బలహీన క్షణం

0
9

[dropcap]అ[/dropcap]వి కరోనా ఉధృతంగా కొనసాగుతున్న రోజులు. వివిధ రాష్ట్రాలు తమకు నచ్చిన రీతిలో లాక్‌డౌన్‍లు విధిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒంగోలు సమీపంలో ఉన్న ఒక కుగ్రామంలో పూజారిగా పనిచేయసాగాడు సదాశివశాస్త్రి. ఆయన్ను ఆ ఊరిలో అందరూ ‘శాస్త్రిగారు’ అని గౌరవంగా పిలుస్తారు. గుడికి వచ్చినవారికి నిష్ఠగా, వచ్చినవారు సంతృప్తి పడేలా పూజ చేసి వారు ఎంత ఇస్తే అంత దక్షిణగా పుచ్చుకునేవాడాయన. శాస్త్రి గారికి ఒక్కడే కొడుకు. పేరు గణేష్. హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఈ మధ్యే జాయిన్ అయ్యాడు. కరోనా కారణంగా గణేష్ కూడా ‘వర్క్ ఫ్రమ్ హోం’ స్కీం కింద ఇంటి దగ్గర నుంచే పనిచేయడం మొదలు పెట్టాడు. లాక్‌డౌన్ కారణంగా గుడికి వచ్చి పోయే భక్తుల సంఖ్య బాగా తగ్గింది. గుడికి కూడా ఆంక్షలు విధించారు.

భక్తులు ఎవరూ రావడం లేదని ఆలోచిస్తున్న శాస్త్రి దగ్గరకు అటుగా వెళుతున్న ఆ గుడి ధర్మకర్త రాయుడు వచ్చాడు. “ఏమిటి శర్మగారు! దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? కారణం నేను కూడా తెలుసుకోవచ్చా?” అని అడిగాడు. దానికి శాస్త్రి “రాయుడు గారు! నేను శర్మను కానండీ, శాస్త్రిని” అని నవ్వుతూ నమస్కరించాడు. రాయుడు నవ్వుతూ ప్రతినమస్కరిస్తూ “శాస్త్రి గారు! శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివే అని అన్నారు కదా! అంతా ఒకటే. ఏమిటి విషయం అలా దిగాలుగా కూర్చున్నారు” అని అడిగాడు. దానికి శాస్త్రి “రేపు నా భార్య రుక్మిణమ్మకి కంటి ఆపరేషన్ చేయించాలి. ఏదో దేవుడి దయ వలన నాలుగు రూపాయలు సమకూరాయి, ఈ లాక్‌డౌన్ వేళల్లో ఒంగోలు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నాను రాయుడు గారు” అని నిట్టూర్చాడు.

రాయుడు ఆశ్చర్యంగా “మీ పెద్ద తమ్ముడిని కారు పంపమనండి, మీ చిన్న తమ్ముడు కూడా ఒంగోలు లోనే ఉన్నాడు కదా” అన్నాడు. శాస్త్రి దిగాలుగా “అయ్యా! నా తమ్ముళ్ళు, వారి భార్య పిల్లలతో వారి సంసారాలు ఈదుతుంటారు, వారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఆలోచిస్తున్నాను” అన్నాడు. రాయుడికి విషయం అర్థమైంది. దాంతో “మీరేమీ బాధపడకండి శాస్త్రి గారు, నా కారు ఇచ్చి, మా డ్రైవర్ రాంబాబును కూడా పంపిస్తాను, దేవునికి మొక్కుకుని ఆపరేషన్ విజయవంతంగా చేయించండి. ఆపరేషన్ అవగానే నాకు ఫోన్ చేయండి, తిరుగు ప్రయాణానికి అదే డ్రైవర్‍కు కారు ఇచ్చి పంపిస్తాను.” అని శాస్త్రి భుజం మీద చెయ్యి వేసి భరోసాగా చెప్పాడు. దానికి ఆనందంతో శాస్త్రి “మీ సహాయానికి శతకోటి వందనాలు రాయుడు గారు, మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడు” అంటూ రాయుడి చేతులు పెట్టుకున్నాడు.

