రంగుల హేల 15: బైట నుంచి ప్రేమిద్దాం

2
9

[box type=’note’ fontsize=’16’] “అందరినీ కలుపుకుంటూ జరుగుతున్న మార్పుల్ని అంగీకరిస్తూ కాలంతో పాటు ప్రయాణించక తప్పదు. జరిగిన పరిణామాలనుంచి నేర్చుకుంటూ పోవాలి తప్ప నిష్ఠూరాలూ, నిందలూ, ఉక్రోషాలూ, శాపనార్థాలూ విజ్ఞత కాదు” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]ప్రే[/dropcap]మ అనే పదార్ధం తగు మాత్రంగా ఉండవలసిన ఉప్పులాంటిది. అధికమైతే వికటిస్తుంది. దురదృష్టవశాత్తూ ఈ మోతాదు దగ్గరే సమస్య వస్తోంది. ప్రేమ మోతాదు ఎక్కువయ్యి కొందరు సమాజంలో విషం చిమ్మే దిశగా ప్రయాణిస్తున్నారు.

సాధారణంగా మనుషులందరికీ విజ్ఞత ఉంటుంది. పెద్ద పెద్ద డిగ్రీలూ, పాండిత్యాలూ, డాక్టరేట్ లను పక్కన పెడితే సామాన్య ప్రజానీకం అనబడే వార్తాపత్రికలు చదవలేని వర్గం వారికి కూడా ఇవాళ టీవీ లొచ్చాక ప్రతి విషయం పట్లా అవగాహన ఏర్పడుతోంది.ఇది శుభ పరిణామం. ఎవరూ పనిగట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లి అవగాహనా సదస్సులు పెట్టే అవసరం లేదు. వారికేం కావాలో వారు ఆలోచించుకోగలరు. మనం మేధావులం విశ్లేషణ చెయ్యగలం అనుకున్నవాళ్లు బోర్లాపడుతున్నారు.

ఏది ఎంతవరకూ మనకు ఉపయోగం లేదా నిరుపయోగం అన్న దృష్టి కోణం ప్రజలందరికీ అవసరం. ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా విస్తరణ పుణ్యమా అని ఆ విధమైన పరిజ్ఞానం అందరికీ కలుగుతోంది. ఇప్పుడు ఖచ్చితంగా మనం పురోగమిస్తున్నాం అని గుండెలపై చేయి వేసుకుని చెప్పుకోవచ్చు. కామన్ మాన్ తనకి కావలసినంత మేరా అతను పరిపూర్ణ జ్ఞానవంతుడౌతున్నాడు. అతనేదో రాజకీయ పరిజ్ఞానం తక్కువ గలవాడనీ అమాయకుడనీ ఎవరూ జాలిపడవలసిన అవసరం లేదు. నోరులేని పసిపిల్లలకు తమను ఎవరు ప్రేమగా చూస్తున్నారో తెలుస్తుంది ప్రజలకు కూడా అంతే.

ఎటొచ్చీ నాకేంటి లాభం? మనకేంటి? మనోళ్లకేంటి? అని స్వార్ధంతో లెక్కలు వేసుకున్నవాళ్ళు మాత్రం అయోమయంలో పడుతున్నారు. దానికి కారణం వాళ్ళు పెట్టుకున్న రంగు కళ్ళద్దాలే!

రక రకాల కారణాల వల్ల మనం రాజకీయనాయకుల్ని అభిమానిస్తూ ఉంటాం. అభిమానం అతిశయించి మనం వారి కోట లోపలికి వెళ్ళిపోతే బైటికి వెళ్లే తలుపులు మూసుకుపోతాయి. లోపలంతా బావున్నట్టుంటుంది. పొగాకు చుట్టేవాడితో సహా చుట్టూ కూర్చుని ఉన్నవారికి ఆ పొగాకు వాసన తెలీదు బైటనుంచి వచ్చినవాడికి తప్ప. దురభిమానం ఎక్కువయ్యి ఆత్మీయ వర్గంలో చేరిపోతే అంధత్వం కమ్మేస్తుంది. పక్షపాతపు రంగు కళ్ళజోడు సహజమైన చూపును చంపేస్తుంది. బైటివారికి పాకుతున్న వాసనను మన నాసిక పసికట్టలేక పోతుంది. చివరికి బైటికొచ్చి చూసాక కానీ నిక్కమైన నిజం తెలీదు. అప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోతుంది.

మన చిన్న కుటుంబంలోనే ఎన్నో విప్పరాని ముళ్ళూ, చక్కదిద్దలేని సమస్యలు మనతో ప్రయాణిస్తూ ఉంటాయి. అలాగే మన జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అంతులేని సమస్యలు అనేకానేకం ఉంటాయి. వాటిని కల్మషరహితమైన మనసుతో అర్థం చేసుకుంటే పరిష్కారం దిశగా అడుగులు వెయ్యవచ్చు.

విశాల మానవ సమాజ హితం కోసం జరిగిన ఏర్పాట్లలో భాగమే రాజకీయాలు. ఎవరూ ఎక్కడా శాశ్వతం కాదు. అందరినీ కలుపుకుంటూ జరుగుతున్న మార్పుల్ని అంగీకరిస్తూ కాలంతో పాటు ప్రయాణించక తప్పదు. జరిగిన పరిణామాలనుంచి నేర్చుకుంటూ పోవాలి తప్ప నిష్ఠూరాలూ, నిందలూ, ఉక్రోషాలూ, శాపనార్థాలూ విజ్ఞత కాదు.

కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. వ్యక్తిగతంగా, ప్రాంతపరంగా, జాతిపరంగా ఎదురైన హేళనలూ, అవమానాలూ సహనంతో ఎదుర్కొన్నవారికి ఫలితం తియ్యని కానుకగా ఎదురు వస్తుందన్న పాఠం మనం ఆనందంగా మరొకసారి మననం చేసుకుందాం.

దృతరాష్ట్రుడి కేమైనా జ్ఞానం తక్కువ ఉందా? తప్పొప్పులు తెలియవా? తెలిసి తెలిసీ గుడ్డిగా కొడుకును ప్రేమించాడు. విపరీతమైన పుత్ర వ్యామోహంతో అతడు చేసే అరాచకాలను తప్పు అని చెప్పలేకపోయాడు. చూసీ చూడనట్టు ఊరుకున్నాడు. ఫలితంగా అనుభవించాడు. విచక్షణ అనే జ్ఞానం నేత్రం తెరిచి ఉంచుకున్నట్టయితే కౌరవ కుల నాశనం కాకపోయేది.

అలాంటి గుడ్డి ప్రేమలు మనకొద్దు. వ్యక్తులపై మితిమీరిన అభిమానాలు వద్దు. అందరికీ ప్రేమ, గౌరవం సమానంగా పంచుదాం. మెరుగైన జీవనం కోసం తీసుకున్న జనత నిర్ణయాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. వారికో నమస్కారం.

మనం మనంగానే ఉందాం. ఉచితజ్ఞతను పాటిద్దాం. ఎటువంటి గ్రూపుల్లోనూ ప్రవేశించకుండా మనల్ని మనం నియంత్రించుకుందాం. మనది సహృదయ వర్గం . స్ఫటికం లాంటి నిజాన్ని నిజాయితీగా గుర్తిద్దాం. నిర్భయంగా చర్చిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here