బహుశా..

1
12

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన శ్రీ జె. ఎస్. వి. ప్రసాద్ గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు శ్రీమతి పుట్టి నాగలక్ష్మి.]

[dropcap]‘ఇ[/dropcap]క్ బంజారా గాయే జీవన్ కే గీత్ సునాయే హమ్ సబ్ జీనేవాలోంకో జీనేకీ రాహ్ బతాయే.. (ఒక బంజారా జీవితం అనే పాట పాడుతున్నాడు సాధారణ జీవితం గడిపేస్తున్న వారందరికీ అసలైన జీవితం గడిపే మార్గం చూపుతున్నాడు)

ఉదయం తొమ్మిది గంటలు.. సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసుకున్న ఇష్టమైన హిందీ పాటలు వింటూ చిన్న పిల్లవాడిలా ఎన్నో ఆట బొమ్మలు ముందు వేసుకుని కూర్చున్నాడు భానుమూర్తి.

ఆ బొమ్మలన్నీ.. ఏదో యుధ్ధంలో కాళ్ళు తెగి, చేతులు తెగి, నేలపై పడున్న సిపాయిల్లా ఉన్నాయ్. మూడేళ్ళ వయసు నుంచి ఐదేళ్ళ వయసు వరకూ రెండు సంవత్సరాల యుధ్ధం చేసి ఆ క్షతగాత్రుల్ని తయారు చేసిన యోధుడు భానుమూర్తి కొడుకు ఆ బుజ్జి పార్థసారథే..!

భీమవరం మొత్తానికి.. క్రేన్‌లకీ, ప్రొక్లైనర్‌లకీ స్పేర్ పార్టులు అమ్మే డీలర్ భానుమూర్తి. ఇప్పుడు డాక్టర్ అవతారమెత్తి గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, మొదలైన ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేస్తున్నాడు, మోటార్ బాగుండి చక్రాలు పాడైన టాయ్ కారుకి మోటార్ పాడైన కారు చక్రాలు తీసి అమర్చాడు, ప్రొఫెల్లర్ విరిగి పోయిన హెలికాప్టర్‌కి మరో పాడైన హెలికాప్టర్ ప్రొఫెల్లర్ తీసి అమర్చాడు. ఇప్పుడు ఆ రెండూ చక్కగా పని చేస్తున్నాయ్..! పార్థు సంతోషంతో చప్పట్లు కొడుతూ గంతులు వేశాడు.

“బాగుంది వరస.. షాపుకి వెళ్ళాలి, టైమై పోతోందని, టిఫిన్ అవలేదని, నా మీద గంతులు వేసి బొమ్మలతో ఆడుకుంటున్నారా..? టైం తొమ్మిదిన్నరయింది, ఇదిగో టిఫిన్..” అంటూ ప్లేట్ టీపాయ్ మీద పెట్టింది మూర్తి భార్య అరుణ.

“ఇది బొమ్మలతో ఆడుకోవడం కాదోయ్.. మరణించిన బొమ్మలకి ప్రాణం పోయడం. ఇదిగో ఈ కారు చూడు జనవరిలో మావుళ్ళమ్మ తీర్థంలో కొన్నాం. రెండు రోజులకే చక్రాలు పీకి పాకం పెట్టాడు, దీనికి చక్రాలు వేశాను, ఈ హెలికాప్టర్ శివరాత్రికి కొన్నాం, దీని రెక్కలు విరిచి మూలన పెట్టాడు, దీనికి కొత్త రెక్కలు వేశాను ఎలా ఎగురుతుందో చూడు..! దీనిమీద మీ అమ్మగారింటికి వెళతావేమిటి..?” అంటూ నవ్వాడు మూర్తి.