రాయుడు నవ్వుతూ “ఎంతమాట శాస్త్రి గారు! మీరు పూజలు గట్టిగా చేయబట్టే మేము ఇవాళ నాలుగు డబ్బులు సంపాయించగలిగి ఇలా ఉన్నాం. జాగ్రత్తగా వెళ్లి రండి” అని దేవుడికి దండం పెట్టుకుని గుడి నుంచి వెళ్ళిపోయాడు. లాక్‌డౌన్ సమయం దగ్గర పడడంతో శాస్త్రి కూడా గుడి మూసేసి ఇంటికి చేరాడు. శాస్త్రికి ఇద్దరు తమ్ముళ్లు. పెద్ద తమ్ముడు రాజా రామ్ ఒంగోలు లోని ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పెద్ద స్థాయిలో ఉన్నాడు. చిన్న తమ్ముడు శంకర రామ్ కూడా ఒంగోలు లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పేదరికం వలన శాస్త్రి తండ్రితో పాటు గుడిలో పూజారిగా పనిచేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ చదువును ఆపేసాడు. శాస్త్రి పెళ్ళి కాకముందు వరకూ తన సంపాదన మొత్తం తండ్రికి ఇచ్చి తమ్ముళ్ళ చదువుకు వినియోగించమనేవాడు. అలా రాజా రామ్, శంకర రామ్‍లు ఇద్దరూ చదువుకుని మంచి స్థాయికి ఎదిగారు. శాస్త్రి మాత్రం మాములు గుడి పూజారి గానే మిగిలిపోయాడు. దాంతో అన్న శాస్త్రి అంటే తమ్ముళ్ళు ఇద్దరికీ లోకువ. ఆదాయం తక్కువ కావడంతో రాయుడు లాంటి వాళ్ళు శాస్త్రికి సహాయం చేస్తుంటారు. శాస్త్రి కొడుకు మంచి తెలివితేటలు గలవాడు కావటంతో రాయుడితో పాటు మిగిలిన గుడి ధర్మకర్తలు కూడా తలో చెయ్యి వేసి అతన్ని చదివించారు.

