బంధం-ఆసరా-అనుబంధం

2
14

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి.]

[dropcap]తుం[/dropcap]టరి చెయ్యేదో కొమ్మలని తుంచేసినా తట్టుకుని మళ్ళీ పచ్చదనాల పందిరి వేస్తుంది చెట్టు. మరి మనిషి? మనసు కింత గాయమైనా సరే, కుంగుబాటుతో కృశించి పోతాడు. రామారావు అలాగే ఉన్నాడిప్పుడు. ఆలోచనలనే కడలి కెరటాల హోరులో తన గుండె ఘోషను లీనం చేసుకుంటున్నాడు.

“అతడు సముద్రం.. ఆమె ఆకాశం.. ఇద్దరూ కలవాలని యుగాలుగా ప్రయత్నం..”

గంభీరమైన స్వరంలో వినవచ్చిన ఆ మాటలకు పక్కకు చూశాడు రామారావు.

ఇరవైయేళ్ళ వయసున్న ఇద్దరు మగపిల్లలు ఒక పెద్దావిడకి చెరో ప్రక్కా కూర్చున్నారు. వాళ్ళలో ఒకడు ఆకాశం వైపు చేయి చాపి ఎంతో తన్మయత్వంతో చెబుతున్నాడా మాటలు.

“చాలాసార్లు విన్నమాటే అది. ఏది అయునా కొత్తగా చెప్పు” వెటకారంగా అన్నాడు రెండోవాడు.

దానికి మొదటివాడు చిన్నబుచ్చుకోవడం చూసిందేమో ఆవిడ “కొత్తగా చెప్పినా, పాతమాటే చెప్పినా, ఆకాశాన్ని, సముద్రాన్ని చూస్తే మనసు స్పందించింది. చూడు.. అది చాలు. స్పందనలు లేని జీవీతం చప్పగా ఉంటుంది. ప్రకృతిని ఆరాధించడం అందరికీ చేతకాదు. అది చేతనైతే మనశ్శాంతి పొందేందుకు ఎక్కువ కష్టపడనక్కరలేదు” వివరిస్తున్న ఆమెవంక ఆసక్తిగా చూశాడు రామారావు.

కొద్దిగా చెంపల దగ్గర నెరిసిన జుట్టు, వెనుక ముడివేసుకుని, నేతచీరలో నిండుగా ఉందావిడ. ‘వాళ్ళిద్దరూ ఆమె పిల్లలు కాబోలు’ మనసులోనే అనుకున్నాడు.

అంతలోనే ఆ ముగ్గురూ లేచి కబుర్లాడుకుంటూ రోడ్డువైపు సాగిపోయారు. కనుమరుగయ్యేంతవరకూ వాళ్ళనే చూస్తుండిపోయాడు రామారావు. ఆమె రూపం అతని మనసు మూలాల్లో ఎక్కడో చిన్న కదలిక తెచ్చింది. తనకు ఎప్పుడో ఎక్కడో పరిచయమైన మనిషిలా అనిపించింది. ఆ రాత్రి అంతా ఆలోచించినా ఆ పరిచయం గుర్తుకు రాలేదు.

మనసు బాగోలేనప్పుడల్లా సరూర్‌నగర్ చెరువుకట్ట (మినీటాంక్ బండ్) దగ్గర గడపడం రామారావుకు అలవాటు. అంత తేలిగ్గా ఎవరితోనూ సొంత విషయాలు పంచుకోలేని అతనికి ఆ చెరువు కట్టే పెద్ద ఓదార్పు.

మరునాటి సాయంత్రం కూడా అక్కడికి వచ్చిన రామారావుకు ఆ తల్లీకొడుకులు మళ్ళీ కనిపించారు. ఈసారి వాళ్ళకి కొంచెం దగ్గరగా కూర్చున్నాడు.