“నాకేమీ అవసరం లేదు. మీ షాపే దూరం కదా, మీరే ఎక్కి ఊరేగండి. సరేగానీ ఈ శవాలన్నీతీసి డస్ట్‌బిన్‌లో పారేయనా..?” అడిగింది అరుణ

“నో.. నో వాటిని శవాలనకూడదు, జన్మసార్థక దేహాలనాలి..!” అంటూ వాటిని ఒక అట్టపెట్టెలో వేశాడు మూర్తి. వాష్ బేసిన్లో చేతులు కడుక్కుని టిఫెన్ ప్లేటు అందుకున్నాడు. టీ.వీ.లో వస్తున్న ఒక వార్త అతని దృష్టిని ఆకర్షించింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక రిక్షా కార్మికుడి జేబులో.. ఎప్పుడైనా తను మరణిస్తే తన కళ్ళను అవసరమైన వారికి అమర్చవచ్చునంటూ రాసిచ్చిన డొనేషన్ కార్డు ఉంది. దాంతో అతను హీరో ఐపోయాడు అందరి దృష్టి లోనూ. ఆ వార్తతో బాటూ దేశంలో రోజూ ఎన్ని వేల మంది మరణిస్తున్నారో ఎన్ని వేల కళ్ళూ, కిడ్నీలూ, గుండెలూ, లివర్లూ మొదలైనవి వృథాగా మట్టిలో కలసి పోతున్నాయో, అగ్గిలో కాలిపోతున్నాయో సమయానికి దాతలు దొరకక ఎన్ని వేల పసిమొగ్గలు నేలరాలి పోతున్నాయో తెలిపే లేఖలు కూడా స్క్రోల్‌లో వేస్తున్నారు. ఈ అంకెలన్నీ అతను ఎన్నో సార్లు ఎన్నో పత్రికల్లో చదివాడు కానీ అతనిలో ఎప్పుడూ ఇంత అలజడి కలుగలేదు, నిరక్షరాస్యుడు, నిరుపేద అయిన ఒక రిక్షా కార్మికుడిలో ఉన్న ఆ సామాజిక స్పృహ భానుమూర్తిని అంతర్ముఖుణ్ణి చేసింది. షాపుకి వెళ్ళాక సెల్ లోని నెట్‌లో వెతికి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుని స్థిరంగా ఒక నిశ్చయానికి వచ్చాడు.

***

ఓ వారం రోజుల్లోపలే మోహన్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి అతనికి పోస్ట్‌లో ఒక కవర్ అందింది. ఆ రాత్రి షాపు నుంచి వచ్చాక భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు కవర్ లో నుంచి ఒక పాంప్లెట్ తీసి చదివి మౌనంగా భార్య చేతికిచ్చాడు. ఆమె దాన్ని చదువుతూ మధ్య మధ్య తలెత్తి భర్త వైపు చూడసాగింది, భానుమూర్తి కవర్లో నుంచి ఏ.టీ.యం కార్డు కంటే కొంచెం పెద్దగా ఉన్నకొన్ని అట్టముక్కలు తీశాడు. వాటి ఒక వైపు డోనర్ కార్డ్ అనీ, రెండోవైపు తెలుగులో బాడీ ఆర్గాన్స్ పేర్లూ ఉండి ఇవ్వదలచుకున్న ఆర్గాన్ ఎదురుగా టిక్ చేయమని ఉంది

భానుమూర్తి ఆల్ పార్ట్స్ ఆఫ్ మై బాడీ అన్న చోట టిక్ చేస్తుంటే అతని వైపు సజలనేత్రాలతో చూడసాగింది అరుణ. అప్పుడే ఎవరో వచ్చి అతని శరీర భాగాలను కోసి తీసుకు పోతున్నట్టు భయపడి పోయిందామె, కళ్ళనుంచి జలపాతాలు కారిపోతుంటే భర్తనల్లుకు పోయింది. భానుమూర్తి ఆమె తలను గుండెలకు హత్తుకున్నాడు. “పిచ్చి అరుణా, ఇది మరో యాభై సంవత్సరాల తర్వాతి సంగతి. ఈలోపు నాకేమీ కాదు ఒకవేళ ఏమైనా ఐనా కూడా నేను ఇంకో వందా నూట యాభై సంవత్సరాలు ఒకరిలో కాదు కనీసం నలుగురైదుగురిలో జీవించే ఉంటాను, మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటాను సరా..!?” అన్నాడు నవ్వుతూ.