***

ఆ మరునాడు శుక్రవారం శాస్త్రి పొద్దున్నే లేచి పూజ చేసుకుని భార్యతో సహా సిద్ధమయ్యాడు. తమ్ముళ్ళు ఇద్దరికీ ఫోన్ చేసి తన భార్య ఆపరేషన్ గురించి చెప్పాడు. వారిద్దరూ “ఏ ఆసుపత్రిలో ఆపరేషన్” అని వాకబు చేసారు కానీ “మా ఇంటికి రండి” అని కూడా అనలేదు. వారి గురించి తెలిసే శాస్త్రి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆపరేషన్ మూలాన తాను గుడికి రాలేనని ధర్మకర్తలకు చెప్పి గుడి అర్చకత్వానికి తన స్నేహితుడిని పురమాయించాడు. చెప్పిన సమయానికి రాయుడు శాస్త్రి ఇంటికి కారు పంపించాడు. శాస్త్రి, శాస్త్రి కొడుకు గణేష్, శాస్త్రి భార్య రుక్మిణమ్మ కారులో ఒంగోలు బయలుదేరారు. డ్రైవర్ రాంబాబుకు అడ్రస్ చెప్పడంతో, అతనికి కూడా ఊరు బాగా తెలవడంతో చాలా త్వరగానే హాస్పిటల్ చేరాడు శాస్త్రి. కారు దిగి తనకు తెలిసిన లెక్కలు వేసి రాంబాబుకు డబ్బులు ఇవ్వబోయాడు శాస్త్రి. కానీ అతను తీసుకోకుండా “రాయుడు గారు తీసుకోవద్దన్నారు” అని నమస్కారం పెడుతూ బలవంతంగా డబ్బు శర్మ చేతిలో పెట్టాడు. “మా మామయ్య గారి ఇల్లు కూడా ఇక్కడే. అరగంట ప్రయాణం. అంతే. నేను అక్కడికి వెళ్తున్నాను. అమ్మగారికి ఆపరేషన్ అయిపోగానే నాకు ఫోన్ చేయండి. నేను వస్తాను. రాయుడు గారు దగ్గరుండి తీసుకురమ్మన్నారు” అని రాంబాబు వెళ్ళిపోయాడు. ఆ తరువాత శాస్త్రి హాస్పిటల్లో వివరాలు నమోదు చేయించి, ప్రాథమిక పరీక్షలు చేయించి ప్రత్యేకంగా గది తీసుకున్నాడు. మరునాడు ఆపరేషన్ చేసి ఇంటికి పంపిస్తామని డాక్టర్ చెప్పాడు. అప్పటికి సమయం సాయంత్రం అయిదు గంటలు. శాస్త్రి చిన్న తమ్ముడు శంకర రామ్ హాస్పిటల్ కు వచ్చాడు. శాస్త్రిని కలిసి పరిస్థితి వాకబు చేసాడు. వచ్చినప్పటి నుంచి ఎప్పుడు, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉన్న శంకర్ రామ్ వాలకం శాస్త్రి కన్ను దాటి పోలేదు. అయినా ఏమీ నొచ్చుకోకుండా సమాధానం చెప్పాడు. చివరికి “వెళ్తున్నా అన్నయ్య” అని శంకర్ రామ్ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడు. దాంతో శాస్త్రి భార్య “ఏమండీ! మనల్ని ఇంటికి రమ్మని మీ తమ్ముడు అనలేదే” అని అడిగింది. దానికి శాస్త్రి “మనం వాడింటికి వెళ్తే వాడికి మూడు భోజనాలు ఖర్చు కదా” అని నవ్వాడు.