ఆమె భాగవత కథ చెబుతోంది. ఈ కాలం కుర్రాళ్ళు సాయంత్రం పూట మినీటాంక్ బండ్ దగ్గర తల్లి ప్రక్కన కూర్చొని భాగవతం వినడం ఓ అద్భుతంలా తోచింది రామారావుకు. ఆ సాయంత్రాన్ని హాయీగా గడిపేశాడు.

దాదాపు మూణ్ణెల్లుగా జీవచ్ఛవంలా బతుకీడుస్తున్న రామారావులో ఆ ముగ్గురి వల్లా వెలుగు వచ్చింది.

దాంతో ప్రతీ సాయంత్రం వాళ్ళ కోసం ఎదురు చూసేవాడు. ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా, వాళ్ళకి దగ్గరగా కూర్చొని మంచి సంభాషణలు వినడంలో మంచి సాంత్వన లభిస్తోంది అతనికి.

మనిషి ప్రేమరాహిత్యంలో నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడూతున్నప్పుడు తన మనసుని కదిలించగల ఇసుకరేణువంత ఆనందం దొరికినా సంతోషపడిపోతాడు. ఒక్కోసారి ఆ ఇసుకరేణువే మనోవేదనకు కూడా మందవుతుంది. ఇప్పుడు రామారావు సరిగ్గా అలాంటి పరిస్థితి లోనే ఉన్నాడు.

మూడు నెలల క్రిందట అతని భార్య కాలం చేసింది. ఉన్న ఒక్క కొడుకు తమని ఏ రకంగానూ ఆదుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. డాక్టర్‌ను చేస్తే, హైదరాబాద్‌లో అతిపెద్ద మల్టీస్పెషాలిటీ అధినేత కూతురిని ప్రేమించి పెళ్ళాడి ఇల్లరికం వెయ్యిపోయాడు. కొడుకులు లేని మామగారికి అల్లుడూ, కొడుకూ అన్నీ తానే అయ్యాడు కానీ, తల్లిదండ్రులకీ ఏమీ కాని వాడిలా మిగిలిపోయాడు.

భార్య బతికున్న రోజుల్లో ఒకరికి ఒకరు తోడునీడగా ఉండేవారు. ఇప్పుడు ఆ తోడు లేక జీవితం అకస్మాత్తుగా అంధకారంలో మునిగిపోయినట్టు అయిపోయింది.

రామారావుకు ఇలాంటి పరిస్థితిలో కూడా తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలన్న కనీస ఆలోచన కొడుకుకు కలగకపోవడం రామారావుకు పెద్ద గుండెకోతయ్యింది.

ఒంటరితనం అతని మనోవేదనను రోజు రోజుకూ పెంచుతూ నిరాశ లోకి నెట్టేసింది.

బతుకు మీద విరక్తి, వైరాగ్యాలతో ప్రతీక్షణం బాధపడుతున్నాడు. తన మీద అభిమానం తోనో, జాలితోనో ఇంటికొచ్చే స్నేహితులతోనూ మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాడు. ఇలాంటి స్తబ్ధతని తనకే మాత్రం సంబంధం లేని ఈ తల్లీ కొడుకుల పరోక్ష సమక్షం, బద్దలు కొట్టడం రామారావుకే ఆశ్చర్యంగా ఉంది.

ఓ సాయంత్రం ఆలోచిస్తూ ఆ తల్లి కొడుకుల వంక చూశాడు.

రెండో బిడ్డ గురించి తనకూ, తన భార్యకూ జరిగిన ఘర్షణ గుర్తొచ్చింది. మధ్య తరగతి కుటుంబంలో నలుగురు పిల్లలలో ఒకడిగా పెరిగిన తనకు బోటాబొటీగా అబ్బిన చదువు, పోషకాహార లోపాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక్క బిడ్డే చాలని వాదించాడు తను. దానినుంచి మంచి చెడ్డల గురించి భార్య ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చివరికి తన మాటే నెగ్గించుకున్నాడు.