అరుణ చటుక్కున అతని నోరు చేత్తో మూసేసింది, కన్నీళ్ళు టప టపా రాలి పోయాయ్.

అతనామెను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు “డోన్ట్ వర్రీ డార్లింగ్, మరణం అన్నది అనివార్యం అయినప్పుడు మనం మరణం తర్వాత కూడా జీవించే ప్రయత్నం చెయ్యాలి, తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.. అనేది అతి మామూలు బ్రతుకు..! ఆ బ్రతుకు అన్ని ప్రాణులూ బ్రతుకుతాయ్ కానీ.. పరమార్థవంతమైన బ్రతుకే అసలైన జీవితమంటే..!”

“జీవించి మనమొరుల జీవింప నిడుటకన్న జీవంతమైన ధర్నమేదేని కలదె ఇలను..?” అన్నాడో కవి. అటువంటి జీవితానికి ఇదే సులువైన మార్గం..!” అన్నాడు గంభీరంగా..

భర్త మాటలు మననం చేసుకుంటుంటే నెమ్మది నెమ్మదిగా ఆమె అపోహలూ, భయాలూ అన్నీ దూరం కాసాగాయ్. తనూ ఒక డోనర్ కార్డ్ తీసుకుని “ఐతే.. నేనెక్కడున్నా..” అంటూ పైకి చూసి “ఈ కళ్ళతో మిమ్మల్ని చూసుకోవచ్చన్న మాట..” అంటూ ‘కళ్ళు’ అన్నచోట టిక్ చేసి సైన్ చేసింది. మూర్తి ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు.

***

పార్థుకి చిన్నప్పటినుంచీ టాయ్‌నీ టాయ్‌నీ కలిపి కొత్త టాయ్‌నో కొత్తరకం టాయ్‌నో తయారు చేయడంలో ఉన్న ఆసక్తి క్లాస్ పుస్తకాల మీద ఉండేది కాదు. ఫలితంగా చదువులో ఎప్పుడూ వెనుకబడే ఉండేవాడు తల్లి మందలిస్తూనే ఉండేది కానీ తండ్రి బుజ్జగించేవాడు.

“ఇదేమిటి నాన్నా నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తావనుకుంటే..! పోనీలే చదువు మానేస్తావా..? టాయ్స్ ఫ్యాక్టరీ పెట్టుకుందామా..? టాయ్స్ షాపా..” అని అడిగేవాడు.

పార్థు మనసులో తండ్రికి సంతోషం కలిగించాలని ఉండేది “వద్దు లే నాన్నా ఈసారి బాగా చదువుతాలే” అనేవాడు. కానీ ఇంటర్ గట్టెక్కేసరికే అతనికి ఇరవైయ్యేళ్ళు వచ్చేశాయ్. అతని తండ్రి ముందు చూపుతో కొడుక్కి ఎప్పుడు శలవులు వచ్చినా తనతోబాటూ షాపుకి తీసుకు పోయేవాడు అలా పార్థుకి చదువుకన్నా వ్యాపారంలో బాగా అనుభవం వచ్చేసింది.

***

భానుమూర్తి షాపుకి వెళ్ళడానికి తయారై టిఫిన్ చేస్తుంటే ఫోన్ వచ్చింది.

రంగరాజు గారి సైట్‌లో ప్రొక్లైనర్ బ్రేక్‌డౌన్ అయిందట, అర్జంటుగా కొన్ని స్పేర్స్ కావాలంటూ వాళ్ళ డ్రైవర్ ఫొన్ చేశాడు.

