బహుమతి పొందిన కథల విశ్లేషణ-5

0
9

[వివిధ పత్రికలు/సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి పొందిన కథలను సంక్షిప్తంగా విశ్లేషిస్తున్నారు వసుంధర.]

[dropcap]క[/dropcap]థలంటే ఉపేక్ష ఉన్నవారికి కూడా బహుమతి కథలంటే ఆపేక్ష ఉండడంవల్లనేమో – చదివిన వెంటనే అభిప్రాయమడిగితే నిరాశతో కూడిన నిట్టూర్పు సాధారణం. నోటిమాటకు అక్షరరూప మిచ్చినప్పుడే విమర్శకు సార్థకమూ, విలువా. ఐతే ఇక్కడ వెలిబుచ్చే అభిప్రాయాలు మా అభిరుచికి మాత్రమే పరిమితమనీ, ఆయా కథలపై తీర్పు కాదనీ పాఠకులకు మనవి.

~

అర్చన ఫైన్ ఆర్ట్‍స్ అక్కడమీ &  శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన పోటీలో బహుమతి పొందిన కథలు:

కొత్తపల్లి ఉదయబాబు (మొదటి బహుమతి)

చదువులమ్మ చెట్టు నీడలో (అచ్చంగా తెలుగు వెబ్ పత్రిక): ఇందిరా ప్రియదర్శినికి ఆరేళ్ల వయసులో తల్లి పోయింది. తండ్రి విజయ రామారావు మళ్లీ పెళ్లి చేసుకోకుండా కూతుర్ని అల్లారు ముద్దుగానూ, ఆదర్శంగానూ పెంచాడు. ఆమె అగ్రికల్చరల్ బీయస్సీ చదివింది. తండ్రి, భర్త సహకారంతో – గ్రామంలో వ్యవసాయం చేసి మూడెకరాల్ని పన్నెండు ఎకరాలు చేసింది. ముగ్గురు కొడుకుల్ని ఆదర్శంగా పెంచింది. వాళ్లు భార్యాబిడ్డలతో జీవితంలో స్థిరపడ్డాక, భర్త పోయినా కూడా – తను మాత్రం గ్రామంలోనే జీవితం కొనసాగించింది. పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చింది. మిగతా ఆస్తిని ముందు తరాలకి అనుభవానికే తప్ప అమ్ముకుందుకు హక్కు లేకుండా వ్రాసిచ్చి, తన ఇంటిని ఊరికి గ్రంథాలయంగా ఇచ్చెయ్యమని లేఖ వ్రాసి చనిపోవడం కథకి ముగింపు. ఈ కథలో కొత్త సన్నివేశాలు కానీ, ఆసక్తికరమైన మలుపులు కానీ లేకపోయినా – యువతకు గొప్ప సందేశముంది. కథనం సందేశాన్ని కథగా మలిచే ప్రయత్నం చేసినట్లు అనిపించదు.

కట్టా రాంబాబు (మొదటి బహుమతి):

జరుగుతున్న కథ (సుజన రంజని వెబ్ పత్రిక జూన్ 2019): అల్లరి విద్యార్థుల అసిడ్ దాడి గురైన ఓ లెక్చరర్ – తన కథను మరో బ్యాచి అల్లరి విద్యార్థులకి ప్రబోధాత్మకంగా వినిపించడం కథాంశం. సన్నివేశాల్లో నవ్యత లేదు. ప్రబోధమే కథగా రూపొందడం వల్ల కథనం ఆసక్తి పుట్టించదు. కథకి పెట్టిన పేరు బాగుంది.

బళ్లా షణ్ముఖరావు (మొదటి బహుమతి)

ధర్మం (గో తెలుగు డాట్‍కామ్ వెబ్ పత్రిక జూన్ 14, 2019): ‘మనిషికి జంతువు సాయం చేయలేదు. మనిషికి మనిషే సాయం చేసుకోవాలి. అది మర్చిపోయిన మనిషి జంతువే’ – అన్న అక్షరసత్యంతో మానవత్వాన్ని ప్రబోధించిన కథ. ఎన్నుకున్న సన్నివేశాలు, పాత్రచిత్రణ, మనోవిశ్లేషణ వాస్తవాలకి అద్దం పట్టాయి. సందేశం పాతదే ఐనా వినిపించిన కథనం కొత్తగా, విశిష్టంగా ఉంది.