‘ఇప్పుడు తన రెండో బిడ్డ ఉంటే, ఇంత ఒంటరి అయ్యేవాణ్ణి కాదేమో’ అనిపిస్తోంది మనసుకు. కానీ, ఆ అమాయకపు ఆలోచనకు తనలో తనే నవ్వుకున్నాడు.

ఆ ఇద్దరు పిల్లలతో ఆమె మాట్లాడే తీరూ, చర్చించే మంచి విషయాలూ వినేకొద్దీ, ఎంత వద్దనుకున్నా తన పెంపకం లోనే లోపముందేమో అన్న బాధ మొదలైందతనికి.

ఉన్న ఒక్క కొడుకుని వైద్యుణ్ణి చెయ్యాలని ఆశపడ్డాడు. దాని కోసమే రాత్రీ పగలూ కష్టపడి సంపాదించాడు. తన ఆశను కష్టాన్ని అర్థం చేసుకున్నాడా అన్నట్టు.. పిల్లవాడు ఎప్పుడూ పుస్తకలతోనే కాలం గడిపేస్తుంటే తన అదృష్టానికి మురిసిపోయేవాడు. ఎప్పుడూ అన్నిటిలోనూ మొదటి స్థానంలో ఉండే కొడుకును చూసుకుని పొంగిపోయేవాడు.

ప్రతీరోజూ ప్రేమగా కబుర్లాడుకునే ఆ తల్లీకొడుకులనే చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు రామారావు.

ఇలా తను భార్యని, కొడుకుని సరదాగా బయటికి తీసుకొచ్చిన రోజులు గుర్తు చేసుకున్నాడు. అలాంటివి చాలా తక్కువగా ఉన్నట్లు అనిపించింది. ఎప్పుడూ చదువుకుంటూ ఉండే పిల్లవాడి ఏకాగ్రత భంగం చెయ్యకూడదనేవాడే కానీ, అప్పుడప్పుడు కాస్త పక్కనపెట్టి విశ్రాంతి తీసుకుంటూ అమ్మా నాన్నలతో కాసేపు గడపాలని చెప్పాల్సిన బాధ్యత తనకుందని తెలుసుకోలేకపోయాడు.

‘ఒకవేళ అదే మా మధ్య బలమైన బంధం లేకపోవడానికి కారణమేమో’ అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు.

మంచి అనుకుని చేసిన పనికి చెడు ఫలితం కలిగితే తట్టుకోలేడు మనిషి. అంతా అయిపోయాక ఆలోచించడం వ్యర్థమని తెలిసినా దాని గురించే ఆలోచిస్తూ ఉన్న సమయాన్ని కూడా బాధాతప్తం చేసుకుంటాడు. ఇక ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఆ ఆలోచనలు మరింతగా కుంగదీస్తాయే కానీ ఓదార్చవు.

“అమ్మా, నీతో చెప్పడం మరిచిపోయా..” పక్కనే ఉన్నా ఒక్కసారిగా గొంతు పెంచి ఊద్వేగంగా ఏదో చెబుతుఉన్నాడామె కొడుకు.

“సంజయ్ మాట్లాడాడమ్మా పొద్దున. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వెళుతు ఉన్నాడట.” మళ్ళీ అతనే ఉత్సాహంగా అన్నాడు తల్లిని చూస్తూ.

“ఎంత అదృష్టమో కదా..” అంటున్న రెండో కొడుకు తలను ప్రేమగా నిమిరిందామె.

“వాడిదంతా అత్తెసరు చదువు. పైగా సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాదమ్మా. అలాంటివాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో?”

చెరువును చూస్తూనే వాళ్ళ మాటలూ వింటున్న రామారావు ఆమె ఏమంటుందో అని చూశాడు.