***

సమయం రాత్రి ఏడు. అప్పుడు గానీ శాస్త్రికి భోజనాల గురించి గుర్తుకు రాలేదు. ఆ హాస్పిటల్లో క్యాంటీన్ గురించి వాకబు చేసాడు. కానీ కరోనా కారణంగా హాస్పిటల్‍కు వచ్చే వారి సంఖ్య తక్కువ కావడంతో క్యాంటీన్ తాత్కాలికంగా మూసివేశారని తెలిసింది. దాంతో బయట భోజన హోటల్స్ ఏమైనా ఉంటాయేమోనని హాస్పిటల్ బయటకు నడిచాడు. బయట కూడా ప్రతి దుకాణం లాక్‍డౌన్ కారణంగా మూసి ఉంది. అప్పుడు శాస్త్రికి ఎదురుగా ఎరుపు రంగు చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతని దగ్గరకు వెళ్ళి “ఇక్కడ ఏమైనా శాఖాహార భోజన హోటల్ ఉందా బాబు” అని అడిగాడు. ఆ వ్యక్తి శాస్త్రి వంక తేరిపార చూసి “ఇక్కడ ఏ దుకాణం ఈ సమయంలో ఉండదు. పంతులు గారు, ఇది లాక్‌డౌన్ టైం కదా! అందుకని అన్నీ దుకాణాలు మూసివేసారు” అని జవాబిచ్చాడు. శాస్త్రి నిరాశతో తిరిగి వెళ్ళిపోతుండగా ఆ వ్యక్తి “మీరెందుకు ఈ సమయంలో ఇక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చా” అని అడిగాడు. దానికి శాస్త్రి “ఇక్కడ దగ్గరలోని ఓ ఆసుపత్రిలో రేపు నా భార్యకు కంటి శుక్లాల ఆపరేషన్ బాబు, అందుకని పొరుగూరు నుంచి నేను, నా భార్య, నా కొడుకు వచ్చాము” అన్నాడు. దానికి ఆ వ్యక్తి “మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయవచ్చు. మా ఇల్లు ఈ పక్క వీధిలోనే” అని అన్నాడు. ఆ సమాధానంతో తటపటాయిస్తున్న శాస్త్రిని పైనుంచి కింద దాకా తేరిపారా చూసి ఆ వ్యక్తి “పంతులు గారు! మీ వయసు వారికి షుగర్ వ్యాధి ఉండటం సహజం. మీరు సరైన సమయానికి తినకపోతే మీ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. మీ భార్యకు రేపు ఆపరేషన్ అంటున్నారు. దాని కోసమైనా మీరు, మీ భార్య, మీ కుమారుడు మా ఇంటికి రండి. మీరు తినే శాఖాహార భోజనమే మా ఇంట్లో కూడా తయారుగా ఉంది” అని అభ్యర్థించాడు. శాస్త్రికి మనస్కరించక “మాకు పస్తులు అలవాటే బాబు. మీ ఆహ్వానానికి ధన్యవాదములు” అని హాస్పిటల్‍కు వెళ్ళిపోయాడు. భార్యతో భోజనం దొరకలేదనే విషయం చెప్పి బాధపడ్డాడు. అరగంట తరువాత ఎవరో గది తలుపులు తట్టడంతో శాస్త్రి వెళ్లి తలుపు తీసాడు. హాస్పిటల్ బయట కనిపించిన ఎరుపు రంగు చొక్కా వేసుకున్న‌‌‌ వ్యక్తి నవ్వుతూ నమస్కరించాడు. శాస్త్రి ఆశ్చర్యంగా “బాబు! మీరేమిటి ఇలా వచ్చారు?” అని ప్రశ్నించాడు. ఆ వ్యక్తి “మీ కుటుంబసభ్యులకు భోజనం తీసుకువచ్చాను. మా ఇంటికి రావడానికి మీకు అభ్యంతరమేమోనని అనుమానం వచ్చింది. అందుకే క్యారేజీలో సర్ది తెచ్చాను. తృప్తిగా భోజనం చేయండి. నేను బయట ఉంటాను” అని భోజనం క్యారేజి బలవంతంగా శాస్త్రి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఒక వైపు కడుపులో ఆకలిమంట, మరో వైపు తాను నమ్మే ధర్మం. ఆ బలహీన క్షణాన్ని ఎలా దాటాలో తెలియక తటపటాయిస్తున్న శాస్త్రితో భార్య “ఏవండీ! మీ అన్నదమ్ములు పట్టెడన్నం పెట్టలేదు. మీ పెద్ద తమ్ముడు ఆసుపత్రి వైపే రాలేదు. వచ్చామా లేదా అని ఫోన్ కూడా చేయలేదు. ఇందాక వచ్చిన మీ చిన్న తమ్ముడు ఇంటికి రమ్మనలేదు సరికదా కనీసం భోజనం ఎలా చేస్తున్నారు అని కూడా అడగలేదు. ముగ్గురు మనుషుల భోజనం తేలేడా? ఇతను ఎవరో కానీ మన పరిస్థితి గుర్తించి భోజనం తెచ్చాడు. మనందరం కలిసి తిందాం” అంటూ క్యారేజీ మూతలు తీసి భర్తకు, కొడుక్కి, అందించింది. అయినా శాస్త్రి ఆ భోజనం వంక చూస్తూ ఆలోచనలో పడ్డాడు. అయినా ఆ క్షణం తను నమ్మిన సిద్ధాంతాలు, నమ్మకాలు మెదడులో తిరగసాగాయి. వేరే కులానికి చెందినవారు తమ డబ్బుతో తన కుమారుడిని చదివిస్తే తప్పు కానపుడు వేరే కులానికి చెందిన వారి తిండి తింటే తప్పులేదు అని మనస్సాక్షి చెప్పసాగింది. చివరికి మనసు మాట విని భోజనం చేసాడు.