జి.ఎస్. లక్ష్మి (మొదటి బహుమతి)

వారధి (సారంగ వెబ్ పత్రిక జూన్ 15, 2019): కొత్తగా పెళ్లయిన ఆడపిల్ల పుట్టినింటికీ, మెట్టినింటికీ వారధిలా ఉండాలన్న సందేశం కథాంశం. అందుకు ఎన్నుకున్న సన్నివేశాలు, సంభాషణలు, పాత్రలు, మనోవిశ్లేషణ – వాస్తవానికి అద్దం పట్టిన తీరు కొత్తగా కథలు వ్రాస్తున్నవారికి మెచ్చుతునక. నవ వధువునుంచి నవవధువుకి తల్లిగా మారిన క్రమంలో అన్నపూర్ణ పాత్రచిత్రణ అద్భుతం. కొత్తగా పెళ్లయిన అబ్బాయి పుట్టినింటికీ, మెట్టినింటికీ వారధిగా ఉండాలన్న సందేశం కూడా అంతర్లీనమని గ్రహిస్తే – ఇది స్త్రీవాదుల్ని కూడా ఇబ్బంది పెట్టని విశిష్ట రచన.

లక్ష్మీ పాల (మొదటి బహుమతి)

క్షత్రి (మధురవాణి జూలై-సెప్టెంబర్ 2019): చిన్నప్పుడే తనవాళ్లందర్నీ పోగొట్టుకున్న క్షత్రి – ఎదిగి తన కాళ్లమీద తాను నిలబడ్డాక – తనవాళ్లంతా జీవించే ఉన్నారన్న భ్రమలో జీవిస్తూ పెళ్లికి విముఖంగా ఉండడం కథాంశం. క్లుప్తత కథని కొంత పేలవం చేసినా – కథాంశం, కథనం, ముగింపు గొప్పగా ఉన్నాయి.

యర్రమిల్లి విజయలక్ష్మి (రెండవ బహుమతి)

అష్టావక్రుడు (సుజనరంజని జూన్ 2019): చందూ, గోవిందు అన్నదమ్ముల బిడ్డలు. చిన్నతనంలోనే తలిదండ్రుల్ని పోగొట్టుకున్న గోవిందుని చందూ తండ్రి ఆదుకున్నాడు. గోవిందు అవిటివాడు. అష్టావక్రుడు వాడికి లభించిన బిరుదు. చందూ కుటుంబం ఊరొదిలి నగరంలో స్థిరపడి కోట్లకి పడగలెత్తితే, గోవిందు ఊళ్లోనే ఉండి ఇంటినీ, పొలాల్నీ చూసుకుంటూ పూర్వీకుల సంప్రదాయాల్ని నిలబెడుతున్నాడు. గోవిందు కూతురు పరమేశ్వరి పెళ్లికి వచ్చిన చందూ – ఆత్మీయానురాగాల్లో నగరం పల్లెకు ఎంత వెనుకబడి ఉందో గ్రహించాడు. ఊరిపై ఏర్పడిన తూష్ణీభావం పోగా, గోవిందు పట్ల కృతజ్ఞత కలిగింది. గోవిందు కొడుకు కేశవ్ ఎదుగుదలకు తనే పూర్తి బాధ్యత తీసుకోవాలని చందూ నిర్ణయించడం కథకి ముగింపు. కథకు సంబంధించిన వాతావరణాన్ని సమర్థవంతంగా అందించిన ఈ సందేశాత్మక రచనలో కథకంటే కథాంశానికే ప్రాధాన్యం. కథనం ఏకబిగిన పెద్ద పెద్ద పేరాలలో కాకుండా – చిన్న వాక్యాలలో ఉంటే ఇంకా బాగుండేది.

నండూరి సుందరీ నాగమణి (రెండవ బహుమతి)

చెఱసాల (సుజనరంజని జూన్ 2019): శిక్షణ పేరిట విద్యార్థుల్ని భయంక శిక్షలకు గురి చేసే కార్పొరేట్ కావ్యవస్థల సంస్కృతినీ, దాన్ని ప్రోత్సహించే మూర్ఖపు తండ్రుల్నీ – వాస్తవంగా ప్రదర్శించిన ఆలోచనాత్మక రచన. కథాంశం కొత్తది కాకపోయినా, తగినంత సన్నివేశకల్పన లేకపోయినా – కథనంతో కొంత బలం సంతరించుకుంది. సృజనాత్మకమైన కొసమెరుపు ఉంటే ఇలాంటి కథలు పాఠకుల్ని మరింత ప్రభావం చేస్తాయి.