ప్రేమగా కొడుకు తల మీద మొట్టికాయ వేస్తూ “ఎవరినీ చూసి అసూయ చెందకూడదు. ఎదుటి వారికి కలిగిన అదృష్టానికి వాళ్ళు అర్హులు కాదో నిర్ణయించే హక్కు మనకి లేదు. మన పూర్వ కర్మని బట్టి మన జీవితం. వాడు విదేశాలకు వెళ్ళడం అదృష్టమైతే మీరు ఇద్దరూ ఇంత చిన్న వయసు లోనే వృద్దులకీ, అనాథలకీ సేవ చేస్తున్నారు. అదెంత పుణ్యమో తెలుసా. తోటి వాళ్ళకు సేవ చేస్తే ఆ మాధవుడికి సేవ చేసినట్టే కదా” మెత్తగా మందలించిందామె.

మొగ్గని వికసింపజేసే కాంతిరేఖలా, ఆ మాటలు రామారావు మనసుని తాకాయి. నిజంగానే కొన్ని రోజులుగా కొడుకులు, కోడళ్ళు, మనుమలతో వృద్ధాప్యాన్ని హాయిగా గడుపుతున్న తన తోటివారితో పదే

పదే తన స్థితిని పోల్చుకుని బాధపడుతున్నాడు. ఇప్పుడామె మాటలు తనలోని చైతన్యాన్ని తట్టి లేపాయి.

కొందరు మనుషులు ఏ రకమైన స్నేహం, బంధుత్వం లేకపోయినా, చివరికి నేరుగా మాట్లాడకపోయినా పక్కవారిని ప్రభావితం చేస్తారు. సత్ప్రవర్తనతోనో,మాటతీరు తోనో ఎదుటి వారి మనసులోకి జొరబడి వారి ఆలోచనలను, చేతలనూ మార్చగలుగుతారు.

తెరపిచ్చిన మనసుతో ఆ అపరిచితులు తనకు చేసిన మేలును తలచుకున్నాడు రామారావు.

ఇన్నాళ్ళు విరక్తీ, వైరాగ్యాల్లో మునిగిపోయి ఆలోచించడమే మానేసిన మనసుకు, మెదడుకూ పని పెట్టాడు. వెంటనే తన బాల్య స్నేహితుడు గుర్తొచ్చాడు. ఆతని తండ్రి ఏనాడో ఓ వృద్ధాశ్రమాన్ని, అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశాడన్న విషయం స్ఫురణకు వచ్చింది. తనకు వచ్చే ఫించన్‌తో వృద్ధాశ్రమంలో ఉండటమే మంచిదనిపించింది.

పరోక్షంగా ఆ తల్లీకొడుకలు తనకిచ్చిన కొత్త శక్తి నిండుగా ఉన్నప్పుడే గమ్యాన్ని చేరాలనే విచక్షణతో అన్నీ ఆ రాత్రే సిద్దం చేసుకున్నాడు. కొడుకుతో చెప్పకూడదనుకుంటూనే ఫోన్ చేశాడు.

రామారావు ఉంటున్న ఆ ఇల్లు నిజానికి అతని భార్యకి తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి. కొడుకు వైద్య విద్య కోసం ఆ ఇంటిని అమ్మేశారు.

ఆ ఇంటిని కొన్నది బాగా పరిచయమైన వాడే కావడంతో వీళ్ళని ఆ ఇంటిలోనే అద్దెకి ఉండనిచ్చాడు.

ఉన్న కాస్త సామాను వదిలి బట్టలు సర్దుకునేటప్పుడు.. ఆ ఇంటి జ్ఞాపకాలు, కొడుకు ఎంతగా గుర్తొచ్చినా చలించలేదు రామారావు. చాలా బిజీగా ఉన్నానంటూ చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేసిన వాణ్ణి తలచుకుని నవ్వుకుంటూనే తన పని తాను చేసుకున్నాడు.