భానుమూర్తి హుషారుగా తయారై బండి తాళాలు తీసుకుని, పర్స్ తెరిచి చూసుకున్నాడు

షాపు తాళాలూ, డోనర్ కార్డూ భద్రంగా ఉన్నాయ్. ఎప్పుడూ డోనర్ కార్డు జేబులో ఉంచుకోవడం అతనికి అలవాటై పోయింది. భార్యకి బై చెప్పి బండి స్టార్ట్ చేశాడు.

అతని షాపు ఉండీ రోడ్‌లో బైపాస్ రోడ్ దాటాక ఉంది. అక్కడికి వెళ్ళాలన్నా, రావాలన్నా ఉండీ రైల్వే గేట్ పెద్ద ప్రతిబంధకం..! ట్రైన్ కోసం గేట్ కానీ పడిందా.. కనీసం అరగంట..!

‘అరే గేట్ పడే టైమయిందే..’ అనుకుంటూ వేగం పెంచాడు భానుమూర్తి, ఇరవై గజాల దూరం నుంచే గేట్ పడుతున్న వార్నింగ్ హారన్ వినబడింది ‘అమ్మో..’ అనుకుంటూ అదే వేగంతో దూసుకుపోయాడు. గేటు అతని తలకి నాలుగడుగుల ఎత్తులో ఉండగానే సర్కస్ ఫీట్ చేసినట్టు తల బాగా వంచి వెళ్ళిపోయాడు సరిగ్గా అతని లాగే ఆలోచించిన ఒక ఆటో డ్రైవర్ కూడా అలాగే ఎదురొచ్చేసరికి ఆ ఆటోని తప్పించబోయి రోడ్ చివరకు వెళ్ళిపోయాడు భానుమూర్తి,

కట్ చేసినట్టున్న రోడ్ అంచు నుంచి స్లిప్ అయిన బైక్ వేగంగా డౌన్ లోకి దొర్లి పోయింది.

భానుమూర్తి ఎగిరి దూరంగా పడ్డాడు. హెల్మెట్ లేని అతని తల దేనికో తగిలి ఠంగ్ మంటూ ధ్వని చేసింది, క్షణాల్లో అక్కడ జనం మూగిపోయారు. వాళ్ళందరికీ అతను పరిచితుడే. ఎవరో అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. ఈలోగా పోలీసులే వచ్చేశారు, క్రింద పడ్డ తాళాలూ, పర్సూ తీసిచ్చి భానుమూర్తి వివరాలు చెప్పారు అక్కడివాళ్ళు. పర్సులో ఉన్న డోనర్ కార్డ్ చూడగానే పోలీసులు ఎలర్ట్ ఐపోయారు. డాక్టర్స్‌కి ఫోన్ చేసేశారు వెంటనే.

***

వరద ప్రవాహంలో ఆకులూ, అలములే కాదు పెద్ద పెద్ద చెట్టు చేమలు కూడా తేలిగ్గా కొట్టుకుపోయినట్టు కాలమనే ప్రవాహంలో రోజులూ, వారాలూ, నెలలూ, సంవత్సరాలూ కూడా కొట్టుకుపోయాయ్.

చదువు మానేసి తండ్రి వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు పార్థు. సెలవుల్లో తండ్రి ఇచ్చిన తర్ఫీదు ఇప్పుడిలా ఉపయోగపడింది. పైగా షాపులోని అందమైన ఫొటో ఫ్రేమ్ లోనుంచి నవ్వుతూ, ప్రేమ కురిపిస్తూ, కొండంత అండగా ఆశీర్వదిస్తున్నాడు తండ్రి.

***

ఆ రాత్రి షాపు నుంచి వచ్చాక స్నానం, భోజనం కానిచ్చి కొడుకు భానుప్రకాష్‌తో ఆడుకుంటుంటే రంగరాజు గారి ప్రొక్లైన్ డ్రైవర్ ఫోన్ చేశాడు. “కొన్ని స్పేర్ పార్ట్స్ కావాలి. ఇప్పుడిస్తారా రేపు ఇస్తారా..?” అని కూడా అడిగాడు. కానీ వ్యాపారం విషయంలో మంచి ఉత్సాహంతో ఉన్న పార్థు “పది నిముషాల్లో షాపు దగ్గరుండు వచ్చేస్తున్నాను” అంటూ గబ గబా తయారై బయల్దేరి పోయాడు. రంగరాజు గారి కంపెనీలో అతనికి పావలా వాటా కూడా వుంది. అదొక కారణం..!

