బలిపీఠం

1
12

[dropcap]వై[/dropcap]ష్ణవిని తీసుకొని మదర్ థెరిస్సా మెటర్నిటీ సెంటర్ (కాన్పుల ఆసుపత్రి) కి బయలుదేరాడు ప్రవీణ్. ఆమె నిండు గర్భిణి. వైద్య పరీక్షల నిమిత్తం వైష్ణవిని మోటార్ సైకిల్‍పై ఎక్కించుకొని బయలుదేరాడు. జంటను ఓ కారు వెంబడించడం వాళ్ళు గమనించలేదు. ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని బయటకు వచ్చిన ఆ జంటపై కారులో వచ్చిన దుండగులు దాడి చేశారు. ఆమెను కదలకుండా పట్టుకొని అతన్ని కత్తులతో పొడిచి హత్య చేశారు. పట్టపగలు జన సమూహం చూస్తూ వుండగా దారుణంగా చంపి, శవాన్ని అక్కడే వదిలేసి ధీమాగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు హంతకులు. తన భర్త తన కళ్ళ ముందే హత్య గావింపబడటాన్ని ప్రత్యక్షంగా చూసిన వైష్ణవి స్పృహ తప్పి పడిపోయింది.

***

గుంటూరు జిల్లా కోర్టులో న్యాయమూర్తి సులోచనాదేవి ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రభుకుమార్ నిందితుడిగా బోనులో నిల్చుని వున్నాడు. అతని తరపున వాదించడానికి వకాల్తా తీసుకోవడానికి న్యాయవాదులెవ్వరూ ముందుకు రాలేదు. అతను చేసిన దారుణాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించిన మానవ హక్కుల సంఘాలు అతని తరఫున న్యాయవాదులెవ్వరూ వాదించడానికి వీల్లేదని తీర్మానించడంతో లాయర్లు ఒక్కరు కూడా ముందుకు రాలేదు.

“మీ తరపున వాదించడానికి ఎవ్వర్నీ నియమించుకోలేదా?” న్యాయమూర్తి సులోచనాదేవి ప్రభుకుమార్ వైపు చూస్తూ ప్రశ్నించారు.

“నా తరఫున నేనే.. నా వాదన వినిపిస్తాను. దయచేసి అనుమతించండి.” ప్రభు కుమార్ అభ్యర్థించాడు. ఆమె.. అతని అభ్యర్థనను మన్నించింది.

“గ్రాంటెడ్! మీ ఆర్గ్యుమెంట్ ప్రారంభించండి.” పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపు చూస్తూ ఆదేశించింది. ఆయన ప్రభుకుమార్ చేసిన నేరాన్ని పూర్తిగా వివరించి.. అతనికి మరణశిక్ష విధించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశాడు. తర్వాత.. ప్రభుకుమార్ మాట్లాడటం మొదలుపెట్టాడు. తన దీనగాథను ఓపికగా వినవలసిందిగా న్యాయమూర్తిని అభ్యర్థించాడు. ఆమె అంగీకరించింది.

***

ప్రభుకుమార్ ప్రముఖ పారిశ్రామికవేత్త. గుంటూరు నగరంలో స్పిన్నింగ్ మిల్లులు, టెక్స్‌టైల్స్ మిల్లులు.. రైస్, దాల్ మిల్లులు కలిగివున్న కోటీశ్వరుడు. ఆయన సంస్థలలో వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులను తన క్రింద పనిచేసే కూలీల మాదిరి కాకుండా.. తనకు ధనాన్ని సంపాదించి పెడుతోన్న తన బిడ్డల్లా చూసుకుంటూ వారికి ఎలాంటి సమస్యలు, కష్టాలు, బాధలు ఎదురైనా తాను స్వయంగా దగ్గరుండి పరిష్కరిస్తూ వుంటాడు. ఆ కారణంగా.. అతని సంస్థలలో పనిజేసే కార్మికులందరూ అతన్ని తండ్రిలా, దేవుడిలా ఆరాధిస్తూ వుంటారు.