మరునాటి ఉదయం, చాలా కాలానికి కొత్తగా కనిపించింది రామారావుకు. పొగమంచు, అప్పుడే విచ్చుకుని గుబాళిస్తున్న పూలు, దూరంగా గుడిగంటలు.. అన్నీ తేటపడిన తన మనసుకు స్వాగతం చెబుతున్నట్లు అనిపించాయి. తొలిసారి తన మనస్తత్వానికి భిన్నంగా, ఇలాంటి సందర్భంలో ఏ బాధా లేకుండా ఇల్లు వదిలి వెళ్ళగలగడం అతనికే ఆశ్చర్యం అనిపించింది.

వృద్ధాశ్రమంలో అన్ని పత్రాలు నింపి డబ్బు కట్టి తనకు కేటాయించిన గదిలోకి వచ్చాడు. ముప్పై ఏళ్ళ పాటు ఎంతో తృప్తిగా సంసార జీవితం గడిపానన్న భ్రమ నుంచి ఒక్కసారిగా బయటపడ్డట్టుగా ఉంది అతనికి. సంవత్సరమంతా కష్టపడి చదివి నిజాయితీగా పరీక్ష రాసినా తప్పిన విద్యార్థిలా దిగులు గానూ అనిపించింది.

చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ ఉండగానే తలుపు చప్పుడైంది. కళ్ళు మూసూకుని ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి తలుపు తీసిన రామారావు, ఆ వచ్చిన మనిషిని చూసి అలాగే నిలబడిపోయాడు. ఏ వ్యక్తి మళ్ళీ తనిలా మనుషుల్లో కలవడానికి కారణమో ఆమె అక్కడ ఫలహారాల పళ్ళెంతో నిలబడి ఉంది. రామారావును చూసి ఆమె కూడా ఆశ్చర్యపోయింది.

వెంటనే కళ్ళలోనే ఆనందం పలికిస్తూ “మీరా..” అని ఆగి “నన్ను గుర్తుపట్టారా?” అంది.

“సుమారు పాతికేళ్ళ కిందట సరూర్‌నగర్ చెరువు కట్టమీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయిన నన్ను కాపాడి ఇక్కడ చేర్చింది మీరే” మళ్ళీ అందామె మెల్లగా.

కారుమబ్బులు తొలగిపోయి ఆకాశం స్వచ్ఛంగా మెరుస్తున్నంత హాయిగా అనిపించింది రామారావుకు. అవును, చిక్కుముడి విడిపోయింది. పాతికేళ్ళ కిందట మధ్యాహ్నం రెండో బిడ్డ విషయంలో భార్యతో గొడవపడి మనశ్శాంతి కోసం చెరువు కట్ట దగ్గర నిర్మానుష్యంగా ఉన్న చోట కూర్చున్నాడు తను. అప్పుడే ఓ అమ్మాయి ఏడుస్తూ చెరువు వైపు పరుగెత్తడం చూశాడు. జరగబోయేది ఊహించి తనకు ఈత రాదనే విషయాన్ని కూడా మరిచిపోయి ఆమెను కాపాడాడు.

తడిసిన నందివర్ధనంలా ఉందామె. అవమానభారమో ఏమో తెలియదు. కానీ చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. చాలా సేపటికి తేరుకుని చెరువు వంక చూస్తూ కూర్చుంది. ఆమె పరిస్థితి అర్థం చేసుకుని రామారావే మాట కలిపాడు

“చూడండి.. మీరెవరో నాకు తెలియదు. చనిపోవాల్సినంత కష్టం మీకేమొచ్చిందో అడిగే హక్కు నాకు లేదు. కానీ ఇప్పటికైనా మనసు మార్చుకుని ఇంటికి తిరిగి వెళ్ళండి. ఇలా చేశారని తెలిస్తే మీవాళ్ళెంత కంగారు పడతారో ఆలోచించండి” అన్నాడు.

ఆమె మాట్లాడలేదు. కానీ మళ్ళీ ఏడవటం మొదలెట్టింది.

కాసేపు సమాధానం కోసం ఎదురు చూసిన రామారావు తిరిగి తనే అన్నాడు.