నామని సుజనాదేవి (రెండవ బహుమతి)

తేడా (సారంగ జూన్ 15 2019): సరిహద్దుల్లో శత్రుసైనికులతో పోరాడుతూ వీరమరణం చెందాడు శివ. ఒలింపిక్సులో దేశానికి పతకం సాధించింది స్వాతి. ఆమెకు అటు ప్రభుత్వంనుంచి, ఇటు ప్రైవేటు సంస్థలనంచి ప్రశంసలతో పాటు, భారీగా డబ్బుని కానుకగా లభించాయి. దేశంకోసం ప్రాణాలే ఒడ్డిన సైనికుడికి అలాంటి గుర్తింపు, కానుకలు ఎందుకు లభించడం లేదన్న ఆవేదనతో కథ ముగుస్తుంది. కథకు తగిన సన్నివేశాలు, పాత్రచిత్రణపై కూడా శ్రద్ధ వహిస్తే – సందేశం గొప్పది. ఆవేదన అర్థవంతం.

మధురాంతకం మంజుల (రెండవ బహుమతి)

ఆశించని ప్రతిఫలం (సారంగ జూన్ 15 2019): చాలా ఏళ్లు వేరేచోట పెద్ద ఉద్యోగం చేసి రిటైరయ్యాడు జగన్నాధం. స్వగ్రామానికి సామాను సద్దుకుంటున్న ఆయన భార్య పద్మావతి – ఆ ఇంటితో ఊరితో ముడిపడి ఉన్న ఎన్నో జ్ఞాపకాలు, అనుభూతులను స్మరించుకుంటూ దిగులుగా ఉంది. ఆమెను చూడొచ్చిన సాటివారందరికీ వారితో ఏవో అవసరాలున్నాయి. ఏ అవసరాలూ లేకుండా ఆశించని ప్రతిఫలంతో వారికి వీడ్కోలిచ్చి, అత్మీయతను పంచింది తోటమాలి చెంచులయ్య కావడం కథకి ముగింపు. కథాంశం కొత్తది కాకపోయినా, మనస్తత్వ విశ్లేషణ వాస్తవంగా బాగుంది. ఇలాంటి కథలకు కొత్తదనం అపాదించగలిగింది, ఊహించని కొసమెరుపు మాత్రమే!

పొత్తూరి విజయలక్ష్మి (ద్వితీయ బహుమతి)

తృప్తి (గోతెలుగు.కామ్ 326వ సంచిక): శ్యాంసుందర్ చిన్నప్పుడు చాలా కష్టపడి చదువుకుని పైకొచ్చి అమెరికాలో స్థిరపడి భాగ్యవంతుడయ్యాడు. కూతురి వోణీల వేడుకని పెళ్లికంటే ఘనంగా జరుపుతుంటే – ఆ వేడుకకి నలుగురు పేద నిరుద్యోగులు ఆహ్వానం లేకుండా వచ్చి భోంచేస్తున్నారు. అనుమానించిన ఓ నిర్వాహకుడికి వాళ్లు శ్యాం మిత్రులమని చెబితే అతడు శ్యాంని పిలిచాడు. శ్యాం వారి పరిస్థితి గ్రహించి, వారికి అవమానం కలుగని విధంగా ప్రవర్తించి కొంత డబ్బిచ్చి కూడా పంపుతాడు. తన గతం గుర్తుండడమే అందుకు కారణమన్నది కథకి ముగింపు. సన్నివేశం ఆర్ద్రంగా, కథనం హృద్యంగా ఉన్నా – కథాంశంలో కొత్తదనం లేదు.

అచ్చంగా తెలుగు వెబ్ పత్రిక నిర్వహించిన ఉగాది కథల పోటీలో బహుమతి పొందిన కథలు:

శశిరేఖా లక్ష్మణన్ (ద్వితీయ బహుమతి)