డ్రైవర్‌కి కావలసిన సామాను ఇచ్చి పంపేశాక, కొంత సేపు తండ్రి ఫోటో వైపు ప్రేమగా చూసుకుని షాపు తాళాలు వేసుకుని ఇంటికి బయలు దేరాడు.

కొంత దూరం వరకూ స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. రోడ్‌కి మరో ప్రక్క ఆర్ అండ్ బీ వాళ్ళు ఎందుకోసమో తవ్వి, పూడ్చడం మరచిపోయిన పెద్ద పెద్ద గోతులు, వాటినుంచి తీసిన మట్టి గుట్టలూ ఉన్నాయ్, ఏదో ఆలోచిస్తూ బండి డ్రైవ్ చేస్తున్న పార్థు ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్‌కి దారివ్వడం కోసం కంగారులో బండిని ప్రక్కకు పోనిచ్చాడు. అదే అతను చేసిన తప్పు. అదుపు తప్పిన బైక్ మట్టి గుట్ట పైకి ఎక్కేస్తుంటే కంగారు పడి దూకేసిన పార్థు ఒక ఇరుకైన గోతిలోకి దొర్లి కూరుకుపోయాడు. బైక్ గుట్టమీదనుంచి జారి అతని మీద పడిపోయింది సన్నటి ఆ గోతిలో ఛాతీ వరకూ ఇరుక్కుపోయాడు పార్థు. పైగా పైన బైక్ బరువు.. ఎంత ప్రయత్నించినా అతను బైటికి రాలేకపోతున్నాడు బోరు బావిలో పడ్డ పిల్లవాడిలా ఉందతని పరిస్థితి.

టిప్పర్ డ్రైవ్ చేస్తున్న ‘క్లీనర్’ కళ్ళుమూసుకుని వేగం పెంచుకుని వెళ్ళిపోయాడు భయంతో. ఆహారపు వేటలో ఆక్కడే తిరుగుతున్న బారెడు తాచు పాముని చూడగానే అతని ప్రాణాలు పైకే పోయినట్టై పోయింది, అప్రయత్నంగా తండ్రి గుర్తొచ్చాడు, ‘నాన్నా..!’ అనుకున్నాడు లోపలే.

***

ఉండీ భాస్కర్ రెడ్డికి ఆరోజు ఒక సెటిల్మెంట్‌లో ఎనభై వేలు మిగిలాయ్. ఇంటిలో ఒంటరిగా పార్టీ చేసుకోవడానికి ఖరీదైన మందూ వగైరాలు తెచ్చుకున్నాడు.

అతని భార్య అనిత చుర చురా చూసిందతనివైపు. “తాగి తాగి ఆల్రెడీ ఒక లివర్ పోగొట్టుకున్నారు, అదృష్టం కొద్దీ ఎవరో మహానుభావుడి లివర్ దొరికింది, దీన్నైనా కాపాడుకోకుండా మళ్ళీ ఇదేమిటి పాడు అలవాటు, అప్పనంగా వచ్చిన డబ్బేకదాని ఇలా తగలేసుకుంటే ఎలా..? మళ్ళీ ఎప్పుడేమి కొనుక్కోవలసొస్తుందో..!?” అంటూ చిటపట లాడేసరికి అతనికి ఎక్కడో గుచ్చుకున్నట్టయింది. “ఒక్క పెగ్గుకే ఏమైపోదులే” అంటూ నిజం గానే కొద్దిగా పుచ్చుకుని భోజనం చేశాడు,

టీ.వీ.లో ఏదో హారర్ సినిమా వస్తుంది. కొంచం చూసేసరికి అతనికి మనసులో ఏదో తెలీని అలజడిగా అనిపించసాగింది. “లే త్వరగా పద పద పద పద” అంటూ చెవుల్లో ఎవరో మర్మర ధ్వని చేస్తున్నట్టు అనిపించసాగింది. అతను మౌనంగా కారు తాళాలు తీసుకుని బైటకు నడిచాడు.

