత కాల ప్రయాణం: తండ్రి దశాబ్దాల క్రితం నరసయ్యశెట్టినుంచి తీసుకున్న నూటయాబై రూపాయల అప్పు తీర్చడానికి గ్రామం వెళ్లాడు ప్రభాకరం. శెట్టి ఆ చిన్న మొత్తాన్ని తీసుకుందుకు మృదువుగా, స్నేహపూర్వకంగానూ నిరాకరిస్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడికొచ్చిన శ్రీరాములు ప్రభాకరం తండ్రి దగ్గర దశాబ్దాల క్రితం తీసుకున్న పదివేల రూపాయలు తిరిగివ్వబోతాడు. తీసుకుందుకు ప్రభాకరం నిరాకరించడం కథకి ముగింపు. పాత్రచిత్రణ, గ్రహపరమైన విశేషాన్ని అంతర్లీనం చేసి – మనోవిశ్లేషణ, సన్నివేశకల్పనల్ని కథలో ఇమిడ్చిన నేర్పు ప్రశంసనీయం.

సి. యమున (జూన్ 1, 2018)

గెలుపెవరిది: బీటెక్ చదివిన ఉజ్వల తనకొచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కాదని, స్వతంత్రంగా వ్యాపారం చేసి రాణించడం కథాంశం. గ్రహపరంగా చెప్పడం కోసం కథే సందేశమైంది. కథగా సాధారణమనిపించినా, ఉజ్వల పాత్ర నేటి యువతకి స్ఫూర్తి కాగలదు.

సూర్యప్రసాదరావు (జూన్ 8, 2018)

లేచిపోవాలని ఉంది: రైల్వే కాంటీన్లో అంటగిన్నెలు తోమే సునంద – విదేశాల్లో ఉన్నతోద్యోగం చేసే స్థాయికి ఎదిగినా – స్వదేశంలో అభాగ్యుల సేవకే తన జీవితాన్ని అంకితం చేసి – ఐక్యరాజ సమితిలో స్వదేశం తరఫున ప్రసంగించడానికి ఎన్నుకోబడ్డం కథాంశం. అనాథల దౌర్భాగ్యాన్ని కళ్లు చెమర్చేలా ప్రదర్శించి, ప్రతికూల వాతావరణంలో జీవనపోరాటాన్ని జనతకు స్ఫూర్తిదాయకం కథనం. కథకి పేరు కూడా విభిన్నం, విశిష్టం. సందేశానికున్న ప్రాధాన్యం వల్ల కథ తక్కువైనా, కథగా తక్కువ కాని ప్రయోజనాత్మక కథ.

టి.ఎస్.ఆర్.కె. గాంధీ (జూన్ 15, 2018)

తాతయ్య: ఓ మనుమడు, మనుమరాలు – తాతయ్య, నానమ్మల అనుబంధాన్ని ఆస్వాదించడం కథాంశం. కథనం హృద్యం. ముగింపు ఆర్ద్రం.

డా. ఎమ్. సుగుణరావు (జూన్ 22, 2018)

దుర్గమ్మ కూతురు: దుర్గమ్మ పాచిపని చేస్తూ – అటు తాగుబోతు భర్త అవసరాలు తీరుస్తూ, ఇటు కూతుర్ని బడిలో వేసింది. దుర్గమ్మకి కూతురనే తప్ప మరో పేరు లేని ఆమెని క్లాసురూంలో సహాధ్యాయులూ, ఉపాధ్యాయులూ కూడా శని అంటూ ఈసడించారు. పట్టుదలతో చదివింది. అవరోధాల్ని అధిగమించింది. కలెక్టరై – ప్రభుత్వ పురస్కారానికి ఆహ్వానం అందుకునే స్థాయిలో ఉద్యోగాన్ని నిర్వహించింది. సన్మాన సభలో ఆమె వినిపించిన స్వీయకథే ఈ కథ. ఇందులో కలెక్టరుగా ఆమె వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడానికి ఎన్నుకున్న సన్నివేశాలు స్ఫూర్తిదాయకం. బడుగుజీవుల దౌర్భాగ్యం, కన్నతల్లి ప్రాముఖ్యం, ప్రతికూల వాతావరణంలో జీవనపోరాటం – వీటిని అర్థవంతంగా, హృద్యంగా ఇముడ్చుకున్న కథనం. యువతకు ప్రేరణ. జనతకు ఆశ. కథానాయిక పేరు, కథకి పేరు కూడా విభిన్నం, విశిష్టం.