హృదయ వేదన: తండ్రి చనిపోతే మేనమామ చెంత చేరాడు రాజేష్. అత్త అతణ్ణి ద్వేషిస్తూ దారుణంగా వేధించేది. ఆ కోపంతో అత్త కూతురు ఐదేళ్ల అసహాయ సౌమ్యపై అత్యాచారం చేసేవాడు. రాజేష్ ఉద్యోగస్థుడై పెళ్లి చేసుకున్నాక అతడి కూతురు ఐదేళ్ల పవిత్ర పైనా అత్యాచారం జరుగుతుంది. ఆ వేదనతో మనసు పాడై – చిన్నతనంలో సౌమ్యను వేధించినదానికి ఇది ప్రతిఫలమన్న వ్యధతో కారు డ్రైవ్ చేస్తూ యాక్సిడెంటుకి గురై మరణించాడు రాజేష్. సౌమ్యలాగే బాల్యంలో ఓ ఆంటీ ద్వారా అత్యాచారానికి గురైన డాక్టర్ ప్రకాష్ సౌమ్య కథ విని ఆమెని పెళ్లాడ్డం కథకి ముగింపు. నేడు విరివిగా జరుగుతున్న అత్యాచారాల విశేషాలు కొన్ని వినిపించిన కథనం – వాటిని కథలా మలచలేకపోయింది. సన్నివేశాల్లో సృజన, నవ్యత లేదు. మనో విశ్లేషణలో పరిణతి లేదు. సందేశం నేటి తరానికి అత్యావశ్యకం.

జైదాస్ (ద్వితీయ బహుమతి)

చింత: హరితహారాన్ని నిరసిస్తూ మొదలై, కథకుడికి నేస్తాలైన తాడిచెట్టు, చింతచెట్టు కథల్ని స్పృశించిన ఈ కథ మధ్యలో ఓ తాత కథని హృద్యంగా పలుకుతుంది. ఐతే ఇది కథ కాదు. మూడు కథాంశాలని క్లుప్తంగా వివరించిన ప్రయత్నం అనొచ్చు. ఏకబిగిని హడావుడిగా చెప్పెయ్యకుండా – శిల్పాన్ని జీడించిన కథనంతో నడిపితే విశిష్టమైన కథలకు మూలాలున్న అంశాల్ని ఇముడ్చుకున్న రచన ఇది. రచయితకు అభినందనలు.

దేవులపల్లి దుర్గాప్రసాద్ (ద్వితీయ బహుమతి)

భ్రమ: సంపాదన రంధిలో పడి కన్నబిడ్డనీ, సంసారాన్నీ నిర్లక్ష్యం చేసిన నేటి తరం తలిదండ్రులు పాత్రలుగా అల్లిన కథాంశం. సన్నివేశాల్లో కొన్ని మనసుల్ని కదిలిస్తే, కొన్ని కృతకం అనిపిస్తాయి. కథాంశానికి న్యాయం చేకూర్చే స్థాయిలో లేకపోయినా కథనంలో ప్రతిభ తొంగి చూస్తుంటుంది. మనసులకి అనుమానాల పొరలు కమ్ముతున్నప్పుడు – సూచించిన పాజిటివ్ దృక్పథం మెచ్చుకోతగ్గది.

ఎన్. వీ. శ్రీధరశర్మ (ద్వితీయ బహుమతి)

వార్ధక్యం: బిడ్డలు తలిదండ్రుల్ని వార్ధక్యంలో నిర్లక్ష్యం చెయ్యడం కథాంశం. ఈ మామూలు కథాంశానికి మామూలు కాని సన్నివేశాల్ని జోడించి ఓ పెళ్లితో ముడి పెట్టిన నేర్పు అభినందనీయం. కథనంలో మరికాస్త పరిణతి ఉండొచ్చుననిపించినా అభినందించతగ్గ చక్కని సందేశాత్మక కథ.

కుసుమ ఉప్పలపాటి (తృతీయ బహుమతి)

అమ్మమ్మ అమెరికా ట్రిప్: లీల అమెరికా వెళ్లింది – కూతురు ఉష పిల్లల్ని చూసుకుందుకు. వాళ్లు పూర్తిగా వేరే సంప్రదాయంలో పెరగడం గమనించి – వాళ్లతో కొంచెం కఠినంగానే వ్యవహరిస్తుంది. పిల్లలకి అమ్మమ్మ నచ్చలేదు. అక్కడ పిల్లలు ఉండే వాతావరణాన్ని ఉష వివరించి చెప్పేక – మారాల్సింది తనేనని లీల గ్రహించడం కథకి ముగింపు. అమెరికాలో పెరుగుతున్న మన యువతరం పరిసరాల్నీ, మనస్తత్వాన్నీ చక్కగా వివరించారు రచయిత్రి. పరిష్కారం మాత్రం అమ్మమ్మ మారడమే అని కాక, మధ్యరకంగా సమన్వయిస్తే కథ సంపూర్ణమయ్యేదనిపించింది.