‘ఏమీ తోచనప్పుడు కారులో ఒంటరిగా భీమవరం వరకూ వెళ్ళి రావడం అలవాటేగా సార్‌కి’ అనుకుంటూ అనిత తలుపులు మూసుకుంది. కారు భీమవరం వైపు వెళ్ళి పోయింది.

***

భీమవరం మల్టీప్లెక్స్ థియేటర్‌లో ఫ్యామిలీతో కలసి సినిమా చూస్తున్నాడు ఆర్.కె చౌదరి. ఆ రోజు అతని పెళ్ళి రోజు. ఉన్నట్టుండి అతని కుడి కంటి నుంచి నీళ్ళు కారసాగాయ్..!

భర్త పదే పదే కర్చీఫ్‌తో కన్ను తుడుచుకోవడం చూసింది లోకేశ్వరి. కంగారుగా అడిగింది భర్తని “అదేమిటి అలా నీళ్ళు కారుతున్నాయ్.. ఆపరేషన్ జరిగి ఇన్నాళ్ళైనా ఎప్పుడూ ఇలా జరగలేదే.. ఇప్పుడేమయింది..!?”

“ఏమో.. ఏమీ అర్థం కావడం లేదు. మనసులో కూడా ఏదో అనీజీగా ఉంది..” అన్నాడు

“ఇంటికి వెళ్ళి పోదామర్రా, మళ్ళీసారి ఇంకో మంచి సినిమాకి వద్దాం..” అన్నాడు పిల్లలతో జాలిగా. ఆ సినిమా పిల్లలకి కూడా నచ్చినట్లులేదు, సంతోషంగా “ఓకే డాడీ” అన్నారు.

వాళ్ళ కారు ఉండీ వైపు బయలు దేరింది ఆర్.కే చౌదరి ఇల్లు బైపాస్ రోడ్‌లో ఉంది.

బైపాస్ రోడ్‌కి దగ్గరవుతూండగా కారు హెడ్ లైట్ల వెలుగులో రోడ్ ప్రక్కనున్న మట్టి గుట్టల మధ్య అస్తవ్యస్తంగా పడిఉన్న బైక్ ని చూసి “అరే.. ఏదో యాక్సిడెంట్‌లా ఉంది” అంటూ కారాపి దిగాడు చౌదరి.

“యాక్సిడెంటైతే మనకెందుకండీ పోలీసులు చూసుకుంటారుగా” అంది లోకేశ్వరి.

“అతను మనవాడే అయినా కూడా అలాగే అంటావా..?” అంటూ అటు నడిచాడు.

***

వేగంగా తన కారుని దాటిపోయిన టిప్పర్‌ని చూసి ‘వీడెక్కడొ యాక్సిడెంట్ చేసే ఉంటాడు’ అనుకున్నాడు భాస్కర్ రెడ్డి తనలో తను.

బైపాస్ రోడ్ దాటాక రోడ్ ప్రక్కన ఆగి ఉన్న కారుని చూసి ‘ఇది ఆర్.కే.గాడిది కదూ, ఆ టిప్పర్ వాణ్ణి కానీ గుద్దేసిందేమో..!’ అనుకుంటూ ప్రక్కనే తన కారు ఆపాడు. ‘కారులో ఆర్.కే ఫామిలీ ఉంది మరి వాడేడీ’ అనుకుంటూ చుట్టూ చూశాడు.

రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఆ ఇద్దరూ బద్ధ శత్రువులు, ఇద్దరి మధ్యా తడిచిన గడ్డి కూడా పెట్రోల్ వేసినట్టు మండుతుంది.