ప్రభుకుమార్ భార్య వైదేహి. ఆ దంపతులకు పెళ్ళయిన ఆరు సంవత్సరాలకు ఓ ఆడపిల్ల జన్మించింది. ఎన్నో నోముల ఫలితంగా జన్మించిన ఆ బిడ్డకు ‘వైష్ణవి’ అని పేరు పెట్టి ఎంతో గారాబంగా పెంచారు. అంతేగాదు వైదేహి గర్భసంచికి ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా గర్భసంచిని తొలగించారు డాక్టర్లు. భవిష్యత్తులో ఆమెకు బిడ్డలు పుట్టే అవకాశం లేదని తేలిపోడంతో ఒక్కగానొక్క కూతురైన వైష్ణవిని అపురూపంగా చూసుకుంటూ అత్యంత జాగ్రత్తగా పెంచుతున్నారు.

బంగారు బొమ్మలా మెరిసిపోతూ.. అద్భుతమైన సౌందర్యాన్ని సొంతం చేసుకున్న వైష్ణవి ‘లిటిల్ ఫ్లవర్ ఇంటర్నేషనల్ స్కూల్’ లో 10వ తరగతి చదువుతోంది. ప్రతిరోజూ ఖరీదైన కారులో స్కూలుకు వచ్చి వెళ్తున్న ఈ బంగారు బొమ్మను రెండు కళ్ళు నిరంతరం వెంటాడ సాగాయి.. అతను ప్రవీణ్!

ఆ స్కూలుకు ఎదురుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల.. డిగ్రీ కళాశాల ఒకే కాంపౌండ్‍లో వున్నాయి. ఆ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు ప్రవీణ్. కోటీశ్వరుడు కూతురైన వైష్ణవిని ఎలాగైనా పెళ్ళి చేసుకొని ఆ ఇంటికి అల్లుడు కావాలని తన మనసులో దురాశను పెంచుకున్నాడు. అందచందాలతో, హావభావాలతో, మైమరపించే మాటల గారడీతో ఆ లేత హృదయాన్ని ఆకర్షించాడు. అమాయకురాలైన వైష్ణవి అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది.

మునిసిపల్ ఆఫీసులో అటెండర్‌గా ఉద్యోగం చేస్తున్న రంగనాధ్ కుమారుడు ప్రవీణ్. రంగనాధ్‌కి ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు ప్రవీణ్ రెండవ కుమారుడు నవీన్. ప్రవీణ్‌కి చిన్నతనం నుండి విలాసవంతమైన జీవితంపై మోజు ఎక్కువ. బంగళాల్లో జీవించాలని, కార్లల్లో తిరగాలని కోరిక. సాధారణ నాలుగవ తరగతి ఉద్యోగి కొడుకుగా పుట్టిన కారణంగా తన కోరికలు నెరవేరవు. అందుకే భగవంతుడు తనకు ఇచ్చిన రూపాన్ని, తెలివితేటలను ఉపయోగించి గొప్పింటి ఆడపిల్లను బుట్టలో పడవేయగలిగితే తన లక్ష్యాన్ని సాధించవచ్చు. ఈ రకమైన ఆలోచనలను మనసులో పెట్టుకొని.. వైష్ణవిపై వల విసిరాడు. లేత వయసులో వ్యామోహాన్ని ప్రేమగా భ్రమించి అతని ఉచ్చులో పడిపోయింది వైష్ణవి.

మైనారిటీ తీరేవరకు తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచాలని.. పెద్దలకు తెలిస్తే విడదీస్తారని ఆమెకు చెప్పి 18 సంవత్సరాలు నిండేవరకూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా వుంచాడు.

19 సంవత్సరాల వయసులో తమ ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు చెప్పింది వైష్ణవి. ఉగ్రుడైపోయాడు ప్రభుకుమార్.  ఆర్థికంగా తన కాలి గోటికి కూడా సాటిరాని వ్యక్తి కొడుకుతో పెళ్ళి చేయడానికి అంగీకరించలేదు.. అంతే కాదు.. కూతుర్ని తన భవనంలోనే బందీని చేశాడు. ప్రవీణ్‌కు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు. కానీ అతని కన్నుగప్పి.. ఇంట్లో నుండి పారిపోయి ఆర్యసమాజంలో పెళ్ళి చేసుకొని.. పోలీసులను ఆశ్రయించారు. మేజర్లయిన ఇద్దరు యువతీయువకుల ప్రేమను అడ్డుకోవడం నేరమని పోలీసులు హెచ్చరించడంతో ప్రభుకుమార్ మౌనంగా ఉండిపోయాడు. ఒక్కగానొక్క గారాల కూతురు  పేదవాడితో వెళ్ళిపోవడం అతన్ని మానసికంగా వేధించింది. గుంటూరు నగరంలో అతని పరువు ప్రతిష్ఠ మనసకబారాయి. భార్య అనారోగ్యంతో మంచం పట్టింది. వేదనతో రగిలిపోయాడు.