కొత్తపల్లి ఉదయబాబు (తృతీయ బహుమతి)

ప్రార్థించే చేతులకన్నా: రాగింగుకి గురై తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరికి అన్యాయం చేసిన చక్రహస్తకి ఆ కారణంగా చదువు ఆగిపోయింది. అతడు సక్రమంగానే ఇతర మార్గాలద్వారా డబ్బు సంపాదించాడు, తనకిలా చిన్నప్పుడే ఇంటికి దూరమైన వాళ్లని కూడగట్టుకుని – ‘వాయుసేన’ అనే సంస్థని ప్రారంభించి జనానికి అవసరపడే పనులు చేస్తూ – ‘ప్రార్థించే చేతులకన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న ఆదర్శాన్ని పాటించడం కథాంశం. ఈ కథలో రాగింగు అంశం విడిగా కథగా వ్రాయాల్సినంత విస్తృతమైనది. ‘వాయుసేన’ అనే సంస్థకు కేవలం ప్రచార ప్రకటనగా మలచిన కథనంతో – ఈ రచన ఒక మంచి సందేశంగా మాత్రమే మిగిలిపోతుంది.

జాగృతి వారపత్రిక నిర్వహించిన వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీలో బహుమతి పొందిన కథలు

రామా చంద్రమౌళి (ప్రథమ బహుమతి)

భరిణె (జాగృతి, 05-11 నవంబర్ 2018): యోగి, శాలిని జంటగా కార్లో మేడారం జాతరకి వెళ్లి పొందిన అనుభవాలు కథాంశం. ఇందులో వేదాంతముంది, ఆలోచన ఉంది, వాస్తవ దృక్పథముంది, చరిత్ర ఉంది, సంప్రదాయపు విశ్వాసాలమీద గౌరవముంది. కొన్ని మంచి పుస్తకాల వివరాలున్నాయి. అన్నింటినీ సమన్వయించిన విధానం గొప్పగా ఉంది. సన్నివేశాలకు అంతగా ప్రాధాన్యం లేని ఈ విశిష్ట రచనలో – మేడారం జాతరని కళ్లకి కట్టిస్తూ, పాత్రల అనుభూతుల్ని పాఠకులకూ అందజేసిన కథనశిల్పం ప్రశంసనీయం.

పుట్టగంటి గోపీకృష్ణ (ప్రోత్సాహక బహుమతి)

హసితం మధురం (జాగృతి, 05-11 నవంబర్ 2018): శ్రీకృష్ణ నిర్యాణాన్ని ఓ వృద్ధభిల్లుడి కృష్ణభక్తితో ముడిపెట్టిన సృజన. కథనం మనోహరం. ఇతివృత్తం, శైలి, స్థాయి – గతంలో యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన ‘సీతారాముడొస్తున్నాడోయ్’ కథని స్ఫురణకు తెస్తాయి.

జొన్నలగడ్డ రామలక్ష్మి (ప్రోత్సాహక బహుమతి)

అదో లక్ష్మణరేఖ (జాగృతి, 05-11 నవంబర్ 2018): నేటి ఆన్‍లైన్ సంస్కృతి ప్రపంచాన్ని ఎంత దగ్గర చేస్తోందో, మనుషుల్ని మానవత్వం నుంచి అంత దూరం చేస్తున్న విషాదాన్ని వినోదపు ముసుగులో ప్రదర్శించిన ఓ హెచ్చరిక ఈ కథ.

విహారి (ద్వితీయ బహుమతి)

నిప్పునుంచి నీరు (జాగృతి, 12-18 నవంబర్ 2018): చిన్న కుటుంబాలు, ఆధునిక సదుపాయాలు – వీటిమధ్య చిన్నపిల్లల్లో సద్దుబాటుతనం పోయి, మొండితనం ప్రబలుతోంది. అదీ కథాంశం. దాన్ని చక్కగా ప్రదర్శించి, సమస్యకు అనువైన పరిష్కారాన్ని అద్భుతంగానూ, సాధ్యమనిపించేలాగానూ కొనసాగిన కథనం ఈ కథను విశిష్టం చేసింది.

