[dropcap]గ[/dropcap]త నాలుగు దశాబ్దాలుగ ప్రవాసంలో వున్న ప్రపంచ ప్రసిద్ధ కెన్యన్ సాహిత్యకారుడు గుగి వా థియాంగో రాసిన “డీటెయిన్డ్ – ఏ రైటర్స్ ప్రిజన్ డైరీ”కి వరవరరావు తెలుగు అనువాదం ‘బందీ – ఒక రచయిత జైలు డైరీ’. రెండో ముద్రణ ఇది.
తన జాతికి చెందిన గికుయు భాషలో రైతాంగ, కార్మిక సమ్మేళనంతో ప్రజారంగస్థలాన్ని నిర్మించే ప్రయత్నం చేసిన నేరానికి గుగి 1977 డిసెంబర్ నుండి 1978 డిసెంబరు దాకా జైలు నిర్బంధం పాలయ్యారు. ఆ జైలు నిర్బంధ సమయంలో తాను చేసిన ఆలోచనలు, తాను చదివిన పుస్తకాలు, కలిసిన మిత్రులు, ప్రభుత్వంతో, తాను అప్పటి వరకు పనిచేసిన యూనివర్శిటీతో తాను చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పన్నెండు నెలల దుర్భర ఏకాంత జైలు జీవితంలో తాను పొందిన అనుభవాలన్నింటినీ గుగి ఈ రచనలో అక్షరీకరించారు. ఆ నిర్బంధ సమయంలోనే తాను రాస్తుండిన నవల ‘సైతాని ముథారబా యిని’ గురించి, ప్రత్యేకంగా ఆ నవల కథానాయిక వరింగా గురించి తన ఆలోచనలు ఇక్కడ పంచుకున్నారు.
ఈ డైరీ రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం – జైల్లో గుగి అనుభవాలు, ఆలోచనలు, జైలు నుంచి గుగి రాసిన ఉత్తరాలు. రెండవ భాగం మొత్తంగా జైలు నుంచి ఉత్తరాలు. వీటిలో ఇంకొక డిటెన్యూ ఉత్తరం కూడా చేర్చారు. మూడవ భాగంలో జైలు పరిణామాలు రేఖామాత్రంగా వున్నాయి.
గుగి జైలు నుండి విడుదలైన కొన్ని గంటలలోనే, నిర్ణీత గంటల తర్వాత కూడా తాగుతున్నాడనే తప్పుడు ఆరోపణలపై అరెస్టు చేశారు. తర్వాత మెజిస్టేట్ ఆ ఆరోపణలు కొట్టివేసినప్పటికీ, అప్పటికే గుగిని అరెస్టు చేసిన పోలీసులు విపరీతంగా కొట్టారు. తర్వాత ఆరు నెలల వరకు గుగిని, అతని కుటుంబాన్ని చంపుతామన్న బెదిరింపులకు గురి కావల్సి వచ్చింది. పూర్తిగా విదేశీ సంస్థల యాజమన్యం కింద, అజమాయిషీ కింద వున్న కెన్యాలోని పత్రికా రంగం ప్రదర్శించిన శత్రువైఖరి కూడా ఇందులో ప్రస్తావించారు. అలాగే కెన్యాలో ప్రధానమైన విదేశీ ఆర్థిక ఆధిపత్యం గురించి వివరిస్తారు. కెన్యాలో కొనసాగుతున్న సాంస్కృతిక ఆధిపత్యం, ఆర్థిక రాజకీయ ఆధిపత్యాల ఫలితమే – ప్రతిఫలనమే అని గుర్తిస్తారు. వీటి నుండి విముక్తి పొందాలంటే – తమ ప్రయోజనాలు ఇమిడివున్న వివిధ సమూహాలు తమ వైఖరి ప్రకటించి పోరాడినప్పుడే ప్రజాస్వామ్యమూ, న్యాయమూ సాధింపబడతాయి. ప్రజాస్వామిక స్వభావం గల కెన్యా ప్రజలు, కార్మికులు, రైతాంగం, విద్యార్థులు, ప్రగతిశీల మేధావులు, ఇతరులు కెన్యా ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక రంగాలపై విదేశీ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి దేశభక్తియుత వ్యతిరేకత అనే కనిష్ట ప్రాతిపదికపై ఐక్యమయ్యేదాకా పరిస్థితులు మరింత అధ్వాన్నమవుతాయే తప్ప బాగుపడవు. అధికార సింహాసనంపై ఎవరు కూర్చున్నారన్నది సమస్య కాదు. ఏ దేశం కూడా తన ఆర్థిక విధానంపై, సంస్కృతిపై విదేశీ ప్రయోజనాల ఆధిపత్యం చెల్లినంత కాలం తనను తాను రాజకీయంగా స్వతంత్ర్యమైనట్టు భావించుకోజాలదు. ఇలాంటి స్పష్టమైన అభిప్రాయాలున్న గుగి పాలకులకు వామపక్ష తీవ్రవాదిగా కనిపించడంలో ఆశ్చర్యమేమున్నది? దాని ఫలితమే గుగి నిర్బంధాన్ని, ప్రవాస జీవితాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పుస్తకానికి వి.వి. చేసిన అనువాదం బాగుంది. హాయిగా చదివింపజేస్తుంది.
***
బందీ (ఒక రచయిత జైలు డైరీ)
రచన: గుగి వా థియాంగో,
తెలుగు: వరవరరావు,
పేజీలు: 288, వెల: ₹ 200,
ప్రచురణ, ప్రతులకు: స్వేచ్ఛా సాహితి, హైదరాబాద్-29.