కూతురు గర్భం ధరించిందని తెలుసుకున్నాడు. వేదన మరీ ఎక్కువైంది.  ఓ పేదవాడి ప్రతిబింబం తన కూతురు కడుపులో రూపుదిద్దుకుంటోందని తెలిసి రగిలిపోయాడు. ప్రవీణ్‌ని అడ్డు తొలగించుకుంటే పసికూనను భూమ్మీద పడిన తర్వాతనైనా నలిపెయ్యొచ్చునని తీర్మానించుకున్నాడు. కిరాయి హంతకులతో ప్రవీణ్‌ని హత్య చేయించాడు.

***

“ఓ కన్న తండ్రిగా నేను అనుభవించిన వేదన నా అంతరంగానికి మాత్రమే తెలుసు!” చెప్పడం ఆపి మౌనంగా వుండిపోయాడు ప్రభుకుమార్.

తండ్రిగా ప్రభుకుమార్ వేదన న్యాయమూర్తి సులోచనాదేవిని చలింపజేసింది. నగరంలోనే ప్రముఖ కోటేశ్వరుడైన ఆ తండ్రి దీన జీవనగాథను విని ఓ నిర్ణయం తీసుకున్నదానిలా తలపంకించి “The Court is adjourned” అని లేచి వెళ్ళిపోయింది.

కారులో ఇంటికి వస్తోన్న సులోచనాదేవి మెదడులో పలురకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంది. ఓ అందమైన రూపం చితిమంటల్లో కాలిపోతున్నట్లు కన్పించసాగింది! ఆ చితిమంటల్లో ఆమెకు గతం కనిపించసాగింది!

***

రామకృష్ణారావు బ్యాంకు మేనేజరు.. అతని భార్య సులోచనాదేవి లాయరు. సనాతన సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఆ దంపతుల ఏకైక పుత్రిక శ్రీలేఖ. జాన్ విక్టర్ అనే క్రిస్టియన్ యువకునితో శ్రీలేఖ ప్రేమలో పడింది. ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. అతనితో లేచిపోయి పెళ్ళి చేసుకుంది.

నిరుద్యోగి అయిన జాన్ విక్టర్ శ్రీలేఖ ఒంటిమీద వున్న నగలు అమ్మి బ్రతుకుతెరువు కొనసాగిస్తూ.. వ్యసనాలకు బానిసై.. ఆమెను పుట్టింటికి వెళ్ళి డబ్బు తీసుకురమ్మని వేధించేవాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించడం ప్రారంభించాడు. అప్పటికే ఓ ఆడపిల్లకు జన్మనిచ్చిన శ్రీలేఖ ఆ పసిదాని కోసం అతనుపెట్టే బాధలను భరిస్తూ పంటి బిగువున జీవించసాగింది. కానీ.. ప్రతిరోజూ అతని హింసాత్మక చర్యలను భరించలేక మరణాన్ని ఆశ్రయించింది. ఏడాది వయసున్న పసిబిడ్డను ముందుగా చంపి.. తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నది. ఉన్నతమైన సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన తాను తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నందుకు తగిన శిక్ష అనుభవించానని.. తన చివరి గమ్యం మరణమేనని తల్లిదండ్రులకు లేఖ రాసి తనువు చాలించింది.

***

కోర్టు హాలులో.. 5గురు జడ్జీల జ్యూరీ ముందు బోనులో.. ముద్దాయిగా గుంటూరు నగర ప్రముఖుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రభుకుమార్ నిల్చునివున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదన వినిపించి కూర్చున్నాడు. సులోచనాదేవి తాను న్యాయమూర్తి హోదాకు రాజీనామా చేశానని, ప్రభుకుమార్ తరపున వాదించడానికి నిర్ణయించుకున్నానని తెలియజేసింది. కోర్టులో కలకలం! ఆమె అభ్యర్థనకు అంగీకారం తెలిపారు జ్యూరీసభ్యులు.