కన్నెగంటి అనసూయ (తృతీయ బహుమతి)

అసలైన దేవుడు (జాగృతి, 19-25 నవంబర్ 2018): గేటెడ్ కమ్యూనిటీలో ఎలక్ట్రీషియన్ మల్లి. దసరా సంబరాల్లో అంతా సామూహిక భోజనాలు చేస్తుంటే – అది వేరే దేవుడి ప్రసాదం కాబట్టి తినడం ఇష్టంలేక ఎక్కడికో వెళ్లి భోంచేసి వచ్చేసరికి రాత్రి బాగా ఆలస్యమైంది. ఆ సమయంలో అక్కడ దసరా సంబరాలు జరుగుతున్నాయి. పెద్ద వాన పడి కరెంటు ఫ్యూజు పోయిన సమయానికి మల్లి అక్కడ లేడు. కార్యక్రమాలు అభాసయ్యాయి. మల్లికి ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అక్కడే పని చేస్తున్న ప్లంబర్ రాంబాబు – అసలైన దేవుడు ఆకలేనంటూ మల్లికి చేసిన ప్రబోధమే ఈ కథ. సన్నివేశాలు కొత్తవి, వాస్తవం. సందేశం ప్రయోజనాత్మకమే కానీ పాత సీసాలో పాత సారా. పాత్రచిత్రణకు ప్రాధాన్యం లభించకపోవడం వల్ల, కథాంశమైన ప్రబోధమే కథ కూడా అయింది.

ఎస్.డి.వి. అజీజ్ (ప్రోత్సాహక బహుమతి)

కేలిక (జాగృతి, 10-16 డిసెంబర్ 2018): సిద్ధవటం ఏలిక గురువరాజుని కళాప్రదర్శనతో మెప్పించి కానుకలందుకోవాలన్న ఆశతో తన బృందాదంతో బయల్దేరాడు. దారిలో అతడికి గురువరాజు అకృత్యాలకు బాధితులైనవారు ఒకొక్కరుగా ఎదురౌతారు. దాంతో అతడు మనసు మార్చుకుని హంపీ నగరానికి వెళ్లి అప్పాజీ అనుమతితో వీర నరసింహరాయలి ముందు గురువరాజు ప్రజాకంటక రాజ్యపాలనకి అద్దం పట్టే సన్నివేశాలతో యక్షగానాన్ని ప్రదర్శించాడు. రాజుకి విషయం అర్థమై – గురువరాజుని శిక్షించి అక్కడి ప్రజల్ని రక్షించాడు. కళకూ, సామాజికస్పృహకూ ఉన్న అనుబంధాన్ని వివరించిన ఈ ప్రయోజనాత్మక రచనకు తగిన సన్నివేశాలు, కథనం పుష్టినిచ్చాయి.

విజయ గొల్లపూడి (ప్రోత్సాహక బహుమతి)

జీవితమే సఫలం (జాగృతి, 26 నవంబర్- 2 డిసెంబర్ 2018): చదువు, ఉద్యోగం – ఇవే జీవితమనుకున్న సౌమ్య జీవితంలో చాలా ఎత్తుకి ఎదిగింది. ఉద్యోగ విరమణ తర్వాత ఒంటరి అయింది. అందరు ఆడపిల్లలకిలాగే తనూ పెళ్ళి చేసుకుని సామాన్య జీవితం గడిపి ఉంటే ఇప్పుడు తనవాళ్లంటూ ఎందరో ఉండేవారు కదా అన్న అసంతృప్తి ఆమెను బాధిస్తోంది. ఆమె చిన్ననాటి స్నేహితురాలు రమ్య తలిదండ్రుల మాట విని చదువవగానే పెళ్లి చేసుకుని అత్తమామలు- వారికుటుంబం, భర్త- తన పిల్లలు – వారి సేవలకే జీవితాన్ని అంకితం చేసింది. అత్తమామలు పోయారు. మరుదులు అమెరికాలో స్థిరపడ్డారు. పిల్లలు కూడా పెద్దవాళ్లై విదేశాలకు వెళ్లిపోయారు. భర్త చనిపోయాడు. వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిన ఆమెకు పెళ్లి కారణంగా జీవితంలో తనేం సాధించలేకపోయానన్న అసంతృప్తి. అనుకోకుండా రైల్లో కలిసిన ఈ బాల్యమిత్రులు తమతమ జీవితాల్ని విశ్లేషించుకుని, కలిసి సమాజానికి పనికొచ్చే కృషి చెయ్యాలనుకోవడం కథకి ముగింపు. కథనం, కొత్తదనం, మనోవిశ్లేషణ – ఈ కథను విశిష్టం చేసింది.