దాట్ల దేవదానం రాజు (జూన్ 29, 2018)

దీపం కింద నీడ: వడ్రంగంలో తనకి తానే సాటి అనిపించుకునే ఓ వీరేశలింగం. భార్య కామాక్షి, ఉంచుకున్న సుబ్బమ్మలతో ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నాడు. వేశ్యావృత్తిలో తనకి తానే సాటి అనిపించుకున్న అపురూప సౌందర్యవతి నాగమణి – తన కొత్తింటి సింహద్వారాన్ని అపురూపంగా తీర్చి దిద్దడానికి లింగాన్ని ప్రాధేయపడింది. అతణ్ణి రెండున్నరేళ్లు తన ఇంట ఉంచుకుని, అక్కడున్నంత కాలం అతడికే కట్టుబడి తన అభీష్టం నెరవేర్చుకుంది. ఆమె వైభోగానికి అబ్బురపడిన లింగం – ధన సంపాదనకోసం వక్రమార్గాలు తొక్కి, పట్టుబడి జైలుపాలై, సర్వం కోల్పోయాడు. ఐనా గ్రామదేవత కోలపిళ్లమ్మ విగ్రహం తయారీకి అతడి ప్రతిభే అవసరపడింది. అపురూపంగా తయారైన ఆ విగ్రహంలో నాగమణి పోలికలుండడం కథకి ముగింపు. మనమనుకునే విలువలకి అందని జీవన విధానాలు కొన్ని ఉంటాయి. వాటిని దీపం కింద నీడలా సమర్థించడాన్ని – వాస్తవం అనిపించేలా చెప్పడంలో మల్లాది రామకృష్ణశాస్త్రిగారికి దీటొచ్చే ప్రతిభ గోచరిస్తుంది. శిల్పకళ [ప్రాధాన్యం అంతర్లీనమైన ఈ కథలో కథాంశానికి దీటైన శిల్పం అభినందనీయం. విలక్షణ కథాంశాన్ని ఒప్పించిన ఈ కథ ముగింపులో ఉన్నట్లుండి ప్రత్యక్షమైన నామా గాంధీ పాత్ర – కథలో కొన్ని వాక్యాలు మిస్సయ్యాయా అనిపింపజేస్తుంది. లేదా – కథనంలో విలక్షణత్వంగా సరిపెట్టుకోవచ్చు.

పోల్కంపల్లి శాంతాదేవి (జూలై 13, 2018)

కుహూ యోగము: రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలికి కుహూయోగం కారణంగా మరణగండముంది. రాజుని దాన్నించి తప్పించడానికి ఆస్థాన గురువు వ్యాసరాజతీర్థులు – ప్రభువునించి రాజ్యాన్ని దానంగా స్వీకరించి ఓ షరతుమీద రాజ్యాధిపతి ఔతాడు. తన మంత్రశక్తితో మరణగండంనుంచి తప్పించుకున్నాకనే, ఆయన షరతేమిటో చెబుతాడు. రాయలు తిరిగి రాజ్యాన్ని తననుంచి దానంగా స్వీకరించాలన్నది ఆ షరతు. ఇచ్చిన దానాన్ని వెనక్కి తీసుకోలేని రాయలు – గురువు మాట కాదనలేక – తన రాజ్యాన్ని నాలుగేళ్ల వయసున్న తన కొడుకు తిరుమలరాయుడికి అప్పగించి – అతడికి ప్రతినిధిగా రాజ్యపాలన చెయ్యడం కథకి ముగింపు. ఉదాత్తమైన పాత్రలు, ఆసక్తికరమైన కథనం, సర్వకాలీనమైన గొప్ప సందేశం ఈ కథకు ప్రాణం పోశాయి.

స్వాతి వారపత్రిక నిర్వహించిన కథలపోటీలో బహుమతి పొందిన కథలుః

యం. రమేష్ కుమార్ (ఆగస్ట్ 17, 2018)

సర్కారీ కొలువు: గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడమే జీవితాశయంగా పెట్టుకున్న బంగార్రాజుకి 48 ఏళ్లు వచ్చేక – అనుకోకుండా అవకాశమొచ్చింది. తన ఆశయంకంటే, ప్రత్యర్ధి అవసరానికే ప్రాముఖ్యమివ్వడం కథకి ముగింపు. సన్నివేశకల్పనలో వాస్తవం పట్ల ఉన్న అవగాహన కథకు పుష్టినిచ్చింది. అంతర్లీనమైన స్వయంఉపాధి స్ఫూర్తి ప్రశంసనీయం. ముగింపు ఊహకందినా కథను విశిష్టం చేసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here