గోతిలో నుంచి బైక్‌ని బయటికి లాగడానికి ప్రయత్నిస్తున్న ఆర్.కే. ని చూసి గబ గబా దగ్గరకు వెళ్ళి తనూ సాయం చేశాడు. తల తిప్పి చూసిన చౌదరి మొహంలో ఏ భావమూ లేదు.

ఇద్దరూ కలసి బైక్‌ని ప్రక్కకు తీసి, పార్థుని బయటకు లాగారు, అతని చర్మం అక్కడక్కడా కొట్టుకు పోయింది. ఫ్రాక్చర్స్ ఏమీ కాలేదు, భాస్కర్ రెడ్డి చొరవగా ఆర్.కే కారు లోనుంచి వాటర్ బాటిల్ తెచ్చి కొంచెం పార్థుకి తాగించాడు. మిగతా నీళ్ళు తను గాయాల మీద పోస్తుంటే ఆర్.కే. కడిగాడు.

పార్థుకి వాళ్ళిద్దరూ తెలుసు, వాళ్ళ మధ్య నున్న భయంకరమైన వైరం తెలుసు. కానీ తనకి సాయం చేయడంలో వాళ్ళ ఐకమత్యం చూస్తుంటే అతనికి మతిపోతోంది.

“మీరు ఎక్కడికి వెళ్ళాలి..? బండి డ్రైవ్ చేయగలరా..? నేను డ్రాప్ చేయనా..?” అడిగాడు ఆర్.కే చౌదరి.

“నీ బండిలో ఫ్యామిలీ ఉందిగా.. నేను అటు వైపే వెళుతున్నాను నేను డ్రాప్ చేస్తాలే..”

పార్థు ఇద్దరికీ చేతులు జోడించి నమస్కరించాడు “థాంక్స్ అండీ దేముడే పంపినట్టు వచ్చి ప్రాణాలు కాపాడారు. పర్వాలేదు సార్ నేను వెళ్ళగలను” అంటూ మళ్ళీ చేతులు జోడించి వెళ్ళి బండి స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరూ కూడా తమ వాహనాల వరకూ మౌనంగా నడిచి వెళ్ళి అక్కడ ఒకరి నొకరు చుర చురా చూసుకుంటూ కార్లెక్కి చెరో వైపూ వేగంగా వెళ్ళిపోయారు.

***

చిన్న పిల్లవాడిలా తల్లి ఒడిలో తల పెట్టుకుని ఉద్వేగం తోకదిలి పోతూ చెపుతున్నాడు పార్థు. ఆ టిప్పర్ తనని గుద్దేస్తే ఏమయ్యుండేదో.. ఇద్దరు బద్ద శత్రువులు తనెవరో తెలియకపోయినా తన కోసం స్నేహితుల్లా చేతులు కలిపి ఎంత శ్రమపడి తనని రక్షించారో వివరంగా చెప్పాడు.

“మేము ఏ జన్మలో ఏ పుణ్యాలు చేసుకున్నామో..? నీలాంటి బిడ్డ కలిగాడు నాన్నా. ఈ జన్మలో మీ నాన్నగారు చేసిన దానాలే ఇవాళ నిన్ను ప్రాణాలతో ఇంటికి చేర్చాయ్.” అంటూ గోడకున్న భర్త ఫొటో వైపు ఆరాధనగా చూసింది అరుణ.

ఆ ఫొటో క్రింద రాసుందిలా

‘అవయవ దానం మహా దానం.. మరణించాక కూడా నలుగురిలో బ్రతికుండేవాడే మనిషి’

అది చదువుతుంటే పార్థుకి హఠాత్తుగా ఏదో స్పురించింది. శరీరమంతా ఉద్వేగంతో సన్నగా వణికిపోతుంటే చటుక్కున లేచి కూర్చుని తల్లి మొహం లోకి చూస్తూ అన్నాడిలా..

“ఐతే.. అమ్మా బహుశా.. వాళ్ళిద్దరి లోనూ.. బ.. హు.. శా..”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here