ఆ క్షణం అతనికి బలహీన క్షణంలా అనిపించింది. ఆకలి, అవసరం ముందు ఓడిపోయినట్లుగా భావించాడు. ఒక గంట తర్వాత ఆ ఎరుపు రంగు చొక్కా వేసుకున్న‌‌‌ వ్యక్తి మరలా వచ్చి కడిగి ఆరబెట్టిన క్యారేజి డబ్బాలు చూసి “పంతులు గారు! భోజనం బాగుందా!” అని అన్నాడు. అప్పుడు శాస్త్రి అతనికి నమస్కరిస్తూ “బాబు! మీరెవరో కానీ ఇవాళ మా ముగ్గురి కడుపులు నింపారు. అన్నీ బాధల్లోకల్లా ఆకలి బాధ చాలా ప్రమాదకరం. దానిని తట్టుకోవడం కంటే మరణమే మేలు. మీ పేరు తెలుసుకోవచ్చా?” అన్నాడు. దానికి ఆ వ్యక్తి “నా పేరు కంటే మీరు ఆప్యాయంగా బాబు అన్నారు కదా, అదే నా హృదయాన్ని తాకింది. నన్ను బాబు అనే పిలవండి. జాగ్రత్తగా ఉండండి. నేను బయలుదేరతాను. నా భార్య నా కోసం ఎదురు చూస్తుంటుంది. కరోనా కాలం కదా. తను ఆదుర్దా పడుతుంటుంది.” అని శాస్త్రికి, అతని భార్య కు నమస్కరించి వెళ్ళిపోయాడు.

***

మరునాడు గురువారం. ఉదయం ఏడు గంటలకు ఎవరో తలుపు తట్టడంతో శాస్త్రి తలుపు తీసాడు. ఎరుపు రంగు చొక్కా వేసుకున్న‌‌‌ వ్యక్తి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. శాస్త్రి ఆశ్చర్యంగా “ఏమిటి బాబు! మళ్ళీ వచ్చారు” అని అడిగాడు. దానికి బాబు “బయట టిఫిన్లు చేస్తారేమో అని ముందుగా మా ఇంటి నుంచి మీకు టిఫిన్ తీసుకుని వచ్చాను పంతులుగారు, బయట ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు” అని బలవంతపెట్టడంతో మొహమాట పడుతూనే క్యారేజి తీసుకోక తప్పలేదు శాస్త్రికి. టిఫిన్ చేసాక బాబు ఫ్లాస్క్‌లో కాఫీ కూడా శాస్త్రికి, అతని భార్యకు, కొడుకుకూ ఇచ్చాడు. అలా టిఫిన్ పూర్తి చేసిన శాస్త్రి భార్యను తీసుకుని ఆపరేషన్ థియేటర్‍కు బయలుదేరాడు. డాక్టర్ పిలవడంతో భార్యకు ధైర్యం చెప్పి ఆపరేషన్ గదిలో భార్యను వదిలి బయటకు నడిచాడు. భయంతో కూర్చొన్న శాస్త్రికి బాబు, శాస్త్రి కుమారుడు ధైర్యం చెప్పారు. సమయం రెండు గంటలు అయ్యేసరికి శాస్త్రి భార్యను ఒక నర్సు వీల్ చైర్‍లో కూర్చోబెట్టి తీసుకువచ్చింది. భార్య కంటికి నల్ల కళ్ళజోడు చూసి శాస్త్రి ఆందోళనకు గురి అయ్యాడు. బాబు శాస్త్రికి ధైర్యం చెప్పి నర్సు సాయంతో వారికి కేటాయించిన గదికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు.

“డాక్టర్ గారు! సాయంత్రం వచ్చి పరీక్షించి ఇంటికి పంపుతారు” అని చెప్పి నర్సు వెళ్ళిపోయింది.