సులోచనాదేవి వాదనాపటిమతో కోర్టు హాలు దద్దరిల్లుతుంది.

“బిడ్డల యెడల తల్లిదండ్రులు పెంచుకున్న ప్రేమానురాగాలకు విలువలేదా? బిడ్డలను శాసించే హక్కు కన్న తల్లిదండ్రులకు లేదా?”

“కేవలం 18 సంవత్సరాలు నిండిన టీనేజ్ బాలిక, అప్పటివరకు తల్లిదండ్రుల నీడలో.. వాళ్ళ కనుసన్నలలో పెరిగిన ఆ చిన్నారి భవిష్యత్ జీవితం గురించి ఎలా ఆలోచించగలదు?”

“ఆ బాలికకు.. ప్రేమకు, వ్యామోహానికి మధ్య తేడా తెలుస్తుందా?”

“తన శరీరంలో సంభవిస్తున్న మార్పుల కారణంగా తన మెదడులో కలుగుతోన్న వ్యామోహమనే భావనను ప్రేమగా భావించి.. పైపై మెరుగులతో భ్రమింపజేసి లోబర్చుకునే మోసగాళ్ళ వలలో పడి ఎందరు యువతులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు?”

“తల్లిదండ్రుల వేదనను, కడుపుకోతను అర్థం చేసుకోలేని బూజు పట్టిన పాత చట్టాలను రద్దు చేయాలి!”

“కేవలం హక్కుల గురించి మాత్రమే మాట్లాడే హక్కుల సంఘాలు, పోరాడే స్త్రీవాద సంస్థలు.. తల్లిదండ్రుల మనోవేదనను అర్థం చేసుకోవాలి!”

సులోచనాదేవి వాక్చాతుర్యానికి, ఆమె సంధించిన పలు మానవీయ కోణాల ప్రశ్నలకూ 5 గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం నివ్వెరబోయింది.

“తల్లిదండ్రుల ప్రేమకు వెల కట్టలేమని కేవలం మైనారిటీ తీరినంత మాత్రాన.. యువతీయువకులు మానసికంగా ఎదిగినట్లుగా భావించలేమని.. ఆ వయసులో వాళ్ళు తీసుకునే నిర్ణయాలను న్యాయబద్ధంగా హేతుబద్ధంగా వున్నట్లు నిర్ణయించలేమని.. బిడ్డల క్షేమం కోసం తల్లిదండ్రులు ఆవేశపడటం నేరం చేయడం మానవసహజమైన ప్రాకృతికధర్మంగా భావించాలని.. తాము పెంచి పెద్ద చేసిన పూల మొక్కను వ్రేళతో సహా పెకలించుకుపోయే దొంగలను, దుర్మార్గులను శిక్షించడంలో తప్పులేదని.. అదేవిధంగా.. తమ బిడ్డలను ప్రలోభపెట్టి లోబర్చుకునే మాయల మరాఠీలను శిక్షించడం నేరం కాదని.. ఈ 5గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెబుతుంది! అయితే ఎంతటి అన్యాయాన్నయినా ఎదుర్కునేందుకు న్యాయబద్ధమయిన మార్గాన్నే ఎంచుకోవాలి కానీ, ఎవరికి వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే, వ్యవస్థ  ఆటవిక వ్యవస్థ అవుతుంది, బలమున్నవాడిదే న్యాయం అవుతుంది. కాబట్టి, కూతురికి అన్యాయం జరిగిందని       ప్రభుకుమార్ పట్ల వ్యక్తిగతంగా సానుభూతి వున్నా, మరో తల్లితండ్రులకు పుత్ర శోకం కలిగించే రీతిలో   మరొక నిండు ప్రాణాన్ని బలిగొనే హక్కు ఎవరికీ లేదని, ముందుగా ఆలోచించి చేసిన హత్యగా ఈ హత్యను పరిగణించి అందుకు తగ్గ శిక్షను విధించాలనీ న్యాయస్థానం నిర్ణయించింది. శిక్షను త్వరలో ప్రకటిస్తాము”  తీర్పును న్యాయమూర్తులు ప్రకటించారు.

కోర్టు హాలు చప్పట్లతో మారుమ్రోగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here