“దేవుడిచ్చిన జీవితాన్ని పూర్తిగా అనుభవించకుండా బలవంతంగా చనిపోతే అటు జన్మా, ఇటు కర్మా లేకుండా అల్లాడూతుంటారు. మీరు ఇంటికి తిరిగి వెళ్ళలేనంత కష్టమే మీకుంటే నాతో రండి. నాకు తెలిసిన ఆయన ఓ అనాథాశ్రమమం నడుపుతున్నారు. అందులో పిల్లలకి తల్లిగా మారండి. వాళ్ళకి తల్లి ప్రేమను పంచండి. ముగించాలనుకున్న మీ జీవితాన్ని వాళ్ళ సేవకు వినియోగించండి.”

రామారావు మాటలకు ఆమె పెద్ద పెద్ద కళ్ళతో నమ్మలేనట్లుగా చూసింది. ఎంతోసేపు ఆలోచించకుండానే లేచి నిలబడి “నా జీవితానికి అర్థమే లేదనుకున్నాను. కానీ నా జీవితం కూడా మరొకరికి ఆసరా కాగలదన్న ఊహే నాలో కొత్త ఊపిరి నింపుతుంది. అదే నా చీకటి జీవితానికో చిరుదీపమనుకుంటాను. పదండి” అంది స్థిరంగా. వెంటనే తనను ఇక్కడ చేర్చాడు.

అయితే, తన జీవితపోరాటంలో పడి ఆ విషయాన్ని మరిచిపోయాడు. ఇదంతా గుర్తుచేసుకుని ఆనందంగా చూస్తున్న రామారావు వంక చూసి నిండు గోదారిలా నవ్విందామె.

“మీరు నన్నిక్కడ చేర్చాక నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ పసివాళ్ళకు సేవ చేస్తూ నేను పొందుతున్న ఆనందమంతా మీవల్లే నాకు దొరికింది. దానికి ప్రతి రోజూ మనసులోనే మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఇక్కడి అనాథ పిల్లలలో కొంతమంది నా సొంత బిడ్డల్లా నా వెనుకే తిరుగుతారు. పిల్లలతో పాటు ఇక్కడి వృద్ధులకు సేవ చేయడంలో నా బతుకు నిజంగా విరబూసింది” నిజాయితీగా అంటున్న ఆమెని అభినందిస్తూ లోనికి ఆహ్వానించాడు రామారావు.

ఆమె అడక్కుండానే తన కథంతా చెప్పాడు.

అంతా విని ఆమె “చూశారా.. మీకెంత చక్కటి అవకాశం వచ్చిందో. ఇంతమంది పిల్లలకి తాతయ్యగా నీతీకథలు, రామాయణ, భారతాలు చెప్పే భాగ్యం కలిగింది. అన్నట్లు మీ జీవితానుభవాలు కూడా వీళ్ళతో పంచుకోండి. వీళ్ళకి తాతయ్య లేని లోటు తీర్చండి.” అంది తేలిగ్గా నవ్వేస్తూ.

ఆ సందర్భంలో ఓదార్పు మాటల కోసం ఎదురుచూసిన రామారావు ఆమెలోని ఆశావహ దృక్పథాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. తానప్పుడే పిల్లలకి తాతయ్యగా మారి ఎన్నో కథలు కబుర్లు చెబుతున్నట్లు కళ్ళ ముందు మెదిలిన దృశ్యమే అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఇస్మాయిల్ ఓ కవితలో చెప్పినట్టు బండరాయిని సైతం సూర్యుడు తన ప్రేమతో వెచ్చపరచ గలిగినప్పుడు, ఓ మంచి మనిషి తన ప్రవర్తనతో పక్కవారి స్థితిని మార్చలేడా; సంభ్రమంగా ఆమెను చూస్తూ అనుకున్నాడు రామారావు

దూరంగా ఆకాశం తన ఒడిలో చేరుతున్న మేఘాల్ని లాలిస్తూ మురిసిపోతోంది.

శుభం భూయాత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here