ఒక గంట తరువాత బాబు మళ్ళీ భోజనం క్యారేజీ తీసుకుని వచ్చాడు. తానే స్వయంగా శాస్త్రి కుటుంబానికి భోజనం వడ్డించాడు. ఈ సారి మాత్రం ఏం ఆలోచనా, తడబాటు లేకుండా శాస్త్రి భోజనం చేసాడు. “ఇప్పుడే వస్తాను పంతులుగారు” అని బాబు ఖాళీ అయిన క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోబోయాడు. శాస్త్రి ఆనందంతో “బాబు! మేము మీకు చాలా రుణపడి పోయాం. ఇప్పటికైనా మీ పేరు చెప్తారా” అని అడిగాడు. బాబు నవ్వుతూ “ ఈ ప్రపంచంలో జరిగే ప్రతీ పని వేరే పనితో సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఇంకెవరికో సాయం అనే బాధ్యత చేసుంటారు. నేను కూడా మీకు ఇప్పుడు అదే బాధ్యతను చేసాను. మనందరమూ మనుషులమే కదా! సాటి వాని కోసం పనిచేయడం సాటి మనిషిగా మనిషి బాధ్యత. ఇక ఈ విషయంలో రుణాలు ఎక్కడున్నాయి. నా పేరు అడిగారు కదూ, నన్ను దాసు అంటారు” అని వెళ్ళిపోయాడు. సమయం అయిదు గంటలు అయ్యేసరికి నర్సు వచ్చి శాస్త్రి భార్యను డాక్టర్ దగ్గరకు పరీక్షలకు తీసుకెళ్ళింది. ఆమెను పరీక్షించిన డాక్టర్ అంతా సవ్యంగానే ఉన్నదని కొన్ని టాబ్లెట్లు, కంటి చుక్కలమందు రాసిచ్చాడు.

డాక్టర్ గదిలోంచి బయటకు రాగానే నర్సు టాబ్లెట్లు, కంటి చుక్కలమందు ఎలా వాడాలో వివరించి చెప్పి ఇంటికి వెళ్ళవచ్చని చెప్పింది. శాస్త్రి కారు డ్రైవర్ రాంబాబుకు ఫోన్ చేసి రమ్మన్నాడు. అప్పుడు గానీ శాస్త్రికి దాసు గుర్తుకు రాలేదు. ఫోన్ చేద్దామంటే దాసు ఫోన్ నెంబర్ తాను తీసుకోలేదు. రాంబాబు రావడానికి ఒక అరగంట అయినా పడుతుంది. తనకు చెప్పిన ఆనవాళ్ళను బట్టి శాస్త్రి, దాసు ఇల్లు వెతకడం మొదలుపెట్టాడు. హాస్పటల్ చుట్టూ ఉన్న వీధుల్లో వాకబు చేసాడు. “ఆ పేరు కల వారు ఎవరూ లేరండీ” అని చుట్టు పక్కల ఇళ్ళవాళ్ళు అన్నారు. దాంతో శాస్త్రికి తాను తిన్న భోజనం గుర్తుకువచ్చి ఏమైనా విషప్రయోగం జరిగిందేమో అని మొదట అనుమానించాడు. కానీ దాసు అలాంటి వ్యక్తి కాదని తనను తాను సమాధానపరుచుకున్నాడు. ఇంతలో రాంబాబు కారుతో సహా వచ్చాడు. శాస్త్రికి ఏం చేయాలో తోచలేదు. రాంబాబు చేత వెతికించాడు. భార్య అడిగినా శాస్త్రి దగ్గర దాసు గురించిన సమాచారం లేదు. దాసు జాడ తెలియకుండానే శాస్త్రి కుటుంబం కారు ఎక్కింది. కారు ఎక్కాక శాస్త్రి మెదడులో ఆలోచనలు తిరగసాగాయి. వచ్చిన వాడు రామదాసా లేక ఏసుదాసా లేక కబీర్ దాసా అని. ఏ దాసైనా దేవుడిలా వచ్చి తనకు, తన కుటుంబానికి ఆకలి తీర్చాడు. “దేవుడా ఆ దాసుని చల్లగా చూడు” అని మనసులో ప్రార్థించిన తరువాత అతని మనసు తేలిక పడింది.‌ శాస్త్రి మరునాడు గుడిలో దేవుడికి మొదటి పూజ దాసు పేరు మీదే చేసాడు. అంతే కాకుండా ప్రతి గురువారం మొదటి పూజ దాసు పేరు మీదే చేయసాగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here