పొత్తూరి విజయలక్ష్మి (ప్రోత్సాహక బహుమతి)

కొడుకులాంటి వాడు (జాగృతి 31 డిసెంబర్ 2018- 6 జనవరి 2019): కృష్ణారావుకి ఇద్దరు కొడుకులు, కూతురు. అంతా దేశ విదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు చుట్టపుచూపుగా కన్నవారిని చూసి వెడుతుండేవారు. దగ్గరుండి ఆయన్ని చూసుకున్న మాధవ్ తనకు కొడుకులాంటి వాడనేవాడు కృష్ణారావు. తను చనిపోయేక మాధవ్‍కి కూడా తగినంత ఇచ్చి ఆదుకోమని పిల్లలకి చెప్పాడు కానీ, వాళ్లమీద నమ్మకం లేక అతడికోసం వేరే ఏర్పాటు చెయ్యడం కథకి ముగింపు. సన్నివేశాలు, పాత్రచిత్రణ హృద్యం. కథాంశం కొత్తది కాకపోయినా – భావోద్వేగ రహితంగా వాస్తవాల్ని వాస్తవంగా ప్రదర్శించిన ప్రతిభావంతమైన కథనం కథను విశిష్టం చేసింది.

బొడ్డేడ బలరామస్వామి (ప్రోత్సాహక బహుమతి)

కళింగ పౌరుషం (జాగృతి, 24-30 డిసెంబర్ 2018): అశోకుడి రాజ్యకాంక్ష. కళింగవీరుల సాహసం. ఘోర యుద్ధం. అశోకుడి పశ్చాత్తాపం. ఈ అంశాలను చారిత్రక అంశాలతో జోడించి ప్రతిభావంతంగా వినిపించిన విశిష్ట కథనం.

నాని పిల్లల మాసపత్రిక నిర్వహించిన ఉగాది కథల పోటీలో బహుమతి పొందిన కథలు

తిరుమలశ్రీ (ఏప్రిల్, 2019)

గుణవంతుడు (మొదటి బహుమతి): తనని ప్రేమించిన రాజుని కాదని, తాను ప్రేమించిన అజయుణ్ణి పెళ్లాడాలనుకున్న సూర్యకళ. ‘గుడిలో అగరువత్తుల ధూపం గుడికే పరిమితం. రాజు కీర్తి అలాంటిది. ఆరుబయలు సుగంధ పరిమళానికి ఎల్లలుండవు. గుణవంతుడి కీర్తి అలాంటిది’ అని రాజు గ్రహించడం కథకి ముగింపు. సన్నివేశాలు, సందేశంలో నవ్యత లేకపోయినా, సూర్యకళ పాత్ర చిత్రణ, పై వ్యాఖ్య ప్రతిభావంతం.

వసుంధర (ఏప్రిల్, 2019)

అడ్డదారి (రెండవ బహుమతి): అనుకున్నది సులభంగా సాధించడానికి అడ్డదారి తొక్కేవారుంటారు. అందువల్ల వారి శ్రేయోభిలాషులు కూడా అడ్డదార్లు తొక్కాల్సివస్తుంది. శ్రమ ఎవరికీ తప్పదు కానీ శ్రమ పడేవారు ఒకరికి ముగ్గురౌతారు. ఈ కథాంశంతో వసుంధర రచన ఇది.

కోనే నాగవెంకట ఆంజనేయులు (ఏప్రిల్, 2019)

కుండలు (మూడవ బహుమతి): కొన్న కుండకు చిల్లి ఉంటే ఎందుకు వెనక్కివ్వకూడదో చెప్పడానికి, కుండలు ఎలా తయారు చేస్తారో, ఆ తయారీలో ఎంత శ్రమ ఉందో ప్రబోధాత్మకంగా, సందేశాత్మకంగా చెబుతూ పిల్లలల్లో సామాజికస్పృహని పెంపొందించే చక్కని ప్రయత్నం ఈ కథ.

మక్కెన రామసుబ్బయ్య స్మారక & విశాలాక్షి మాసపత్రిక నిర్వహించినకథల పోటీలో బహుమతి పొందిన కథలు

సి. యమున (మే 2019)

చూపులు (ప్రథమ బహుమతి): పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లపై జరిగే అత్యాచారాల్లో ఒకటి అనతగ్గ స్థాయికి చేరుకున్న పెళ్లిచూపుల సంప్రదాయం మన వ్యవస్థకు పెద్ద మచ్చగా మారింది. ఆ పెళ్లిచూపుల వ్యవహారంపై ఎన్నో కథలు వచ్చాయి. రామాయణం ఎన్నిమార్లు విన్నా కొత్తగా అలరించినట్లు, ఆ కథలు ఎన్నిమార్లు విన్నా హృదయమున్న వారినెవరినైనా కలవరపరుస్తుంటాయి. పెళ్లిచూపులు కథాంశమైన ఈ రచన కూడా ఆ సమస్యని ప్రతిభావంతంగా ప్రదర్శించింది. ఐతే ‘మీకు మీరు నచ్చడం నాకు నచ్చింది’ అని వరుడు వధువుతో అన్న మాట మగువలకు ప్రబోధం, ఈ కథకు విశిష్టం.

గన్నవరపు నరసింహమూర్తి (జూన్ 2019)

ఆయుధం (ద్వితీయ బహుమతి): ఎన్నికల వాగ్దానాల్ని ఎన్నికకలవగానే మర్చిపోయే ప్రజాప్రతినిధుల్ని – ఎన్నికల్లో ‘నోటా’ ద్వారా ఓటునే ఆయుధంగా చేసుకుని సాధించిన పౌరుల కథ. సాధారణంగా అనిపించే కథాంశాశం తీసుకుని, సందేశాన్ని బలంగా వినిపించిన కథనం అద్భుతం.

పి.వి.ఆర్. శివకుమార్ (జూలై 2019)

గ్రహణం (తృతీయ బహుమతి): పనిలో నైపుణ్యంకంటే, పాత కక్షలకూ, అధికార దురహంకారానికీ ప్రాధాన్యమిచ్చే ఓ కంపెనీ వ్యవహారాలు కథాంశం. మానసిక విశ్లేషణ, పాత్రచిత్రణ, కథనం – అపూర్వం. ‘మాకు ఉరితాడు పడ్డట్టే – కాళ్లకింది పలకలు తొలగటమే తరవాయి’ – వంటి వాక్యాలు అపురూపం.

వంజారి రోహిణి (జూలై 2019)

నల్ల సూరీడు (తృతీయ బహుమతి): నేటికీ సమసిపోని కులవివక్ష, అహంకారం కథాంశం. సన్నివేశాలు వాస్తవానికి అద్దం పడుతూ మనసుని కదిలిస్తాయి. నల్లసూరీడు, ఇతర పాత్రల చిత్రణలో అవగాహన గొప్పగా ఉంది. ముగింపు పాత కథల్ని గుర్తు చేస్తూ మూసలో ఇమిడిపోయినా, ఈ కథకు అందాన్నిచ్చింది. కథనం ప్రశంసనీయమై ఈ కథను విశిష్టం చేసింది.

తెలుగు జ్యోతి వెబ్ పత్రిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో బహుమతి పొందిన కథల పరిచయం

కలవల గిరిజారాణి

నాన్న ఎవరు? (మొదటి బహుమతి): రత్నని తాగుడు మైకంలో చెరిచాడు కన్నతండ్రి. ఆ కోపంతో అతణ్ణి చంపేసి జైలుకెళ్లి అక్కడే కన్నుమూసింది కన్నతల్లి. చేరదీసిన పిన్ని కొన్నాళ్లే దగ్గరుంచుకుని ఓ దయామయి ఇంట్లో ఆశ్రయం కల్పించింది. ఆమెకు పుట్టిన కొడుకు బడిలో చేరేక తన తండ్రి గురించి అడిగితే, ‘నీకూ నాకూ నాన్న ఒక్కడే అని చెప్పలేని దౌర్భాగ్యపు సందిగ్ధం ఆమెది’ అంటూ కథ ముగుస్తుంది. వాస్తవాల్ని ప్రతిఫలించిన ఈ కథలో సృజనను ప్రతిఫలించే నవ్యత లేదు. ఆమె సందిగ్ధాన్ని కొసమెరుపు చేస్తూ – ఒక పేజీ కథగా వ్రాసి ఉంటే కథలో బిగి ఉండేదేమో!

బిట్ర సంధ్య

చాకిరేవు (రెండవ బహుమతి): ప్లాస్టిక్ సంచీలు, శానిటరీ ప్యాడ్సుల్ని ఎక్కడ పడితే అక్కడ పడెయ్యకుండా స్వచ్ఛభారత్ నిర్మాణానికి సహకరించాలని పర్యావరణపరంగా సందేశమిచ్చే రచన. చాకిరేవు పరంగా ఒకప్పటి చాకిరేవుని ప్రతిఫలించిన ప్రతిభ – సందేశాన్నుంచి కథను కూడా పుట్టిస్తే బాగుండేదనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here